Thursday, June 1, 2017

మునక్కాడ పచ్చి కొబ్బరి కూర

మునక్కాడ పచ్చి కొబ్బరి కూర
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

మునక్కాడ పచ్చి కొబ్బరి నువ్వు పప్పు జీడిపప్పు తో కూర.
కావలసినవి .
లేత మునక్కాడలు - 4
తురిమిన పచ్చి కొబ్బరి -- ఒకచిప్ప.
నువ్వుపప్పు --- 100 గ్రాములు 
జీలకర్ర -- అర స్పూను
ఉప్పు -- తగినంత 
పసుపు -- కొద్దిగా 
నూనె -- 75 గ్రాములు
కారం --- స్పూను
జీడిపప్పు పలుకులు -- 10

పోపుకు
ఎండుమిరపకాయలు -- 3
పచ్చిశనగపప్పు -- స్పూనున్నర 
మినపప్పు --- స్పూను 
జీలకర్ర -- పావు స్పూను 
ఆవాలు -- అర స్పూను 
కరివేపాకు -- మూడు రెబ్బలు

తయారీ విధానము .
ముందుగా నువ్వు పప్పు బాగు చేసుకొని , జీడిపప్పు పలుకులు వేసి మునిగే వరకు నీరు పోసి రెండు గంటలు పైగా నాన బెట్టాలి.
మునక్కాడలు ముక్కలుగా తరుగుకొని గిన్నెలో తగిన నీరు పోసి విడిగా మునక్కాడ ముక్క మూడు వంతులు ఉడికే వరకు ఉంచి దింపి వడగట్టి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .
ములక్కాడలు ఉడికిన నీరు ఒక గిన్నెలో తీసి ఉంచుకోండి,
ఆ నీటితో రసం పెట్టుకోవచ్చు.
కుక్కర్ లో పెడితే ముక్కలు చితికే అవకాశం ఉంది .
కొబ్బరి కాయ కొట్టి ఒక చిప్ప పచ్చి కొబ్బరి వచ్చే విధముగా సిద్ధం చేసుకోవాలి .

ఇప్పుడు మిక్సీలో నానబెట్టిన నువ్వుపప్పు , జీడిపప్పు వేసి నువ్వుపప్పు నలిగే వరకు గ్రైండ్ చేసుకోవాలి .
అందులోనే తురిమిన పచ్చి కొబ్బరి తురుము , జీలకర్ర , తగినంత ఉప్పు , స్పూను కారం, చిటికెడు పసుపు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని ముద్ద విడిగా తీసి పెట్టుకోవాలి .
ముద్ద పేస్ట్ లా ఉండకూడదు .
రుబ్బిన కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉండాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె మొత్తము వేసి నూనె కాగగానే ఎండుమిర్చి , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు, కరివేపాకు వేసి పోపు వేసుకుని పోపు వేగగానే సిద్ధం చేసుకున్న ముద్దను కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి .
తర్వాత ఉడికిన మునక్కాడ ముక్కలు వేసి ఒక పావు గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముద్ద అడుగంటకుండా మునక్కాడలకు పట్టే విధంగా చూసుకోవాలి .
మీడియం సెగలో మగ్గ నివ్వాలి .

మునగకాడ ముక్కలు పూర్తిగా మగ్గగానే దింపి వేరే డిష్ లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే మునక్కాడ + నువ్వుపప్పు + పచ్చి కొబ్బరి + జీడిపప్పు తో స్పెషల్ కూర సర్వింగ్ కు సిద్ధం .
ఈ కూర అన్నం లోకి చపాతీల లోకి బాగుంటుంది .
మునక్కాయలు ఉడికించిన నీటితో రసము చేసుకునే విధానము .
ఉడికిన నీరు పారపోయాకుండా అందులోనే ఉడికిన నాలుగు మునక్కాయ ముక్కలు వేసి చింతపండు ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసి బాగా తెర్లగానే మిరియాల రసం పొడి వేసి చారు పెట్టుకుని పోపు పెట్టు కుంటే అద్భుతమైన రుచిగా ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి