Sunday, December 10, 2017

కంది కట్టు

ఆలూరుకృష్ణప్రసాదు .

కంది కట్టు.

ఇది గోదావరి జిల్లాలలో పెద్ద వాళ్ళందరూ  చేసే వారు.

బలవర్ధకమైనది .

తయారీ విధానము .

కంది కట్టు .

మా అత్తగారు  కూడా చేస్తారు .
కందిపప్పు లో ఎక్కువగా  నీళ్ళు పోసి పప్పు పొంగకుండా ఉడుకుతున్నప్పుడు  పై నీళ్ళన్నీ  వేరే గిన్నెలోకి తీసే వారు.

తర్వాత అందులో ఉడికిన తర్వాత  మెత్తగా  యెనిపిన గరిటె కంది పప్పు వేసి బాగా కలిపి , కాస్త ఉప్పు వేసి ,  ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర , ఆవాలు, ఇంగువ మరియు కరివేపాకు  వేసి నేతితో పోపు పెట్టేవారు .

అచ్చు పప్పు చారులా చాలా రుచిగా ఉంటుంది .

మేము కూడా చేసుకుంటాము తరచుగా.

వెరైటీ కారప్పొడి

అదిరి పోయే రుచితో ఇడ్లీ , దోశెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి .

కావలసినవి .

నూనె  -- మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  - 12
పచ్చిశనగపప్పు -- అర కప్పు
చాయమినపప్పు  -- అర కప్పు
ధనియాలు  --  అర కప్పు
కరివేపాకు  --  కప్పు
ఉప్పు   -- తగినంత

తయారు చేయు విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ పెట్టుకుని నూనె మొత్తము  పోసి  నూనె  బాగా కాగనిచ్చి  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు  వేసి బాగా  వేగ నివ్వాలి .

తర్వాత   అందులో కరివేపాకు  కూడా వేసి ఎర్రగా  వేగ నివ్వాలి .

చల్లారగానే  మొత్తము  మిక్సీ లో వేసి  పప్పులు  పూర్తిగా  నలగ కుండా  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఇడ్లీ , దోశెల లోకి కారప్పొడి  సిద్ధం.

ఫోటో ---  ఇప్పుడే  కొట్టిన  కారప్పొడి .

పచ్చి టమోటాల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొంచెం  వెరైటీగా పచ్చి టమోటో లతో పచ్చడి.

కావలసినవి .
 
పచ్చి టమోటో లు  -- 5
పచ్చి మిరపకాయలు  -- 8
కొత్తిమీర  -- ఒక  కట్ట
ఉప్పు  --  తగినంత
పసుపు  --  కొద్దిగా
చింతపండు  --  నిమ్మకాయంత.
పదిహేను నిముషముల క్రితం  నీళ్ళల్లో నాన పెట్టుకుని  చిక్కగా  రసం తీసుకోవాలి .

పోపునకు .

నూనె  -- నాలుగు  స్పూన్లు .
ఎండుమిరపకాయలు  --  5
మినపప్పు  -- స్పూను
మెంతులు  --  పావు స్పూను .
ఆవాలు --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా
కరివేపాకు  --  మూడు రెమ్మలు .

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె  వేసి  పచ్చి టమోటో లు కాయల  పళంగా  నూనెలో  వేయాలి .

అందులో  పచ్చిమిరపకాయలు , పసుపు , ఉప్పు  మరియు చింతపండు  రసము కూడా వేసి  మగ్గ నివ్వాలి .

అవి వేరే ప్లేటులో తీసుకోవాలి .

తర్వాత  తిరిగి  స్టౌ మీద బాండీ  పెట్టి  మిగిలిన  నూనె వేసుకుని  నూనె బాగా కాగగానే  ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి  పోపు వేయించుకోవాలి .

పోపు చల్లారగానే మిక్సీ లో  ముందుగా  ఎండుమిరపకాయలు పోపుతో సహా వేసి  మెత్తగా  మిక్సీ వేసుకోవాలి.

తర్వాత  వేయించిన పచ్చిమిరపకాయలు  కూడా వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

చివరగా  మగ్గిన టమోటోలు మరియు  కొత్తిమీర  కూడా  వేసుకుని    మరీ మెత్తగా  కాకుండా  కచ్చా పచ్చాగా ఒకసారి మిక్సీ  వేసుకుని వేరే గిన్నె లోకి  తీసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే  పచ్చి టమోటో   పచ్చడి   దోశెలు  , చపాతీలు  మరియు  భోజనము  లోకి సర్వింగ్  కు సిద్ధం.

వెజిటబుల్ కూర్మా

ఆలూరుకృష్ణప్రసాదు .

పూరీలు  /  చపాతీలు  /  మరియు   రోటీల లోకి  వెజిటబుల్  కూర్మా .

కావలసినవి.

బంగాళా  దుంపలు  --  రెండు
క్యారెట్  -- మూడు
టమోటోలు  --  రెండు
బీన్స్  --  150 గ్రాములు.

ఈ కూరలన్నీ  ముక్కలుగా చేసుకోవాలి.

క్యారెట్  , బీన్స్ మరియు  బంగాళాదుంపలు  వేరే  గిన్నెలలో  సరిపడా  నీళ్ళు పోసి   కుక్కర్ లో  పెట్టుకుని  మూడు విజిల్స్ రానిచ్చి  దింపుకోవాలి.

బంగాళాదుంపలు  ముక్కలు  చేసి ఉడికిన  తర్వాత  పై  తొక్కు తీసుకోవాలి .

ఇవ్వన్నీ  విడిగా వేరే ప్లేటులో  ఉంచుకోవాలి .

కూర్మా  కూర  గ్రేవీ కు.

ఎండుమిరపకాయలు  --  4
టమోటోలు  -- రెండు
ధనియాలు --  స్పూను
దాల్చిన  చెక్క -- చిన్న ముక్క
పచ్చి కొబ్బరి  తురుము --  మూడు  స్పూన్లు .
జీడిపప్పు  --  6
పచ్చి బఠాణీలు  --  పావు కప్పు

కావలసిన మిగిలిన  వస్తువులు.

కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర   --  చిన్న కట్ట
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  -- తగినంత
నూనె  --  నాలుగు  స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ  పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  ఎండుమిరపకాయలు , ధనియాలు , దాల్చిన  చెక్క ,  జీడిపప్పు  వేసి  వేయించుకుని అందులో  టమోటో  ముక్కలు  మరియు పచ్చి కొబ్బరి  తురుము కూడా వేసి  కాసేపు ఉంచి  చల్లారగానే   మిక్సీలో  కొద్దిగా  నీళ్ళు పోసి  ముద్దగా  వేసుకోవాలి .

తర్వాత  మళ్ళీ స్టౌ మీద  బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  జీలకర్ర  పచ్చి బఠాణీలు , టమోటో ముక్కలు కరివేపాకు  వేసి అందులో ఉడికించిన  ముక్కలు ,  కొద్దిగా  పసుపు మరియు  తగినంత ఉప్పు వేసి  మూత పెట్టి ముక్కలను మగ్గనివ్వాలి .

తర్వాత  అందులో  సిద్ధం చేసుకున్న ముద్దను వేసి కొద్దిగా   నీళ్ళు పోసి  గ్రేవి  మొత్తము  ముక్కలకు పట్టే విధముగా  మగ్గ నివ్వాలి .

తర్వాత  కొత్తిమీర  కూడా 
వేసుకుని వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  పూరీ , చపాతీ లు మరియు రోటీల లోకి ఎంతో రుచిగా  ఉండే  కూర్మా కూర సర్వింగ్  కు సిద్ధం.

ఆరోగ్యానికి చిట్కాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఉదయం 9 గంటల లోపు తప్పని సరిగా అల్పాహారము తీసుకోవాలి .

ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా పోషకాహారం తీసుకోవాలి. అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవడం మానకూడదు. అల్పాహారం ఆరోగ్యానికి, మెదడుకు బూస్ట్ లాంటిది. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందించడంతో పాటు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అలసట, నీరసాన్ని దూరం చేస్తుంది.

