ఈ రోజు పరిచయం చేస్తున్న కాంబినేషన్ పచ్చడి.
బీరకాయ మరియు ఆనపకాయ / సొరకాయ పచ్చడి .
కావలసినవి .
బీరకాయలు -- రెండు.
సొరకాయ -- 250 గ్రాములు ముక్క .
పచ్చి మిరపకాయలు -- 12 .
చింతపండు -- నిమ్మకాయంత . విడదీసి కొద్ది నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .
కొత్తిమీర -- ఒక చిన్న కట్ట.
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
నూనె -- మూడు స్పూన్లు .
పోపునకు.
నూనె -- రెండు స్పూన్లు
ఎండుమిరపకాయలు - 5
చాయమినపప్పు - స్పూనున్నర
జీలకర్ర - పావు స్పూను
మెంతులు -- పావు స్పూన్ కు తక్కువ .
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- రెండు రెమ్మలు.
తయారీ విధానము .
బీరకాయలు ఒకసారి బాగా కడుగుకుని పై చెక్కు తీసి కాస్త పెద్ద ముక్కలుగా తరుగు కోవాలి .
ఇష్టమైన వారు చెక్కుతో సహా తరుగు కోవచ్చు.
ఆనపకాయ / సొరకాయ చెక్కు తీసి కాస్త పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే బీరకాయ ముక్కలు , సొరకాయ ముక్కలు , పచ్చి మిరపకాయలు మరియు కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ముక్కలను బాగా మగ్గ నివ్వాలి.
ఆ తర్వాత అందులోనే కొత్తిమీర ను వేసి మగ్గ నివ్వాలి .
మగ్గినవి వేరే ప్లేటులోకి తీసుకోవాలి .
తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా మెంతులు , ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకును వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే ముందుగా రోటిలో ఎండుమిరపకాయలు , తడిపిన చింతపండు మరియు ఉప్పు వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి .
తర్వాత మగ్గబెట్టిన బీరకాయ , సొరకాయ మరియు పచ్చిమిర్చి మిశ్రమము వేసి పచ్చడి బండతో మెత్తగా నూరుకోవాలి .
తర్వాత మిగిలిన పోపును కూడా వేసి బండతో మరోసారి బాగా నూరుకుని , వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే. ఇంగువ మరియు కొత్తిమీర ఘమ ఘమలతో బీరకాయ మరియు ఆనపకాయ రోటి పచ్చడి దోశెలలోకి, రోటీల లోకి మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
సంబంధించిన రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.
0 comments:
Post a Comment