నోరూరించే గుంటూరు గోంగూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్
ఒకటి మంచి గోంగూర
రెండు కొండ గోంగూర
మంచి గోంగూర పులుపు ఉండదు .
కొండ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది.
ఇది ఏడాది నిల్వ పచ్చడి కాదు .
ఆకులు వలచి చేసుకునే పచ్చడి .
ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఒక పది రోజులు నిల్వ ఉంటుంది.
పచ్చడికి అది సగం ఇది సగం వాడుకుంటే పులుపు సమంగా సరిపోతుంది .
రెండూ కలిపి చేస్తే చింతపండు వేయనక్కరలేదు.
పులుపు లేని ఆకు చేసుకుంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది.
గుంటూరు జిల్లాలో కొంత మంది గోంగూర పచ్చడి నూరాక సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు పచ్చడిలో కలుపుకోవడం , లేదా పచ్చిమిర్చి మరియు ఈ ఉల్లిపాయల ముక్కలు పచ్చడితో తింటారు. .
తిన్నాక నోరు వాసన వస్తుందని మేము ఎప్పుడైనా అలా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి నూనెలో మగ్గబెట్టి పచ్చడిలో కలుపుకొని తింటాము.
అలా కూడా పచ్చడి చాలా రుచిగా ఉండేది.
గోంగూర పచ్చడి తయారీ విధానము .
*********************************
కావలసినవి .
రెండురకాల కట్టలు -- 4
నూనె -- రెండు గరిటలు
ఎండుమిరపకాయలు --- కారాన్ని బట్టి షుమారు 20 కాయలు .
మెంతులు -- రెండు స్పూన్లు
ఆవాలు -- స్పూను
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
ఇంగువ -- తగినంత
ముందుగా గోంగూర కట్టల నుండి ఆకు వలుచుకొని, ఆకును శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టపై ఆకులోని తడి పోయే విధంగా నీడను గాలికి ఆరబెట్టుకోండి.
తర్వాత స్టౌ మీద బాండి పెట్టి ఒక గరిటెడు నూనె వేసి నూనె కాగగానే ఆకును మెత్తగా మగ్గ బెట్టి కొద్దిగా పసుపు కూడా వేసి ఒక ప్లేటులో విడిగా తీసుకోండి.
తర్వాత మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన గరిటెడు నూనె వేసి నూనె కాగగానే ఎండుమిర్చి, మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకోండి.
పోపు చల్లారగానే ఎండు మిర్చి మరియు మిగిలిన పోపును మిక్సీలో వేసి , తగినంత ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చెసుకోండి.
తర్వాత మగ్గిన ఆకును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి.
పైన మినపప్పు , శనగపప్పు పోపు వేయించి పచ్చడిలో కలుపుకోండి. లేదా ముందే పోపులో వేసి పచ్చడితో పాటుగా గ్రైండ్ చేసుకోవచ్చు . అది మీ ఇష్టం .
ఇప్పుడు పండు మిరపకాయలు వస్తున్నాయి కాబట్టి ఎండు మిర్చి బదులు పండు మిరపకాయలు కూడా నూనెలో మగ్గబెట్టి గోంగూర పచ్చడి చేసుకోవచ్చు .
విధానము అంతా పైన చెప్పినదే .
అప్పుడు ఓ పది పండు మిరప కాయలు వేసుకుంటే సరిపోతుంది.