ఆలూరుకృష్ణప్రసాదు .
కొంచెము వెరైటీ గా
గోంగూర ఆకుతో పండు మిరపకాయలు పచ్చడి.
కావలసినవి .
గోంగూర -- మూడు కట్టలు
పండుమిరపకాయలు -- 150 గ్రాములు .
చింతపండు -- 50 గ్రాములు .
మెంతిపిండి -- రెండు స్పూన్లు .
ఉప్పు -- తగినంత
పసుపు -- స్పూను
ఉల్లిపాయలు -- మూడు .
పోపునకు .
ఎండుమిరపకాయలు -- 4 ముక్కలుగా చేసుకోవాలి .
నూనె -- 150 గ్రాములు .
చాయమినపప్పు -- స్పూనున్నర .
ఆవాలు -- స్పూను .
ఇంగువ -- తగినంత
తయారీ విధానము .
ముందుగా పండు మిరపకాయలు ఒకసారి కడుగుకుని , తొడిమలు తీసుకుని పొడి గుడ్డతో తుడుచుకుని నీడలో ఒక అరగంట సేపు ఎండబెట్టుకోవాలి .
తర్వాత మిక్సీ లో పండుమిరపకాయలు , చింతపండు , పసుపు , కొద్దిగా ఇంగువ మరియు సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా తరుగు కోవాలి .
గోంగూర కట్టలు ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి , ఆకులు వలుచుకుని పూర్తిగా తడి పోయేవరకు నీడలో ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి .
ఆ తర్వాత బాండీలో నూనె వేయకుండా వేయించుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయల ముక్కలు , చాయమినపప్పు , ఆవాలు, ఇంగువ వేసి పోపు వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .
ఒక అయిదు నిముషములు పోపు చల్లారనివ్వాలి .
ఇప్పుడు మిక్సీలో వేయించి సిద్ధంగా ఉంచుకున్న గోంగూర , మిక్సీ వేసుకున్న పండుమిరపకాయల ముద్ద , మెంతి పొడి మరియు సరిపడా ఉప్పు వేసుకుని ఈ రెండు బాగా కలిసే వరకు మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేయించి సిద్ధంగా ఉంచుకున్న ఉల్లిపాయల లో వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .
తర్వాత వేరే జాడీలోకి తీసుకుని భద్రపరుచుకోవాలి .
ఈ పచ్చడి ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది .
గోంగూర ఆకు మరియు పండు మిరపకాయలతో చేసిన ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది .
మంచి గోంగూర ( అంటే పులుపు లేనిది ) మరియు కొండ గోంగూర ( అంటే పుల్లని గోంగూర ) రెండు రకములు మార్కెట్ లో అమ్ముతారు .
ఈ పచ్చడి తయారీకి పుల్లని గోంగూర చాలా రుచిగా ఉంటుంది .
ఒకవేళ పుల్లని గోంగూర దొరకని పక్షంలో మంచి గోంగూరతో కూడా చేసుకోవచ్చును .
అప్పుడు మరో 25 గ్రాములు చింతపండు వేసుకోవాలి .
ఫోటో ; ---
ఈ రోజు మా ఇంట్లో చేసుకున్న
గోంగూర ఆకుతో పండుమిరపకాయల పచ్చడి .
0 comments:
Post a Comment