ఆలూరుకృష్ణప్రసాదు .
జిల్లేడుకాయలు లేదా తీపి కుడుములు.
ఈ స్వీట్ మేము ప్రతి వినాయక చవితి పండుగకు తప్పనిసరిగా చేసుకుంటాము .
గణపతి కి ఉండ్రాళ్ళు మరియు తీపి జిల్లేడుకాయలు మాత్రమే ప్రసాదంగా చేస్తాము .
ఆ రోజు వేడి వేడి నూనెతో గారెలు , సజ్జ పూరీలు , పునుగులు వంటి వండిన పిండి వంటలు చేయము ,
కారణం నాకు పూర్తిగా తెలియదు కాని మా ఇంట్లో మాత్రం మా బామ్మ గారి తరం నుండి ఇదే పద్ధతి .
గోదావరి జిల్లాలో మా అమ్మమ్మ గారి ఇంట్లో కూడా ఇదే ఆనవాయితి .
ఇంక ఈ తీపి కుడుములు మళ్ళీ దేవీ నవరాత్రులలో చేసుకుంటాము .
విడి రోజుల్లో చేసుకోవడం చాలా తక్కువ .
జిల్లేడుకాయలు మాదిరిగా చేసుకుంటే జిల్లేడుకాయలు అని అంటాము .
గుండ్రంగా చేసుకుంటే తీపి కుడుములని అంటాము .
తయారీ విధానము .
ఇంక జిల్లేడుకాయలు లేదా తీపి కుడుములు తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద గిన్నె పెట్టి అందులో గ్లాసున్నర నీళ్ళు పోసి అందులో చిటికెడు ఉప్పు వేసి నీళ్ళను బాగా తెర్ల నివ్వాలి .
బియ్యము మర పట్టించి ఒక గ్లాసు బియ్యపు పిండి తీసుకోవాలి .
తరువాత తెర్లుతున్న నీళ్ళలో సిద్ధంగా ఉంచుకున్న బియ్యపు పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ బియ్యపు పిండి ఉండలు కట్టకుండా గరిటతో బాగా కలుపుకుని , రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలిపి పైన మూత పెట్టి స్టౌ ఆపేయాలి .
తర్వాత చేతికి నెయ్యి రాసుకుని పిండిని చెత్తో మెదుపుతూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .
అంతకు ముందు కొబ్బరి కాయ కొట్టుకొని పచ్చి కొబ్బరి తురుముతో రెండు చిప్పలు కోరుకొని పచ్చి కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి .
పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పులు ఉంటే , ఒక కప్పు బెల్లం బండతో పొడిగా చేసుకొని , తురిమిన కొబ్బరి లో వేసి బాగా కలుపు కోవాలి .
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి కలిపిన మిశ్రమము వేసి రెండు చేతి వేళ్ళతో పట్టుకుంటే చేతులకు బెల్లం పాకం అంటుకునే విధంగా పాకం పట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసి దింపాలి .
కొబ్బరి లౌజు కొద్దిగా చేయి పట్టే వేడి మీద ఉండగానే చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న బియ్యపు పిండి అర చేతికి నెయ్యి రాసుకుని ఒక్కొక్క ఉండను అర చేతులోకి తీసుకొని చెయ్యి అంతా ఒత్తుకుని , అందులో స్పూను కొబ్బరి మిశ్రమం పెట్టి పిండి మీద పరచి అంచులు తడి చేత్తో మూసేసుకోవాలి .
ఇలా అన్నీ తయారు చేసుకుని ఇడ్లీ స్టాండు ప్లేటులకు నెయ్యి రాసి , అందులో ఈ తయారు చేసుకున్న కుడుములు పెట్టి , కుక్కర్ లో సరిపడా నీళ్ళు పోసి ఒక పది నిముషాల పాటు ఇడ్లీల మాదిరిగా ఆవిరి పట్టాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే జిల్లేడుకాయలు లేదా తీపి కుడుములు స్వామి వారికి లేదా అమ్మ వారి నైవేద్యానికి అనంతరం మనం దైవ ప్రసాదంగా స్వీకరించడానికి సిద్ధం .
0 comments:
Post a Comment