Thursday, August 31, 2017

వంకాయ జీడిపప్పు గ్రేవి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ  జీడిపప్పు   గ్రేవి  కూర.

కావలసినవి .

లేత చిన్న గుండ్రని  వంకాయలు  --  అర  కిలో .

ఫోటోలో  చూపిన  విధముగా  కాయలు  ఉంటే  కూర  చాలా  రుచిగా  ఉంటుంది.

కాయలు నాలుగు  పక్షాలుగా కాయల పళంగా  నీళ్ళలో  తరుగు కోవాలి .

ఉల్లిపాయలు  --  రెండు
సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి
ఎండుమిరపకాయలు  --  8 
మెంతులు  --- పావు స్పూను
ధనియాలు  --  స్పూను
జీలకర్ర  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
అల్లం  --  ఒక 20  గ్రాముల  ముక్క
చింతపండు  --   నిమ్మ కాయంత  తీసుకుని   పది నిముషములు  నీళ్ళలో  నాన వేసి  చిక్కగా  రసం  తీసుకోవాలి .
జీడిపప్పులు  --  10
ఒక  అరగంట  నీళ్ళలో  నాన బెట్టు కోవాలి .
నువ్వు పప్పు  --  రెండు  స్పూన్లు
పల్లీ  పప్పు   --  రెండు  స్పూన్లు
పచ్చి కొబ్బరి  --  అర చిప్ప  కోరాముతో  తురుము కోవాలి .
నూనె  --  100 గ్రాములు
ఉప్పు  --  తగినంత
పచ్చి మిరపకాయలు  --  5 

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , ధనియాలు , జీలకర్ర , ఇంగువ, నువ్వు పప్పు , పల్లీ పప్పు  , పై చెక్కు  తీసి ముక్కలు గా చేసుకున్న అల్లం , పచ్చిమిర్చి మరియు  పచ్చి  కొబ్బరి  వేసి  పోపు  వేయించుకోవాలి .

పోపు  చల్లారగానే  మిక్సీ లో   ఈ పోపు, చింతపండు  రసం , తగినంత  ఉప్పు , నాన బెట్టిన జీడిపప్పు లు నీళ్ళతో సహా  వేసి   మెత్తగా   గ్రేవి  లాగా  మిక్సీ   వేసుకోవాలి .

ఆ గ్రేవి ని  వేరుగా   ఉంచుకోవాలి .

తరువాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  వేసి  నూనె బాగా  కాగగానే  సన్నగా  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , కొద్దిగా పసుపు  మరియు కొద్దిగా  ఉప్పు వేసి  మూత పెట్టి  సన్నని  సెగన  ఉల్లిపాయలు  మగ్గనివ్వాలి .

ఆ  తర్వాత అందులో  కాయల  పళంగా  తరిగిన  వంకాయలు  కూడా  వేసి  మగ్గనివ్వాలి .

కాయలు  మగ్గగానే  ముందుగా  సిద్ధం  చేసుకున్న  గ్రేవి  మరియు  అర గ్లాసు  నీళ్ళు  ఆ  మగ్గిన  కాయలలో  వేసి  పది  నిముషాల పాటు  సన్నని  సెగన  అడుగంట కుండా ,  కాయలు  విడిపోకుండా  అట్లకాడతో  కాయలను  తిప్పుకుంటూ  కాయలకు  గ్రేవి  పట్టాక  దింపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  Five  Star  Hotel  లో  చేసే  విధముగా  తలదన్నే  రీతిలో  వంకాయ  జీడిపప్పు  మసాలా  కాయల  పళంగా   కూర  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి