చలిమిడి
ఆలూరు కృష్ణప్రసాదు .
చలిమిడి తయారు చేయు విధానము .
ఆడపిల్లను అత్తవారింటికి పంపే సందర్భాలలో , కూతురుకు మూడవ నెల రాగానే దొంగ చలిమిడి అని కన్న తల్లి పెడతారు ఆ సందర్భంలో , కూతురుకు ఏడవ నెల మరియు తొమ్మిదివ నెల సీమంతం చేసిన సందర్భాలలో , పిల్ల వాడు పుట్టాక కూతురును బిడ్డతో సహా తిరిగి అత్తవారింటికి పంపుతూ చొంగ చక్కిలాలు అంటారు వాటితో సహా ఇచ్చి పంపే సందర్భాలలో ఇలా అన్ని శుభ సందర్భాలలో చలిమిడి అని పెడతారు .
అయితే ఈ చలిమిడి చేసే విధానము చాలా మందికి తెలియదు .
అందువలన పెద్దలను సంప్రదించి మీ అందరికీ వివరంగా తెలియచేస్తున్నాను .
చలిమిడి తయారు చేయు విధానము .
కావలసినవి .
బియ్యము -- ఒక కె. జి .
బెల్లం -- ముప్పావు కిలో
గసగసాలు -- రెండు స్పూన్లు
ఎండు కొబ్బరి -- ఒక చిప్ప.
చిన్న ముక్కలుగా తరిగి స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ముక్కలు వేగగానే అందులో గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి.
పాకం పట్టే సమయంలో వేయించుకోవాలి .
యాలకుల పొడి -- ఎనిమిది యాలకులు పొడిగా చేసుకోవాలి . స్పూనున్నర తీసుకోవాలి .
తయారీ విధానము .
ఒక కె. జి . బియ్యము తగినన్ని నీళ్ళు పోసి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి .
కావలసినవి సామగ్రి అన్నీ సిద్ధం చేసుకున్నాక మరుసటి రోజు బియ్యము వడకట్టి పిండి మరపెట్టించాలి .
మరపట్టించే అవకాశము లేని వారు మిక్సీ లో వేసుకొనవచ్చు.
పిండి తడిగా ఉన్నప్పుడు బాగా నొక్కి పట్టి ఉంచాలి .
బెల్లం పొడిలా పచ్చడి బండతో దంచుకోవాలి .
స్టౌ మీద గిన్నె పెట్టి నలగొట్టిన బెల్లం వేసి , బెల్లం మునిగే వరకు నీళ్ళు పోసి జాగ్రత్తగా చూసి కదుపుతూ బాగా ఉండ పాకం రానివ్వాలి .
ఉండపాకం అంటే ఒక పళ్ళెంలో నీళ్ళు వేసి ఉడుకుతున్న కొద్ది పాకం వేసి చేతితో చూస్తే పాకం బాగా ఉండలా రావాలి .
ఈ లోగా తడిపిండి బాగా జల్లించుకుని బరకగా ఉన్నది తీసేసుకోవాలి .
ఉండపాకం రాగానే స్టౌ కట్టేసి దించి పాకంలో వేయించిన కొబ్బరి ముక్కలు , గసగసాలు , యాలకులపొడి వేసి కొద్ది కొద్దిగా గుప్పెడు గుప్పెడు పిండి వేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ చలిమిడి సరియైన విధంగా వచ్చేటట్లు చూసుకోవాలి .
తర్వాత పిండిలో మూడు చెంచాలు నెయ్యి వేసుకోవాలి .
పిండి చాలా మృదువుగా వస్తుంది .
తరువాత సందర్భానుసారం ఉండలుగా చేసుకోవచ్చు .
అంతే ఎంతో రుచిగా ఉండే చలిమిడి సిద్ధం.
ఇష్టమైనవారు జీడిపప్పు నేతితో వేయించుకుని వేసుకోవచ్చు .
Super Krishna Prasad garu. Chala vivram ga rasaru
ReplyDeleteThank you!