Wednesday, July 4, 2018

సాంబార్ రైస్

ఆలూరుకృష్ణప్రసాదు .

సాంబార్  రైస్ .

వేసవికాలం .
పిల్లలకు శలవులు .అక్కడకు వెడదాం.ఇక్కడకు తీసుకు వెళ్ళండి అని గొడవ చేస్తుంటారు .

అలాటి సందర్భాలలో

దూరపు  ప్రయాణాలు , చిన్న పిక్నిక్ లకు చేయవలసి  వచ్చినప్పుడు   ఇలా  సాంబార్  రైస్  మరియు  దద్ధ్యోజనం   చేసుకొని    వెడితే   నలుగురు   మీద  ఖర్చులు  కలిసి  వస్తాయి  మరియు  ఆరోగ్యానికి   మంచిది .

అలాగే   నలుగురు  families  సరదాగా   ఎక్కడికైనా  వెళ్ళేటప్పుడు  కూడా  ఈ  సాంబార్  రైస్  తయారు చేసుకుని   వెంట  తీసుకొని   వెళ్ళవచ్చు  .

మనం  సాంబారు  పొడి  తయారు  చేసుకొని   సిద్ధంగా   ఉంచుకుంటే    సులువుగా   సాంబార్  రైస్  తయారీ  అయిపోతుంది .

సాంబారు  పొడి  తయారీ  ---

ఎండుమిర్చి  ---  15
పచ్చిశనగపప్పు   --   అయిదు  స్పూన్లు
ఎండు కొబ్బరి --  అర చిప్ప. చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ధనియాలు  -- నాలుగు  స్పూన్లు
మిరియాలు  --  ఒక  స్పూను
ఇంగువ   ---  పావు స్పూను లో సగం.
బియ్యం  --  రెండు  స్పూన్లు

పై  వన్నీ  బాండీలో  నూనె  లేకుండా  వేయించుకొని  చల్లారగానే  మెత్తగా   మిక్సీ  వేసుకోవాలి .

ఈ  పొడిని  ఒక  సీసాలో  భద్ర పరుచుకోవాలి .

ఈ  పొడి  మనం  విడిగా   సాంబారు  పెట్టుకోవడానికి  కూడా  ఓ  ఐదు  ఆరు సార్లకు  వస్తుంది .

సాంబార్  రైస్  తయారీ  విధానము

కావలసినవి .

ఉల్లిపాయలు  ---  మూడు
సొరకాయ ముక్క --  ఒకటి
వంకాయలు  --  నాలుగు లేదా
బెండకాయలు --  పది

ఈ కూరలన్నీ  ముక్కలుగా  తరుగుకొని  వేరుగా పెట్టుకోవాలి .

పచ్చి  మిర్చి  ఒక  అయిదు  నిలువుగా   తరగాలి.

కరివేపాకు  ఒక మూడు  రెమ్మలు , కొత్తిమీర  ఒక చిన్న  కట్ట  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పెద్ద  నిమ్మకాయంత  చింతపండు   పదిహేను  నిముషాలు  ఒక  గ్లాసున్నర నీళ్ళలో   నానబెట్టి  రసం  తీసుకోవాలి .

ఒక  గ్లాసు బియ్యం తగినన్ని నీళ్ళు పోసి  విడిగా  స్టౌ  మీద  పెట్టి కొంచెం  పొడి పొడిగా   వండుకోవాలి.

అలాగే ఒక కప్పు కందిపప్పు  తగినన్ని  నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి .

అన్నం ఒక గిన్నెలో , పప్పు ఒక గిన్నెలో  పెట్టుకుని  రెండూ కలిపి కుక్కర్ లో పెట్టుకోవచ్చు .

సమయం కలిసి వస్తుంది .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   మూడు ఎండుమిరపకాయలు   ముక్కలుగా చేసి ,  పావు  స్పూను మెంతులు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ ,
కరివేపాకు మరియు  పచ్చిమిర్చి  ముక్కలు   వేసి పోపు  వేయించి  అందులో  తరిగిన అన్ని కూరల ముక్కలు మరియు ఉల్లిపాయల  ముక్కలు , కొద్దిగా  పసుపు , స్పూను  కారం , మరియు తగినంత   ఉప్పు వేసి  మూతపెట్టి     పది నిముషాలు   ముక్కలన్నీ మెత్తగా  మగ్గ నివ్వాలి .

ఆ తర్వాత  అందులో  చింతపండు  రసం  మరో రెండు గ్లాసులు నీళ్ళు  పోసి  బాగా  తెర్లనివ్వాలి .

ఆ తర్వాత ఉడికించిన పప్పు కూడా కలుపుకోవాలి .

తర్వాత  మూడు  స్పూన్లు   సాంబారు  పొడి  వెయ్యాలి .

అయిదు  నిముషాలు  తెర్లిన  తరువాత  దింపి  కొత్తిమీర   వేసుకోవాలి .

ఇంతవరకు  సాంబార్  సిద్ధమైంది .

ఇప్పుడు  ఉడికిన అన్నం  బేసిన్  లోకి  తీసుకొని  చల్లార పెట్టుకోవాలి .

వేడి మీద కలిపితే వాసన రావచ్చును .

చల్లారిన అన్నంలో సాంబారు , నాలుగైదు స్పూన్లు   నెయ్యి  వేసి  అన్నం  కలుపుకోవాలి .

లేదా  తెర్లుతున్న  సాంబారు  లో  పట్టిన  వరకు  ఉడికిన  అన్నం  వేసి  గరిటతో  బాగా కలిపి  మరో  అయిదు  నిముషాలు  స్టౌ  మీద  ఉంచి  దింపే ముందు  నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలిపి  దింపు కొని విడిగా చల్లార బెట్టుకోవాలి .

అప్పటికప్పుడు తినాలనుకుంటే  ఐతే  వేడిగా  తినవచ్చు .

బాక్స్ లో  సర్దుకోవాలనుకునే  పక్షంలో  చల్లారాక  పెట్టుకోండి .

వేడి  మీద  పెడితే   వాసన వచ్చి నిల్వ  ఉండక పోవచ్చు .

ఈ సాంబార్ రైస్ తో పాటుగా అప్పడాలు కూడా వేయించుకుని బాక్స్ లో సర్దుకుని  తీసుకొని  వెళ్ళి తింటే ఆ రుచే వేరు .

సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి