Friday, December 8, 2017

పండుమిర్చి దోసకాయ ముక్కల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పండుమిరపకాయలతోదోసకాయ ముక్కల  పచ్చడి .

కావలసినవి .

పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.

పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

నిమ్మకాయంత  చింతపండు   విడదీసి  కొద్దిగా నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి ..
 
పండుమిరపకాయలు  --  12

కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .

కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .

ఉప్పు   ---   తగినంత

పసుపు  ---  కొద్దిగా .

పోపుకు  .

ఎండుమిరపకాయలు  --  3  ముక్కలుగా  చేసుకోవాలి.

చాయమినపప్పు   ---  స్పూనున్నర

మెంతులు  ---   పావు  స్పూను

ఆవాలు  ---   అర  స్పూను 

ఇంగువ  ---  కొద్దిగా

నూనె  ---   50  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.

నూనె  బాగా  కాగనివ్వాలి  .

నూనె బాగా కాగగానే   మెంతులు , ఎండుమిరపకాయల ముక్కలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .

ఎక్కువ   నూనె  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.

బాండీ లోనే  ఉంచేయండి .

పోపు  చల్లారగానే  ముందుగా   మిక్సీ లో  ఎండుమిరపకాయ ముక్కలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి  మిక్సీ   మెత్తగా   వేసుకోవాలి .

తరువాత  పండుమిరపకాయలు , తడిపిన  చింతపండు   మరియు  పోపు  వేసి  మెత్తగా మిక్సీ   వేసుకోవాలి .

చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   ఒకే  ఒక్కసారి  దోసకాయ  ముక్కలు  నలగ  కుండా  మిక్సీ   వేసుకుని  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే   పండు మిరపకాయలతో దోసకాయముక్కలు  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి