కూరల ధరలు ఎక్కువగా ఉన్న రోజుల్లో .
ఈ రోజు బంగాళా దుంపలు అల్లం పచ్చి మిర్చి వేసి చివరలో నిమ్మరసం పిండిన ముద్ద కూర.
బంగాళాదుంప అల్లం పచ్చిమిర్చి ముద్ద కూర.
కావలసినవి .
బంగాళాదుంపలు -- అరకిలో
పచ్చిమిరపకాయలు -- 8
అల్లం -- రెండు అంగుళాల -- ముక్క
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక కట్ట
పసుపు -- కొద్దిగా
నిమ్మకాయ -- ఒకటి
ఉప్పు -- తగినంత
పోపునకు .
నూనె -- అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 5
పచ్చి శనగపప్పు -- రెండు స్పూన్లు
మినపప్పు -- స్పూనున్నర
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
బంగాళాదుంపలు కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చాక దింపుకోవాలి .
చల్లారగానే పై చెక్కు వలచి విడిగా పళ్ళెంలో పెట్టుకోవాలి . ముక్కల పై కొద్దిగా పసుపు వేసుకోవాలి .
పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .
అల్లం పై చెక్కు తీసి చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి .
నిమ్మకాయ మధ్యలోకి కట్ చేసుకుని రసం వేరే చిన్న Bowl లోకి పిండుకుని రసం లోని గింజలను తీసేసుకోవాలి .
కొత్తిమీర శుభ్రం చేసుకుని కట్ చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె ను బాగా కాగనిచ్చి వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు , పచ్చి శనగపప్పు ,
మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , అల్లం ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు వేసి పోపును బాగా వేగ నివ్వాలి .
తర్వాత ఉడికిన బంగాళాదుంప ముక్కలు పోపులో వేసి అందులోసరిపడా ఉప్పు వేసి ఒక అయిదు నిముషాలు మూత పెట్టి మగ్గనిచ్చి తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకుని దింపుకుని నిమ్మరసం అందులో వేసి బాగా కలుపుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
వేడి మీద నిమ్మరసం పిండితే కూర చేదు వస్తుంది.
ఈ ముద్దకూర లో విడిగా మేము కారం వేయము .
పోపులోని ఎండుమిర్చి , పచ్చిమిర్చి , అల్లం ముక్కల కారం సరి పోతుంది .
అంతే పుల్ల పుల్లగా నిమ్మ , అల్లం పచ్చి మిర్చి రుచితో ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప ముద్ద కూర దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment