కాకరకాయ ఉల్లిపాయ పులుసు
ఆలూరు కృష్ణప్రసాదు .
కాకరకాయ ఉల్లిపాయ పులుసు .
ఆరోగ్యానికి ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగించే కూర కాకరకాయ .
ఎంతో మంది ఇష్ట పడే ఈ కాకరకాయ తినని వారు కూడా ఉన్నారు .
ఎందుకంటే చేదు అంటారు .
చేదు కలిగి ఉండడం కాకరకాయ సహజ గుణం .
పైగా ఆ చేదు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కూడా .
ఉగాది రోజున చేదుగా ఉన్నా వేపపువ్వు ను తినిపిస్తారు కదా !
అదే విధంగానే కాకరకాయ ను కూడా కనీసం వారంలో ఒకసారైనా ఆహారంలో ఉపయోగించడం ఆరోగ్య కరం .
కాకరకాయ ఉల్లిపాయ పులుసు తయారీ విధానము .
కావలసినవి .
కాకరకాయలు -- పావు కిలో
ఉల్లిపాయలు -- మూడు .
పచ్చిమిరపకాయలు -- ఎనిమిది
కరివేపాకు -- మూడు రెమ్మలు .
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత .
బెల్లం --- కొద్దిగా .
కారం --- ముప్పావు స్పూను .
చింతపండు -- నిమ్మకాయంత.
పోపుకు .
నూనె --- నాలుగు స్పూన్లు .
ఎండుమిరపకాయలు -- నాలుగు , ముక్కలుగా చేసుకోవాలి .
మినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా చింతపండు పదిహేను నిముషాల పాటు ఒక గ్లాసు నీళ్ళలో నాన బెట్టి పల్చగా రసం తీసుకోవాలి .
కాకరకాయ లు చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ఉల్లిపాయ లు చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చిమిర్చి --- నిలువుగా తరుగు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేసుకోవాలి .
పోపు వేగగానే కరివేపాకు , పచ్చిమిర్చి , తరిగిన కాకరకాయ ముక్కలు , తరిగిన ఉల్లిపాయల ముక్కలు సరిపడా ఉప్పు మరియు కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గ నివ్వాలి .
ఆ తర్వాత నాన బెట్టిన చింతపండు రసము మగ్గుతున్న ముక్కలలో పోసి మరో అర గ్లాసు నీళ్ళు , కొద్దిగా బెల్లం మరియు ముప్పావు స్పూను కారం వేసి బాగా తెర్లనివ్వాలి .
పులుసు పల్చగా ఉన్నట్లయితే పావు గ్లాసు నీళ్ళలో స్పూను బియ్యపు పిండి వేసి స్పూను తో బాగా కలిపి మరుగుతున్న పులుసు లో పోసి మరో అయిదు నిముషాలు ఉంచి దింపి వేరే గిన్నెలో పోసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లిపాయ పులుసు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment