సజ్జప్పాలు లేదా సజ్జ పూరీలు
ఆలూరు కృష్ణప్రసాదు .
సజ్జప్పాలు లేదా సజ్జ పూరీలు .
తయారు చేయు విధానము .
పావు కిలో మైదా పిండి లో చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి బొబ్బట్లు కు కలుపు కునే విధంగా పిండిని పల్చగా తోపుకు అనుగుణంగా కలుపు కోవాలి .
అందులో రెండు స్పూన్లు నూనె వేసి బాగా కలుపు కొని విడిగా ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలి .
స్టౌ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి నీళ్ళు బాగా తెర్లగానే గ్లాసు పంచదార వేసి, పంచదార నీళ్ళలో కరగగానే గ్లాసు బొంబాయి రవ్వ ఉండకట్టకుండా సన్నగా పోసుకుంటూ అట్లకాడతో తిప్పుతూ కలుపు కోవాలి .
తదుపరి అందులో అర స్పూను యాలకుల పొడి మరియు మూడు స్పూన్లు నెయ్యి వేసి రవ్వ ఉడకగానే దింపు కోవాలి .
ఇప్పుడు రవ్వ కేసరి తయారు అయ్యింది .
రవ్వ కేసరి కొద్దిగా చల్లారగానే చేతికి నెయ్యి రాసుకుని నిమ్మకాయంత ఉండలుగా చేసుకుని వేరే పళ్ళెంలో విడిగా పెట్టు కోవాలి .
ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని కవరుకు నూనె రాసుకుని పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి అర కె. జి . నూనె పోసి నూనెను సన్నని సెగన బాగా కాగ నివ్వాలి
తర్వాత అర చేతికి నూనె రాసుకుని కొంచెం తోపు పిండి తీసుకొని అర చేతిలోకి తీసుకుని అర చేతిలో పల్చగా పరుచుకుని , మధ్యలో రవ్వ కేసరి ఉండ పెట్టుకుని తోపు పిండితో ఉండ మొత్తము మూసి వేయాలి .
తర్వాత నూనె రాసి సిద్ధముగా ఉంచుకున్న ప్లాస్టిక్ కవరు పై ఆ ఉండను పెట్టుకుని చిన్న చిన్న పూరీల సైజులో మధ్య మధ్య నూనె చెయ్యి చేసుకుంటూ నాలుగు వైపులా రౌండ్ గా సమంగా వత్తు కుని , ఒక్కొక్కటిగా బాండీ లోని కాగుతున్న నూనెలో వేసి రెండు ప్రక్కలా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకుంటూ విడిగా తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండి శుభ కార్యక్రమాల్లో అందురూ తరచుగా చేసుకునే సజ్జప్పాలు లేదా సజ్జ పూరీలు సర్వింగ్ కు సిద్ధం .
ఈ సజ్జ పూరీలు రెండు రోజులు నిల్వ ఉంటాయి .
0 comments:
Post a Comment