దోసావకాయ
ఆలూరు కృష్ణ ప్రసాదు .
దోసావకాయ .
ఇది వరకు రోజులలో పెళ్ళిళ్ళ లో ఎక్కువగా రాత్రి పూట కందిపొడి , దోసావకాయ , అరటి కాయ వేపుడు , పప్పు చారు , పెరుగు వడ్డించేవారు .
ఇప్పటి విందులు గురించి చెప్పుకోవడం " కంబళీ లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం " అనే సామెతగా ఉంటుంది .
ఆ రోజుల్లో మామిడి కాయలు సంవత్సరం లో ఐదారు నెలలు మించి వచ్చేవి కావు .
ఆవకాయ అనేది ఏడాదికి ఒక్కసారే పెట్టుకునే వారు .
మరి ఈ రోజుల్లో సంవత్సరం లో పది నెలల వరకు మామిడి కాయలు దొరుకుతూనే ఉన్నాయి .
అందుకని శ్రావణ మాసం లో పెళ్ళిళ్ళైనా , కార్తీక మాసంలో పెళ్ళిళ్ళైనా ఓ నాలుగు కాయలతో Instant ఆవకాయ పడేసి , ఆ పబ్బం గడిపేస్తున్నారు .
ఖచ్చితంగా సీజన్ లో పెట్టిన వాటికి , ఈ Instant ఆవకాయకు ఖచ్చితంగా తేడా ఉంటుంది .
సీజన్ ఆవకాయ ఏడాది పొడవునా తాజాగా ఉంటుంది .
అందుకు కారణం మిరపకాయలు , ఆవాలు , నూనె అన్నీ కొత్తవి .
మామిడి కాయలు ఆవకాయ కోసం తయారైనవి .
అందువల్ల ఆవకాయ నిల్వ ఉంటుంది .
అందుకే పెద్ద వాళ్ళు ఇది వడ్డనకు వాడితే మరి వారికి ఏడాది పొడవునా ఉండదని ఈ దోసావకాయ వేసి వడ్డించేవారు .
దోసావకాయ తయారీ విధానము
ఫోటోలో ఒక చిన్న Bowl పెట్టాను.
ఒక దోసకాయకు ఆ చిన్న Bowl కొలత సరిపోతుంది .
ఒక గట్టి దోసకాయను తీసుకుని చెక్కుతో సహా చిన్న ముక్కలుగా తరగండి .
కొద్ది ఊట వస్తే వడగట్టి ఉంచండి .
గింజలు ఇష్టమైతే వేసుకోండి .
ఒక గిన్నెలో ఒక గరిటె నూనె ,
కొద్దిగా పసుపు , కొంచెం ఉప్పు , కొద్దిగా ఉంటే రసం , తరిగిన దోసకాయ ముక్కలు వేసి చేతితో బాగా కలిపి ఓ పావు గంట అలాగే ఉంచండి .
ఒక బేసిన్ లో ఆ Bowl ఎండు కారం , ఆవపిండి మరియు ఉప్పు తగ్గించి అంటే Bowl కొలతలో తలగొట్టెడు , ఈ మూడు వేసి బాగా కలుపుకోండి .
ఇప్పుడు రెడీగా ఉంచిన ముక్కలు మూడు కలిపిన బేసిన్ లో వేసి ఒక bowl నూనె వేసి చేతితో బాగా కలుపుకోండి .
ఒక గంట అయ్యాక ఊరుతుంది .
అంతే నోరూరించే దోసావకాయ భోజనము లోకి సిద్ధం .
ఈ దోసావకాయ రెండు నెలలు నిల్వ ఉంటుంది .
ఫోటో -- మా ఇంట్లో చేసిన దోసావకాయ.
0 comments:
Post a Comment