అల్పాహారం తీసుకోకపోతే.. ఆకలి పెరగడంతో చికాకు తప్పదు. మధ్యాహ్న భోజనంను తృప్తిగా తీసుకోలేకపోవడం జరుగుతుంది. అల్పాహారాన్ని మితంగా తీసుకోకపోవడం.. శుభ్రంగా మానేయడం ద్వారా ఒబిసిటీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అల్పాహారాన్ని తప్పకుండా తీసుకోవడం ద్వారా శరీర బరువును నియంత్రించవచ్చును. అల్పాహారంలో  పీచుపదార్థాలుండేలా చూసుకోవాలి. అందుచేత కొవ్వు లేని ఆహారాన్ని తీసుకోవాలి. కోడిగుడ్డు, బీన్స్, పాల ఉత్పత్తులను బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకోవడం ఉత్తమం. ఇంకా కూరగాయలు, పండ్లు కూడా తీసుకోవచ్చు.

మధ్యాహ్నం :
మధ్యాహ్న భోజనం 12.30 గంటల నుంచి 1.30 గంటల లోపు తీసుకోవాలి. వ్యాధులకు కారణం ఏదిపడితే తినడం, అల్పాహారం తీసుకోకపోవడమే. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు

ముఖ్యంగా అల్పాహారం తీసుకున్న తర్వాత కొందరు చిరుతిళ్ళు తీసుకుంటారు. టీ, జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవి మధ్యాహ్న భోజనంపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఆకలేయకపోవడం.. భోజనాన్ని లేటుగా తీసుకోవడం వంటివి జరుగుతాయి. రోజంతా కష్టపడాల్సి వుండటంతో మధ్యాహ్న భోజనంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. భోజనం మానేయడం కూడదు. మధ్యాహ్న భోజనానికి తర్వాత పండ్ల రసం తీసుకోవచ్చు. నిమ్మ, ఆపిల్, ద్రాక్ష రసాలు తీసుకోవచ్చు. 

రాత్రి:
రాత్రిపూట భోజనం మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నెలలో అధిక రోజులు తల్లిదండ్రులతో కలిసి తీసుకునే చిన్నారులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఒబిసిటీ సమస్య దూరమైనట్లు సర్వేలు చెబుతున్నాయి. 

మరో సర్వేలో తల్లిదండ్రులతో రాత్రిపూట కలిసి భోజనం చేసే టీనేజ్ పిల్లలు మద్యం, మత్తు పదార్థాలకు బానిస కావట్లేదనే విషయం తేలింది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట భోజనాన్ని నిద్రపోయేందుకు మూడు గంటలకు ముందే తీసుకోవడం బెటరని పరిశోధనలు తేలుస్తున్నాయి.

ముద్దపప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాహార ప్రియులకు  అత్యుత్తమ మైనది .

తర తరాల నుండి  వస్తున్న  ముద్ద పప్పు.

తయారీ విధానము .

ఒక  ఇత్తడి  గిన్నెలో  రెండు స్పూన్లు  నెయ్యి వేసి బాగా కాగగానే  ఒక కప్పు  కందిపప్పు  వేసి  బాగా వేయించుకుని  తగినన్ని  నీళ్ళు పోసి  మూతపెట్టి ఒక పదిహేను  నిముషముల పాటు  మెత్తగా  ఉడకనివ్వాలి .

నెయ్యి  వేసి వేయించాము  కనుక  ఇంక పప్పు  పొంగదు .

పప్పు  మెత్తగా  ఉడకగానే  సరిపడా ఉప్పు వేసి గరిటతో  బాగా యెనిపి  వేరే స్టీలు గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇత్తడి గిన్నెలోనే ఉంచితే  కొద్ది సేపటికి  కిలం వస్తుందని పెద్దలు  చెప్పే వారు.

ఇత్తడి  గిన్నె  లేని వారు ఇదే పద్థతి లో స్టీలు గిన్నెలో  చేసుకోవచ్చు.

Best  Combinations .

ముద్ద పప్పు  +  కొత్తావకాయ  +  నెయ్యి .

ముద్ద పప్పు +  ముక్కల పులుసు + పేరుకున్న నెయ్యి

ముద్ద పప్పు  + కొత్త నిమ్మకాయ +  నెయ్యి

ముద్ద పప్పు  +  మజ్జిగ  పులుసు

ముద్ద పప్పు  +  గుత్తి  వంకాయ కూర +  నెయ్యి

ముద్ద పప్పు  +  కొత్త పండు మిర్చి పచ్చడి +  నెయ్యి.

వేడి  వేడి  అన్నంలో పై విధంగా  తింటే  ఆ రుచే  అత్యద్భుతం.

కొస మెరుపు .

"  బ్రాహ్మణో  భోజన ప్రియః  ".

"  కోటి  రూపాయి లిచ్చినా  తృప్తి పడని  వ్యక్తి 
కడుపు నిండా  భోజనము  చేయగానే  సంతుష్టు డవుతాడు ."

"  అన్నదాతా  సుఖీభవ ."

పండుమిరపకాయలతో ఊరగాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

పండుమిరపకాయలతో ఊరగాయ.

తయారీ విధానము .

పండు మిరపకాయలు  - 15
శుభ్రంగా తడి గుడ్డతో  తుడుచుకుని , దాని పై తొడిమలు  తీసి వేసి  ఒక అరగంట సేపు  ఆర పెట్టుకోవాలి .

వాటి మధ్యలో గాటు పెట్టుకుని  పూర్తిగా  గింజలను  తొలగించి , ఆ గింజలను  వేరేగా  ప్లేటులో  తీసుకోవాలి .

రెండు స్పూన్లు  ఆవాలు , రెండు స్పూన్లు  మెంతులు , రెండు  స్పూన్లు  సోంపు  తీసుకుని  బాండీలో  నూనె లేకుండా  దోరగా  వేయించుకోవాలి .

ఆ తర్వాత  మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

ఒక  ప్లేటులో  ఈ పొడిని , విడిగా  తీసి ఉంచుకున్న  గింజలను , స్పూను పసుపు , స్పూనున్నర  ఉప్పు ,ఆరు స్పూన్లు  నూనె వేసి  చేత్తో  బాగా  కలుపుకోవాలి .

అందులో రెండు కాయల   నిమ్మరసం  పిండుకుని పండు  మిరపకాయలలో  కూరుకోవాలి .

మరుసటి  రోజు  భోజనము లో  ఊరగాయగా వాడుకోవచ్చును .

వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర  చట్నీతో

ఆలూరుకృష్ణప్రసాదు .

వేడి వేడి ఇడ్లీ కొత్తిమీర  చట్నీతో .

కొత్తిమీర  చట్నీ.

తయారీ విధానము.

ఆరు పచ్చిమిర్చి , రెండు చిన్న కట్టల కొత్తిమీర , తగినంత   ఉప్పు వేసుకుని  మెత్తగా  మిక్సీ వేసుకుని , ఒక కాయ నిమ్మరసం పిండుకొని , తర్వాత నేతితో  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు స్పూను మినపప్ఫు , అర స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు  మరియు కొద్దిగా  ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .

కొత్త  పండు మిరపకాయల పచ్చడి

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

సాంపిల్ గా  ఒక  అర కిలో పెట్టుకున్నాం.

ఒక అర కిలో పండు మిరపకాయలలో స్పూనున్నర  పసుపు,  ఒక 75 గ్రాములు మెత్తని ఉప్పు వేసి  రోటిలో  తొక్కుకోవాలి .

ఒక జాడిలో  100 గ్రాముల కొత్త చింతపండు  విడదీసి  మధ్యలో  పెట్టుకోవాలి .

ఇంగువ  పలుకులు కూడా  మధ్యలో పెట్టుకుని  మూడో  రోజు  మెత్తగా  రుబ్బుకోవాలి .

ఒక  జాడీలో  భద్ర పరుచుకోవాలి .

కావలసినప్పుడు   కొంత పచ్చడి తీసుకుని  అందులో స్పూను మెంతిపిండి  వేసుకుని , బాండిలో  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని  ఆవాలు, ఎండుమిర్చి  ముక్కలు మరియు ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పండుమిరపకాయల పచ్చడి  దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.

Friday, December 8, 2017

ఆకుకూరల ప్రయోజనాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఆకు కూరలు భోజనము లో తీసుకొనడం వలన.

ఆకుకూరలు చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఇందులోని విటమిన్-ఏ కంటిచూపును కాపాడుతుంది. విటమిన్-బీ పాలెట్స్ జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనోఆమ్లాలనూ నియంత్రిస్తాయి.

ముఖ్యంగా పొన్నగంటికూరలో ఏ విటమిన్ అధికం. దీనిని తింటే రేచీకటి రాదు. శరీరానికి చలువ కూడా. పేగుల్లోకి వెళ్లిన వెంట్రుకలను సైతం కరిగించే శక్తి దీనికుంది.

ఇక కూరల్లోగానీ, పచ్చడిగాగానీ పుదీనా తీసుకుంటే మెదడుకు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఆవ పెట్టి చేసిన తోటకూర  పులుసు కూర.

టమోటా దోశెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటా దోశెలు .

మాములుగా దోశెల పిండి  అంటే  కప్పు మినపప్పు కు  రెండున్నర  కప్పుల బియ్యం ముందు రోజు  రాత్రి నానబోసుకుని ఉదయాన్నే నీళ్ళు వడగట్టి  మెత్తగా  గ్రైండ్  చేసుకుని  తీసుకోవాలి .

అందులో  తగినంత   ఉప్పు కలుపు కోవాలి .

4 తయారైన టమోటాలు ముక్కలుగా  తరుగుకోవాలి.

ఈ టమోటా ముక్కలు , 5 ఎండుమిరపకాయలు , ఒక స్పూను జీలకర్ర  మిక్సీలో వేసుకుని  మెత్తగా  వేసుకోవాలి .

దోశెల పిండిలో ఈ మిశ్రమాన్ని  వేసుకుని  గరిటతో బాగా కలుపుకుని , స్టౌ మీద పెనం పెట్టి  పల్చగా దోశెల లాగా  వేసుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే  టమోటో   వేడి వేడి దోశెలు  సర్వింగ్ కు సిద్ధం.

ఒక ఉల్లిపాయ  మరియు రెండు పచ్చిమిరపకాయలు  సన్నగా ముక్కలుగా  తరుగుకొని ఈ దోశెలపై  వేసుకోవచ్చు .

ఈ దోశెలు కొబ్బరి చట్నీతో తింటే  చాలా రుచిగా ఉంటాయి.

పండుమిర్చి దోసకాయ ముక్కల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పండుమిరపకాయలతోదోసకాయ ముక్కల  పచ్చడి .

కావలసినవి .

పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.

పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

నిమ్మకాయంత  చింతపండు   విడదీసి  కొద్దిగా నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి ..
 
పండుమిరపకాయలు  --  12

కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .

కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .

ఉప్పు   ---   తగినంత

పసుపు  ---  కొద్దిగా .

పోపుకు  .

ఎండుమిరపకాయలు  --  3  ముక్కలుగా  చేసుకోవాలి.

చాయమినపప్పు   ---  స్పూనున్నర

మెంతులు  ---   పావు  స్పూను

ఆవాలు  ---   అర  స్పూను 

ఇంగువ  ---  కొద్దిగా

నూనె  ---   50  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.

నూనె  బాగా  కాగనివ్వాలి  .

నూనె బాగా కాగగానే   మెంతులు , ఎండుమిరపకాయల ముక్కలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .

ఎక్కువ   నూనె  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.

బాండీ లోనే  ఉంచేయండి .

పోపు  చల్లారగానే  ముందుగా   మిక్సీ లో  ఎండుమిరపకాయ ముక్కలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి  మిక్సీ   మెత్తగా   వేసుకోవాలి .

