Monday, July 9, 2018

అవియళ్

ఆలూరుకృష్ణప్రసాదు .

అవియళ్ .

అవియళ్  కేరళ వారి వంటకం.

ఇందులో అన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటారు  కావున  చాలా  బలవర్ధకమైన  వంటకము  అవియళ్.

కేరళ ప్రాంతంలో  వారు  అన్ని వంటలకు  కొబ్బరి  నూనెను వాడతారు .

అందువల్ల వారు ఈ అవియళ్ లో కూడా కొబ్బరి నూనె నే వాడతారు .

నిజానికి  మనం కూడా కొబ్బరి  నూనె  వాడితేనే  మంచిది.

ఒకవేళ  కొబ్బరి  నూనె  వేసుకోవడం ఇష్టం లేకపోతే  నూనె  వాడకండి .

దాని బదులుగా  నెయ్యి వాడండి.

ఇంక ఈ అవియళ్ కు కావలసిన వస్తువులు మరియు తయారు  చేయు విధానము గురించి  తెలుసుకుందాము.

కావలసినవి .

బూడిద గుమ్మడికాయ  -- ఒక ముక్క .( పై చెక్కు తీసుకొని  ముక్కలుగా తరుగు కోవాలి . )

బంగాళా దుంపలు  --  రెండు.(  పై చెక్కు తీసి  ముక్కలుగా  చేసుకోవాలి )

క్యారెట్  --  రెండు . (  పై చెక్కు  తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి . )

బీన్స్  --   50  గ్రాములు .  ( చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి . )

ములక్కాడలు  --  2  
( ముక్కలుగా  కట్ చేసుకోవాలి . )

ఆనపకాయ  లేదా  సొరకాయ  --  ఒక ముక్క .  (  పై  చెక్కు తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

అరటికాయ  --  పెద్దది  ఒకటి .  (  చెక్కు  తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

దొండకాయలు --   8 ( ముక్కలుగా  తరుగు కోవాలి .)

పచ్చి బఠాని  గింజలు  --  అర కప్పు .

కొత్తిమీర  --  ఒక  కట్ట . (  సన్నగా  తరుగు కోవాలి .)

కరివేపాకు  --  మూడు రెమ్మలు .

కొబ్బరి  నూనె  లేదా  /  నెయ్యి  --  ఆరు  స్పూన్లు

కొబ్బరి కాయ  --  1  (  రెండు  చిప్పలు  కోరాముతో  తురుము కోవాలి . )

గట్టి పెరుగు  --  అర లీటరు . ( పుల్లగా ఉంటే  బాగుండదు . కమ్మగా ఉండాలి . )

జీలకర్ర  --  స్పూను

పచ్చి మిరపకాయలు --   8
 
పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ( ముక్కలుగా   చేసుకోవాలి )
ఆవాలు  --  అర స్పూను .

తయారు చేయు విధానము .

ముందుగా   తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలు మరియు ఒలుచుకున్న బఠాణీ గింజలు  ఒక గిన్నెలో  వేసుకుని  సరిపడా  ఉప్పు  మరియు  నీళ్ళు పోసుకుని  కుక్కర్ లో  పెట్టుకుని  మూడు విజిల్స్  రానిచ్చి  దింపుకుని  కొద్దిగా  నీరు  ఉంటే  గిన్నెలో  అలాగే  ఉంచుకోవాలి .

తర్వాత  తురిమిన పచ్చి కొబ్బరి , పచ్చిమిరపకాయలు , జీలకర్ర , సరిపడా ఉప్పు వేసుకుని  మరియు కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మరీ పల్చగా  కాకుండా  ముద్దలా  వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  ఉడికిన నీళ్ళతో  ఉన్న ముక్కల గిన్నెను  పెట్టి , అందులో   మిక్సీ  వేసుకున్న కొబ్బరి  ముద్దను  వేసి , ముక్కలు  ముద్ద బాగా  దగ్గర పడి  కలిసి పోయేలా  ఓ పది   నిముషాలు   ముద్ద పచ్చి వాసన పోయేదాకా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  ముక్కలతో   ఉడికిన  మిశ్రమాన్ని బాగా  చల్లారనివ్వాలి .

వేడి  మీద పెరుగు కలిపితే  విరిగి  పోతుంది .

తర్వాత  పెరుగును  గరిటతో  బాగా  కలుపుకుని  ఈ  ముక్కలలో  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము  నెయ్యి వేసి , నెయ్యి  బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , ఆవాలు , కరివేపాకు  వేసుకుని  పోపు  వేసుకుని  ఈ  పెరుగు కలిపిన  ముక్కలలో  వేసుకోవాలి .

తర్వాత తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  అవియళ్  చపాతీల లోకి , భోజనము  లోకి , చివరికి  వట్టిగా  తినడానికి  కూడా  సర్వింగ్  కు సిద్ధం .

పసుపు వేస్తే అవియళ్ తెల్లగా  ఉండదు . పసుపు అవసరం లేదు.

పోపు దినుసులు మినపప్పు , పచ్చిశనగపప్పు  వంటివి  ఇందులో బాగుండదు .

ఇంగువ ,  ఎండు కారము వంటివి వేసినా  బాగుండవు .

ఎంత కమ్మగా  ఉంటే  అవియళ్  అంత  రుచిగా  ఉంటుంది .

ఎవరైనా  అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు  మరియు ప్రత్యేక సందర్భాలలో  ఈ అవియళ్  తయారు చేసుకుంటే  చాలా  కలర్ ఫుల్ గా ఉండి ఫంక్షన్ కు నిండు తనం  తెస్తుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి