అరటికాయ పచ్చడి
ఆలూరు కృష్ణప్రసాదు .
ప్రియమిత్రులందరికీ
ఈ రోజు స్పెషల్ అరటి కాయ పచ్చడి .
అరటి కాయ తో పచ్చడా !
అని ఆశ్చర్య పోకండి.
ఒకసారి చేసి చూడండి .
అరటి కాయ పచ్చడి తయారు చేయు విధానము .
కాలసిన వస్తువులు .
అరటి కాయలు ---- 2
పెద్ద ఉల్లిపాయలు ---- 2
పచ్చిమిరపకాయలు ----- 4
కరివేపాకు ----- 3 రెమ్మలు
కొత్తిమీర ----- మరి కాస్త ఎక్కువ .
పోపు వేయుటకు --- నూనె 3 టీ స్పూన్లు .
ఎండు మిరపకాయలు --- 5
చాయ మినపప్పు --- 2 స్పూన్లు
ఆవాలు ---- 1 స్పూన్
ఇంగువ --- తగినంత
పసుపు --- కొద్దిగా
ఉప్పు ---- తగినంత .
అరటి కాయ పచ్చడి తయారు చేయు విధానము .
ముందు ఉల్లిపాయలు పై పొట్టు తీసి చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరగండి.
( ఎలాగంటే దోశెలలోకి మరియు మిర్చి బజ్జీలలోకి సన్నగా తరుగుతాము కదా . ఆ విధంగా )
ఇప్పుడు అరటికాయలు శుభ్రంగా కడిగి పొడిగా గుడ్డ పెట్టి తుడవండి.
అరటి కాయల చెక్కు తీయవద్దు.
ఇప్పుడు స్టౌ వెలిగించి సెగ సిమ్ లో పెట్టండి.
అరటికాయలు మీద నూనె రాయనక్కరలేదు .
ఆ రెండు అరటి కాయలు వంకాయలు రోటి పచ్చడికి కాల్చినట్లు కాల్చండి .
పై చెక్కు నల్లగా అయి చేతితో పట్టుకొని చూస్తే లోపల మెత్తగా అవుతుంది .
గిన్నెలో నీళ్ళు పెట్టుకుని చేతులు తడి చేసుకుంటూ ఆ కాయల పై చెక్కు తీసేయండి .
ప్లేటులో ఆ కాయలు ఉంచుకోండి.
ఇప్పుడు స్టౌ మళ్ళీ వెలిగించి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగాక అందులో చాయ మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి పోపు బాగా వేగాక అందులో కరివేపాకు , పచ్చిమిరపకాయలు వేసి రెండు నిముషాలు ఉంచి స్టౌ ఆపేయండి .
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించవద్దు .
పోపు చల్లారాక మిక్సీలో ఎండుమిరపకాయలు , తగినంత ఉప్పు , పసుపు కొద్దిగా వేసి రెండుసార్లు తిప్పండి.
మిగిలిన పోపు ఇప్పుడే వేయవద్దు.
మిక్సీలో కాలిన అరటి కాయలు ,పచ్చి మిరపకాయలు ,
వేగిన కరివేపాకు వేసి మిక్సీ మరోసారి తిప్పండి .
అరటికాయలు బాగా కాలి ఉంటాయి కాబట్టి ఒక్కసారి మిక్సీ తిప్పితే మెత్త పడుతుంది .
ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన పోపు , కొత్తిమీర సన్నగా తరిగి చేత్తోనే బాగా కలుపుకుని ఒక Bowl లోకి తీసుకోండి.
అంతే పసందైన అరటి కాయ పచ్చడి భోజనం లోకి సిద్ధం.
ఇందులో ఉల్లిపాయలు పచ్చివి వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది .
వేగిన మినపప్పు పంటి కింద తగులుతూ చక్కని రుచితో ఉండే ఈ అరటి కాయ పచ్చడి తప్పక try చెయ్యండి.
మీ అందరికీ నచ్చుతుంది .
ఈ పచ్చడికి పండిన , ఓ మాదిరిగా పండిన అరటి కాయలు వాడవద్దు .
పచ్చడి తీపి వచ్చి రుచి పాడవుతుంది .
పచ్చి కాయలే వాడండి .
ఫోటో --- మేము చేసిన అరటికాయ పచ్చడి .
0 comments:
Post a Comment