తరువాత  పండుమిరపకాయలు , తడిపిన  చింతపండు   మరియు  పోపు  వేసి  మెత్తగా మిక్సీ   వేసుకోవాలి .

చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   ఒకే  ఒక్కసారి  దోసకాయ  ముక్కలు  నలగ  కుండా  మిక్సీ   వేసుకుని  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే   పండు మిరపకాయలతో దోసకాయముక్కలు  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

బీరకాయ, అరటికాయ బజ్జీలు

బీరకాయ మరియు అరటి కాయ బజ్జీలు.

తయారీ విధానము .

ఒక బీరకాయ  మరియు ఒక అరటికాయ పై చెక్కు  తీసుకుని  చక్రాలుగా తరుగు కోవాలి.

ఒక  100  గ్రాములు శనగపిండిలో ,  స్పూనున్నర   బియ్యపు పిండి, చిటికెడు  వంటసోడా , అర స్పూను  కారం, సరిపడా ఉప్పు వేసుకుని  సరిపడా నీళ్ళు పోసుకుని  చేతితో బాగా కలుపు కోవాలి .

తర్వాత  స్టౌ మీద బాండీ పెట్టుకుని  పావు కిలో  నూనె పోసుకుని  నూనె బాగా కాగాక  ఒక్కొక్క  ముక్కను పిండిలో ముంచి ఏడెనిమిది చొప్పున వేసి బంగారు రంగులో వేయించుకోవాలి .

అంతే మధ్యాహ్నం  అల్పాహారము  బీరకాయ మరియు అరటి కాయ బజ్జీలు  సేవించడానికి సిద్ధం.

మా చిన్నప్పుడు  బాపట్లలో   జగన్నాథం అనే వ్యక్తి  ఒక స్టాండు మీద  అన్ని వస్తువులు పోస్టాఫీసు  ఎదురుగా  4 గంటల కల్లా పెట్టుకుని  రాత్రి 10 గంటల ద్వారా జోరుగా  వ్యాపారం  చేసేవాడు.

మిరపకాయబజ్జీలు , బీరకాయ అరటి కాయ బజ్జీలు , చేగోడీలు, గరం గరం ( ముంత కింద పప్పు )  ఇలా అన్ని రకములు  వేడిగా  అమ్మేవాడు.

వేడిగా  అంటే  చిల్లుల ముంతలో  బొగ్గులు ( నిప్పులు )  పోసుకుని వేయించిన  అటుకుల మీద పెట్టుకొని  తన వెంట తీసుకుని  వచ్చేవాడు.

ఆలా వేడి వేడిగా  ఇచ్చే వాడు .

ఇంక బీరకాయ అరటి కాయ బజ్జీలలో అయితే  పెద్ద ఉల్లిపాయలు సన్నగా  తరిగి  బజ్జీలలో పెట్టి , పండు మిరపకాయల పచ్చడి  మెత్తగా  రుబ్బి అందులో  నిమ్మరసం పిండి  ఆ పచ్చడి  ఉల్లిపాయలు కూరిన బజ్జీలలో పెట్టి ఇచ్చేవాడు.

అలా తింటే దాని రుచి చెప్పనలవి కాదు .

మీరు  ఒకసారి ప్రయత్నించ వలసిందే.

Tuesday, December 5, 2017

అశోకా హల్వా

ఆలూరుకృష్ణప్రసాదు .

అశోకా హల్వా.

కావలసినవి .

చాయ పెసరపప్పు -- ఒక కప్పు
గోధుమ పిండి --  రెండు స్పూన్లు
యాలకులు  -- 5 మెత్తగా  పొడి చేసుకోవాలి.
పంచదార --  ఒక కప్పున్నర
నెయ్యి  --  ఒక కప్పు
జీడిపప్పు  --  15  పలుకులు .

తయారీ  విధానము .

స్టౌ వెలిగించి  బాండీ  పెట్టి  కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు  కమ్మని వాసన వచ్చే దాకా వేయించు కోవాలి .

తర్వాత కుక్కర్లో  గిన్నె పెట్టి  వేయించిన  పప్పు వేసి  సరిపడా  నీళ్ళు పోసి  మూడు విజిల్స్  వచ్చే వరకు  ఉంచాలి .

తర్వాత  మెత్తగా  పప్పును యెనపాలి .

తర్వాత బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  ముందుగా  జీడిపప్పు  వేయించుకుని  విడిగా  ప్లేటులో తీసుకుని  ఉంచుకోవాలి .

తర్వాత  అదే బాండీలో  మరో స్పూను  నెయ్యి వేసి  గోధుమ పిండి కమ్మని వాసన వచ్చే వరకు  వేయించుకుని పక్కన  పెట్టు కోవాలి .

తర్వాత అదే బాండీలో
మళ్ళీ నాలుగు స్పూన్లు  నెయ్యి వేసి ఉడికించి ఉంచుకున్న  పెసర పప్పు  మరియు పంచదార వేసి గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.

రెండూ దగ్గర  పడి  ఉడుకుతుండగానే  పది నిముషాల  తర్వాత  వేయించిన  గోధుమ పిండి , యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని    మిఠాయి రంగు కొద్దిగా  పాలల్లో  కలుపుకుని   ఉడుకుతున్న హల్వాలో  పోసి గరిటతో  బాగా కలుపుకోవాలి .

తర్వాత  మిగిలిన  నెయ్యి  , జీడిపప్పు పలుకులు  వేసి  గరిటతో  బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే  తమిళనాడు  స్పెషల్ అశోకా హల్వా  సర్వింగ్  కు సిద్ధం.

టమోటో ,   బెండకాయలు మరియు మునగ కాడలు వేసి కందిపప్పుతో పప్పు  చారు .

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటో ,   బెండకాయలు మరియు మునగ కాడలు వేసి కందిపప్పుతో పప్పు  చారు .

తయారీ విధానము.

ఒక   కప్పు  కందిపప్పు   ఒకసారి  కడిగి  కుక్కర్  లో  సరిపడా  నీళ్ళు పోసి మూడు  విజిల్స్  వచ్చే వరకు   ఉంచి  స్టౌ  ఆపేయాలి .

తర్వాత  కుక్కర్  తీసి  పప్పు బాగా యెనిపి , అందులో  నాలుగు  పచ్చిమిర్చి  ముక్కలుగా తరిగి , రెండు  ములక్కాడలు  ముక్కలుగా  తరిగి ,  రెండు టమోటో లు ముక్కలు గా తరిగి , ఆరు బెండకాయలు ముక్కలుగా తరిగి , నిమ్మకాయంత  చింతపండు  రసం  గ్లాసు నీళ్ళలో   పది  నిముషాలు నానబెట్టి  రసం తీసుకుని  ,  కాస్త పసుపు, రెండు రెమ్మలు  కరివేపాకు  , సరిపడా  ఉప్పు వేసి  మరో గ్లాసు నీళ్ళు పోసి  స్టౌ మీద  పెట్టి   ములక్కాడలు  ఉడికే  వరకు పుప్పు చారు   మరగనివ్వాలి .

ఆ తర్వాత   పప్పు చారు  దింపాలి .

తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా కాగగానే   వరుసగా  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , కొద్దిగా  మెంతులు , పావు స్పూను  జీలకర్ర  ,  అర స్పూను  ఆవాలు  ,  కొద్దిగా  ఇంగువ మరియు  కొద్దిగా  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకోవాలి .

ఆ తర్వాత  కొత్తిమీర   తరిగి   పైన  వేసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ లాడే  ములక్కాడ  ,  బెండకాయ , టమోటో  కందిపప్పుతో  పప్పు చారు  సర్వింగ్  కు  సిద్ధం.

ఇష్టమైన వారు చిన్న బెల్లం  ముక్క వేసుకోవచ్చు .

వెల్లుల్లి  ఇష్టపడే వారు  ఇంగువ బదులుగా ఎనిమిది వెల్లుల్లి  రేకలు వేసుకుని  పోపు వేసుకోవచ్చును.

పునుగులు

ఆలూరుకృష్ణప్రసాదు .

పునుగులు.

తయారీ విధానము .

షుమారు మూడు కప్పుల ఇడ్లీ పిండిలో తరిగిన  రెండు ఉల్లిపాయలు  ముక్కలుగా తరిగి , తరిగిన  నాలుగు పచ్చి మిరపకాయలు  ముక్కలుగా తరిగి  , తరిగిన  కొత్తిమీర , తరిగిన  కరివేపాకు , రెండు స్పూన్లు  బియ్యపు పిండి, స్పూను బొంబాయి రవ్వ , స్పూనున్నర  మైదా పిండి , స్పూను కారం , కొద్దిగా  ఇంగువ , తగినంత   ఉప్పు మరియు చిటికెడు  వంట సోడా వేసి కొద్దిగా  నీళ్ళు పోసుకుని చేతితో  బాగా కలిపి  పది నిముషాల తర్వాత  స్టౌ మీద బాండీ పెట్టి  పావు కె.జి . నూనె పోసి చేతితో కాని లేదా  స్పూనుతో కాని చిన్న చిన్న ఉండలు వలె వేసుకుని బంగారు రంగులో కర కర లాడే విధముగా  వేయించుకోవాలి.

చింతకాయలు, పండుమిర్చి పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతకాయలు , పండు మిరపకాయల పచ్చడి.

కావలసినవి .

చింతకాయలు  --- కిలో
పండు మిరపకాయలు  --  అర కిలో 
పసుపు  --  స్పూను 
ఉప్పు  --  తగినంత

ముందుగా చింతకాయలను ఒకసారి కడిగి పల్చని బట్టపై పోసి ఆర నివ్వాలి .

ఆ తర్వాత  చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .

తర్వాత  చింతకాయల ముక్కలను  రోటి లో తగినంత  ఉప్పు  పసుపు  వేసి   మెత్తగా బండతో మెత్తగా  దంపుకోవాలి .

ఆ  తర్వాత ఈ పచ్చడిని  వేరే జాడీలో పెట్టు కోవాలి .

మూడో రోజు  అందులోని గింజలను  తీసుకోవాలి .

పండు మిరపకాయలు  కూడా  స్పూను పసుపు , పావు స్పూను ఇంగువ మరియు తగినంత  ఉప్పువేసి  మెత్తగా  మిక్సీ లో పచ్చడి  మెత్తగా  వేసుకుని , అందులో  రెండు స్పూన్లు  మెంతిపొడి  వేసుకుని  జాడిలో పెట్టుకుని  ఉంచుకోవాలి .

మూడో రోజు  గింజలను  తీసిన చింతకాయల తొక్కు మరియు  తొక్కుకుని సిద్ధంగా ఉంచుకున్న పండు మిరపకాయల మిశ్రమాన్ని  ఒక బేసిన్ లో వేసుకుని  చేతితో బాగా కలుపుకుని  ఒక జాడిలోకి  తీసుకోవాలి .

తర్వాత ఒక కప్పు పచ్చడి విడిగా  తీసుకొని   పచ్చడి చేసుకోవాలి .

కప్పు పచ్చడిలో పోపునకు .

నూనె   -- ఐదు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  8
మెంతులు  --  అర స్పూను
మినపప్పు  --  స్పూనున్నర 
ఆవాలు  --  అరస్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము .

స్టౌ  మీద బాండీ పెట్టి  మొత్తము నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు ,  ఆవాలు , ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

ఇప్పుడు  మిక్సీ లో  మొత్తం  పోపు వేసి  మెత్తగా వేసుకోవాలి  .

తర్వాత  చింతకాయ పండు మిరపకాయల పచ్చడి వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

నూరిన పచ్చడి పది రోజులు నిల్వ  ఉంటుంది .

నూరకుండా ఉంచిన పచ్చడి ఒక సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే పూర్తిగా ఏడాది నిల్వ ఉంటుంది .

అంతే ఇడ్లీ , దోశెలు  , చపాతీలు మరియు  భోజనము లోకి ఎంతో రుచిగా  ఉండే  చింతకాయ పండు మిరపకాయల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి