ఆలూరుకృష్ణప్రసాదు .
మునగాకు తో కూర.
మునగ కాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో మునగ ఆకు కూడా ఆహారంలో తీసుకోవడం రెట్టింపు మంచిది .
తమిళనాడు వాళ్ళు బాగా ఎక్కువగా మునగాకు వాడతారు .
తమిళనాడు మార్కెట్లలో మునగాకు ఆకు ఒక ఆకు కూరగా ప్రతిరోజూ అమ్ముతారు .
మన వాళ్ళు ఆషాఢమాసం మునగాకు వాడాలని , కార్తీక మాసం నేతి బీరకాయ తినాలని , శ్రావణమాసంలో నేరేడు పళ్ళు తినాలని , వేసవి కాలంలో ముంజెలు తినాలని చెప్తారు .
మాకు ఒక తమిళము వారు మునగ ఆకుతో కూర చేసుకునే విధానము తెలిపారు .
చేసి చూసాము. చాలా రుచిగా కుదిరింది .
ఈ రెసిపీ మీ కోసం.
మునగ ఆకుతో పప్పు కూర .
కావలసినవి .
మునగ ఆకు -- మూడు కప్పులు .
లేత మునగ ఆకులు శుభ్రంగా విడి విడిగా వలుచుకోవాలి.
చాయపెసరపప్పు -- పావు కప్పు .
కూర చేయబోయే ఒక గంట ముందు తగిన నీళ్ళు పోసి నానబెట్టుకుని నీళ్ళు వడకట్టు కోవాలి .
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు .
కరివేపాకు - రెండు రెమ్మలు.
పసుపు -- కొద్దిగా
కారం -- స్పూను
ఉప్పు -- తగినంత
పోపునకు.
నూనె -- మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు - 3 ముక్కలు గా చేసుకోవాలి.
చాయమినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి .
తర్వాత మొత్తము మునగాకు ఆకు పళంగా వేసి , సరిపడ ఉప్పు మరియు పసుపు వేసి మూత పెట్టి ఆకును పూర్తిగా మగ్గనివ్వాలి .
తర్వాత నానబెట్టిన చాయ పెసరపప్పును మరియు స్పూను కారం కూడా వేసి మరో అయిదు నిముషాలు ఆకు మరియు పెసరపప్పు రెండూ కలిసే విధముగా మగ్గనివ్వాలి .
తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి అట్లకాడతో బాగా కలిపి మరో మూడు నిముషాలు ఉంచి దింపి వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే మునగాకు పప్పు కూర భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment