Thursday, August 31, 2017

పెసరపప్పు పచ్చడి

పెసర పప్పు  పచ్చడి .

కావలసినవి .

చాయపెసరపప్పు  --  100  గ్రాములు.
ఎండు మిరపకాయలు --  8
జీలకర్ర   --  ఒక  స్పూను
ఇంగువ  ---  కొద్దిగా
నెయ్యి  --  రెండు స్పూన్లు

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే   పెసర పప్పు , ఎండు మిరపకాయలు ,  జీలకర్ర  మరియు  ఇంగువ   వేసి  బంగారు  రంగులో  వేయించుకోవాలి .

తర్వాత  మిక్సీ లో  ముందుగా  ఎండు మిరపకాయలు , జీలకర్ర , ఇంగువ  మిశ్రమము  మరియు  సరిపడా  ఉప్పు వేసుకుని   మెత్తగా  వేసుకోవాలి.

తర్వాత   వేయించిన  పెసరపప్పు  వేసుకుని  కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

పులుపు ఇష్ట మైనవారు  రెండు  రెబ్బలు  చింతపండు  వేసుకుని  రుబ్బు కోవచ్చును.

ఆరు  వెల్లుల్లి  రెబ్బలు  కూడా  ఇంగువ  బదులు  వేసుకోవచ్చును .

పైన  మినపప్పు , ఆవాలు , రెండు ఎండుమిర్చి ముక్కలుగా   చేసి వేసుకుని  నేతితో  పోపు  పెట్టుకుంటే  పచ్చడి  మరింత  రుచిగా  ఉంటుంది .

దొండకాయ కొత్తిమీర కారం

ఆలూరుకృష్ణప్రసాదు .

దొండకాయ  కొత్తిమీర   కారం .

కావలసినవి.

దొండకాయలు  ---  అర కిలో
పచ్చిమిరపకాయలు  --  15
కొత్తిమీర   ---  రెండు కట్టలు
ఉప్పు  ---  తగినంత
నూనె  ---  100  గ్రాములు

తయారీ  విధానము .

మీకు  కూర  కొంచెం   వేగినట్లుగా  కావాలనుకుంటే    బాండీ  లో   చేసుకోండి .

మీకు  మెత్తగా   కావాలనుకుంటే  గిన్నెలో  చేసుకోవాలి. 

ఈ  కూర  కాయల  పళంగా  అయినా చేసుకోవచ్చు .

కానీ  వేసవి కాలంలో  బుల్లి  బుల్లి  లేత  దొండ కాయలు  మార్కెట్  లో  దొరకవు .

దొరికే  పక్షంలో  ఇదే  మిశ్రమాన్ని  దొండకాయలు  నాలుగు  పక్షాలుగా  చేసుకుని   అందులో  కూరుకుని  గిన్నెలో  చేసుకోవచ్చు .

ముందుగా  దొండకాయలను  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

కొత్తిమీర   కడిగి  శుభ్రం  చేసుకోవాలి .

ఇప్పుడు  మిక్సీ  లో  కొత్తిమీర, పచ్చిమిరపకాయలు   మరియు తగినంత  ఉప్పువేసి
కొంచెం  కచ్చా పచ్చాగా  మిక్సీ   వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద   గిన్నె  పెట్టి  గిన్నెలో  మొత్తం   నూనె  పోసి ,  నూనె  బాగా కాగగానే   దొండకాయ  ముక్కలు  వేసి , పైన  నీళ్ళ గిన్నె  మూత పెట్టి  ముక్కలు  బాగా  మగ్గ  నివ్వాలి .

మధ్య   మధ్యలో   మూత  తీసి  అట్లకాడతో ముక్కలను   కదుపుతూ  ఉండాలి .

మూడు వంతులు  ముక్కలు  మగ్గ గానే  మిక్సీ   వేసుకున్న  కొత్తిమీర   కారం వేసుకుని   మళ్ళీ  మూత  పెట్టి  ముక్కలు , మిశ్రమం  కలిసేలా  పూర్తిగా   మగ్గనిచ్చి  దింపు కోవాలి .

తర్వాత  వేరే  Bowl  లోకి  తీసుకోవాలి .

అంతే  కొత్తిమీర   సువాసనతో  ఘమ  ఘమ  లాడే  దొండకాయ  కొత్తిమీర   కారం  కూర  సర్వింగ్   కు  సిద్ధం .

బీరకాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

బీరకాయ  కూర.

ఈ  కూరకి  లేత  బీరకాయలే  రుచిగా   ఉంటాయి .

తయారీ  విధానము .

నాలుగు  లేత  బీర కాయలు  పై  చెక్కు  తీసుకొని , చేదు  ఉందో  లేదో  చూసుకుని   ముక్కలుగా   తరుగు  కోవాలి .

చాలా  కొద్దిగా   ఉప్పు వేసి  ముక్కలు   పిండుకోవాలి .

మరీ  ఎక్కువ   పిండ  వద్దు .

పిండిన నీరు  తీసేయండి.

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి నూనె  బాగా  కాగగానే   మూడు  ఎండుమిరప  కాయల  ముక్కలు , స్పూనున్నర   మినపప్పు , పావు స్పూను  జీలకర్ర , పావు  స్పూను  ఆవాలు  , కరివేపాకు  వేసి  పొపు  వేగగానే   పిండిన  బీరకాయ  ముక్కలు  వేసి  మూత  పెట్టి  మగ్గ నివ్వాలి  .

ముక్కలు  మగ్గగానే  చాలా  కొంచెం   పావు  స్పూను లో  సగం  ఉప్పు వేసి  దింపుకోవాలి .

ఈ కూర  మూడు  ఏళ్ళ లోపు  చిన్న పిల్లలకు , పధ్యం  వారికి   పెట్ట వచ్చు.

ఇలా  కారం వేయకుండా  ఇష్టపడే వాళ్ళకు   కూడా  రుచిగా  ఉంటుంది .

ఈ  కూరలో  ఇంక  కారం  కాని , ఉల్లిపాయలు కాని , టమోటోలు  కాని  వేయనక్కరలేదు .

స్వతహాగా  బీరకాయలో  ఉన్న  తీపితో  కారం  వేయం  కనుక  తియ్యగా   ఉంటుంది.

అయితే  ఈ  కూర  ఆటు  రాదు  .

అందరికీ  రావాలంటే  దింప బోయే  ముందు  ఒక చిప్ప  పచ్చి  కొబ్బరి  తురుము  వేసుకుంటే  అందరికీ   సరి పోతుంది.

చేగోడీలు

ఆలూరుకృష్ణప్రసాదు .

చేగోడీలు.

కావలసినవి .

బియ్యపు పిండి  ---  మూడు కప్పులు.
పచ్చిశనగపప్పు  ---  ఒక కప్పు
కారం  ---  ఒక స్పూను.
ఉప్పు  --  తగినంత
వెన్న  --  నిమ్మకాయంత
నీళ్ళు  --  మూడుకప్పులు
నూనె  --  పావు కిలో

తయారీ  విధానము .

ముందుగా  పచ్చిశనగపప్పు    తగినన్ని  నీళ్ళు పోసి రెండు గంటలు నాన బెట్టుకుని  తర్వాత  నీళ్ళు వడకట్టుకుని  ఒక పళ్ళెంలో వేసుకోవాలి .

తర్వాత స్టౌ వెలిగించి గిన్నెలో ఒక  మూడు కప్పులు నీళ్ళు పోసి నీళ్ళు బాగా  తెర్లుతున్నప్పుడు అందులో  వెన్న, కారం , తగినంత  ఉప్పు  మరియు  బియ్యపు పిండి వేసి గరిటతో  బాగా కలపాలి .

పిండి  చల్లారగానే  చేతులకు  నూనె రాసుకుని పీట పై  ముద్దను వేసి  బాగా మెదిపి ముద్దను  పొడవుగా  చేసి వాటికి  శనగపప్పు  అద్ది  చిన్న చిన్న రౌండ్లుగా  తయారు చేసుకోవాలి.

అన్నీ  చేగోడీలు  తయారు  చేసుకోవాలి .

ఇప్పుడు స్టౌ మీద  బాండి పెట్టి   మొత్తము నూనె  పోసి  నూనె  బాగా కాగగానే  ఎడెనిమిది  చేగోడీల చొప్పున  నూనె లో వేసి  బంగారు  రంగులో  వేయించు కోవాలి .

అంతే  ఈ  వానాకాలంలో  వేడి వేడి  చేగోడీలు  మధ్యాహ్నము  వేళ అల్పాహారమునకు సిద్ధం.

వెరైటీగా వంకాయ కూర

ఈ రోజు  రొటీన్  టైపులో  వంకాయ కూర  చెయ్యకుండా  కొంచెం  వెరైటీగా  చేసాను .

కూర మాత్రం  సూపర్ గా  వచ్చింది .

నేను  పావు కిలో  వంకాయల కూరకు  కొలతలు  ఇస్తున్నాను .

మీరు  అర కిలో  కాయలు  చేసుకునేటట్లయితే  దినుసులు  రెట్టింపు  వేసుకోండి .

వంకాయ  కొబ్బరి  కూర .

కావలసినవి  .

సన్నని నీలం రంగు పొడుగు  వంకాయలు  --  పావు కిలో .

వంకాయలు  శుభ్రంగా  కడుగుకొని  ఒక గిన్నెలో  రెండు గ్లాసులు  నీళ్ళు పోసి  అర స్పూను  ఉప్పు వేసి ,  అందులో  వంకాయలు  నిలువుగా  ముక్కలు   తరుగుకోవాలి .

పచ్చి  కొబ్బరి  --  అర  చిప్ప .
చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .

పచ్చిమిరపకాయలు  --  8

అల్లం ---  15  గ్రాములు .
పై చెక్కు  తీసుకొని  చిన్న ముక్కలుగా కట్  చేసుకోవాలి .

పసుపు  --  కొద్దిగా

ఉప్పు  ---  తగినంత

పోపుకు  --

నూనె   ---  అయిదు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --- 4 
శనగపప్పు  ---  స్పూనున్నర
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర  స్పూను
కరివేపాకు  ---  మూడు రెమ్మలు.

తయారీ విధానము .

ముందుగా  పచ్చి కొబ్బరి ముక్కలు , పచ్చిమిర్చి ,  అల్లం  ముక్కలు  మరియు  కొద్దిగా  ఉప్పు వేసి మిక్సీ లో  కచ్చాపచ్చాగా  వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  అయిదు స్పూన్లు  నూనె వేసి , నూనె  బాగా కాగగానే  వరుసగా ఎండుమిర్చి  ముక్కలు , శనగపప్పు , మినపప్పు , జీలకర్ర . ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పోపు  వేయించుకొని  పోపు వేగగానే  అందులో  నీళ్ళలో  తరిగిన  వంకాయ ముక్కలు  , కొద్దిగా పసుపు, కొద్దిగా  ఉప్పు వేసి మూతపెట్టి  మెత్తగా  మగ్గ నివ్వాలి .

తరువాత  పచ్చి కొబ్బరి  మిశ్రమము  కూడా  వేసి , ఒక అయిదు  నిముషాలు  పచ్చి  వాసన పోయేవరకు  ఉంచి  దింపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  వంకాయ  కొబ్బరి  కూర  భోజనము  లోకి  సిద్ధం.

ఉల్లిపాయ పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఉల్లిపాయ  పులుసు.

ఉల్లిపాయలు  --  పావు కిలో లేదా 4
చింతపండు  --  30 గ్రాములు. లేదా  నిమ్మకాయంత.
బెల్లం  --  30 గ్రాములు .
పచ్చిమిర్చి  --  4 
కరివేపాకు  --  మూడు రెమ్మలు
పసుపు   --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కొత్తిమీర  --  కొద్దిగా
బియ్యపు పిండి  --  స్పూను

పోపుకు .

ఎండుమిరపకాయలు  -  4 
ముక్కలుగా  చేసుకోవాలి .
నూనె  --  మూడు స్పూన్లు
మెంతులు  --  పావు స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారి విధానము .

ముందుగా  స్టౌ మీద  గ్లాసున్నర నీళ్ళు పోసి నీళ్ళు మరిగాక చింతపండు  వేసి  దింపి  చల్లారాక  చిక్కగా  రసం తీసుకోవాలి .

ఉల్లిపాయలు కాస్త  పెద్ద ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చిమిర్చి  నిలువుగా  తరుగుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు  వేసి పోపు వేగాక  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు, పచ్చిమిర్చి  ముక్కలు  కూడా  వేసి మూతపెట్టి  ముక్కలను   బాగా మగ్గనివ్వాలి .

ముక్కలు  మగ్గగానే  రెడీగా  ఉంచుకున్న  చింతపండు  రసం, పసుపు , ఉప్పు , బెల్లం  కూడా  వేసి  పదిహేను నిముషాల సేపు  బాగా  తెర్లనివ్వాలి .

తర్వాత అర గ్లాసు నీళ్ళలో  స్పూను  బియ్యపు  పిండి  వేసి  స్పూనుతో  బాగా కలిపి  మరుగుతున్న పులుసు లో పోసి మరో అయిదు నిముషాలు  ఉంచి  దింపుకుని  పైన కొత్తిమీర  వేసుకోవాలి .

అంతే  ఘమ ఘమ లాడే  ఉల్లిపాయ  పులుసు  సర్వింగ్  కు  సిద్ధం.

కాల్చిన అరటికాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు

కాల్చిన అరటి కాయలతో  కూర.

కావలసినవి .

అరటి కాయలు  --  రెండు.
ఉల్లిపాయలు  ---  రెండు
పచ్చిమిర్చి  --  అయిదు .
అల్లం తరుగు  --   స్పూను
కరివేపాకు   --  రెండు  రెబ్బలు.
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
నిమ్మకాయ  --  ఒకటి
కారం  ---  స్పూను.

పోపుకు .

నూనె  --  మూడు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  -  4
చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
పచ్చి శనగపప్పు  --  స్పూనున్నర
మినపప్పు  --  స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ  విధానము .

ముందుగా  అరటి కాయలు  చెక్కు తీయకుండా  పైన నూనె రాసి  స్టౌ మీద  మీడియం సెగన పెట్టి  అన్ని  వైపులా  బాగా  కాల్చుకోవాలి .

చల్లారగనే  నీళ్ళ చేతితో  పై చెక్కు వలుచుకుని ,  చేతితో  ముక్కలుగా  నలుపుకోవాలి .

ఆ ముక్కలు  వేరే  ప్లేటులో  తీసుకుని  పైన పసుపు వేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

ఉల్లిపాయలు  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి.

పచ్చి మిరపకాయలు  చిన్న ముక్కలుగా  కట్  చేసుకోవాలి .

అల్లం ముక్క  పై చెక్కు  తీసుకుని   సన్నని  ముక్కలుగా  తరుగుకోవాలి లేదా  సన్నగా  తురుముకొని  ఒక  స్పూను  అల్లం తరుగు  సిద్ధం చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిర్చి  ముక్కలు , శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు , అల్లం  తరుగు   మరియు  పచ్చిమిర్చి  ముక్కలు  వేసి  పోపు  బాగా  వేగగానే  తరిగి  ఉంచుకున్న  ఉల్లిపాయల  ముక్కలు కూడా  వేసి  మూతపెట్టి   ఉల్లిపాయలను  బాగా  మగ్గనివ్వాలి .

తర్వాత  విడిగా  ఉంచుకున్న అరటి కాయల  ముక్కలు , తగినంత  ఉప్పు, స్పూను  కారం వేసి  కూడా వేసి కూర  బాగా  మగ్గగానే  దింపి  ఒక  కాయ  నిమ్మరసం కూరలో  పిండి  గరిటతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే  కాల్చిన  అరటి కాయలతో  కూర  భోజనము లోకి  సర్వింగ్  కు సిద్ధం .

బెంగుళూరు వంకాయతో పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

బెంగుళూరు  వంకాయ తో  పచ్చడి .

కావలసినవి .

బెంగుళూరు  వంకాయలు -- రెండు
పచ్చి మిరపకాయలు  --  8
కొత్తిమీర   --  ఒక  కట్ట
పసుపు  --కొద్దిగా
ఉప్పు --  తగినంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు.
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత . కొద్ది నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  8
మెంతులు --  పావు స్పూను
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా   బెంగుళూరు  వంకాయలు  కడిగి  చెక్కు  తీసి   ముక్కలుగా  తరుగు  కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   తరిగిన  వంకాయ  ముక్కలు , పచ్చిమిర్చి , కొద్దిగా  పసుపు , కొద్దిగా  ఉప్పు వేసి  మూత పెట్టి  ముక్కలను  బాగా  మగ్గనిచ్చి  దింపి  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు  , జీలకర్ర , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు వేసి  పోపు  వేగగానే  దింపు కోవాలి .

పోపు చల్లారగానే  ముందుగా   మిక్సీ లో  ఎండుమిరపకాయలు  , చింతపండు  మరియు  ఉప్పు వేసి  మెత్తగా   మిక్సీ   వేసుకోవాలి .

తర్వాత  వంకాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు  కూడా వేసి మరోసారి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

చివరలో  మిగిలిన  పోపు  మరియు  కొత్తిమీర  వేసి   ఒకే ఒకసారి మి  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే . ఎంతో  రుచిగా  ఉండే  బెంగుళూరు  వంకాయలతో  రోటి పచ్చడి చపాతీలు , దోశెలు  మరియు  అన్నం లోకి  సర్వింగ్  కు సిద్ధం.

మద్రాసు చెట్టినాడు సాంబార్

ఆలూరుకృష్ణప్రసాదు .

మద్రాసు  చెట్టినాడు సాంబార్ .

కావలసినవి .

కందిపప్పు  ---  ఒక గ్లాసు
చింతపండు  --  40  గ్రాములు
ఆనపకాయ /  సొరకాయ   --పావుకిలో  పై చెక్కు  తీసి ముక్కలుగా  తరుగుకోవాలి .
ములక్కాడలు  --  రెండు . ముక్కలుగా  తరుగు కోవాలి.
బెండకాయలు  --  8  ముక్కలుగా  తరుగు కోవాలి.
టమోటోలు  --  రెండు  ముక్కలుగా  తరుగు కోవాలి.
వంకాయలు  --  రెండు  నీళ్ళలో  ముక్కలుగా  తరుగు కోవాలి
పచ్చిమిర్చి  --  6  నిలువుగా   చీలికలు గా  తరుగు కోవాలి
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర   --  ఒక కట్ట
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బెల్లం  --  కొద్దిగా  

పోపుకు .

ఎండుమిరపకాయలు  --  మూడు
ఆవాలు -- అర స్పూను
మెంతులు  ---  పావు  స్పూను
జీలకర్ర  --  పావు  స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  రెండు స్పూన్లు

సాంబారు పొడి  కొలతలు .

ఎండుమిరపకాయలు  --  20
శనగపప్పు   -- ఒక  కప్పు
మినపప్పు   --  అరకప్పు
బియ్యము  --  మూడు స్పూన్లు
ధనియాలు  --  మూడు  స్పూన్లు
మిరియాలు  --  స్పూనున్నర
ఇంగువ   --  పావు  స్పూను

పై  దినుసులన్నీ  బాండీలో  నూనె  లేకుండా  వేయించి  మిక్సీ లో  మెత్తగా   పొడి  వేసుకుని  ఒక  సీసాలో  భద్ర పరచుకోవాలి .

ఈ పొడి  ఒక  పది  హేను  సార్లు  సాంబారు  పెట్టుకొనడానికి  ఉపయోగిస్తుంది .

తయారీ  విధానము .

చింతపండు   రెండు గ్లాసుల  వేడి నీటిలో  ఒక పదిహేను  నిముషములు  నానబెట్టి  రసం తీసుకోవాలి .

కుక్కర్  లో  తగిన నీళ్ళు పోసి ఒక  గిన్నెలో   కందిపప్పు   మరియు సరిపడా  నీళ్ళు పోసి  మూతపెట్టి  నాలుగు  విజిల్స్  వచ్చే వరకు   రానివ్వాలి .

తరువాత  మూత తీసి  పప్పును  గరిటతో  మెత్తగా  యెనుపుకోవాలి .

అందులో  చింతపండు  రసము , పసుపు,  తగినంత ఉప్పు ,  చిన్న బెల్లం  ముక్క, తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , ఆనపకాయ ముక్కలు ,  బెండకాయ ముక్కలు ,  వంకాయ  ముక్కలు , ములక్కాడ ముక్కలు , టమోటో  ముక్కలు అన్నీ  వేసి  మరో  గ్లాసు నీళ్ళు  పోసి  ఒక  ఇరవై నిముషాలు  పాటు  స్టౌ మీద  ముక్కలన్నీ  ఉడికే వరకు  ఉంచి  బాగా  తెర్లనివ్వాలి.

తరువాత  మూడు స్పూన్లు  సాంబారు పొడి  తెర్లుతున్న సాంబారులో  వేసి  మరో  అయిదు  నిముషాలు  ఉంచి  దింపి  పైన   తరిగిన  కొత్తిమీర   వేసుకుని  మూత పెట్టుకోవాలి.

తర్వాత  స్టౌ మీద  పోపు గరిట పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మెంతులు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ మరియు  కరివేపాకు  వేసి  పోపు వేసుకుని  సాంబారులో  వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  తమిళనాడు సాంబార్  ఇడ్లీ, వడలు , పూరీలు , చపాతీలు  మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

మైసూర్ మసాలా దోశే

ఆలూరుకృష్ణప్రసాదు .

మైసూర్ మసాలా దోశె.

కావలసినవి .

మినపప్పు   --  అరకప్పు
బియ్యము  ---  రెండు కప్పులు
అటుకులు  -- పావుకప్పు
మెంతులు  ---  అరస్పూను
ఉప్పు  --  కొద్దిగా
నూనె  --  100 గ్రాములు.

తయారీ  విధానము .

బియ్యము  , మినపప్పు , మెంతులు  సరిపడా  నీళ్ళు  పోసి ఆరు  గంటల సేపు  నానబెట్టు కోవాలి.

అటుకులు  పై  మూడింటిని  గ్రైండ్  చేయబోయే  పది నిముషాలు   ముందు నాన బెట్టు కోవాలి .

ఇప్పుడు  నానబెట్టిన బియ్యము , మినపప్పు ,  మెంతులు  మిశ్రమము , మరియు  నానబెట్టిన అటుకులు కూడా  కలిపి గ్రైండర్ లో కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి .

ఈ పిండిలో  దోశెలు  వేసుకునే ముందు కొద్దిగా  నీళ్ళు మరియు కొద్దిగా  ఉప్పు  వేసి  దోశెలు  వేసుకునే  విధముగా  సిద్ధం చేసుకోవాలి.

మసాల దోశె  కూర తయారు  చేసుకునే విధానము.

కావలసినవి.

బంగాళాదుంపలు  --  మూడు
ఉల్లిపాయలు   --  రెండు
పచ్చిమిర్చి  --  5
కొత్తిమీర   --  తరిగినది  అర కట్ట .
ఉప్పు  ---  తగినంత
కరివేపాకు --  రెండు  రెమ్మలు

పోపునకు.

ఎండుమిర్చి  --  3  ముక్కలుగా  చేసుకోవాలి.
మినపప్పు  --  స్పూను
ఆవాలు  --  అర స్పూను

తయారీ  విధానము .

ముందుగా  బంగాళాదుంపలు   నాలుగు  ముక్కలుగా  తరుగుకుని  కుక్కర్  లో  మూడు  విజిల్స్  వచ్చే వరకు ఉంచి  చల్లారగానే  బంగాళాదుంపల  పై  చెక్కు  తీసుకుని  మెత్తగా  చేసుకుని  విడిగా వేరే ప్లేటులో  ఉంచుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నూనె  వేసి నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు  మరియు కరివేపాకు  వేసి  పోపు  వేగగానే  ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  పచ్చిమిర్చి   ముక్కలు  వేసి   మూతపెట్టి   బాగా  మగ్గనివ్వాలి .

తర్వాత  ఉడికిన బంగాళాదుంపలు , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు వేసి బాగా  మగ్గనిచ్చి  కొత్తిమీర  కూడా వేసుకుని  దింపుకోవాలి.

దోశెలపై  వేసుకునే  పొడి .

పది ఎండుమిరపకాయలు , ఇష్టమైన  వారు అయిదు వెల్లుల్లి  రెబ్బలు నూనెలో  వేయించుకుని  కొద్దిగా  పసుపు మరియు కొద్దిగా  ఉప్పు వేసుకుని  మిక్సీ లో  పొడిగా   చేసుకోవాలి ,

ఈ పొడి  ఒక  కప్పులో  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ వెలిగించి  పెనం పెట్టి   పెనం పైన  నూనె  రాసి  పెనం బాగా వేడెక్కగానే  దోశె వేసి  దోశె   పైన అంతా కొద్దిగా  వెన్న రాసి , కారం పొడి  కూడా రాసి ,  రెండు  స్పూన్లు  కూర  పెట్టుకుని   దోశె  పైన  కొద్దిగా   నూనె  వేసి   బాగా కాల నివ్వాలి.

ఇదే  పద్ధతిలో  మిగిలిన   దోశెలను  కూడా  వేసుకోవాలి .

ఈ  మైసూర్  మసాలా  దోశెలు   వేడి  వేడిగా  కొబ్బరి చట్నీ  మరియు  అల్లం   చట్నీతో  సర్వ్  చేసుకోవాలి .

అరటికాయ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

ప్రియమిత్రులందరికీ

ఈ  రోజు  స్పెషల్  అరటి కాయ పచ్చడి .

అరటి  కాయ  తో  పచ్చడా  !

అని  ఆశ్చర్య  పోకండి.

ఒకసారి  చేసి  చూడండి .

అరటి కాయ పచ్చడి  తయారు  చేయు  విధానము .

కాలసిన  వస్తువులు .

అరటి కాయలు         ----   2
పెద్ద ఉల్లిపాయలు           ----     2
పచ్చిమిరపకాయలు    -----  4
కరివేపాకు     -----   3   రెమ్మలు
కొత్తిమీర     -----   మరి కాస్త  ఎక్కువ .

పోపు  వేయుటకు  ---  నూనె  3  టీ  స్పూన్లు .
ఎండు  మిరపకాయలు  ---  5
చాయ మినపప్పు  ---  2  స్పూన్లు
ఆవాలు   ----  1   స్పూన్
ఇంగువ   ---  తగినంత
పసుపు   ---  కొద్దిగా 
ఉప్పు   ----  తగినంత .

అరటి కాయ  పచ్చడి  తయారు చేయు విధానము .

ముందు  ఉల్లిపాయలు  పై  పొట్టు  తీసి  చాలా  సన్నగా  చిన్న  చిన్న  ముక్కలుగా  తరగండి.

(  ఎలాగంటే  దోశెలలోకి  మరియు మిర్చి  బజ్జీలలోకి  సన్నగా  తరుగుతాము  కదా .  ఆ  విధంగా )

ఇప్పుడు  అరటికాయలు  శుభ్రంగా  కడిగి  పొడిగా  గుడ్డ పెట్టి  తుడవండి.

అరటి కాయల  చెక్కు తీయవద్దు.

ఇప్పుడు  స్టౌ  వెలిగించి  సెగ  సిమ్  లో  పెట్టండి.

అరటికాయలు మీద  నూనె రాయనక్కరలేదు .

ఆ  రెండు  అరటి కాయలు  వంకాయలు  రోటి  పచ్చడికి  కాల్చినట్లు  కాల్చండి .

పై  చెక్కు  నల్లగా  అయి  చేతితో  పట్టుకొని   చూస్తే  లోపల  మెత్తగా  అవుతుంది .

గిన్నెలో  నీళ్ళు  పెట్టుకుని  చేతులు  తడి చేసుకుంటూ  ఆ కాయల  పై చెక్కు తీసేయండి .

ప్లేటులో  ఆ కాయలు  ఉంచుకోండి.

ఇప్పుడు  స్టౌ  మళ్ళీ  వెలిగించి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  అందులో  చాయ మినపప్పు , ఆవాలు , ఎండు మిరపకాయలు ,  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగాక  అందులో  కరివేపాకు , పచ్చిమిరపకాయలు   వేసి  రెండు  నిముషాలు  ఉంచి  స్టౌ  ఆపేయండి .

సన్నగా   తరిగిన  ఉల్లిపాయ ముక్కలు  వేయించవద్దు .

పోపు  చల్లారాక  ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు , పసుపు కొద్దిగా వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

మిగిలిన  పోపు  ఇప్పుడే  వేయవద్దు.

తర్వాత మిక్సీ లో  కాలిన  అరటి కాయలు  ,పచ్చి మిరపకాయలు ,
వేగిన  కరివేపాకు   వేసి  మరోసారి  మిక్సీ  వేసుకోండి.

అరటికాయలు  బాగా  కాలి ఉంటాయి  కాబట్టి  కొద్దిగామిక్సీ వెస్తే  చాలు  పచ్చడి  మెత్త పడుతుంది .

ఇప్పుడు  ఒక  పళ్ళెంలోకి  తీసుకొని  సన్నగా  తరిగి ఉంచుకున్న  ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన  పోపు , కొత్తిమీర   సన్నగా   తరిగి  చేత్తోనే  బాగా కలుపుకుని  ఒక  Bowl  లోకి  తీసుకోండి.

అంతే  పసందైన  అరటి కాయ  పచ్చడి  భోజనం  లోకి  సిద్ధం.

ఇందులో  ఉల్లిపాయలు  పచ్చివి  వేసుకుంటేనే  చాలా రుచిగా  ఉంటుంది .

వేగిన  మినపప్పు పంటి కింద   తగులుతూ  చక్కని  రుచితో  ఉండే  ఈ  అరటి కాయ  పచ్చడి  తప్పక   try  చెయ్యండి.

మీ  అందరికీ   నచ్చుతుంది .

ఈ  పచ్చడికి  పండిన , ఓ  మాదిరిగా   పండిన  అరటి కాయలు  వాడవద్దు .

పచ్చడి  తీపి  వచ్చి  రుచి  పాడవుతుంది .

పచ్చి  కాయలే  వాడండి .

ఫోటో  ---  ఈ  రోజు  మేము  చేసిన  అరటికాయ  పచ్చడి .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి