పొదీనా ఆకు పచ్చి కొబ్బరి తో పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
పచ్చి శనగపప్పు పొదీనా ఆకు పచ్చి కొబ్బరి తో పచ్చడి .
కావలసినవి .
పచ్చి శనగపప్పు --- పావు కప్పు
పొదీనా ఆకు --- ముప్పావు కప్పు.
పచ్చి కొబ్బరి తురుము -- ఒక కప్పు .
కొత్తిమీర -- ఒక కట్ట.
చింతపండు -- చిన్న నిమ్మకాయంత .
పసుపు -- కొద్దిగా
పచ్చిమిర్చి -- పది
నూనె -- 40 గ్రాములు
ఉప్పు --- తగినంత
పోపుకు .
ఎండుమిరపకాయలు -- 4
మినపప్పు -- స్పూనున్నర
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- రెండు రెమ్మలు .
మెంతులు --- పావు స్పూను
తయారీ విధానము .
పదిహేను నిముషముల ముందు చింతపండు విడదీసి కొద్దిగా నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .
కొబ్బరి కాయను కొట్టి కొబ్బరి కోరాముతో తురుముకొని ఒక కప్పు కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి .
పొదీనా కాడలు అన్నీ తీసివేసుకుని ఒక్క ఆకునే వలుచుకొని ఒక ముప్పావు కప్పు సిద్ధం చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే ముందుగా పచ్చి శనగపప్పు వేయించుకోవాలి .
పప్పు వేగుతుండగానే పొదీనా ఆకు , పచ్చి మిరపకాయలు వేసి మూత పెట్టి ఐదు నిముషాలు మగ్గపెట్టి అన్నీ మగ్గ గానే తీసి వేరేగా ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద మళ్ళీ బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే ఎండుమిరపకాయలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , మెంతులు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే ముందుగా మిక్సీలో వేయించుకున్న పోపు , తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత మిక్సీలో వేయించిన పచ్చిమిర్చి , పచ్చి శనగపప్పు , పొదీనా మిశ్రమం , తడిపిన చింతపండు నీటితో సహా , కొద్దిగా పసుపు , తురిమిన పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
చివరగా కొత్తిమీర వేసుకొని మరోసారి మిక్సీ వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పొదినా పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరి పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
ఈ పచ్చడి అన్నింటిలోకి అంటే అన్నంలోకి , ఇడ్లీల లోకి , దోశెల లోకి , పూరీల లోకి మరియు చపాతీల లోకి కూడా చాలా బాగుంటుంది .
0 comments:
Post a Comment