ఆలూరుకృష్ణప్రసాదు .
బెండకాయలతో రుచికరమైన మజ్జిగ పులుసు .
కావలసినవి .
పెరుగు -- అర లీటరు
బెండకాయలు -- లేతవి పావు కిలో .
పచ్చిమిరపకాయలు -- ఆరు నిలువుగా చీలికలు చేసుకోవాలి .
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక కట్ట
ఉప్పు -- తగినంత
ముందుగా స్పూనున్నర పచ్చిశనగపప్పు , చిన్న అల్లం ముక్క , పావు స్పూను ఆవాలు ఒక గిన్నెలో వేసుకుని మునిగే వరకు నీరు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి .
తర్వాత నీరు వేరుగా వడకట్టుకుని మిక్సీ లో నానబెట్టిన పచ్చిశనగపప్పు , ఆవాలు , అల్లం ముక్క , చిన్న పచ్చి కొబ్బరి ముక్క ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి.
రెండు పచ్చిమిర్చి , వేసి కొద్దిగా విడిగా తీసి ఉంచిన నీరు పోసుకుంటూ మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఒక గిన్నెలో మొత్తము పెరుగు వేసుకుని తగినన్ని నీరుపోసుకుని కవ్వముతో మజ్జిగ చేసుకోవాలి .
నీరు మరో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి .
అందులో తరిగిన పచ్చిమిరపకాయలు , కరివేపాకు , తగినంత ఉప్పు , రుబ్బిన ముద్ద అందులో వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి .
లేత బెండ కాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి బెండకాయ ముక్కలను వేసి ముక్కలను బాగా మగ్గనివ్వాలి .
చల్లారగానే ముక్కలను మజ్జిగలో కలుపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , కొద్దిగా మెంతులు , పావు స్పూను జీలకర్ర , పావు స్పూను ఆవాలు కొద్దిగా ఇంగువ మరియు కరివేపాకు వేసుకుని పోపు వేగగానే మజ్జిగ లో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద ఈ మజ్జిగ పులుసును పెట్టి పొంగకుండా , విరగకుండా గరిటెతో బాగా కలుపుతూ పదిహేను నిముషాల పాటు తెర్లనిచ్చి , కొత్తిమీర కూడా వేసుకుని దింపుకోవాలి.
ముందుగా మరగనిచ్చి తర్వాత పోపు పెడితే పులుసు విరిగే ప్రమాదం ఉంది .
అంతే వేడి వేడి మజ్జిగ పులుసు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment