Wednesday, June 7, 2017

పొంగల్ .

పొంగల్ .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తమిళ నాడు  అంతటా  ప్రతి రోజు  హోటళ్ళలో ఉప్మా  చేయరు. పొంగల్  చేస్తారు . కారణం  బొంబాయి రవ్వ , మైదా  పిండి  ఆరోగ్య  రిత్యా  తగు  మోతాదులో   ఉపయోగించు  కోవాలని  అందరూ  చెప్తున్నారు .

ఈ  పొంగల్  బియ్యముతో  చేసుకుంటారు  కాబట్టి  ఆరోగ్యానికి  చాలా  మంచిది . 
ఇంక  పొంగల్  తయారు  చేయడానికి  కావలసిన  వస్తువులు .

బియ్యము  --  ఒక  గ్లాసు 
చాయపెసరపప్పు  --  అర  గ్లాసు 
మిరియాలు  --   ఒకటిన్నర   స్పూను .
నెయ్యి  ---   ఒక  చిన్న  కప్పు.
ఉప్పు  --   తగినంత 
అల్లం తరుగు  --  ఒకటిన్నర   స్పూను 
 జీలకర్ర   --  అర  స్పూను .
జీడిపప్పు  ---  30  గ్రాములు 
కరివేపాకు   -  మూడు  రెమ్మలు  
పచ్చిమిర్చి   --  ఐదు  పొడుగ్గా   తరుగు కోవాలి .
ఇంగువ  ---   కొద్దిగా

ముందుగా  బియ్యాన్ని  , పెసరపప్పును  మునిగే వరకు  నీళ్ళు పోసి ఒక  గంట సేపు విడి  విడిగా  నానబెట్టు కోవాలి . స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టుకొని  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసి   జీడిపప్పు ను  వేయించుకొని  పక్కన  పెట్టుకోవాలి .   మిరియాలను  కొంచెం  కచ్చా పచ్చాగా  దంచుకొని  ఒక  ప్లేటులో  పెట్టుకోండి. 

అదే  బాండిలో  మరో  రెండు స్పూన్లు   నెయ్యి వేసి  దంచి  పెట్టుకున్న  మిరియాలు  , జీలకర్ర  , అల్లం తరుగు ,  ఇంగువ , పచ్చి  మిర్చి  , కరివేపాకు  వేసి  పోపు వేగాక  ఒకటి  మూడు  చొప్పున  నీళ్ళు పోసి   అందులో  తగినంత   ఉప్పు వేసి అదే  నీళ్ళలో  నానబెట్టి  ఉంచుకున్న   బియ్యము  పెసరపప్పు  వేసి  మూత పెట్టి  మెత్తగా   ఉడకనివ్వాలి .

దింప బోయే  ముందు  మిగిలిన  నెయ్యి ,  వేయించి  ప్రక్కన  పెట్టుకున్న  జీడిపప్పు   వేసి  మరో  మూడు  నిముషాలు  ఉంచి  దింపు కోవాలి .

వేడి  వేడి  పొంగల్  సర్వింగ్  కు సిద్ధం .ఇందులోకి  కొబ్బరి  చట్నీ ,  టమోటో  చట్నీ  రెండూ  బాగుంటాయి .

తమిళనాడు  అంతటా  అన్ని హోటళ్ళలోనూ  చక్కగా  లేత  అరిటాకు వేసి  పొంగల్  పెట్టి   పై రెండు  చట్నీలు  వేసి , వేడి  వేడిగా  పొగలు  కక్కుతున్న  సాంబారు  వేస్తారు .

ఎంత  రుచిగా  ఉంటుందో  ! మళ్ళీ  మధ్యాహ్నము  ఒంటి గంట  దాకా  ఆకలి  వెయ్యదు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి