సాంబార్ రైస్ .
ఆలూరుకృష్ణప్రసాదు .
దూరపు ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఇలా సాంబార్ రైస్ మరియు దద్ధ్యోజనం చేసుకొని వెడితే నలుగురు మీద ఖర్చులు కలిసి వస్తాయి మరియు ఆరోగ్యానికి మంచిది .
అలాగే నలుగురు families సరదాగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఈ సాంబార్ రైస్ తయారు చేసుకుని వెంట తీసుకొని వెళ్ళవచ్చు .
మనం సాంబారు పొడి తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకుంటే సులువుగా సాంబార్ రైస్ తయారీ అయిపోతుంది .
సాంబారు పొడి తయారీ ---
ఎండుమిర్చి --- 15
మినపప్పు -- అయిదు స్పూన్లు
ధనియాలు -- నాలుగు స్పూన్లు
మిరియాలు -- ఒక స్పూను
కందిపప్పు -- పావు కప్పు
ఇంగువ --- పావు స్పూను లో సగం.
బియ్యం -- రెండు స్పూన్లు
పై వన్నీ బాండీలో నూనె లేకుండా వేయించుకొని చల్లారగానే మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ పొడిని ఒక సీసాలో భద్ర పరుచుకోవాలి .
ఈ పొడి మనం విడిగా సాంబారు పెట్టుకోవడానికి కూడా ఓ ఐదు సార్లకు వస్తుంది .
సాంబార్ రైస్ తయారీ విధానము
కావలసినవి .
ఉల్లిపాయలు --- మూడు
సొరకాయ ముక్క -- ఒకటి
వంకాయలు -- నాలుగు
ఈ కూరలన్నీ ముక్కలుగా తరుగుకొని వేరుగా పెట్టుకోవాలి .
పచ్చి మిర్చి ఒక అయిదు నిలువుగా తరగాలి.
కరివేపాకు ఒక మూడు రెమ్మలు , కొత్తిమీర ఒక చిన్న కట్ట సిద్ధంగా ఉంచుకోవాలి .
పెద్ద నిమ్మకాయంత చింతపండు పదిహేను నిముషాలు ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి రసం తీసుకోవాలి .
ఒక గ్లాసు బియ్యం తగినన్ని నీళ్ళు పోసి విడిగా స్టౌ మీద పెట్టి మెత్తగా వండుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , పావు స్పూను మెంతులు ,పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ ,
కరివేపాకు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి పోపు వేయించి అందులో తరిగిన ముక్కలు , కొద్దిగా పసుపు , స్పూను కారం , ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరి మరియు తగినంత ఉప్పు వేసి మూతపెట్టి పది నిముషాలు ముక్కలన్నీ మెత్తగా మగ్గ నివ్వాలి .
ఆ తర్వాత అందులో చింతపండు రసం మరో గ్లాసు నీళ్ళు పోసి బాగా తెర్లనివ్వాలి .
తర్వాత మూడు స్పూన్లు సాంబారు పొడి వెయ్యాలి .
అయిదు నిముషాలు తెర్లిన తరువాత దింపి కొత్తిమీర వేసుకోవాలి .
ఇంతవరకు కొబ్బరి సాంబార్ సిద్ధమైంది .
ఇప్పుడు ఉడికిన అన్నం బేసిన్ లోకి తీసుకొని , సాంబారు , కొద్దిగా నెయ్యి వేసి అన్నం కలుపుకోవచ్చు .
లేదా తెర్లుతున్న సాంబారు లో పట్టిన వరకు ఉడికిన అన్నం వేసి గరిటతో బాగా కలిపి మరో అయిదు నిముషాలు స్టౌ మీద ఉంచి దింపే ముందు నెయ్యి వేసి గరిటతో బాగా కలిపి దింపు కోవచ్చు .
అప్పటికప్పుడు ఐతే వేడిగా తినవచ్చు .
బాక్స్ లో సర్దుకోవాలను కునే పక్షంలో చల్లారాక పెట్టుకోండి .
వేడి మీద పెడితే నిల్వ ఉండక పోవచ్చు .
0 comments:
Post a Comment