Thursday, June 1, 2017

టొమాటో మిరియాల రసము.

టొమాటో మిరియాల రసము.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ముందుగా ( అప్పటికప్పుడు ) Instant గా చారుపొడి తయారు చేసుకునే విధానము .

నాలుగు ఎండుమిరపకాయలు , మూడు స్పూన్లు ధనియాలు , స్పూను జీలకర్ర , స్పూను పచ్చి శనగపప్పు , స్పూను కందిపప్పు, పది మిరియాలు ,
కొద్దిగా ఇంగువ నూనె వేయకుండా అన్నీ ఒక్కసారే
బాండీలో వేయించి , చల్లారక మెత్తగా మిక్సీ వేసుకుని ఈ పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి .

ఒక పది సార్లకు వస్తుంది .
టొమాటో రసము .
ముందు రెండు టొమాటో లు ముక్కలుగా తరిగి కాసిని నీళ్ళు పోసి ఉడింకించుకుని చల్లారగానే రసం తీసుకోవాలి.
చిన్న నిమ్మకాయంత చింతపండు నీళ్ళలో నానవేసి రసం తీసుకోవాలి .
ఉడికిన టొమాటో రసము , చింతపండు రసము రెండు కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
అందులో చిటికెడు పసుపు , రుచికి చాలా కొంచెం బెల్లం , తగినంత ఉప్పు, తరిగిన రెండు పచ్చిమిర్చి ,
కరివేపాకు వేసి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద బాగా మరగ నివ్వాలి .

ఆ తరువాత ఒకటిన్నర స్పూన్లు రసము పొడి వేసి మరో మూడు నిముషాలు మరగ నివ్వాలి .
ఆ తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే రెండు ఎండుమిర్చి , కొద్దిగా మెంతులు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు, కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టు కోవాలి.
తదుపరి కొత్తిమీర వేసుకోవాలి.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి