Thursday, November 30, 2017

కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొంచెం  వెరైటీగా పచ్చిమిర్చి  కొత్తిమీర  పచ్చడి .

తయారీ విధానము.

చిన్నవి అయితే రెండు కట్టలు , పెద్దది  ఒక  కట్ట కొత్తిమీర  శుభ్రం చేసుకుని  వలుచుకుని  ఉంచుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు  పదిహేను నిముషాల  ముందు  కొద్దిగా వేడి నీళ్ళలో నానబెట్టకుని  అర గ్లాసు రసం చిక్కగా  తీసుకోవాలి .

ఒక  15  పచ్చిమిరపకాయలు  తొడిమలు  తీసుకుని  ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె  వేసి  స్పూను  చాయమినపప్పు , పావు స్పూను  మెంతులు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ వేసి పోపు వేగగానే  పోపులో పచ్చిమిరపకాయలు  , కొద్దిగా  పసుపు , తగినంత  ఉప్పు మరియు  చింతపండు  రసం  వేసి మూత పెట్టి  అయిదు నిముషాలు  చింతపండు  రసంలో పచ్చిమిరపకాయలు  మగ్గనివ్వాలి .

తర్వాత  కొత్తిమీర  కూడా  పోపులో వేసి మూడు నిముషాలు  వేసి  మగ్గనిచ్చి  దింపుకోవాలి .

చల్లారగానే  ఈ మిశ్రమము మొత్తము మిక్సీలో  వేసి పచ్చడి మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి.

ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు .

ఈ పచ్చడి  ఇడ్లీ , దోశెలు, గారెలు  మరియు  భోజనము  లోకి  కూడా చాలా రుచిగా  ఉంటుంది .

మునగాకు తో కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మునగాకు తో కూర.

మునగ కాయలు ఆరోగ్యానికి  ఎంత మంచివో  మునగ ఆకు కూడా  ఆహారంలో తీసుకోవడం రెట్టింపు  మంచిది .

తమిళనాడు వాళ్ళు బాగా ఎక్కువగా  మునగాకు  వాడతారు .

తమిళనాడు మార్కెట్లలో మునగాకు ఆకు ఒక ఆకు కూరగా  ప్రతిరోజూ అమ్ముతారు .

మన వాళ్ళు ఆషాఢమాసం మునగాకు వాడాలని , కార్తీక మాసం నేతి బీరకాయ తినాలని ,  శ్రావణమాసంలో  నేరేడు పళ్ళు తినాలని  , వేసవి కాలంలో  ముంజెలు  తినాలని  చెప్తారు .

మాకు ఒక తమిళము వారు  మునగ ఆకుతో  కూర చేసుకునే   విధానము  తెలిపారు .

చేసి చూసాము. చాలా రుచిగా  కుదిరింది .

ఈ రెసిపీ  మీ కోసం.

మునగ ఆకుతో  పప్పు కూర .

కావలసినవి .

మునగ ఆకు  --  మూడు కప్పులు .
            
లేత మునగ ఆకులు శుభ్రంగా  విడి విడిగా వలుచుకోవాలి.

చాయపెసరపప్పు  -- పావు కప్పు .

కూర చేయబోయే ఒక గంట ముందు  తగిన నీళ్ళు పోసి నానబెట్టుకుని  నీళ్ళు వడకట్టు కోవాలి .

పచ్చి కొబ్బరి తురుము  -  అర కప్పు .
కరివేపాకు  -  రెండు రెమ్మలు.
పసుపు  --  కొద్దిగా
కారం  --  స్పూను
ఉప్పు  --  తగినంత

పోపునకు.

నూనె --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  - 3  ముక్కలు గా చేసుకోవాలి.
చాయమినపప్పు  --  స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిర్చి ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు  వేసుకోవాలి .

తర్వాత  మొత్తము  మునగాకు  ఆకు పళంగా వేసి , సరిపడ ఉప్పు మరియు  పసుపు వేసి  మూత పెట్టి  ఆకును  పూర్తిగా  మగ్గనివ్వాలి .

తర్వాత  నానబెట్టిన చాయ పెసరపప్పును  మరియు స్పూను కారం కూడా వేసి మరో అయిదు నిముషాలు  ఆకు  మరియు  పెసరపప్పు రెండూ కలిసే విధముగా  మగ్గనివ్వాలి .

తర్వాత  పచ్చి కొబ్బరి తురుము కూడా  వేసి అట్లకాడతో బాగా కలిపి మరో  మూడు నిముషాలు  ఉంచి దింపి  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మునగాకు  పప్పు కూర  భోజనము  లోకి సర్వింగ్ కు సిద్ధం.

ఇన్స్టంట్ కందిపచ్చడి

అయిదు నిముషాల క్రితం  ఈ రోజు రాత్రికి  భోజనము  లోకి  కందిపచ్చడి తినాలని అన్పించింది .

మొత్తము  ప్రాసెస్ చేసే ఓపిక లేదు .

బుర్రలో తళుక్కుమని ఒక ఆలోచన.

ఇంట్లో మూడు రోజుల క్రితం కొట్టిన కందిపొడి  ఉంది.

నాలుగు  స్పూన్లు  కందిపొడి , పావు స్పూను  జీలకర్ర  , ముప్పావు స్పూను  కారం మరియు తగినంత  ఉప్పు  మిక్సీ లో వేసి , కొద్దిగా  నీళ్ళు పోసి తిప్పేసాను .

రుచి  అదిరిపోయింది.

పచ్చడిని చూసి మీరే చెప్పవచ్చు  ఎంత రుచిగా  ఉందో.

మూడు నిముషాల్లో అయిపోయింది  కందిపచ్చడి .

పచ్చి కొబ్బరి తురుముతో  పెరుగు పచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చి కొబ్బరి తురుముతో  పెరుగు పచ్చడి.

కావలసినవి.

కొబ్బరి  కాయ --  పగుల కొట్టి  రెండు చిప్పలూ పచ్చి కొబ్బరి తురుముతో  తురుము కోవాలి .

పెరుగు  --  అర  లీటరు .

పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగు , పచ్చడి  కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగు వాడు కోవచ్చును.

పచ్చి మిరపకాయలు  --  8
అల్లం  --  అంగుళం ముక్క ఒకటి

కొత్తిమీర  --  చిన్న కట్టలు రెండు .

ఉప్పు  --  తగినంత .

పోపునకు.

నెయ్యి --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  4  ముక్కలుగా  చేసుకోవాలి .
చాయమినపప్పు  --  స్పూనున్నర .
జీలకర్ర  --  పావు స్పూను .
ఆవాలు --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా
కరివేపాకు  --  మూడు రెమ్మలు .

తయారీ విధానము .

పచ్చిమిరపకాయలు తొడిమలు  తీసి ఉంచుకోవాలి.

అల్లం చెక్కు  తీసి , ముక్కలుగా చేసుకోవాలి .

కొత్తిమీర  విడదీసి శుభ్రం చేసుకోవాలి .

ఇప్పుడు మిక్సీ లో పచ్చిమిరపకాయలు , తరిగిన  అల్లం  ముక్కలు , కొత్తిమీర లో మూడు వంతులు , తగినంత  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఇప్పుడు  ఒక గిన్నెలో సిద్ధంగా  ఉంచుకున్న  పెరుగు , తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి తురుము , మిగిలిన ఒక వంతు కొత్తిమీర  మరియు  మిక్సీ  వేసుకున్న మిశ్రమము వేసి  గరిటతో బాగా కలుపుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టి  మొత్తము  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు, చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు పెట్టి , కొబ్బరి పెరుగు పచ్చడి లో కలుపుకోవాలి .

అద్భుతమైన  కొత్తిమీర  సువాసనతో  రుచిగా ఉండే ఈ కొబ్బరి తురుము పెరుగు పచ్చడి  ఇడ్లీ , దోశెలలోకి  మరియు భోజనము లోకి కూడా  ఎంతో బాగుంటుంది .

ఫోటో  ---  ఈ రోజు  నేను స్వయముగా  చేసుకున్న  పచ్చి కొబ్బరి  తురుము పెరుగు పచ్చడి .

ఎలా ఉందో మీరే చెప్పాలి ?

వంకాయ పండుమిర్చి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

శ్రీమతి నాలుగు  రోజులు  ఊరికి  వళ్ళింది.

చాలా రోజుల తర్వాత వంటిల్లు నా హస్త గత మైంది .

మరి  ఈ మూడు రోజులు  వంటింట్లో  చెలరేగి పోవడమే .

లోగడ మీకు చెప్పినట్లుగా ఆమె  ఊళ్ళో  ఉంటే  వంటింట్లోకి  వెళ్ళను. రానివ్వదు.

ఆమె ఊరిలో  లేనప్పుడు  మాత్రమే  నేను  వంట గదిలోకి ప్రవేశం.

అదే మా ఇరువురి ఒప్పందం .

సాధారణంగా  కొత్త వంట ప్రయోగాలు  ముందు నా మీద వేసుకుంటాను.

నేను తిని  నాకు బాగుందనిపించినప్పుడే  ఇతరులకు చెప్తాను.

ఈ రోజు  అలాంటి ప్రయోగమే  చేసాను.
ఆ వెరైటి రెసిపీ మీ కోసం.

మరో వెరైటీ వంకాయ కూర.

పండుమిరపకాయలతో వంకాయలు కాయల పళంగా కూర .

కావలసినవి .

వంకాయలు -- అర కిలో.
నన్నగా పొడుగు గా ఉన్న లేత నీలం రంగు వంకాయలైనా లేదా లావుగా  గుండ్రంగా  ఉన్న  లేత నీలం రంగు  చిన్న వంకాయలైనా  బాగుంటాయి.

పండు మిరపకాయలు  -  15 

చింతపండు  --  చిన్న నిమ్మకాయంత.  చాలా కొద్ది నీటిలో తడిపి ఉంచుకోవాలి .

పసుపు  --  కొద్దిగా
ఇంగువ --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
నూనె  --  75 గ్రాములు .

తయారీ  విధానము .

ముందుగా  పండు మిరపకాయలు , తడిపిన చింతపండు , కొద్దిగా  పచ్చి ఇంగువ , కొద్దిగా  పసుపు , తగినంత ఉప్పు వేసి  మిక్సీ లో మరీ మెత్తగా  కాకుండా వేసుకోవాలి .

తర్వాత ఆ మిశ్రమాన్ని వేరే ప్లేటులోకి  తీసుకుని ఉంచుకోవాలి.

వంకాయలు  నీళ్ళలో వేసి  పుచ్చులు లేకుండా చూసుకుని  కాయల పళంగా  నాలుగు  పక్షాలుగా  చేసుకోవాలి.

తర్వాత ఇంతకు ముందు మిక్సీ  వేసుకుని  ఉంచుకున్న  మిశ్రమాన్ని  ఈ కాయలలో పట్టినంతవరకు  కూరుకోవాలి.
ఇప్పుడు  స్టౌ మీద బాండి పెట్టి మొత్తం  నూనె వేసి  నూనె బాగా కాగగానే  ఈ కాయలను  అందులో  వేసి , స్టౌ సెగ మీడియంలో ఉంచి , బాండి పైన మూతపెట్టి కాయలు పూర్తిగా  మగ్గ నివ్వాలి .

మధ్య మధ్యలో అట్లకాడతో  కాయలు  విడి పొకుండా  కదుపుతూ  ఉండాలి .

కాయలు  వేగి  నూనె బయటకు వస్తుంది.

ఆ సమయంలో  పై  మూత తీసి మరో అయిదు నిముషాలు  ఉంచి కారం వేగినట్లుగా రాగానే  దింపి వేరే ప్లేటులోకి  తీసుకోవాలి .
ఈ విధముగా  పండుమిరపకాయలతో చేసిన వంకాయ కాయల పళంగా  కూర  వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని  తింటే అద్భుతమైన  రుచిగా ఉంటుంది .

ఈ రోజు నేను  స్వయంగా చేసిన వంకాయ కూర తాలూకు చిత్రం.

స్పెషల్ వెరైటి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో  స్పెషల్  వెరైటీ  కూర .

మునక్కాడ  పచ్చి  కొబ్బరి  నువ్వు పప్పు తో  కూర.

తెల్ల నువ్వులు వేరు. నువ్వు పప్పు  వేరు.

తెల్లగా ఉన్న నువ్వుపప్పు  తో చేస్తేనే  ఈ ములక్కాడలతో కూర రుచిగా  ఉంటుంది .

కావలసినవి .

లేత  మునక్కాడలు   -  4
తురిమిన  పచ్చి  కొబ్బరి  --  ఒకచిప్ప.
నువ్వుపప్పు   ---  100  గ్రాములు
జీలకర్ర  --  అర స్పూను
ఉప్పు  --   తగినంత
పసుపు  --  కొద్దిగా
నూనె  --   75  గ్రాములు
కారం  ---  స్పూను

పోపుకు

ఎండుమిరపకాయలు --  3
పచ్చిశనగపప్పు  --  స్పూనున్నర
మినపప్పు   ---  స్పూను
జీలకర్ర   --  పావు  స్పూను
ఆవాలు  --  అర స్పూను
కరివేపాకు  --  మూడు  రెబ్బలు

తయారీ  విధానము .

ముందుగా  నువ్వు  పప్పు  బాగు చేసుకొని , పప్పు  మునిగే  వరకు  నీరు పోసి  రెండు  గంటలు  పైగా  నాన బెట్టాలి.

మునక్కాడలు  ముక్కలుగా  తరుగుకొని   గిన్నెలో  తగిన  నీరు పోసి   చిటికెడు  ఉప్పు వేసి విడిగా  మునక్కాడ ముక్క  మూడు వంతులు  ఉడికే  వరకు  ఉంచి  దింపి  వడగట్టి  వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

నీరు  పార బొయ్యాలి .

కుక్కర్  లో  పెడితే  ముక్కలు  చితికే  అవకాశం  ఉంది .

కొబ్బరి  కాయ  కొట్టి  ఒక  చిప్ప  పచ్చి  కొబ్బరి  వచ్చే  విధముగా   సిద్ధం  చేసుకోవాలి .

ఇప్పుడు  మిక్సీలో  నానబెట్టిన  నువ్వుపప్పు  వేసి  నువ్వుపప్పు   మెత్తగా నలిగే  వరకు  గ్రైండ్  చేసుకోవాలి .

అందులోనే  తురిమిన పచ్చి కొబ్బరి తురుము , జీలకర్ర  , తగినంత  ఉప్పు , స్పూను  కారం,  చిటికెడు  పసుపు   వేసి  మళ్ళీ  గ్రైండ్  చేసుకుని    ముద్ద  విడిగా  తీసి  పెట్టుకోవాలి .

ముద్ద  పేస్ట్  లా  ఉండకూడదు .

కొంచెము  కచ్చాపచ్చాగా  వేసుకోవాలి.

రుబ్బిన  కొబ్బరి  పచ్చడి  ఎలా ఉంటుందో ఆ మాదిరిగా  ఉండాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  నూనె  మొత్తము   వేసి  నూనె  కాగగానే  ఎండుమిర్చి , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు, కరివేపాకు   వేసి  పోపు  వేసుకుని   పోపు  వేగగానే  సిద్ధం చేసుకున్న  ముద్దను   కూడా వేసి  పచ్చి వాసన  పోయే వరకు  వేయించాలి .

తర్వాత ఉడికిన  మునక్కాడ  ముక్కలు వేసి  ఒక  పావు  గ్లాసు  నీళ్ళు పోసి  మూత పెట్టి  మధ్య  మధ్యలో  కలుపుకుంటూ  ముద్ద  అడుగంటకుండా  మునక్కాడలకు పట్టే  విధంగా  చూసుకోవాలి .

మీడియం  సెగలో  మగ్గ నివ్వాలి .

మునగకాడ ముక్కలు  పూర్తిగా  మగ్గగానే  దింపి  వేరే  డిష్  లోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మునక్కాడ +  నువ్వుపప్పు  +  పచ్చి కొబ్బరి తో  స్పెషల్  కూర  సర్వింగ్   కు  సిద్ధం .

ఈ కూర  అన్నం  లోకి  చపాతీల లోకి  బాగుంటుంది .

వామన చింతకాయల పప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

మా అత్తగారు వామన చింతకాయలతో పప్పు చేసేవారు.

చాలా రుచిగా  ఉండేది .

మీ కోసం .

వామన చింతకాయలతో  పప్పు .

కావలసినవి .

  వామన చింతకాయలు  --  100  గ్రా
కందిపప్పు   --  150  గ్రా
పచ్చి మిరపకాయలు  --  6
కరివేపాకు  --  నాలుగు   రెమ్మలు
పసుపు  --  కొద్దిగా
ఉప్పు   ---  తగినంత
కారం  ---   ఒకటిన్నర   స్పూను

పోపుకు .

నూనె  ---  మూడు  స్పూను
ఎండుమిరపకాయలు  --- మూడు
ముక్కలుగా   చేసుకోవాలి .
మెంతులు  ---  పావు  స్పూను
జీలకర్ర   --  పావు  స్పూను
ఆవాలు  ---  అర  స్పూను
ఇంగువ  ---  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  ఒక  గిన్నెలో  కందిపప్పు   వేసుకుని   ఒకసారి  కడిగి  తగినన్ని   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టుకోవాలి  .

వామన చింతకాయలు శుభ్రంగా  కడిగి  చిన్న ముక్కలుగా  చేసుకుని  మిక్సీలో చింతకాయముక్కలు , పావు స్పూను  పసుపు మరియు స్పూను  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

పచ్చి గింజలు ఏమైనా  ఉంటే అందులో తీసి వేసుకోవాలి.

పచ్చిమిర్చి   నిలువుగా   తరుగు  కోవాలి .

పప్పు  దాదాపుగా ఉడకగానే ఈ చింతకాయల ముద్ద,
  పచ్చిమిర్చి , కరివేపాకు , కొద్దిగా  పసుపు  వేసి   పప్పును  పూర్తిగా   ఉడకనివ్వాలి  .

పప్పు  ఉడికాక  తగినంత  ఉప్పు  , ఒక  స్పూను  కారం  వేసి  మరో  మూడు  నిముషాలు   ఉంచి  దింపు కోవాలి .

తదుపరి  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టి  నూనె  వేసి  నూనె  కాగగానే   ఎండుమిర్చి ,  మెంతులు , జీలకర్ర ,
ఆవాలు  , ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకుని  పప్పులో  కలుపుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

వెల్లుల్లి   ఇష్టమైన  వారు  ఇంగువ  బదులు  ఒక  ఆరు  వెల్లుల్లి   రేకలు పోపులో  వేసుకోవచ్చు .

ఇదే  విధంగా  పెసరపప్పుతో  కూడా  చేసుకోవచ్చు .

అంతే  ఇంగువ   సువాసనతో  వామన చింత  కాయలతో  పప్పు   సర్వింగ్
కు  సిద్ధం .

పెద్ద ఉసిరి కాయలతో కొబ్బరి పచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

పెద్ద ఉసిరి కాయలతో కొబ్బరి పచ్చడి.

కావలసినవి .

ఉసిరికాయలు -- ఎనిమిది .
కొబ్బరి తురుము -- ఒక చిప్ప
పచ్చిమిరపకాయలు  -- 6
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  -- చిన్న కట్ట
పసుపు --  కొద్దిగా .

పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4
నూనె  --  4  స్పూన్లు
చాయమినపప్పు  -- స్పూనున్నర
మెంతులు --  పావు స్పూను
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు --  అర స్పూను
ఇంగువ -- కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద బాండి పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసుకుని  ఉసిరి కాయలు పై  కొద్దిగా పసుపు వేసుకుని  మూడు నిముషాలు  మగ్గ పెట్టు కుని చల్లారగానే కాయలలోని  గింజలను  తీసి వేసుకుని  విడిగా పక్కన వేరే ప్లేటులో ఉంచుకోవాలి.

తర్వాత  తిరిగి స్టౌ  వెలిగించి   మిగిలిన నూనె పోసి  వరుసగా  ఎండుమిరపకాయలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు వేయించుకుని అందులో పచ్చి మిరపకాయలు  కూడా వేసి  మగ్గ నివ్వాలి .

పోపు చల్లారగానే  ముందుగా  మిక్సీ లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  వేసి   మెత్తగా వేసుకోవాలి .

తర్వాత  పచ్చిమిర్చి , మగ్గబెట్టిన ఉసిరి ముక్కలు , పచ్చి కొబ్బరి  తురుము వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత మిగిలిన పోపు , మరియు  కొత్తిమీర  కూడా వేసి  ఒకసారి మిక్సీ  వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

అంతే  ఇడ్లీ, దోశెలు  మరియు  భోజనము  లోకి ఎంతో  రుచిగా ఉండే  ఉసిరి కాయ కొబ్బరి  పచ్చడి సిద్ధం .

ఉసిరికాయలలో  పులుపు  ఉంటుంది  కనుక చింతపండు  వేయనవసరం లేదు .

ఈ పచ్చడి రాత్రులందు , ఆదివారము రోజు కాకుండా  చేసుకోండి .

కొబ్బరి పాలతో రైస్ పొంగల్

కొబ్బరి పాలతో  రైస్ పొంగల్.

కొబ్బరి  పాలు -- ఒక గ్లాసు.
కొబ్బరి కాయను పగుల గొట్టి చిప్పలను పచ్చి
కొబ్బరి కోరాముతో తురుముకుని  ఒకసారి మిక్సీ  వేసుకుని ఒక గుడ్డలో వేసుకుని 
కొబ్బరి పాలు తీసుకోవాలి .  

తిరిగి  తురుము మరోసారి  మిక్సీలో వేసి కొద్దిగా  నీళ్ళుపోసి  మరోసారి మిక్సీ  వేసుకుని  తిరిగి  పాలు తీసుకోవాలి .

ఈ విధముగా  ఒక గ్లాసు కొబ్బరి  పాలు తీసుకుని  సిద్ధముగా ఉంచుకోవాలి.

చాయపెసరపప్పు --  పావు గ్లాసు . అరగంట ముందుగా  నానబెట్టి  ఉంచుకోవాలి.
నెయ్యి -  5 స్పూన్లు
ఉల్లిపాయ  --  ఒకటి
టమోటో  --  ఒకటి
పచ్చిమిర్చి  -- రెండు
కరివేపాకు  -- మూడు రెమ్మలు
కొత్తిమీర  --  చిన్న కట్ట
పొదినా --  చిన్న కట్ట
లవంగాలు  -- 4
మిరియాలు  -- 6
జీడిపప్పు  -- పది పలుకులు
ఉప్పు  -- తగినంత

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద కుక్కర్  పెట్టి అందులో మూడు స్పూన్లు  నెయ్యి వేసి  జీడిపప్పు , లవంగాలు , మిరియాలు వేయించుకోవాలి .

ఆ తర్వాత అందులో తరిగిన టమోటో ముక్కలు , ఉల్లిపాయ  ముక్కలు మరియు పచ్చిమిర్చి  ముక్కలు వేసి పైన మూత పెట్టి మగ్గనివ్వాలి.

తర్వాత తరిగిన పొదినా, కరివేపాకు  మరియు  తరిగిన కొత్తిమీర  వేసి  కొద్దిసేపు మగ్గనిచ్చి అందులో గ్లాసు  కొబ్బరి పాలు మరియు గ్లాసు నీళ్ళు , తగినంత  ఉప్పు , గ్లాసు నానబెట్టిన బియ్యము మరియు పావు గ్లాసు నానబెట్టిన పెసర పప్పు వేసి కుక్కర్ మూతపెట్టి  విజిల్ పెట్టి  మూడు విజిల్స్ రానిచ్చి దింపు కోవాలి .

విజిల్  ఊడి రాగానే  మిగిలిన నెయ్యి మొత్తము  వేసి  గరిటతో  బాగా కలుపుకుని, టమోటో  మరియు కొత్తిమీర  చట్నీతో కాని  లేదా అల్లం  చట్నీతో కాని   సర్వింగ్  చేసుకోవాలి.

ఉసిరి కాయలు ఉక్కాళించిన ముక్కల పచ్చడి

ఉసిరి కాయలు ఉక్కాళించిన ముక్కల పచ్చడి .

కావలసినవి .

ఉసిరికాయలు  ---  అర కిలో
ఎండుమిరపకాయలు  --  6
మెంతి పొడి  --  స్పూను
ఆవాలు --  స్పూను
ఇంగువ --  పావు స్పూను
నూనె  --  ఆరు స్పూన్లు
పసుపు --  పావు స్పూను 
కారం  --  నాలుగు  స్పూన్లు
ఉప్పు  --  తగినంత

తయారీ విధానము .

ముందుగా  ఉసిరి కాయలు  శుభ్రంగా పొడి గుడ్డతో  తుడుచుకోవాలి.

ఒక గిన్నెలో నీళ్ళు పోయకుండా ఉసిరి కాయలు వేసి,  కుక్కర్ లో  తగినన్ని నీళ్ళు పోసి  గిన్నె కుక్కర్ లో పెట్టి స్టౌ మీద పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి.

చల్లారగానే  చేతితో చిదిపి కాయల లోపల గింజలను  తీసి వేసి  ఉసిరి కాయలను ముక్కలుగా చేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి నూనెను బాగా కాగ నివ్వాలి .

నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , ఆవాలు, మెంతి పొడి , ఇంగువ , కారము, సరిపడా ఉప్పు వేసి , అందులో  ఉడికించిన  ఉసిరి ముక్కలు మరియు పసుపు వేసి  ముక్కలను నూనెలో మగ్గ నివ్వాలి .

ఆ తర్వాత  చల్లారగానే  వేరే  సీసాలో తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే ఉసిరికాయ  ముక్కల పచ్చడి  సర్వింగ్  కు సిద్దం .

ఈ పచ్చడి  ఫ్రిజ్ లో  ఉంచుకుంటే  20  రోజులు  నిల్వ ఉంటుంది .

Thursday, November 16, 2017

కాలిఫ్లవర్ అల్లం పచ్చిమిర్చి కూర

క్యాలీ ఫ్లవర్  తో అల్లం , పచ్చిమిర్చి  మరియు కొబ్బరి కూర.

కావలసినవి .

క్యాలిఫ్లవర్  --  అర కిలో
పచ్చి కొబ్బరి తురుము  --  ఒక చిప్ప.
పచ్చిమిరపకాయలు  --  12
అల్లం  --  ఒక చిన్న ముక్క
ఉప్పు  --  తగినంత

పోపునకు .

నూనె  --  నాలుగు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  -- 4  చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
పచ్చి శనగపప్పు  --  స్పూనున్నర .
చాయమినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  పావు స్పూను
ఆవాలు  ---  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
ఉప్పు  --  తగినంత

తయారీ  విధానము .

ముందుగా  క్యాలీ ఫ్లవర్ ను  తుంపుకుని , ఒక గిన్నెలో  గోరు  వెచ్చని నీటిలో  కొద్దిగా  ఉప్పువేసి మరియు  తుంపిన  క్యాలీ ఫ్లవర్ ను కూడా  వేసి  ఒక అయిదు నిముషాలు  ఉండనివ్వాలి .

పొరపాటున  ఒకటి అర  పురుగులు ఉంటే   పువ్వు లోపల  ఉంటే  బయటకు  వస్తాయి.

ఆ తర్వాత  పువ్వును  సన్నగా  చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.

అల్లం  పై చెక్కు తీసుకుని  చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  మిక్సీ లో  పచ్చిమిరపకాయలు , అల్లం  ముక్కలు , పచ్చి కొబ్బరి  తురుము  మరియు  తగినంత   ఉప్పు వేసి  మెత్తగా కాకుండా  కచ్చా పచ్చాగా  మిక్సీ వేసుకోవాలి.

ఈ ముద్దను వేరే ప్లేటు లోనికి  తీసుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయల  ముక్కలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి  పోపు వేగగానే  అందులో  సన్నగా  తరిగిన  క్యాలీ ఫ్లవర్  ముక్కలు కూడా  వేసి  మూత పెట్టి  మీడియం సెగన  ఓ  పది నిముషాలు  మగ్గ నివ్వాలి .

తరువాత  సిద్ధంగా  ఉంచుకున్న  అల్లం , పచ్చిమిర్చి  మరియు  కొబ్బరి  ముద్దను  వేసి , మరో అయిదు నిముషాలు  ముద్ద పచ్చి వాసన పోయే దాక  వేయించి దింపుకుని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  క్యాలిఫ్లవర్  అల్లం  పచ్చిమిర్చి  కొబ్బరి కూర  రోటీలలోనికి, చపాతీల లోకి మరియు  భోజనము  లోనికి  సర్వింగ్  కు సిద్ధం.

చిలకడ దుంపల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చిలకడ దుంపల పచ్చడి .

కావలసినవి .

చిలకడ దుంపలు  --  పావు కిలో.
ఎండుమిరపకాయలు  --  8
చింతపండు  --చిన్న నిమ్మకాయంత
చాయమినపప్పు  --  స్పూనున్నర .
మెంతులు  --  పావు స్పూను
జీలకర్ర   --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ --  కొద్దిగా
పసుపు --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు
నూనె  --  మూడు స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా  చిలకడ దుంపలు  శుభ్రంగా కడుగుకొని   ఎండుకొబ్బరి కోరాముతో  తురుముకొని ఒక ప్లేటులో విడిగా  తీసుకోవాలి .

దానిపై పసుపు వేసుకుని ఉంచుకోవాలి .

చింతపండు  విడదీసుకుని కొద్దిగా  నీళ్ళతో తడుపుకుని ఉంచుకోవాలి.

స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు వేయించుకోవాలి .

పోపు చల్లారగానే  ముందుగా  మిక్సీ లో  వేయించిన  ఎండుమిరపకాయలు , ఉప్పు  వేసి మెత్తగా  వేసుకోవాలి.

తర్వాత  చింతపండు , మిగిలిన పోపు మిక్సీలో వేసి మెత్తగా   వేసుకోవాలి .

తర్వాత  తురిమి ఉంచుకున్న  చిలకడ దుంపల  తురుము అందులో వేసి నాలుగు  మూలలా కలిసే విధముగా  స్పూనుతో కలిపి , వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

చిలకడ దుంపలో తీపి స్వతహాగా  ఉంటుంది  కనుక వేరేగా తీపి అవసరం లేదు.

తురుమకుండా  చిన్న చిన్న ముక్కలుగా  తరుగుకొని పై విధముగా  పోపు వేసుకుని  మిక్సీ లో  మెత్తగా  వేసుకుని కూడా చేసుకొనవచ్చును .

పచ్చిమిరపకాయలు , కొత్తిమీర   వేయనవసరం లేదు .

అంతే ఎంతో రుచిగా  ఉండే చిలకడ దుంపల  పచ్చడి భోజనము  లోనికి  సర్వింగ్  కు సిద్ధం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి