ఆలూరుకృష్ణప్రసాదు .
మునగాకు కందిపప్పు పప్పు కూర .
******************
కావలసినవి .
మునగాకు లేత ఆకులు మరియు చిగురు ఒలిచినవి -- మూడు కప్పులు .
మరీ ఆకులుగా ఉంటే చాకుతో కట్ చేసుకోవాలి .
కందిపప్పు -- ఒక కప్పు.
కారం -- స్పూనున్నర
ఉప్పు - తగినంత
పసుపు -- కొద్దిగా
పోపునకు .
నూనె -- నాలుగు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 4
ముక్కలుగా చేసుకోవాలి .
చాయమినపప్పు - స్పూను
జీలకర్ర - పావు స్పూను
ఆవాలు - అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- రెండు రెమ్మలు .
తయారీ విధానము .
ముందుగా కందిపప్పు ఒకసారి కడిగి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి మూడు వంతులు అనగా బద్దలుగా ఉండికించుకోవాలి .
అంటే బద్ద చేతితో నొక్కితే మెత్తగా అవ్వాలి .
తర్వాత నీళ్ళు వడ కట్టుకుని విడిగా పళ్ళెం లోకి తీసుకోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయ ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
తర్వాత అందులోనే సిద్ధం చేసుకున్న మునగాకు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి అయిదు నిముషాలు ఆకును పూర్తిగా మగ్గనివ్వాలి .
తర్వాత ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న కందిపప్పు ను , తగినంత ఉప్పు , స్పూనున్నర కారం కూడా వేసి అట్లకాడతో బాగా కలిపి మూత పెట్టి మీడియం సెగన మరో అయిదు నిముషాలు మగ్గనివ్వాలి .
ఆ తర్వాత దింపుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు పప్పుకూర సర్వింగ్ కు సిద్ధం.
దీనికి భోజనము లోకి కాంబినేషన్ గా నిమ్మకాయ కారం చాలా రుచిగా ఉంటుంది .
ఈ కూర భోజనము లోకి , చపాతీలు మరియు రోటీల లోకి బాగుంటుంది .
సంబంధించిన రెసిపి మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment