ఆలూరుకృష్ణప్రసాదు .
శ్రీమతి నాలుగు రోజులు ఊరికి వళ్ళింది.
చాలా రోజుల తర్వాత వంటిల్లు నా హస్త గత మైంది .
మరి ఈ మూడు రోజులు వంటింట్లో చెలరేగి పోవడమే .
లోగడ మీకు చెప్పినట్లుగా ఆమె ఊళ్ళో ఉంటే వంటింట్లోకి వెళ్ళను. రానివ్వదు.
ఆమె ఊరిలో లేనప్పుడు మాత్రమే నేను వంట గదిలోకి ప్రవేశం.
అదే మా ఇరువురి ఒప్పందం .
సాధారణంగా కొత్త వంట ప్రయోగాలు ముందు నా మీద వేసుకుంటాను.
నేను తిని నాకు బాగుందనిపించినప్పుడే ఇతరులకు చెప్తాను.
ఈ రోజు అలాంటి ప్రయోగమే చేసాను.
ఆ వెరైటి రెసిపీ మీ కోసం.
మరో వెరైటీ వంకాయ కూర.
పండుమిరపకాయలతో వంకాయలు కాయల పళంగా కూర .
కావలసినవి .
వంకాయలు -- అర కిలో.
నన్నగా పొడుగు గా ఉన్న లేత నీలం రంగు వంకాయలైనా లేదా లావుగా గుండ్రంగా ఉన్న లేత నీలం రంగు చిన్న వంకాయలైనా బాగుంటాయి.
పండు మిరపకాయలు - 15
చింతపండు -- చిన్న నిమ్మకాయంత. చాలా కొద్ది నీటిలో తడిపి ఉంచుకోవాలి .
పసుపు -- కొద్దిగా
ఇంగువ -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
నూనె -- 75 గ్రాములు .
తయారీ విధానము .
ముందుగా పండు మిరపకాయలు , తడిపిన చింతపండు , కొద్దిగా పచ్చి ఇంగువ , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు వేసి మిక్సీ లో మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి .
తర్వాత ఆ మిశ్రమాన్ని వేరే ప్లేటులోకి తీసుకుని ఉంచుకోవాలి.
వంకాయలు నీళ్ళలో వేసి పుచ్చులు లేకుండా చూసుకుని కాయల పళంగా నాలుగు పక్షాలుగా చేసుకోవాలి.
తర్వాత ఇంతకు ముందు మిక్సీ వేసుకుని ఉంచుకున్న మిశ్రమాన్ని ఈ కాయలలో పట్టినంతవరకు కూరుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే ఈ కాయలను అందులో వేసి , స్టౌ సెగ మీడియంలో ఉంచి , బాండి పైన మూతపెట్టి కాయలు పూర్తిగా మగ్గ నివ్వాలి .
మధ్య మధ్యలో అట్లకాడతో కాయలు విడి పొకుండా కదుపుతూ ఉండాలి .
కాయలు వేగి నూనె బయటకు వస్తుంది.
ఆ సమయంలో పై మూత తీసి మరో అయిదు నిముషాలు ఉంచి కారం వేగినట్లుగా రాగానే దింపి వేరే ప్లేటులోకి తీసుకోవాలి .
ఈ విధముగా పండుమిరపకాయలతో చేసిన వంకాయ కాయల పళంగా కూర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది .
ఈ రోజు నేను స్వయంగా చేసిన వంకాయ కూర తాలూకు చిత్రం.
0 comments:
Post a Comment