కొత్తిమీర కారం .
ఆలూరి కృష్ణ ప్రసాద్
మా చిన్న అమ్మమ్మ మా చిన్నప్పుడు బాపట్ల లో అమ్మకు సాయంగా కొంత కాలం మా దగ్గర ఉంది .
మా చిన్న అమ్మమ్మ చేసేదండీ రోటిలో కొత్తిమీర కారం .
ఆహా ! ఏమి రుచి.
అనరా ! మైమరచి
అనే స్థాయిలో ఉండేది
ఆ కొత్తిమీర కారం.
పొద్దున్న వండినది రాత్రికి ముట్టుకోని మా నాన్నగారు ఫ్రిజ్ లో పెట్టించుకుని అయిదు రోజులు తినే వారు .
అంత బాగా చేసేది మా చిన్న అమ్మమ్మ.
మరి అంత బాగుండే ఆ కొత్తి మీర కారం తయారీ విధానము మీతో పంచు కోవడం నాకు సంతోషంగా ఉంది .
కొత్తిమీర కారం.
కావలసినవి.
ఎండుమిరపకాయలు బాగా గల గల లాడుతూ ఎండినవి -- 12
పచ్చి మిరపకాయలు -- 10
చింతపండు -- 40 గ్రా
ధనియాలు -- నాలుగు స్పూన్లు
ఉప్పు -- తగినంత
బెల్లం -- 20 గ్రా
పసుపు -- పావు స్పూను
కొత్తిమీర -- మూడు కట్టలు మరి కాస్త ఎక్కువగా .
ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి .
పోపుకు .
ఎండుమిరపకాయలు - 2
పొట్టు మినపప్పు -- స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
నూనె --- మూడు స్పూన్లు
తయారీ విధానము .
ఈ పచ్చడి రోటిలోనే చేసుకుంటే
చాలా బాగుంటుంది.
అవకాశం లేని వారు మిక్సీలో వేసుకోండి.
ముందు చింతపండు విడదీసి నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి.
కొత్తిమీర ఎక్కువ మోతాదులో తీసుకొని క్రింద కాడలు తీసి కడిగి శుభ్రం చేసుకోవాలి .
అన్నీ కూడా వేయించ కుండా అలాగే వేసుకోవాలి.
ముందుగా ఎండుమిరపకాయలు , ధనియాలు , ఉప్పు వేసి రోటిలో పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి.
తరువాత తడిపిన చింతపండు ,పచ్చిమిరపకాయలు ( తొడిమలు తీసి కడిగి అలాగే వేసుకోవాలి ) బెల్లం , పసుపు వేసి
బాగా మెత్తగా దంపుకోవాలి .
తర్వాత మొత్తం కొత్తిమీర అంతా రోటిలో వేసి మెత్తగా పచ్చడి బండతో నూరాలి .
కొత్తిమీర , పచ్చి మిరపకాయలు లో తడి ఉంటుంది కనుక నీళ్ళు పోయక్కరలేదు చేసేటప్పుడు .
మరీ గట్టిగా అన్పిస్తే నీళ్ళు చేత్తో చిలకరిస్తే సరిపోతుంది .
రోటి లో నుండి గిన్నెలోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి నూనె వేసి నూనె కాగగానే ఎండు మిర్చి , మినపప్పు , ఆవాలు , ఇంగువ తో పోపు పెట్టుకొని స్పూను తో బాగా కలుపుకోవాలి .
అంతే వెరైటీ కొత్తిమీర కారం సిద్ధం.
ఈ కొత్తిమీర కారం ఇడ్లీ , దోశెలు మరియు అన్నం లోకి కూడా చాలా బాగుంటుంది .
0 comments:
Post a Comment