Saturday, April 14, 2018

బాలింతల కోసం కరివేపాకు కారప్పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ప్రియమిత్రులందరికీ   శుభోదయనమస్కారములు .

ప్రియమైన   మిత్రులారా  !

ఈ  రోజు  మీ  అందరికీ   అతి ప్రాచీన వంటకం  అనగా ఏనాటినుండో మన  తాతమ్మల  తరం  నుంచి  వచ్చిన  కరివేపాకు   కారప్పొడి  గురించి  వివరిస్తాను .

ఈ  కరివేపాకు   కారప్పొడి  బాలింతలకు  పథ్యంగా  పెడతారు.

జ్వరపడిన వారికి   పథ్యం  పెట్టే  సమయంలో    కూడా  పెడతారు .

నోరు అరుచిగా  ఉన్నప్పుడు , బాగా  జలుబు  చేసినప్పుడు , కడుపులో  ఇబ్బందిగా  ఉన్నప్పుడు మేము తరచుగా  ఈ  కారప్పొడి  కొట్టుకుంటాము .

ఈ  కరివేపాకు   కారప్పొడి  కొట్టగానే  వాసన  పోకుండా  ఒక  సీసాలో  పోసుకుంటే  ఘమ  ఘమ లాడే సువాసనతో  నెల రోజుల  పైనే  నిల్వ  ఉంటుంది .

ఈ  కారప్పొడి  తయారు చేయడంలో  మీ  టాలెంట్  అంతా  వేయించడం లోనే  ఉంటుంది.

వేపు  అటూ ఇటు  అయితే  మనం అనుకున్న  రుచి  రాదు .

ఈ  కరివేపాకు   కారప్పొడి లో  వెల్లుల్లి  పాయలు  తప్పని సరిగా   వేయాలి .

వెల్లుల్లి  పాయలు   తగిన మోతాదులో వేస్తేనే  ఆరోగ్య  పరంగా ప్రయోజనం  ఉంటుంది .

ఇక  వెల్లుల్లి  మా ఇళ్ళల్లో  వాడం  అనుకునే  వాళ్ళు  వెల్లుల్లి  వేయకుండా  చేసుకోండి .

ఈ కరివేపాకు  కారప్పొడి కి అసలైన రుచి  వెల్లుల్లి  పాయలు  వేసుకుంటేనే  వస్తుంది.

కరివేపాకు  కారప్పొడి.

కావలసిన పదార్థములు .

కరివేపాకు   ఒక  20  రెమ్మల  ఆకు  దూసుకోవాలి .

మరి కాస్త  కరివేపాకు  వేసుకున్నా  మంచిదే.

ఎండు మిరపకాయలు  -- 15 నుండి  18  వరకు .

చాయ మినపప్పు   ---  మూడు  స్పూన్లు .

ధనియాలు   ---  50 గ్రాములు

జీలకర్ర   ---  పావు  స్పూన్

ఆవాలు  --  పావు  స్పూన్

వెల్లుల్లి  రెబ్బలు  --  పై  పొట్టు  తీయకుండా  ఒక  20 .

పొడిలో పచ్చివే  వేయాలి . నూనె లో వేయించనవసరం లేదు.

పైన  ఫోటోలో  చూపిన  మాదిరిగానే   ఒలిచి  పెట్టుకోండి .

వెల్లుల్లి పొట్టు  తీసి వేస్తే   కారప్పొడి  పేస్టు అవుతుంది.

కారప్పొడి  కూడా అదో రకమైన ఘాటు  వాసన వస్తుంది .

ఉప్పు   ---  తగినంత

చింతపండు  --  ఒక  నిమ్మ కాయ సైజు . విడదీసి పెట్టుకోవాలి .

నూనె  --  5  లేక  6  స్పూన్లు  .

అంతే .

కరివేపాకు  కారప్పొడి .

తయారు  చేయు విధానము .

ముందుగా   కరివేపాకు   కడిగి  నీడన ఒక అరగంట ఆరబోసుకోండి .

తడి  ఉండకూడదు . పొడిగా ఉండాలి .

స్టౌ  వెలిగించి  బాండి పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా  కాగాక  కరివేపాకు  మెత్తదనం  పోయేదాకా  వేయించి  పక్కన  వేరే ప్లేటులో  పెట్టుకోండి .

కరివేపాకు  మెత్తగా  వేయిస్తే పొడి  పొడిపొడిగా రాదు.

తర్వాత  స్టౌ  మీద  మళ్ళీ  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  ఎండు మిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు  వేసి కమ్మని వేపు  వాసన  వచ్చే  దాకా  వేయించండి . ఇప్పుడు  జీలకర్ర , ఆవాలు కూడా వేసి  అట్లకాడతో  కలుపుతుండండి .

ఆవాలు  చిటపటలాడాక  దింపి  ఒక  అయిదు  నిముషాలు   చల్లార నివ్వండి.

చింతపండు  ఈనెలు ,  గింజలు  లేకుండా  శుభ్రం  చేసుకోండి .

ముందుగా మిక్సీలో  వేయించిన  ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు ,  ఆవాలు , జీలకర్ర  మిశ్రమము మరియు  తగినంత ఉప్పు వేసి  రెండుసార్లు  తిప్పండి.

ఇప్పుడు   చింతపండు  , వేయించిన  కరివేపాకు  వేసి మరో  రెండుసార్లు  తిప్పండి

ఆ తర్వాత  వెల్లుల్లి  పాయలు వేసి  ఒకసారి  తిప్పండి .

ఇప్పటికే  మీ వంట గదంతా  చక్కని  కరివేపాకు , వెల్లుల్లి  వాసనల సువాసనలతో  ఘుమ  ఘమ  లాడి  పోతుంది .

ఇప్పుడు   ఈ  మిశ్రమమంతా  ఒక  పళ్ళెంలోకి  తీసుకొని,      చేత్తో  బాగా  కలుపుకొని  నలగని  చింతపండు  చేతికి తగిలితే  తీసేయండి .

చేత్తో  బాగా నలిపాక ముద్దగా  ఉన్న కారప్పొడి ఇప్పుడు పొడి పొడి లాడుతుంది .

ఉప్పు  సరిపోయిందో  లేదో  నోట్లో  వేసుకుని   చూసుకొని , చాలక పోతే  తగినంత  కలుపుకోండి .

వాసన పోకుండా  శుభ్రంగా  తుడిచిన  గాజు  సీసాలో  పెట్టుకుంటే  నెల  రోజుల  పైన  నిల్వ ఉంటుంది .

వేడి  వేడి  అన్నంలో  మూడు  స్పూన్లు  నెయ్యి  వేసుకుని , అందులో  ఈ  కరివేపాకు   కారప్పొడి  వేసుకొని తింటే
ఆ రుచి  అహా  అద్భుతః .

ఇందులో  పచ్చి శనగపప్పు , మెంతులు , పసుపు, ఎక్కువ  జీలకర్ర , ఎక్కువ  ఆవాలు , ఇంగువ  వాడకూడదు .

ఆరోగ్య  ఫలితాలు  పొందాలంటే  నేను  చెప్పిన  విధంగానే   తయారు  చేసుకోవాలి.

ఎంతో రుచిగా  ఉండే ఈ కరివేపాకు  కారప్పొడి భోజనము  లోకే  కాకుండా  ఇడ్లీలు , దోశెలు , గారెలు మరియు చపాతీలలోకి కూడా చాలా బాగుంటుంది .

సంబంథిత రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .

కరివేపాకు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కరివేపాకు   పచ్చడి .

తయారీ  విధానము  .

రెండు కప్పుల కరివేపాకు  ,  50  గ్రాముల  పొట్టు  మినపప్పు  ,  పది  ఎండుమిరపకాయలు  , అర స్పూను   ఆవాలు ,  ఇంగువ  కొద్దిగా , బాండీలో  నాలుగు   స్పూన్లు   నూనె  వేసి  వేయించుకోండి .

నిమ్మకాయంత  చింతపండు కొద్దిగా   నీళ్ళలో  పావు  గంట సేపు   నాన బెట్టు కోవాలి . 

పోపు చల్లారగానే  మిక్సీ  లో  ముందు  వేగిన  ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు  వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

ఆ  తర్వాత  వేయించిన  పొట్టు మినపప్పు   కరివేపాకు   మిశ్రమం ,  తడిపిన చింతపండు  , ఇష్టమైతే  కొద్దిగా  బెల్లం  వేసుకుని  కొంచెం   నీరు  అవసరమైతే  పోసుకుని  మరీ మెత్తగా  కాకుండా కొంచెం    పప్పులు  పప్పులుగా   తగిలే విధముగా  పొత్రముతో రుబ్బుకుంటే  మిక్సీ  వేసుకోండి.

పొట్టు  మినపప్పే  వాడండి.

పొట్టు మినపప్పు  దొరకని పక్షంలో చాయమినపప్పు  వాడండి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే కరివేపాకు  పచ్చడి భోజనము లోకి , దోశెలు , వడలు మరియు  చపాతీలలోకి  సర్వింగ్  కు సిద్ధం .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటో  నా స్వంతం .

సాంబార్

ఆలూరుకృష్ణప్రసాదు .

సాంబార్ . ( సాంబారు పొడి కాకుండా  ముద్ద వేసి )

కావలసినవి .

కందిపప్పు  ---  ఒక గ్లాసు
చింతపండు  --  40  గ్రాములు
ఆనపకాయ /  సొరకాయ   --పావుకిలో  పై చెక్కు  తీసి ముక్కలుగా  తరుగుకోవాలి .
ములక్కాడలు  --  రెండు . ముక్కలుగా  తరుగు కోవాలి.
బెండకాయలు  --  8  ముక్కలుగా  తరుగు కోవాలి.
వంకాయలు  --  రెండు  నీళ్ళలో  ముక్కలుగా  తరుగు కోవాలి
పచ్చిమిర్చి  --  6  నిలువుగా   చీలికలు గా  తరుగు కోవాలి
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --  ఒక కట్ట
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బెల్లం  --  కొద్దిగా  

పోపుకు .

ఎండుమిరపకాయలు  --  మూడు
ఆవాలు -- అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  రెండు స్పూన్లు

సాంబారు ముద్ద.
***********

చాలామంది  సాంబారు పెట్టేటప్పుడు  " సాంబారులో  వేసుకునే  ముద్ద ఎలా తయారు  చేస్తారు ?

అందులో  ఏ ఏ పదార్థాలు  వాడతారు ?

తెలియ చెయ్యమని  " అడుగుతున్నారు .

అందువలన  సాంబారు  ముద్ద  లో ఏ ఏ పదార్థాలు  వేసుకోవాలో , ఎలా  
తయారు చేసుకోవాలో  సభ్యులందరి సౌలభ్యం  కొరకు  తెలియచేస్తున్నాను .

సాంబారు  ముద్ద.
************

కావలసినవి .

ఎండుమిరపకాయలు  - 5
పచ్చిశనగపప్పు  --  రెండు స్పూన్లు .
ధనియాలు --  రెండు స్పూన్లు
మెంతులు --  పావు స్పూను
ఆవాలు -- పావు స్పూను
ఇంగువ  -- కొద్దిగా
మిరియాలు --  అర స్పూను
బియ్యము  -  స్పూను
ఎండు కొబ్బరి /  లేదా  పచ్చి కొబ్బరి  -- అర చిప్ప.
చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
నూనె  -  మూడు  స్పూన్లు

సాంబారు  ముద్ద తయారీ విధానము .
**************

ముందుగా  స్టౌ వెలిగించి  బాండీ పెట్టి  మొత్తం  నూనె వేసి , నూనె బాగా కాగగానే  ముందు మెంతులు వేసి మూడు వంతులు వేగ నివ్వాలి .

మెంతులు సరిగ్గా  వేగకపోతే  సాంబారు  చేదు వస్తుంది .

తర్వాత వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , ధనియాలు , మిరియాలు ,  బియ్యము , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

తర్వాత అందులోనే ఎండుకొబ్బరి లేదా పచ్చి కొబ్బరి  ముక్కలు కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా  వేయించుకోవాలి .

పోపు  బాగా చల్లారగానే  మిక్సీ లో పోపు అంతా వేసి   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత అందులోనే   ఒక అర గ్లాసు నీళ్ళు   ( పైకి  తన్నకుండా  ) రెండుసార్లుగా పోసుకుంటూ  ముద్దను   మెత్తగా  వేసుకోవాలి .

ఈ  ముద్దను  తెర్లుతున్న సాంబారు లో వేసి  గరిటెతో  బాగా కలిపి  మరో పది నిముషాలు  సాంబారులో  ముద్ద బాగా కలిసే  విధముగా  తెర్ల నివ్వాలి .

సాంబారు  ముద్ద ఈ విధముగా  తయారు చేసుకుని ఒక సారి సాంబారు  పెట్టుకుని చూడండి .

సాంబారు తయారీ  విధానము .
*************

చింతపండు   రెండు గ్లాసుల  వేడి నీటిలో  ఒక పదిహేను  నిముషములు  నానబెట్టి  రసం తీసుకోవాలి .

కుక్కర్  లో  తగినన్ని  నీళ్ళు పోసి ఒక  గిన్నెలో   కందిపప్పు  సరిపడా  నీళ్ళు పోసి మూతపెట్టి  నాలుగు  విజిల్స్  వచ్చే వరకు   ఉంచాలి .

తరువాత  మూత తీసి  పప్పును  గరిటతో  మెత్తగా  యెనుపుకోవాలి .

అందులో  చింతపండు  రసము , పసుపు,  తగినంత ఉప్పు ,  చిన్న బెల్లం  ముక్క, తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , ఆనపకాయ ముక్కలు ,  బెండకాయ ముక్కలు ,  వంకాయ  ముక్కలు , ములక్కాడ ముక్కలు , అన్నీ  వేసి  మరో  గ్లాసు నీళ్ళు  పోసి  ఒక  ఇరవై నిముషాలు  పాటు  స్టౌ మీద  ముక్కలన్నీ  ఉడికే వరకు  ఉంచి  బాగా  తెర్లనివ్వాలి.

తరువాత పైన చెప్పిన  విధముగా  ముందుగా  తయారు చేసి సిద్ధము చేసుకున్న సాంబారు ముద్దను  తెర్లుతున్న సాంబారులో  వేసి  గరిటె తో బాగా కలపాలి .

సాంబారు ముద్ద సాంబారులో బాగా ముక్కలకు కలిసే విధముగా మరో  పది నిముషాలు  ఉంచి  దింపి  పైన   తరిగిన  కొత్తిమీర   వేసుకుని  మూత పెట్టుకోవాలి.

తర్వాత  స్టౌ మీద  పోపు గరిట పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు ,  ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు వేసుకుని  సాంబారులో  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే   సాంబార్  ఇడ్లీ, వడలు , పూరీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధిత రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం.

మరో వెరైటి దోశెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటీ  దోశెలు.

చల్ల (  మజ్జిగ  )  దోశెలు.

కావలసినవి .

మజ్జిగ  --  మూడు కప్పులు .
బియ్యము  --  కప్పు
మినపగుళ్ళు  --  ఒక  గరిటెడు.
మెంతులు  --  అర  స్పూను .

ఉల్లి కారమునకు . ( దోశెల పైన రాయడానికి  )

ఉల్లిపాయలు  -   రెండు ( ముక్కలుగా  తరుగుకోవాలి )
ఎండుమిరపకాయలు  - రెండు
పచ్చిమిర్చి  --  నాలుగు
జీలకర్ర  --  అర స్పూను
ఉప్పు  --  తగినంత .
పసుపు  --  కొద్దిగా
నూనె --  ఒక  50  గ్రాములు .

తయారీ విధానము .

ముందుగా బియ్యము , మినపగుళ్ళు  నీళ్ళల్లో కడగాలి .

ఒక గిన్నెలో  మజ్జిగ  పోసుకుని  అందులో   బియ్యము  , మినపగుళ్ళు , మెంతులు  వేసుకుని  ఒక అయిదు గంటల సేపు నానబెట్టుకోవాలి .

తర్వాత  గ్రైండర్ లో  వేసుకుని  , కొద్దిగా  ఉప్పు వేసుకుని  దోశెల పిండిలా  మెత్తగా  వేసుకోవాలి . 

రుబ్బిన పిండిని  విడిగా  వేరే గిన్నె లోకి తీసుకోవాలి .

తర్వాత   మిక్సీ లో  ఉల్లిపాయ  ముక్కలు , జీలకర్ర , రెండు ఎండుమిరపకాయలు  , నాలుగు  పచ్చి మిరపకాయలు , కొద్దిగా  పసుపు  మరియు  కొద్దిగా  ఉప్పు  వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ కారాన్ని  వేరేగా  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  పెనం పెట్టి  పెనం వేడెక్కగానే  పల్చగా  దోశెలు  వేసుకుని ఒక్కొక్క  దోశె   పైన  ఒక స్పూను  ఉల్లి కారం వేసుకుని  అట్లకాడతో  దోశె అంతా రాసి , స్పూను  నూనె వేసి  రెండు వైపులా  బాగా  కాలనివ్వాలి .

ఇలాగే  అన్ని దోశెలు  వేసుకోవాలి .

ఈ దోశెలు  కొబ్బరి  చట్నీతో  చాలా రుచిగా  ఉంటాయి .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటోలు   నా స్వంతం .

ఆవకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

ఆవకాయ. ( ఏడాది  ఊరగాయ )

ఇప్పుడు  ఆవకాయల  సీజన్ .

అందరూ  అదే  పనిలో  బిజి  బిజీ .

మరి  ఆవకాయ  ఎలా  పెట్టు కోవాలో  మన సభ్యులందరికీ  తెలియచేస్తున్నాను.

తయారీ  విధానము .

అవకాయ .

మామిడి కాయను  సైజును , పులుపును బట్టి కొలతలు  కొంచెం  అటుఇటుగా ఉంటాయి

మామిడికాయలు  - 12

As బ్రాండ్ పప్పు నూనె   - one and half kg

పసుపు -- ఒక స్పూను

మెంతులు  --  మూడు స్పూన్లు

కొంతమంది   శనగలు , మరి కొంతమంది  వెల్లుల్లి  రెబ్బలు  ఆవకాయ లో కలిపేటప్పుడు వేసుకుంటారు .

ఈ శనగలు , వెల్లుల్లి  రేకలు మీ మీ ఇష్టాన్ని బట్టి  షుమారుగా వేసుకోవచ్చు .

ముందుగా మామిడికాయలు బజారు నుంచి తెచ్చి నీటిలో వెయ్యాలి .

కొద్దిసేపు ఒక బకెట్ లో ఉంచిన తరువాత ఒక్కొక్క కాయను  గుడ్డతో
తుడిచి ముచ్చికలు తీసి  పెచ్చుతో సహా ముక్కలుగా కట్ చేసుకోవాలి .

తరువాత ఒకొక్క ముక్కను గుడ్డ పెట్టి తుడిచి అందులో పల్చటి పొరను తీసెయ్యాలి .

ఇప్పుడు  ప్రతి ఊరిలోనూ ఏ రకం కాయ కావాలో మనం ఎన్నుకుంటే వాళ్ళే నీళ్ళల్లో కడిగి  , గుడ్డ పెట్టి కాయను తుడిచి ఆవకాయ కత్తి పీటతో కాయ చితకకుండా  , పెచ్చుతో సహా ముక్కలుగా కట్ చేసి ఇస్తున్నారు .

దాని నిమిత్తం  కాయకు ఇంతని వసూలు చేస్తున్నారనుకోండి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో  మొత్తము  నూనె పోసుకుని  తరిగి సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలను నూనెలో వేయాలి.

అలా  కొద్దిసేపు నూనె అంతా  ముక్కలకు పట్టేటట్లు ఉంచాలి .

ఈ విధంగా నూనె లో  ముక్కలను వెయ్యటం వలన  సంవత్సరము అంతా  ముక్క గట్టిగా  ఉంటుంది  .

ముక్క మెత్తగా  అవ్వదు.

ఇప్పుడు ఓ  పళ్ళెంలో  అవ పిండి , ఉప్పు , కారం , పసుపు , మెంతులు వేసి  కలిపి గుచ్చు ఎత్తుకోవాలి

ఇందాక నూనెలో వేసిన ముక్కలు కు ఈ మిశ్రము కలిపి బాగా చెక్క గరిటెతో కానీ  చేతి తో  బాగా కలుపుకోవాలి

ఒక జాడీలో పెట్టుకుని ఒక గుడ్డ వాసము కట్టాలి.

మూడవ రొజు తిరగ కలపాలి.

ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి .

లోగడ  పెద్ద వారందరూ ఈ ఏడాది  ఆవకాయ తిరగ కలపటానికి , మధ్యలో కొంచెం  కొంచెం  విడిగా  తీసుకోవడానికి  చెక్క గరిటెలు వాడేవారు.

తిరిగి  మళ్ళీ  గుడ్డతో వాసిన కట్టే వారు.

ఇలా చేయడం వలన ఏటి కేడాది ఆవకాయ రంగు మారకుండా ఘమ ఘమ లాడుతూ ఉండేది .

ఆవకాయ లో కలిపే ఆవపిండి  పాళ్ళు  వివరంగా  ఇస్తున్నాను .

ముక్కలు  షుమారుగా  కొలుచుకుని  అంటే   మూడు  కే. జి ల  ముక్కలకు  రెండు  కె.జీ ల  ఆవపిండి,  కారం , ఉప్పు  మిశ్రమం   కలపాలి .

ఈ  మిశ్రమం  కలి పేటప్పుడు  మొత్తం   గుండ  రెండు  కె. జీ. లను  కుంటే   800  గ్రాములు  ఆవ పిండి ,  700  గ్రాములు  కారం ,   500  గ్రాములు  మెత్తని   ఎండబెట్టిన  ఉప్పు వేసి  కలపాలి .

అయోడైజ్డ్  ఉప్పును వాడవద్దు .

పచ్చడి  రుచి పాడవుతుంది.

బజార్లో విడిగా  ఉప్పు పాకెట్లు అమ్ముతారు .

అవి తెచ్చి  తడి లేకుండా  ఎండబెట్టుకోవాలి .

కొత్తావకాయ కలిపి  జాడీలలో పెట్టుకున్న తర్వాత ,   ఆ బేసిన్ లో  మిగిలిన  ఆవపిండి లో   వేడి వేడి అన్నం , మరియు నెయ్యి వేసి కలిపి అమ్మ పెట్టిన  ముద్దలు తిన్న ఆ మధురానుభూతులు ,  ఆ అద్భుతమైన  రుచి  జీవితంలో  మర్చిపోగలమా ?

గోంగూర పండుమిరపకాయ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

గోంగూర  ఆకు  మరియు  పండు మిరపకాయలతో పచ్చడి.

కావలసినవి .

గోంగూర  --  మూడు  కట్టలు
పండుమిరపకాయలు --  150  గ్రాములు .
చింతపండు  --  50  గ్రాములు .
మెంతిపిండి --  రెండు స్పూన్లు .
ఉప్పు  --  తగినంత
పసుపు  --  స్పూను
ఉల్లిపాయలు  --  మూడు .

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ముక్కలుగా చేసుకోవాలి .
నూనె -- 150  గ్రాములు .
చాయమినపప్పు  --  స్పూనున్నర .
ఆవాలు  --  స్పూను .
ఇంగువ  --  తగినంత

తయారీ  విధానము .

ముందుగా  పండు మిరపకాయలు  ఒకసారి  కడుగుకుని ,  తొడిమలు  తీసుకుని  పొడి గుడ్డతో  తుడుచుకుని  నీడలో  ఒక అరగంట సేపు  ఆరబెట్టుకోవాలి .

తర్వాత  మిక్సీ లో  పండుమిరపకాయలు , చింతపండు , పసుపు , కొద్దిగా  పచ్చిఇంగువ మరియు  సరిపడా  ఉప్పు వేసుకుని  పచ్చడి మెత్తగా  వేసుకోవాలి .

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

గోంగూర  కట్టలు  ఇసుక లేకుండా  శుభ్రంగా  కడిగి , ఆకులు  వలుచుకుని  పూర్తిగా  తడి పోయేవరకు  నీడలో  ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి . 

ఆ తర్వాత  బాండీలో  నూనె  వేయకుండా  వేయించుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండి  పెట్టి   మొత్తము  నూనె పోసి  నూనె  బాగా కాగగానే  ఎండుమిరపకాయల ముక్కలుగా చేసి , చాయమినపప్పు , ఆవాలు, ఇంగువ వేసి  పోపు  వేగగానే  సన్నగా  తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  వేసి  ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు  వేయించుకోవాలి .

ఒక అయిదు  నిముషములు  పోపు  చల్లారనివ్వాలి .

ఇప్పుడు   మిక్సీ లో  వేయించి సిద్ధంగా  ఉంచుకున్న   గోంగూర ,  రోటిలో దంపిన   పండుమిరపకాయల  ముద్ద , మెంతి పొడి మరియు సరిపడా  ఉప్పు  వేసుకుని  ఈ రెండు  బాగా  కలిసే వరకు  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఆ తర్వాత  ఈ  మిశ్రమాన్ని  వేయించి  సిద్ధంగా  ఉంచుకున్న  ఉల్లిపాయల లో వేసుకుని   గరిటెతో  బాగా  కలుపుకోవాలి .

కొంతమంది    మొత్తము  పచ్చడిలో ఉల్లిపాయలు  ముందు వేయించి  వేయకుండా అవసరమైన మేరకు పచ్చడి  తీసుకుని   ఉల్లిపాయలు వేయించి కలుపుకుంటారు .

మరి కొంతమంది పచ్చి ఉల్లిపాయలు , నాలుగు  పచ్చిమిరపకాయలు  మరియు పది వెల్లుల్లి  రెబ్బలు మిక్సీ లో  వేసి  ఈ పచ్చడి  కూడా కలిపి  మిక్సీ  వేసుకుంటారు .

వెల్లుల్లి  ఇష్టమైన వారు అలా కూడా చేసుకోవచ్చును .

తర్వాత  వేరే జాడీలోకి కాని  లేది కంటైనర్  లోకి  గాని తీసుకుని భద్రపరుచుకోవాలి .

ఈ పచ్చడి  మనం చేసుకునే విధానమును పట్టి షుమారు వారం నుండి  రెండు వారముల వరకు  నిల్వ ఉంటుంది .

గోంగూర ఆకు మరియు పండు మిరపకాయలతో  చేసిన  ఈ పచ్చడి  వేడి వేడి అన్నంలో  మరి కాస్త నెయ్యి వేసుకుని  తింటే  అద్భుతమైన  రుచిగా  ఉంటుంది .

మంచి గోంగూర  (  అంటే  పులుపు  లేనిది )  మరియు  కొండ గోంగూర  ( అంటే  పుల్లని  గోంగూర  )  రెండు  రకములు  మార్కెట్  లో అమ్ముతారు .

ఈ పచ్చడి తయారీకి   పుల్లని  గోంగూర  చాలా రుచిగా  ఉంటుంది .

ఒకవేళ పుల్లని  గోంగూర  దొరకని  పక్షంలో  మంచి గోంగూరతో  కూడా  చేసుకోవచ్చును .

అప్పుడు  మరో  25  గ్రాములు  చింతపండు  వేసుకోవాలి .

హామీ పత్రం .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటో  నా స్వంతం.

రసము పొడి / చారు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

రసము  పొడి /  చారు పొడి .

మా ఇంట్లో   రసము /చారు పొడి  నెలకు  సరి పడా  ఒక్కసారే  మిక్సీ  వేసుకుంటాము .

రసము /చారు పొడి  చేసుకునే  విధానము .

ఎండు  మిరపకాయలు  ---  షుమారు  20  గ్రాములు.
ధనియాలు   ----  50  గ్రాములు
జీలకర్ర        -----  20  గ్రాములు
మిరియాలు  ----  15  గ్రాములు
పచ్చి శనగపప్పు  ---  25  గ్రాములు
కందిపప్పు        ----   20 గ్రాములు

షుమారుగా  కొలతలు  చెప్పాను.

ఇవి  అన్నీ  పచ్చివే  ఒక  చాటలో  పోసి  ఎర్రటి  ఎండలో  మూడు  రోజులు  ఎండ  నివ్వండి . 

మూడో  రోజు  ఈ పదార్ధాలన్నీ  మెత్తగా   మిక్సీ  వేసుకోండి .

మేము  ఇందులో  కొంచెం  పచ్చి  ఇంగువ  వేసుకుంటాం .

మీకు  ఇష్ట మైతే  పొడి  మిక్సీ  వేయబోయే ముందు  ఇంగువ  తగినంత  వేసుకోండి.

మిరియాలు  మరి కాస్త  వేసుకుంటే  ముక్కులు  అదిరిపోయే  ఘూటుతో  చారుపొడి  రెడీ  అవుతుంది .

ఈ  మిశ్రమాన్ని  ఒక  సీసాలో  పోసి  నిల్వ  ఉంచుకోండి .

రసము /చారు తయారు చేసుకునే  విధానము .

నిమ్మకాయంత చింతపండు , మూడు పచ్చిమిరపకాయలు , తగినంత ఉప్పు , ఇష్టమైతే చాలా కొద్దిగా  బెల్లం , కరివేపాకు , పసుపు వేసి  రెండున్నర గ్లాసుల నీళ్ళు  పోసి  స్టౌ మీద పెట్టాలి .

రసము బాగా  తెర్లుతున్నప్పుడు  ఈ  చారుపొడి  రెండు  స్పూన్లు  వేసి  పొంగ కుండా  చూసుకోవాలి .

దింపే ముందు  కొద్దిగా  కొత్తిమీర వేసుకోవాలి .

తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి  రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , అర స్పూను ఆవాలు , కొద్దిగా జీలకర్ర  , కొద్దిగా మెంతులు ,  కొంచెం ఇంగువ  వేసి    పోపు  పెట్టుకొని  రసము లో కలుపుకోవాలి .

అంతే  రుచికరమైన  చారు  / రసము భోజనం  లోకి సిద్ధం.

ఈ రసము / చారులో  టమోటోలు లేదా  మునక్కాయలు  వేసుకోవచ్చును .

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

కూర పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కూర పొడి .

సాధారణంగా  వంకాయ , దొండకాయ మరియు  బెండకాయ  వంటి కూరల్లో  వెరైటీగా   ఆ కాయలలో పొడిని  పెట్టుకుని  కాయలపళంగా  కూర  చేసుకుంటాము .

