క్యాలీ ఫ్లవర్ తో అల్లం , పచ్చిమిర్చి మరియు కొబ్బరి కూర.
కావలసినవి .
క్యాలిఫ్లవర్ -- అర కిలో
పచ్చి కొబ్బరి తురుము -- ఒక చిప్ప.
పచ్చిమిరపకాయలు -- 12
అల్లం -- ఒక చిన్న ముక్క
ఉప్పు -- తగినంత
పోపునకు .
నూనె -- నాలుగు స్పూన్లు
ఎండుమిరపకాయలు -- 4 చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
పచ్చి శనగపప్పు -- స్పూనున్నర .
చాయమినపప్పు -- స్పూనున్నర
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు --- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు
ఉప్పు -- తగినంత
తయారీ విధానము .
ముందుగా క్యాలీ ఫ్లవర్ ను తుంపుకుని , ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పువేసి మరియు తుంపిన క్యాలీ ఫ్లవర్ ను కూడా వేసి ఒక అయిదు నిముషాలు ఉండనివ్వాలి .
పొరపాటున ఒకటి అర పురుగులు ఉంటే పువ్వు లోపల ఉంటే బయటకు వస్తాయి.
ఆ తర్వాత పువ్వును సన్నగా చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.
అల్లం పై చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ఇప్పుడు మిక్సీ లో పచ్చిమిరపకాయలు , అల్లం ముక్కలు , పచ్చి కొబ్బరి తురుము మరియు తగినంత ఉప్పు వేసి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి.
ఈ ముద్దను వేరే ప్లేటు లోనికి తీసుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే అందులో సన్నగా తరిగిన క్యాలీ ఫ్లవర్ ముక్కలు కూడా వేసి మూత పెట్టి మీడియం సెగన ఓ పది నిముషాలు మగ్గ నివ్వాలి .
తరువాత సిద్ధంగా ఉంచుకున్న అల్లం , పచ్చిమిర్చి మరియు కొబ్బరి ముద్దను వేసి , మరో అయిదు నిముషాలు ముద్ద పచ్చి వాసన పోయే దాక వేయించి దింపుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే క్యాలిఫ్లవర్ అల్లం పచ్చిమిర్చి కొబ్బరి కూర రోటీలలోనికి, చపాతీల లోకి మరియు భోజనము లోనికి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment