Tuesday, July 24, 2018

పెద్ద చిక్కుడుకాయ ఉల్లిపాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

పెద్ద చిక్కుడు కాయ ఉల్లిపాయ  కూర.

సాధారణంగా అందరూ  పెద్ద చిక్కుడు  కాయలు ఉడక పెట్టిన కూర మరియు వంకాయతో కలిపి కూరగా చేస్తారు.

చిక్కుడు  కాయలు మరియు ఉల్లిపాయలు కలిపి చేసే కూర కూడా చాలా బాగుంటుంది .

కావలసినవి .

చిక్కుడు  కాయలు -  200 గ్రాములు .
పెద్ద ఉల్లిపాయలు  -  మూడు  లేదా  150  గ్రాములు.
నూనె -  నాలుగు  స్పూన్లు .
జీలకర్ర  కారం  --  స్పూనున్నర .

జీలకర్ర  కారం  అంటే  స్పూను  జీలకర్ర , స్పూనున్నర  కారం మరియు కొద్దిగా  ఉప్పు కలిపి  మిక్సీ లో లేదా రోటిలో  మెత్తగా  దంపు కోవాలి .

ఉప్పు  --  తగినంత .
పసుపు --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా పెద్ద చిక్కుడు  కాయలు ఒకసారి కడిగి  శుభ్రం చేసుకుని  కొద్దిగా  ఆరనిచ్చి  కాయకు  రెండు వైపులా ఉన్న ఈ నెలు  తీసి వేసి  చిన్న  ముక్కలుగా కట్ చేసుకోవాలి .

ఉల్లిపాయలు  మరీ చిన్నవిగా  కాకుండా  ఒక మాదిరి ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి  నూనె బాగా కాగగానే  ముందుగా  సిద్ధంగా  ఉంచుకున్న  చిక్కుడు  కాయలు , కొంచెం  పసుపు మరియు కొద్దిగా  ఉప్పు వేసి  మూత పెట్టి మీడియం  సెగన ఓ ఎనిమిది  నిముషాలు  ముక్కలను బాగా మగ్గ నివ్వాలి.

తర్వాత  అందులోనే ఉల్లిపాయల  ముక్కలు కూడా వేసి మధ్య  మధ్యలో అట్లకాడతో  కదుపుతూ మరో ఎనిమిది నిముషాలు  చిక్కుడు  ముక్కలు మరియు ఉల్లిపాయల  ముక్కలను పూర్తిగా  మగ్గనివ్వాలి .

తర్వాత  స్పూనున్నర  కారం వేసి మూత తీసి  మరో మూడు నిముషాలు  మగ్గనిచ్చి  దింపి  వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .

అంతే  చపాతీలు మరియు భోజనము  లోకి ఎంతో రుచిగా  ఉండే  చిక్కుడు  కాయ ఉల్లిపాయల  కూర సర్వింగ్  కు సిద్థం .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

సింపుల్ గా స్వీట్ పొంగలి

ఆలూరుకృష్ణప్రసాదు .

సింపుల్  గా  స్వీట్  పొంగలి .

ఒక   గిన్నెలో గ్లాసు  బియ్యం , పావు కప్పు చాయపెసరపప్పు  కడిగి  తగినన్ని   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టుకోండి .

అన్నం  పూర్తిగా   ఉడకగానే  అర లీటరు  కాచిన  పాలు  అందులో  పోయండి .

షుమారు  ఓ  150  గ్రాముల  బెల్లం  పొడిగా   చేసి  ఉడుకుతున్న  పాలు  బెల్లం లో  వేయండి.

మరో  స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు  స్పూన్లు   నెయ్యి  వేసి 
ముందు  పది  జీడిపప్పు లు  ,  కిస్ మిస్ వేయించి  పక్కన  పెట్టుకోండి .

నాలుగు  యాలకులు  పొడిగా   చేసి  ఉడుకుతున్న  పొంగలి  లో  వేయండి.

పావు  చిప్ప  ఎండు  కొబ్బరి  చిన్న  ముక్కలు  గా  Cut  చేసుకుని   బాండీలో  ఉన్న  నేతిలో  బాగా  వేయించుకుని   నేతితో  సహా  ఉడుకుతున్న  పాయసంలో  వేసి  బాగా  అంతా  కలిసేలా  ఉడకనివ్వండి.

మూడు  స్పూన్లు   నెయ్యి వేసి  దింపుకుని  పైన  వేయించిన  జీడిపప్పు   తో  అలంకరించుకోండి .

అంతే  స్వీట్  పొంగలి  సిద్ధం.

మునగాకు కందిపప్పు పప్పుకూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మునగాకు కందిపప్పు  పప్పు కూర .
******************
కావలసినవి .

మునగాకు లేత ఆకులు మరియు చిగురు ఒలిచినవి  --  మూడు కప్పులు .

మరీ ఆకులుగా ఉంటే చాకుతో కట్ చేసుకోవాలి .

కందిపప్పు  --  ఒక కప్పు.
కారం -- స్పూనున్నర
ఉప్పు  -  తగినంత
పసుపు -- కొద్దిగా

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  -  4
ముక్కలుగా చేసుకోవాలి .
చాయమినపప్పు  - స్పూను
జీలకర్ర  - పావు స్పూను
ఆవాలు -  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
కరివేపాకు  --  రెండు రెమ్మలు .

తయారీ విధానము .

ముందుగా  కందిపప్పు  ఒకసారి కడిగి  తగినన్ని  నీళ్ళు పోసి స్టౌ  మీద పెట్టి  మూడు వంతులు  అనగా బద్దలుగా  ఉండికించుకోవాలి .

అంటే బద్ద చేతితో నొక్కితే  మెత్తగా  అవ్వాలి .

తర్వాత నీళ్ళు వడ కట్టుకుని విడిగా  పళ్ళెం లోకి తీసుకోవాలి .

స్టౌ మీద బాండి పెట్టి మొత్తము  నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయ  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ  మరియు కరివేపాకు  వేసి పోపు వేయించుకోవాలి .

తర్వాత అందులోనే  సిద్ధం చేసుకున్న మునగాకు, కొద్దిగా  పసుపు వేసి మూత పెట్టి అయిదు నిముషాలు  ఆకును పూర్తిగా  మగ్గనివ్వాలి .

తర్వాత ఉడికించి సిద్ధంగా  ఉంచుకున్న  కందిపప్పు ను , తగినంత  ఉప్పు , స్పూనున్నర  కారం కూడా వేసి  అట్లకాడతో  బాగా కలిపి మూత పెట్టి మీడియం సెగన  మరో అయిదు నిముషాలు  మగ్గనివ్వాలి .

ఆ తర్వాత దింపుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు  పప్పుకూర  సర్వింగ్  కు సిద్ధం.

దీనికి  భోజనము లోకి కాంబినేషన్ గా నిమ్మకాయ కారం చాలా రుచిగా  ఉంటుంది .

ఈ కూర భోజనము లోకి , చపాతీలు మరియు రోటీల లోకి బాగుంటుంది .

సంబంధించిన  రెసిపి మరియు ఫోటో నా స్వంతం.

వెరైటీ వంకాయ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటీ వంకాయ కూర.

పండుమిరపకాయలు లేదా పండు మిరపకాయల పచ్చడితో వంకాయలు కాయల పళంగా కూర .

కావలసినవి .

వంకాయలు -- అర కిలో.
నన్నగా పొడుగు గా ఉన్న లేత నీలం రంగు వంకాయలైనా లేదా లావుగా  గుండ్రంగా  ఉన్న  లేత నీలం రంగు  చిన్న వంకాయలైనా  బాగుంటాయి.

పండు మిరపకాయలు  -  15.

( పండు మిరపకాయలు  అన్ని వేళలా దొరకవు కనుక పెద్ద నిమ్మకాయంత పచ్చడి తీసుకోండి . పచ్చడితో చేసుకునే పక్షంలో పచ్చడిలో చింతపండు  ఉంటుంది  కనుక  చూసుకుని కొద్దిగా  వేసుకోండి ) 

చింతపండు  --  చిన్న నిమ్మకాయంత.  చాలా కొద్ది నీటిలో తడిపి ఉంచుకోవాలి .

పసుపు  --  కొద్దిగా
ఇంగువ --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
నూనె  --  75 గ్రాములు .

తయారీ  విధానము .

ముందుగా  పండు మిరపకాయలు , తడిపిన చింతపండు , కొద్దిగా  పచ్చి ఇంగువ , కొద్దిగా  పసుపు , తగినంత ఉప్పు వేసి  మిక్సీ లో మరీ మెత్తగా  కాకుండా వేసుకోవాలి .

తర్వాత ఆ మిశ్రమాన్ని వేరే ప్లేటులోకి  తీసుకుని ఉంచుకోవాలి.

వంకాయలు  నీళ్ళలో వేసి  పుచ్చులు లేకుండా చూసుకుని  కాయల పళంగా  నాలుగు  పక్షాలుగా  చేసుకోవాలి.

తర్వాత ఇంతకు ముందు మిక్సీ  వేసుకుని  ఉంచుకున్న  మిశ్రమాన్ని  ఈ కాయలలో పట్టినంతవరకు  కూరుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద బాండి పెట్టి మొత్తం  నూనె వేసి  నూనె బాగా కాగగానే  ఈ కాయలను  అందులో  వేసి , స్టౌ సెగ మీడియంలో ఉంచి , బాండి పైన మూతపెట్టి కాయలు పూర్తిగా  మగ్గ నివ్వాలి .

మధ్య మధ్యలో అట్లకాడతో  కాయలు  విడి పొకుండా  కదుపుతూ  ఉండాలి .

కాయలు  వేగి  నూనె బయటకు వస్తుంది.

ఆ సమయంలో  పై  మూత తీసి మరో అయిదు నిముషాలు  ఉంచి కారం వేగినట్లుగా రాగానే  దింపి వేరే ప్లేటులోకి  తీసుకోవాలి .

ఈ విధముగా  పండుమిరపకాయలతో చేసిన వంకాయ కాయల పళంగా  కూర  వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని  తింటే అద్భుతమైన  రుచిగా ఉంటుంది .

ఈ రోజు చేసిన వంకాయ కూర తాలూకు చిత్రం.

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

Monday, July 9, 2018

కొత్త పండు మిరపకాయల పచ్చడి

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

సాంపిల్ గా  ఒక  అర కిలో పెట్టుకున్నాం.

ఒక అర కిలో పండు మిరపకాయలలో స్పూనున్నర  పసుపు,  ఒక 75 గ్రాములు మెత్తని ఉప్పు వేసి  రోటిలో  తొక్కుకోవాలి .

ఒక జాడిలో  100 గ్రాముల కొత్త చింతపండు  విడదీసి  మధ్యలో  పెట్టుకోవాలి .

ఇంగువ  పలుకులు కూడా  మధ్యలో పెట్టుకుని  మూడో  రోజు  మెత్తగా  రుబ్బుకోవాలి .

ఒక  జాడీలో  భద్ర పరుచుకోవాలి .

కావలసినప్పుడు   కొంత పచ్చడి తీసుకుని  అందులో స్పూను మెంతిపిండి  వేసుకుని , బాండిలో  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని  ఆవాలు, ఎండుమిర్చి  ముక్కలు మరియు ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పండుమిరపకాయల పచ్చడి  దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.

ఇడ్లీలోకి కొత్తిమీర చట్నీ

ఆలూరుకృష్ణప్రసాదు .

వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర  చట్నీతో .

కొత్తిమీర  చట్నీ.

తయారీ విధానము.

ఆరు పచ్చిమిర్చి , రెండు చిన్న కట్టల కొత్తిమీర , తగినంత   ఉప్పు వేసుకుని  మెత్తగా  మిక్సీ వేసుకుని , ఒక కాయ నిమ్మరసం పిండుకొని , తర్వాత నేతితో  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు స్పూను మినపప్ఫు , అర స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు కొద్దిగా  ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .

ముద్దపప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాహార ప్రియులకు  అత్యుత్తమ మైనది .

తర తరాల నుండి  వస్తున్న  ముద్ద పప్పు.

తయారీ విధానము .

ఒక  ఇత్తడి  గిన్నెలో  రెండు స్పూన్లు  నెయ్యి వేసి బాగా కాగగానే  ఒక కప్పు  కందిపప్పు  వేసి  బాగా వేయించుకుని  తగినన్ని  నీళ్ళు పోసి  మూతపెట్టి ఒక పదిహేను  నిముషముల పాటు  మెత్తగా  ఉడకనివ్వాలి .

నెయ్యి  వేసి వేయించాము  కనుక  ఇంక పప్పు  పొంగదు .

పప్పు  మెత్తగా  ఉడకగానే  సరిపడా ఉప్పు వేసి గరిటతో  బాగా యెనిపి  వేరే స్టీలు గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇత్తడి గిన్నెలోనే ఉంచితే  కొద్ది సేపటికి  కిలం వస్తుందని పెద్దలు  చెప్పే వారు.

ఇత్తడి  గిన్నె  లేని వారు ఇదే పద్థతి లో స్టీలు గిన్నెలో  చేసుకోవచ్చు.

Best  Combinations .

ముద్ద పప్పు  +  కొత్తావకాయ  +  నెయ్యి .

ముద్ద పప్పు +  ముక్కల పులుసు + పేరుకున్న నెయ్యి

ముద్ద పప్పు  + కొత్త నిమ్మకాయ +  నెయ్యి

ముద్ద పప్పు  +  మజ్జిగ  పులుసు

ముద్ద పప్పు  +  గుత్తి  వంకాయ కూర +  నెయ్యి

ముద్ద పప్పు  +  కొత్త పండు మిర్చి పచ్చడి +  నెయ్యి.

వేడి  వేడి  అన్నంలో పై విధంగా  తింటే  ఆ రుచే  అత్యద్భుతం.

కొస మెరుపు .

"  బ్రాహ్మణో  భోజన ప్రియః  ".

"  కోటి  రూపాయి లిచ్చినా  తృప్తి పడని  వ్యక్తి 
కడుపు నిండా  భోజనము  చేయగానే  సంతుష్టు డవుతాడు ."

"  అన్నదాతా  సుఖీభవ ."

పండుమిరపకాయలతో ఊరగాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

పండుమిరపకాయలతో ఊరగాయ.

తయారీ విధానము .

పండు మిరపకాయలు  - 15
శుభ్రంగా తడి గుడ్డతో  తుడుచుకుని , దాని పై తొడిమలు  తీసి వేసి  ఒక అరగంట సేపు  ఆర పెట్టుకోవాలి .

వాటి మధ్యలో గాటు పెట్టుకుని  పూర్తిగా  గింజలను  తొలగించి , ఆ గింజలను  వేరేగా  ప్లేటులో  తీసుకోవాలి .

రెండు స్పూన్లు  ఆవాలు , రెండు స్పూన్లు  మెంతులు , రెండు  స్పూన్లు  సోంపు  తీసుకుని  బాండీలో  నూనె లేకుండా  దోరగా  వేయించుకోవాలి .

ఆ తర్వాత  మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

ఒక  ప్లేటులో  ఈ పొడిని , విడిగా  తీసి ఉంచుకున్న  గింజలను , స్పూను పసుపు , స్పూనున్నర  ఉప్పు ,ఆరు స్పూన్లు  నూనె వేసి  చేత్తో  బాగా  కలుపుకోవాలి .

అందులో రెండు కాయల   నిమ్మరసం  పిండుకుని పండు  మిరపకాయలలో  కూరుకోవాలి .

మరుసటి  రోజు  భోజనము లో  ఊరగాయగా వాడుకోవచ్చును .

ఉసిరి ఆవకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

ఉసిరి  ఆవకాయ .  (  నిల్వ  ఊరగాయ  )

కావలసినవి .

పెద్ద ఉసిరి కాయలు  --  రెండు కిలోలు.
ఎండు కారం  --  400 గ్రాములు.
ఆవపిండి  --  350 గ్రాములు
ఉప్పు మెత్తనిది  - 300 గ్రాములు
పసుపు  --   రెండు స్పూన్లు 
ఎండుమిరపకాయలు  -  15
నూనె  --  600 గ్రాములు
ఆవాలు  --  మూడు స్పూన్లు 
ఇంగువ  --    స్పూను.

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి   200   గ్రాముల  నూనె వేసి నూనె బాగా కాగగానే  ఉసిరికాయలు  వేసి  మూత పెట్టి  పది హేను నిముషాలు పాటు  మగ్గనివ్వాలి .

తర్వాత  మూత తీసి  మరో అయిదు నిముషాలు  నీరు  తడి లేకుండా  ఇగర నివ్వాలి .

తర్వాత  మగ్గ పెట్టి  సిద్ధంగా ఉంచుకున్న కాయలపై  పై  పసుపు, కారం , ఆవపిండి , మెత్తని   ఉప్పు ఒక బేసిన్ లో  వేసి  నాలుగు  మూలలా  చేతితో  బాగా కలుపు కోవాలి .

మళ్ళీ  స్టౌ మీద బాండీ  పెట్టి  మిగిలిన మొత్తము నూనె  వేసి నూనెను  బాగా  కాగనివ్వాలి .

బాగా  కాగిన నూనెలో  ఎండుమిరపకాయలు , ఆవాలు , ఇంగువ (  మరి కాస్త  )  వేసి  పోపు వేగాక  చల్లారనిచ్చి  ఆ నూనెను  ముక్కల లో పోసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి.

చల్లారగానే  ఒక  జాడి  లోకి  తీసుకోవాలి .

వాడుకునే టప్పుడు  చిన్న  గిన్నెలలోకి  అవరమైన  పచ్చడి  తీసి  వాడుకుంటే  ఎక్కువ  రోజులు  నిల్వ ఉంటుంది .

అంతే ముక్కుపుటాలు అదిరిపోయే  ఇంగువ  వాసనతో  ఉసిరికాయతో  ఆవకాయ  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ పచ్చడి  నాలలుగు  నెలల  పైన  నిల్వ ఉంటుంది .

కొబ్బరి దోశలు

ఆలూరుకృష్ణప్రసాదు .

కొబ్బరి  దోశెలు.

కావలసినవి .

బియ్యము --  కప్పు.
మినపగుళ్ళు -- పావు కప్పు.
పచ్చి కొబ్బరి  చిప్ప -- ఒకటి
ఉప్పు -- తగినంత
నూనె  -  పావుకప్పు .

తయారీ విధానము .

ముందుగా  బియ్యము  మరియు మినపగుళ్ళు ఒక గిన్నెలో పోసుకుని నాలుగు  గంటల సేపు నానబెట్టు కోవాలి .

పచ్చి కొబ్బరిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా  కోసుకోవాలి .

తరువాత  నానబెట్టిన బియ్యము మినపగుళ్ళు  గ్రైండర్ లో వేసుకుని  కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మెత్తగా  దోశెల పిండి మాదిరిగా  గ్రైండ్ చేసుకోవాలి .

అందులోనే  పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోశెల పిండి మాదిరిగా గ్రైండ్  చేసుకుని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఆ పిండిలో తగినంత  ఉప్పు కలుపుకుని  గరిటెతో బాగా కలుపుకుని , ఒక గంట సేపు పిండిని బయట ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద పెనం పెట్టుకుని , పెనం బాగా వేడెక్కగానే  నూనె వేసుకుని  పల్లగా  దోశెల మాదిరిగా  పోసుకోవాలి .

ఈ కొబ్బరి దోశెలు  కొబ్బరి చట్నీ లేదా అల్లపు చట్నీతో తింటే చాలా రుచిగా  ఉంటాయి .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

బెండకాయలు కాయల పళంగా

ఆలూరుకృష్ణప్రసాదు .

బెండకాయలు  కాయల పళంగా .

అయిదు నిముషాలలో తయారయ్యే కూర .

తయారీ విధానము .

మూడు స్పూన్లు  మామూలు కారంలో  ముప్పావు స్పూను  జీలకర్ర  మరియు తగినంత  ఉప్పు వేసి  వేరే ప్లేటులోకి తీసుకోండి .

ఓ పది లేత చిన్న బెండకాయలు శుభ్రంగా కడిగి  చాకుతో మధ్యలో గాటు పెట్టుకోండి .

మీరు  గిన్నెలో అన్నం వండుతున్నప్పుడు , అన్నం ఉడికి దగ్గర  పడగానే  సిద్ధంగా  ఉంచిన బెండకాయలు ముచికలు  బయటకు  కనిపించేలా  ఉడుకుతున్న అన్నంలో గుచ్చి మూత పెట్టండి .

అన్నం పూర్తిగా ఉడికి  దింపగానే  ఆవిరి మీద ఉడికిన బెండకాయలను ఒక పళ్ళెం లోకి తీసుకుని , కాయలలో సిద్ధంగా  ఉంచుకున్న  కారం కూరుకోండి .

స్టౌ  మీద బాండీ పెట్టి  అయిదు స్పూన్లు  నూనె వేసి నూనె పొగలు వచ్చే విధముగా  కాగ నివ్వండి .

ఈ కాగే నూనె  స్పూనుతో కారం కూరిన కాయలలో  పోయండి .

అంతే వేడి వేడిగా తయారైన అన్నం లోకి బెండకాయ కాయల  పళంగా అయిదు నిముషాల్లో తయారైన Instant  కూర సిద్ధం.

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటొ నా స్వంతం .

మామిడికాయ ముక్కల పచ్చడి

ఆహా !!  ఏమి రుచి .

ప్రియమిత్రులందరికీ

ఆలూరుకృష్ణప్రసాదు .

మామిడి కాయతో ముక్కల పచ్చడి .( మెంతి బద్దలు  )

కావలసినవి .

పుల్లని పచ్చి మామిడి కాయ  --  ఒకటి .

పై చెక్కు తీసుకుని  చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .

ముక్కలను విడిగా ప్లేటులోకి తీసుకుని  పైన  కొద్దిగా పసుపు వేసుకోవాలి .

నూనె  --  నాలుగు  స్పూన్లు

ఎండుమిరపకాయలు  - 12 
మెంతులు --    స్పూను
ఆవాలు --   స్పూను
ఇంగువ --   కొద్దిగా
ఉప్పు  --  తగినంత
పసుపు --  కొద్దిగా

తయారీ విధానము .

స్టౌ మీద బాండీ పెట్టుకొని  మొత్తము  నూనె పోసి  నూనె బాగా కాగగానే   ముందుగా మెంతులు మరియు ఎండుమిరపకాయలు   వేసి బాగా వేగనివ్వాలి .
తర్వాత అందులోనే ఆవాలు  మరియు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే ముందుగా   మిక్సీ లో వేయించిన పోపు  మరియు తగినంత  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి . 

తీపి ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క మిక్సీ లో వేసుకుని మిక్సీ  వేసుకోవచ్చును,

ఆ తర్వాత  మామిడి కాయ ముక్కలు కూడా వేసుకుని  ఒకసారి ముక్కలు నలగకుండా  మిక్సీ వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే. భోజనము లోకి , చపాతీల లోకి , రోటీల లోకి మరియు దోశెల లోకి ఎంతో రుచిగా  ఉండే మామిడి  కాయ ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.

ఈ ముక్కల పచ్చడినే  మెంతి బద్దలు అని కూడా అంటారు .

బెల్లం  వేయకపోతే ఒక వారం , వేస్తే నాలుగు రోజులు  ఈ ముక్కల పచ్చడి నిల్వ ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

మరిన్ని  రుచికరమైన వంటలకు ఆహా !!  ఏమి రుచి బ్లాగ్ ను దర్శించండి .

బంగాళదుంప నిమ్మరసం కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

బంగాళాదుంప  అల్లం పచ్చి మిర్చి తో ముద్ద కూర . ( నిమ్మ రసం పిండి  )
****************************

పెళ్ళిళ్ళలో చేసే కూర.

ఈ రోజు   మిత్రులందరికీ బంగాళా దుంపలు  అల్లం పచ్చి మిర్చి  వేసి  చివరలో  నిమ్మరసం  పిండిన  ముద్ద కూర.

దాదాపుగా  చాలా మంది ఇళ్ళల్లో  చేసుకునే ముద్ద కూర ఇది.

ఏ విధంగా  చేయాలో  రెసిపి  పెడుతున్నాను .

కావలసినవి .

బంగాళాదుంపలు  --  అరకిలో
పచ్చిమిరపకాయలు  --  8
అల్లం  --  రెండు అంగుళాల -- ముక్క
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  ఒక కట్ట
పసుపు  --  కొద్దిగా
నిమ్మకాయ --   బాగా రసం ఉన్న పెద్ద కాయ ఒకటి
ఉప్పు  --  తగినంత

పోపునకు .

నూనె  --  అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  5
పచ్చి శనగపప్పు  --  రెండు స్పూన్లు
మినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ విధానము .

బంగాళాదుంపలు  కడిగి  పెద్ద  ముక్కలుగా కట్ చేసుకుని  కుక్కర్ లో పెట్టుకుని  మూడు విజిల్స్ వచ్చాక దింపుకోవాలి .

చల్లారగానే  పై   చెక్కు వలచి  ఉడికిన ముక్కలను  విడిగా పళ్ళెంలో పెట్టుకోవాలి .  ముక్కల పై కొద్దిగా  పసుపు వేసుకోవాలి .

పచ్చిమిర్చి  చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .

అల్లం పై చెక్కు తీసి చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి .

నిమ్మకాయ మధ్యలోకి కట్ చేసుకుని  రసం వేరే చిన్న Bowl లోకి  పిండుకుని  రసం లోని గింజలను  తీసేసుకోవాలి .

కొత్తిమీర  శుభ్రం చేసుకుని  కట్  చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె వేసి నూనె ను  బాగా కాగనిచ్చి  వరుసగా  ఎండుమిరపకాయల ముక్కలు , పచ్చి శనగపప్పు ,
మినపప్పు , జీలకర్ర , ఆవాలు ,  ఇంగువ , అల్లం  ముక్కలు , పచ్చిమిర్చి  ముక్కలు మరియు కరివేపాకు  వేసి  పోపును  బాగా వేగ నివ్వాలి.

పచ్చి మిరపకాయ  ముక్కలు కూడా పోపులో మగ్గితే  కూరకి కారం పడుతుంది .

తర్వాత  ఉడికిన  బంగాళాదుంప  ముక్కలు  పోపులో వేసి అందులోసరిపడా  ఉప్పు  వేసి  ఒక  అయిదు నిముషాలు  మూత పెట్టి  మగ్గనిచ్చి  తర్వాత తరిగిన  కొత్తిమీర  వేసుకుని  దింపుకుని  నిమ్మరసం  అందులో వేసి  బాగా కలుపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

వేడి మీద  నిమ్మరసం  పిండితే  కూర చేదు వస్తుంది.

ఈ ముద్దకూర లో  విడిగా  మేము కారం వేయము .  అల్లం పచ్చి మిర్చి తోనే కూర రుచిగా  ఉంటుంది .

పోపులోని  ఎండుమిర్చి , పచ్చిమిర్చి , అల్లం  ముక్కల కారం సరి పోతుంది .

అంతే  పుల్ల పుల్లగా నిమ్మ , అల్లం  పచ్చి మిర్చి  రుచితో ఎంతో రుచిగా  ఉండే  బంగాళాదుంప  ముద్ద కూర  దోశెలు , చపాతీలు మరియు  భోజనము  లోకి  సర్వింగ్  కు సిద్ధం .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

అవియళ్

ఆలూరుకృష్ణప్రసాదు .

అవియళ్ .

అవియళ్  కేరళ వారి వంటకం.

ఇందులో అన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటారు  కావున  చాలా  బలవర్ధకమైన  వంటకము  అవియళ్.

కేరళ ప్రాంతంలో  వారు  అన్ని వంటలకు  కొబ్బరి  నూనెను వాడతారు .

అందువల్ల వారు ఈ అవియళ్ లో కూడా కొబ్బరి నూనె నే వాడతారు .

నిజానికి  మనం కూడా కొబ్బరి  నూనె  వాడితేనే  మంచిది.

ఒకవేళ  కొబ్బరి  నూనె  వేసుకోవడం ఇష్టం లేకపోతే  నూనె  వాడకండి .

దాని బదులుగా  నెయ్యి వాడండి.

ఇంక ఈ అవియళ్ కు కావలసిన వస్తువులు మరియు తయారు  చేయు విధానము గురించి  తెలుసుకుందాము.

కావలసినవి .

బూడిద గుమ్మడికాయ  -- ఒక ముక్క .( పై చెక్కు తీసుకొని  ముక్కలుగా తరుగు కోవాలి . )

బంగాళా దుంపలు  --  రెండు.(  పై చెక్కు తీసి  ముక్కలుగా  చేసుకోవాలి )

క్యారెట్  --  రెండు . (  పై చెక్కు  తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి . )

బీన్స్  --   50  గ్రాములు .  ( చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి . )

ములక్కాడలు  --  2  
( ముక్కలుగా  కట్ చేసుకోవాలి . )

ఆనపకాయ  లేదా  సొరకాయ  --  ఒక ముక్క .  (  పై  చెక్కు తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

అరటికాయ  --  పెద్దది  ఒకటి .  (  చెక్కు  తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

దొండకాయలు --   8 ( ముక్కలుగా  తరుగు కోవాలి .)

పచ్చి బఠాని  గింజలు  --  అర కప్పు .

కొత్తిమీర  --  ఒక  కట్ట . (  సన్నగా  తరుగు కోవాలి .)

కరివేపాకు  --  మూడు రెమ్మలు .

కొబ్బరి  నూనె  లేదా  /  నెయ్యి  --  ఆరు  స్పూన్లు

కొబ్బరి కాయ  --  1  (  రెండు  చిప్పలు  కోరాముతో  తురుము కోవాలి . )

గట్టి పెరుగు  --  అర లీటరు . ( పుల్లగా ఉంటే  బాగుండదు . కమ్మగా ఉండాలి . )

జీలకర్ర  --  స్పూను

పచ్చి మిరపకాయలు --   8
 
పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ( ముక్కలుగా   చేసుకోవాలి )
ఆవాలు  --  అర స్పూను .

తయారు చేయు విధానము .

ముందుగా   తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలు మరియు ఒలుచుకున్న బఠాణీ గింజలు  ఒక గిన్నెలో  వేసుకుని  సరిపడా  ఉప్పు  మరియు  నీళ్ళు పోసుకుని  కుక్కర్ లో  పెట్టుకుని  మూడు విజిల్స్  రానిచ్చి  దింపుకుని  కొద్దిగా  నీరు  ఉంటే  గిన్నెలో  అలాగే  ఉంచుకోవాలి .

తర్వాత  తురిమిన పచ్చి కొబ్బరి , పచ్చిమిరపకాయలు , జీలకర్ర , సరిపడా ఉప్పు వేసుకుని  మరియు కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మరీ పల్చగా  కాకుండా  ముద్దలా  వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  ఉడికిన నీళ్ళతో  ఉన్న ముక్కల గిన్నెను  పెట్టి , అందులో   మిక్సీ  వేసుకున్న కొబ్బరి  ముద్దను  వేసి , ముక్కలు  ముద్ద బాగా  దగ్గర పడి  కలిసి పోయేలా  ఓ పది   నిముషాలు   ముద్ద పచ్చి వాసన పోయేదాకా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  ముక్కలతో   ఉడికిన  మిశ్రమాన్ని బాగా  చల్లారనివ్వాలి .

వేడి  మీద పెరుగు కలిపితే  విరిగి  పోతుంది .

తర్వాత  పెరుగును  గరిటతో  బాగా  కలుపుకుని  ఈ  ముక్కలలో  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము  నెయ్యి వేసి , నెయ్యి  బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , ఆవాలు , కరివేపాకు  వేసుకుని  పోపు  వేసుకుని  ఈ  పెరుగు కలిపిన  ముక్కలలో  వేసుకోవాలి .

తర్వాత తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  అవియళ్  చపాతీల లోకి , భోజనము  లోకి , చివరికి  వట్టిగా  తినడానికి  కూడా  సర్వింగ్  కు సిద్ధం .

పసుపు వేస్తే అవియళ్ తెల్లగా  ఉండదు . పసుపు అవసరం లేదు.

పోపు దినుసులు మినపప్పు , పచ్చిశనగపప్పు  వంటివి  ఇందులో బాగుండదు .

ఇంగువ ,  ఎండు కారము వంటివి వేసినా  బాగుండవు .

ఎంత కమ్మగా  ఉంటే  అవియళ్  అంత  రుచిగా  ఉంటుంది .

ఎవరైనా  అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు  మరియు ప్రత్యేక సందర్భాలలో  ఈ అవియళ్  తయారు చేసుకుంటే  చాలా  కలర్ ఫుల్ గా ఉండి ఫంక్షన్ కు నిండు తనం  తెస్తుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి