తమిళుల పొడి
ఆలూరుకృష్ణప్రసాదు .
ఇటీవల వడపళని చెన్నై లోని ఒక హోటల్ లో భోజనానికి వెళ్ళాము .
పక్కన కప్పులో పొడి , ఊరగాయ పెట్టాడు .
అది తమిళుల హోటల్ .
సర్వర్ కర్నూలు ప్రాంతం అతను .
మా మొఖాలు చూసి తెలుగులో నే మాట్లాడాడు .
భోజనము లో పక్కనే కప్పులో ఉన్న పొడి అన్నం లో కలుపుకున్నాను .
చాలా రుచిగా ఉంది .
ఏం పొడి ఇది అని అడిగాను .
ఏదో అరవ పేరు చెప్పాడు .
నాకు ఆ పేరు అర్ధం కాక ఎలా తయారు చేస్తారని అడిగాను .
తయారీ విధానము చెప్పాడు . నేను రాసుకున్నాను .
ఇంటికి వచ్చాక చేసాను .
హోటల్ లో తిన్న దానిని తలదన్నేలా కుదిరింది .
మరి ఆ కందిపప్పు పుట్నాల పప్పు పొడి తయారీ విధానము మీ కోసం .
కందిపప్పు పుట్నాల పప్పు పొడి .
కావలసినవి.
కందిపప్పు --- 150 గ్రాములు .
పుట్నాల పప్పు -- 75 గ్రాములు
ఎండుమిరపకాయలు -- 15
కరవేపాకు -- విడి ఆకులు అర కప్పు ఆర పెట్టుకుని సిద్ధం చేసుకోవాలి . .
మిరియాలు -- స్పూను.
ఉప్పు --- తగినంత .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి బాండీ బాగా వేడెక్కగానే ముందుగా కందిపప్పు , మిరియాలు , ఎండుమిరపకాయలు వేసి అట్లకాడతో బాగా కలుపుతూ కందిపప్పును మూడొంతులు పైగా వేగ నివ్వాలి .
ఆ తర్వాత వేయించిన శనగపప్పు ( పుట్నాల పప్పు ) , ఆరిన కరివేపాకు మరియు పొట్టు తీయని వెల్లుల్లి రేకలు కూడా వేసి పూర్తిగా బంగారు రంగులో వేగనివ్వాలి .
తర్వాత వేయించినవి కొద్దిగా చల్లారగానే ముందుగా ఎండుమిరపకాయలు , సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత కందిపప్పు , పుట్నాల పప్పు, కరివేపాకు , మరియ మిరియాలు వేసిన వేగిన మిశ్రమం కూడా మిక్సీ లో వేసి మెత్తగా పొడి వేసుకోవాలి .
ఆ తర్వాత దీనిని ఒక సీసాలో భద్ర పరుచుకోవాలి .
వెల్లుల్లి ఇష్ట పడని వారు వెల్లుల్లి బదులుగా కందిపప్పు వేయించే ముందే స్పూను జీలకర్ర వేసి చేసుకోవచ్చు .
అంతే . అన్నం లోకి , దోశెల లోకి , ఇడ్లీ ల లోకి రుచికరమైన కందిపప్పు పుట్నాల పొడి సిద్ధం .
0 comments:
Post a Comment