ఈ కూర పొడి  కొద్దిగా  మార్పులు  చేసుకుని  కొట్టుకోవచ్చు.

అదేవిధంగా  ఒకసారే  కొట్టుకుని  సీసాలో భద్రపరచుకుంటే  నాలుగైదు సార్లకు  వస్తుంది.

ఈ విధముగా  కొట్టుకున్న పొడి  సీసాలో భద్రపర్చుకుని  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  మూడు నెలల వరకు తాజాగా  ఉంటుంది .

మేం సాధారణంగా  ఇలా చేసుకునే  రెండు రకముల  కూర పొడుల గురించి  మీకు తెలియ చేస్తాను .

మొదటి  విధానము .

ఈ పొడి  మసాలా  టచ్  లేకుండా  మామూలుగా  ఉంటుంది .

ఎండుమిరపకాయలు  --  25
పచ్చిశనగపప్పు  --  50  గ్రాములు
చాయమినపప్పు  --  50  గ్రాములు
జీలకర్ర  --  మూడు స్పూన్లు .
నూనె  --  నాలుగు  స్పూన్లు .
ఉప్పు -- తగినంత

తయారీ విధానము .

స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి , నూనె బాగా కాగగానే  ఎండుమిరపకాయలు (  తొడిమలు  తీసి  ) , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు  మరియు  జీలకర్ర  వేసుకుని  మీడియం సెగన కమ్మని వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి .

కొద్దిగా  చల్లారగానే  తగినంత  ఉప్పు వేసి  మరీ మెత్తగా  కాకుండా  కొద్దిగా  పప్పులు  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

రోటి సౌకర్యము  ఉన్నవారు  రోటిలో  పచ్చడి బండతో  దంపుకుంటే  రెట్టింపు  రుచిగా ఉంటుంది.

తర్వాత  సీసాలో  భద్రపరుచుకుని  ఫ్రిజ్ లో పెట్టుకోవాలి .

అవసరయయినప్పుడు ఫ్రిజ్ లో నుండి  తీసుకుని  అవసరమైతే  కొద్దిగా ఉప్పు కలుపుకుని ,   కూరల్లో  పెట్టుకుని , కాయలను  నూనెలో వేయించుకోవాలి.

రెండవ  విధానము .

కొద్దిగా  మసాలా  కూరలా  చేసుకోవాలంటే  ----

కావలసినవి .

ఎండుమిరపకాయలు  --  25
పచ్చిశనగపప్పు  --  50  గ్రాములు
చాయమినపప్పు  -- 50  గ్రాములు
ధనియాలు  -- 20    గ్రాములు 
జీలకర్ర  --  రెండు స్పూన్లు
ఎండుకొబ్బరి  --  పావు చిప్ప . చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .
కరివేపాకు  --  అయిదు  రెమ్మలు .
నూనె  --  నాలుగు  స్పూన్లు
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందు  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె  వేసి , నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు, జీలకర్ర , ఎండుకొబ్బరి ముక్కలు మరియు  కరివేపాకు  వేసి  కమ్మని  వాసన వచ్చేవరకు  వేయించుకుని  చల్లారగానే  మిక్సీ  లో వేసి , తగినంత  ఉప్పువేసి   మరీ మెత్తగా  కాకుండా  పప్పులు తగిలే విధముగా మిక్సీ వేసుకోవాలి .

రోటి సౌకర్యం  ఉన్నవారు  రోటిలో  పచ్చడి  బండతో పప్పులు  తగిలే విధముగా దంపుకుంటే  ఈ మసాలా కూర పొడి   చాలా రుచిగా  ఉంటుంది .

తర్వాత  సీసాలో భద్రపర్చుకుని , ఫ్రిజ్ లో  పెట్టుకోవాలి .

అవసరమైనప్పుడు  ఫ్రిజ్  లోనుండి తీసుకుని  అవసరమైన  యెడల కొద్ది ఉప్పు కలుపుకుని  కూరల్లో పెట్టుకోవాలి .

ఈ  కూరపొడి  కూడా  రెండు నెలల పైన  నిల్వ ఉంటుంది .

మనం కూరల్లో  కూరే ముందు  పొడి  నాలుక పై వేసుకుని  రుచి చూస్తే  ఉప్పగా  తగిలితే  వేగిన కూరలో సరిపోతుంది .

సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి