Wednesday, May 27, 2020

టమోటా పులుసు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్త వెరైటీగా.

టమోటో  పులుసు పచ్చడి.
కావలసినవి .

పండి  గట్టిగా  ఉన్న టమోటోలు  -   3
ఉల్లిపాయలు -  3
పచ్చిమిర్చి  -   6
కొత్తిమీర   -  ఒక చిన్న కట్ట 
పసుపు  --  కొద్దిగా .

చింతపండు  -  నిమ్మకాయంత
ఉప్పు  -  తగినంత .

పోపుకు .

నూనె  -  నాలుగు  స్పూన్లు .
ఎండుమిర్చి  -   3 .  ముక్కలుగా  చేసుకోవాలి.
చాయమినపప్పు  - స్పూను .
జీలకర్ర  -  పావు స్పూను.
ఆవాలు -  అర  స్పూను 
ఇంగువ  -  కొద్దిగా 
కరివేపాకు  -  రెండు రెమ్మలు. 

తయారీ విధానము .

ముందుగా  చింతపండు  విడదీసి  శుభ్రం చేసుకుని  పావు గ్లాసు వేడి  నీళ్ళల్లో   పావు గంట సేపు  నాన బెట్టుకుని  చిక్కగా  రసం తీసుకోవాలి .

కొత్తిమీర   విడదీసి  శుభ్రం  చేసుకోవాలి.

ఉల్లిపాయలు  సన్నని  ముక్కలుగా  తరుగుకుని  విడిగా  వేరే ప్లేటులో  ఉంచుకోవాలి.

టమోటోలు  ముక్కలుగా  తరుగుకోవాలి. 

ఇప్పుడు  మిక్సీ లో  టమోటో  ముక్కలు , కొత్తిమీర , పచ్చిమిర్చి  , చింతపండు  రసము  మరియు కొద్దిగా  ఉప్పు వేసి  మెత్తగా  గ్రేవి  మాదిరిగా  వేసుకోవాలి .

విడిగా  ఒక  గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనె   వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర ,  ఆవాలు , ఇంగువ మరియు  కరివేపాకు ను  వేసి  పోపును  బాగా  వేగనివ్వాలి .

అందులోనే  తరిగిన  ఉల్లిపాయ  ముక్కలు , కొద్దిగా  పసుపు  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మూత పెట్టి  పది నిముషాలు  ఉల్లిపాయలను  మగ్గనివ్వాలి. 

ఉల్లిపాయలు  మగ్గగానే  ముందుగా  సిద్ధం  చేసుకున్న  గ్రేవి  మిశ్రమమును కూడా  వేసి  గరిటెతో  బాగా  కలిపి  మూత  పెట్టి  మరో  పది నిముషాలు  ఉల్లిపాయ  ముక్కలతో  టమోటో  గ్రేవిని  ఉడకనివ్వాలి .

తరువాత  వేరే డిష్  లోకి  తీసుకుని పైన కొత్తిమీర  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  టమోటో  పులుసు పచ్చడి  భోజనము లోకి, చపాతీలు  రోటీల లోకి  సర్వింగ్  కు సిద్ధం .

ఈ పులుసు పచ్చడిలో  విడిగా  ఎండుకారం వేయనవసరం లేదు.

పచ్చిమిర్చి  టమోటో  కొత్తిమీర లతో  మిక్సీ  వేసుకున్నాము  కనుక  ఆ కారం సరిపోతుంది.

బెల్లం  కూడా  వేయనవసరం లేదు.

ఈ టమోటో  పులుసు పచ్చడి   మూడు రోజులు  నిల్వ ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది .

అతిథులొచ్చినప్పుడు

అతిథులను  భోజనానికి  మన ఇంటికి ఆహ్వానించినప్పుడు .

ఆలూరుకృష్ణప్రసాదు .

మనందరి  ఇళ్ళల్లో  తరచుగా అతిథులను మన ఇంటికి భోజనానికి  ఆహ్వానించడమనేది  మనందరికీ తరచుగా జరుగుతూనే ఉంటుంది .

Weekends లో సరదాగా  వారింటికి  వీరు  లేదా  వీరింటికి  వారు  families తో  విందు భోజనాలకి  వెళ్ళడమనేది  మామూలే.

ఆ సమయంలో  ఇంటి  ఇల్లాళ్ళకు ప్రధానమైన సమస్య ఏ ఏ పదార్ధాలు తయారు చెయ్యాలి ? 

మనం చేసిన పదార్ధాలు  వారికి  నచ్చుతాయో లేదో ? 

వారు  తింటారో  లేదో ?  అని.

ఇంకా  కొంచెం  మొహమాటం లేకుండా  చెప్పాలంటే   వచ్చే వారి  కులమును బట్టి కూడా పదార్ధాలు  మరియు  వాటిని  తయారు చేయు విధానము కూడా  మారుతుంటాయి.

అయితే  మనవి ప్రధానంగా శాఖాహార భోజన సంఘ సభ్యుల గ్రూపులు కనుక , మనమంతా  శాఖాహారుల  పదార్థములు  గురించి మాత్రమే  ఇక్కడ  ప్రస్తావించడం జరుగుతుంది .

ప్రధానంగా ఈ విందు భోజనాలు  రెండు రకాలు.

మధ్యాహ్నం  విందు  LUNCH.

రాత్రి  విందు  DINNER.

షుమారు  15  మంది లోపు Guest ల కైతే , ఆ ఇంటి ఇల్లాలు  ఆరేడు  ఐటమ్స్  అవలీలగా  వండేస్తారు.

ఏదైనా  ప్రధానంగా  functions  సమయంలో , వచ్చే అతిథులు 25 సంఖ్య దాటినా , వంట మనిషిని పెట్టుకుని చేయించుకోవడం కానీ  లేదా క్యాటరింగ్  ఇవ్వడం  కాని  తప్పని సరి.

మధ్యాహ్నం  భోజనం Lunch కు , రాత్రి  భోజనం  Dinner కు  ఐటమ్స్   మారుతుంటాయి.

లోగడ నన్ను ఐదారుగురు , " రేపు  మా అబ్బాయి పుట్టినరోజు  లేదా మా అమ్మాయి  function ,  ఒక పాతిక మందికి ఏ ఏ ఐటమ్స్ వండితే బాగుంటుందో చెప్పండి  " అని  అడిగారు.

అప్పుడు నాకున్న అవగాహన మేరకు వారికి   ఐటమ్స్  చెప్పాను.

అయితే అచ్చంగా  మన తెలుగింటి  భోజనము  వండి  తృప్తిగా  వచ్చిన అతిధులకు పెట్టాలనుకునే వారికి  మాత్రమే,   నేను ఈ దిగువున  అతిథులను మన ఇంటికి ఆహ్వానించి నప్పుడు ఏ ఏ పదార్ధములు తయారు చేస్తే బాగుంటుందో తెలియచేస్తున్నాను .

మీకు సంతృప్తిగా  నచ్చితేనే  ఇందులో కొన్ని  ఐటమ్స్  అయినా  చేసి పెట్టండి.

ఆ ఇందంతా trash , ఈ రోజుల్లో  ఇవి ఎవడు తింటాడు ? పళ్ళాలు విసిరేస్తారు.
విస్తళ్ళముందు నించి  లేచి పోతారు . మా పిల్లలకు పిలిచే అతిధులకు Northern Dishes కావాలి అనే వాళ్ళు , కామెంట్  చేసే వాళ్ళకు  ఒకటే నా సవినయ విజ్ఞప్తి .

" అయ్యా / అమ్మా .

ఈ పోస్టింగు  మీ కొరకు  కాదు.
మాలాంటి ఛాందస భావాలు కలిగిన పాత తరం వారికి .  మీ వంటి ఆధునిక భావాలు కలవారు దయచేసి ఈ పోస్టింగు  చదవవద్దు. ఒకవేళ చదివినా  మీరు పట్టించుకోవద్దు. దయచేసి ఏ విధమైన  negative Comment చేయవద్దు. మీకు తోచిన పద్ధతిలోనే మీరు సాగిపోండి . "

ఇంక అసలు విషయానికి  వద్దాము.

అతిథులను భోజనానికి  పిలిచినప్పుడు మీ ఇంట్లో ఐటమ్స్  లో వెల్లుల్లి  వాడే అలవాటు ఉన్నా మీరు ఆ రోజు వంటల్లో వెల్లుల్లి  వేయకండి. ఎందుకంటే  వెల్లుల్లి  అసలు తినని వారు చాలా మంది ఉంటున్నారు. అటువంటి వారు ఆ ఐటమ్ వేసుకోరు. తెలియక మనం చేసి వారికి  వడ్డించినా  వారు తినకుండా పారేస్తారు. పదార్ధం వృధా అవడమే గాక వారికి మనకి అసంతృప్తి .

సాధ్యమయినంత వరకు  పెద్ద ఉల్లి పాయను కూడా పదార్ధాలలో ఆ రోజు వాడకుండా ఉంటే మంచిది . చాలా మంది గురువారము , శనివారము పెద్ద ఉల్లిపాయ తినరు. ఈ మధ్య కొంతమంది   " మేము  అసలు  ఉల్లిపాయ  తినము , ఉల్లిపాయలు  వేయని  ఐటమ్స్  చెప్పండి ". అని  అంటున్నారు .

వెజిటబుల్  బిర్యానీ వంటి మసాలా పదార్ధాన్ని చేసే కన్నా , చింతపండు  పులిహోర కానీ  నిమ్మకాయ పులిహోర కానీ లేదా మామిడి  కాయ తురుముతో పులిహోర కానీ  చక్కగా  జీడిపప్పులు  మరియు వేరుశనగ  గుళ్ళు  వేసుకుని , ఒక ఐటమ్ గా చేసుకుంటే బాగుంటుంది.
మరో ఐటమ్ గా గారెలు వంటి Heavy ఐటమ్ కంటే  అరటికాయతో బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది.

స్వీట్  చేయాలనుకుంటే  సేమియా , సగ్గు బియ్యం  కలిపి పాయసం చేసుకుంటే బాగుంటుంది.

పిండి వంటలు ఇంతవరకు  చాలు.

గారెలు , పూర్ణం బూరెలు , సజ్జప్పాలు  ఇటువంటివి ఏవైనా ప్రత్యేక సందర్భాలలో  మాత్రమే వడ్డనకు బాగుంటాయి. 

విడి రోజుల్లో  ఇంతకన్నా అవసరం లేదు.

ఇంక అతిధులు Lunch కు వచ్చే పక్షంలో
మధ్యాహ్నము  భోజనానికి .

1. దోసకాయ పప్పు లేదా టమోటో  పప్పు లేదా మామిడి  కాయ పప్పు ( ఈ మూడింటిలో  పెద్ద ఉల్లిపాయ వేయకుండా )  ఒక ఐటమ్  వండు కోవచ్చును.

సాధారణంగా  functions  లో  ముద్దపప్పు వండరు. కలగలపు పప్పు మాత్రమే వండుతారు.

ఈ  మూడు పప్పులలో ఎది  వండినా  ఊర మిరపకాయలు  మరియు గుమ్మడి వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది.

2. ఇంక కూర విషయానికి వస్తే నూటికి  80 శాతం మంది  ఏ functions  లో అయినా  మొట్టమొదటగా ఇష్టపడేది  వంకాయ కూర. తర్వాత దొండకాయ కూర. మూడో పక్షం బెండకాయ కూర.

వంకాయలు పుచ్చులు లేకుండా కాయలు లేతగా ఉంటే , ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర మరియు ఇంగువ వేసుకుని  నూనెలో వేయించి  తగినంత  ఉప్పువేసుకుని పొడి కొట్టుకుని కాయలలో కూరుకుని నూనెలో మగ్గపెట్టుకుని కూర చేసుకుంటే , ఈ వంకాయ కాయల పళంగా కూర అందరూ ఇష్ట పడతారు. ఇది అందరూ మెచ్చుకునే కూర.

కాని పక్షంలో  దొండకాయ చీలికలుగా తరిగి ఎండుమిరపకాయలు , మినపప్పు , పచ్చిశనగపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకును నూనెలో వేసుకుని  ముక్కలను మగ్గపెట్టి చివరలో తగినంత ఉప్పు కారం వేసుకుని  పోపు కూర చేసుకోవచ్చును. ఈ కూర కూడా  చాలా మంది ఇష్ట పడతారు.

చివరగా బెండకాయ జిగురు అని చాలా మంది పోపు కూర ఇష్టపడరు. పై రెండు వీలుకాని పక్షంలో బెండకాయ ముక్కలు తరిగి  నూనెలో  fry చేసి పావు చిప్ప ఎండుకొబ్బరి కోరాముతో కోరి  అందులో వేసి , ఒక పదిహేను జీడిపప్పు  పలుకులు వేసి , ఉప్పు కారం చల్లుకుంటే  కూర కలర్ ఫుల్ గా కనపడటమే కాకుండా  రుచిగా  కూడా ఉంటుంది .

ఇంక అతిధులను భోజనానికి  పిలిచినప్పుడు సాధారణంగా  ఆకు కూరలతో పప్పు , మరియు కాకరకాయ , క్యాబేజీ , క్యాలీఫ్లవర్ వంటివి  వండరు. ఆ కూరలు వారికి ఇష్టమో కాదో తెలియనప్పుడు అవి  చేయకపోవడమే మంచిది.

3. పచ్చడులు.

దోసకాయ ముక్కలుగా తరిగి కొత్తిమీర  వేసుకుని ముక్కల పచ్చడి చేసుకుంటే బాగుంటుంది.
 
లేదా

మామిడి కాయ  ముక్కలతో మెంతి బద్దలు వేసుకుని  మామిడి  కాయ ముక్కల పచ్చడి బాగుంటుంది.

లేదా 

కొబ్బరి పచ్చడి కాని  కొబ్బరి మామిడి కాయ పచ్చడి కాని  చేసుకున్నా బాగుంటుంది .

లేదా

గోంగూర  అకు -  ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు , ఇంగువ నూనెలో వేసి గోంగూర ఆకు మరియు కొద్దిగా  పసుపు వేసి మగ్గబెట్టి , తగినంత ఉప్పు వేసి పచ్చడి చేసుకొనవచ్చును .

ఈ పచ్చడి కూడా  పుల్ల పుల్లగా ఉంటుంది కనుక అతిధులకు  నచ్చుతుంది.

ఇంక ఈ వేసవికాలం ఆవకాయల సీజన్ లో  కొత్తావకాయ  మరియు  నోరూరించే  మాగాయ వంటివి  విడిగా  bowl లో తీసి పెడితే  ఇంక చెప్పే దేముంది ?

4.  లిక్విడ్ ఐటమ్ .

అతిధులు  వచ్చినప్పుడు చారు కన్నా ముక్కల పులుసు వండితేనే  బాగుంటుంది. చింతపండు  రసములో అన్ని ముక్కలు వేసి తగినంత ఉప్పు పసుపు వేసి ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , ధనియాలు , కొంచెం  మెంతులు , కొంచెం  జీలకర్ర  , ఎండు కొబ్బరి , ఇంగువ వేసుకుని నూనెలో వేయించి  పొడి కొట్టుకుని ఆ పొడి మరుగుతున్న పులుసులో వేసుకుని  పులుసు పెట్టుకుంటే ఆ పులుసు రుచే వేరు.

5. అతిథులు వచ్చినప్పుడు  మజ్జిగ  కన్నా పెరుగు బాగుంటుంది. ఈ వేసవికాలం పెరుగు  అన్నంలో తయారైన బంగినపల్లి మామిడి పండు ముక్కలు కోసి అతిధులకు వడ్డిస్తే విందుకు శోభ వస్తుంది.

6. తాంబూలము లేదా కిళ్ళీలు గా చుట్టి ఇస్తే అతిధులు సంతోషిస్తారు.

7.  నేను చెప్పినది  మధ్యాహ్నం  భోజనం  Lunch  లో items ఏం చేస్తే బాగుంటుందో సూచనా ప్రాయంగా నా సలహా మాత్రమే. 

8. రాత్రి  Dinner కు అతిథులను ఆహ్వానిస్తే menu కొద్దిగా  మారుతుంది . ఈ పోస్టింగు  మీకు నచ్చితే  త్వరలో Dinner items ఏమి చేయాలో కూడా తెలియచేస్తాను.

9.  కమ్మని  నెయ్యి తో  పైన  తెలిపిన  పదార్ధాలను  వడ్డించారా !!  ఇక  అతిధులు  తృప్తిగా  భోజనము  చేసి  " అన్నదాతా  సుఖీభవ !!  " అని  అనకుండా  ఉంటారా చెప్పండి.

10.  చివరగా  " తాళము వేసితిని  గొళ్ళెము మరచితిని " అనే సామెత చెప్పినట్లు  మల్లెపూవు లాంటి  వేడి వేడి అన్నం వండటం మాత్రం  మరచి పోకండి.

చివరగా  అతిథులను  భోజనానికి  ఆహ్వానించే వారికి  నా  విజ్ఞప్తి. " గంగి గోవు పాలు  గరిటెడైనను  చాలు  కడివెడైన  నేమి  ఖరము  పాలు  "  అన్నట్లుగా   మీరు వడ్డించే  పదార్ధాలు  తక్కువ  ఐటమ్స్  ఐనా  మీరు  ఆప్యాయంగా  నవ్వుతూ  వడ్డిస్తే  భుజించే  వారు  బ్రహ్మానందపడిపోతారు.

మహిళలందరికీ  కృతజ్ఞతాపూర్వకధన్యవాదములు.
ఆలూరుకృష్ణప్రసాదు .
కారణం వండే శ్రమంతా  మీదే కనుక.

తిరుమల స్వామి వారి వడలు



మిత్రులందరికీ   ఓ  ప్రత్యేకమైన  ప్రసాదము.

తిరుమల  స్వామి  వారి వడలు.
ఆలూరుకృష్ణప్రసాదు .

తిరుమల  స్వామి  దర్శనానికి  వెడుతున్నామనగానే , మిత్రులందరూ  " చాలా  సంతోషమండీ . మీరు  తిరిగి  వచ్చేటప్పుడు  మాకు  రెండు  లడ్డూలు  తెచ్చి పెట్టండి . మీరు  రాగానే  మీకు  నేను  డబ్బులు  ఇస్తాను " . అంటారు.

అక్కడ  మనకే  మనం చేయించుకునే  సేవలు  లేక  దర్శనం  టిక్కెట్  ధరలను  బట్టి  మనకు  ఒకటి  లేదా  రెండు  లడ్డూలు  ఇస్తారు. అవి  మనకు  మన బంధువులకు  ప్రసాదం పంచడానికే  సరిపోతాయి. అదీ  దర్శనం చేసుకున్నాక  గంట సేపు లడ్డూల ప్రత్యేక  క్యూలో నిలబడితే  ఆ రెండూ లడ్డూలయినా  మనకు  దక్కుతాయి.

ఇక మోహమాటస్తులకు  ఎక్కడినుండి  తెస్తాము ?

విచిత్రం  ఏమిటంటే  అన్య మతస్ధుడైన  నా స్నేహితునితో  " రేపు  మా దంపతులిరువురమూ  తిరుపతి  స్వామి వారి దర్శనానికి  వెడుతున్నామని " చెబితే  తన పర్సులో నుండి  రూ. 200 /   తీసి "  బాసూ !  మా పిల్లలిద్దరికీ  మీ  తిరుపతి  లడ్డూలంటే  చాలా  ఇష్టం . నాకో నాలుగు  లడ్డూలు  తెచ్చి పెట్టవా ?  "  అంటూ నోటు ఇవ్వబోయాడు.

 తిరుమలేమైనా  స్వీట్స్  షాపా  ?ప్రసాదంగా కాకుండా  ఫలహారంగా  తినడానికి  అని  మనసులోనే  నేను అనుకుని  " డబ్బులు  తీసుకు వచ్చాక తీసుకుంటాను. ఇప్పుడు  వద్దులే " అని  తిరస్కరించాను.  అతను అలా అడగడం  నాకు  మనస్కరించక అతనికి  లడ్డూలు తేలేదు. తిరిగి వచ్చాక ఏదో  సర్ధి  చెప్పాను.

మనం  తేకపోతే  తెమ్మన్న వారు  మొహం మాడ్చుకుంటారు. పాపం  వారికే  తెచ్చుకోవడం  కష్టం కదా అని కూడా  ఆలోచించరు.  మీకు తెచ్చి పెట్టడం మాకు  కష్టమని  వారి మొహాన  మనం చెప్పలేము.

అందుకని  పాపమో  పుణ్యమో  ఎవ్వరికీ  చెప్పకుండా  గుట్టు చప్పుడు కాకుండా  తిరుమల వెళ్ళి  తలనీలాలు  ఇచ్చి ( తిరుమల  వెళ్ళిన  ప్రతి సారీ  తల నీలాలు  సమర్పించే ఆ జన్మ మొక్కు నాకు  ఉంది  ) స్వామి దర్శనం చేసుకుని , మా టిక్కెట్  కు వచ్చిన  లడ్డూ  ప్రసాదాలు  తీసుకుని  , తిరిగి వచ్చాక  మా  అపార్ట్ మెంట్ లో  వారికి , లోకల్ గా ఉన్న బంధుమిత్రులకు  స్వామి  ప్రసాదం  పంచడం  అలవాటు  చేసుకున్నాం. 

ఇంక  వెనుకటి  రోజుల్లో   లడ్డూలతో  పాటుగా  స్వామి  వారి  వడల  ప్రసాదం కూడా  విక్రయించేవారు. 

స్వామి  వారి  లడ్డూల కెంత  డిమాండ్  ఉండేదో , స్వామి  వారి  వడలకు  కూడా ఆ రోజుల్లో   అంతే  డిమాండ్  ఉండేది. ఆ మాటకొస్తే  వడలు  ఇష్ట పడే వారు  ఇప్పటికీ  వేల సంఖ్యలో ఉన్నారు . లడ్డూలతో  పాటు  వడలు కూడా  స్వచ్ఛమైన  ఆవు  నెయ్యితో చేస్తారు కనుక అదియును గాక స్వామి  వారి  ప్రసాదమే  మధురాతి  మధురం కనుక  ఈ వడలు కూడా  అద్భుతమైన  రుచిగా  ఉండేవి.

కాలక్రమేణా  తిరుమలలో  వడలు  విక్రయం  తీసేసారు. స్వామి వారికి   కళ్యాణోత్సవము  మరియు  ఇతర సేవలు  చేయించుకునే  వారికి  ఒకటి  లేదా  రెండు  వడలు  ఇస్తున్నారు. 

అయితే  స్వామి  వారి  వడలు మనం స్వయముగా  మన ఇంట్లోనే   తయారు చేసుకొనవచ్చును .

ఆ వేంకటేశ్వర స్వామి వారికి  నివేదించిన  తర్వాత  వడలను  మనము  ప్రసాదముగా  స్వీకరించవచ్చును.

తిరుమల  వడల  తయారీ  విధానము.
***************************

ఓ  పావు కిలో  మినుములు  తగినన్ని  నీళ్ళు  పోసుకుని  ముందు రోజు  రాత్రి  బాగా  నాన బెట్టుకోవాలి.

మరుసటి  రోజు  నీళ్ళు  వడకట్టుకుని  గ్రైండర్ లో  నానబెట్టిన  మినుములు పొట్టుతోనే   వేసుకుని  నీళ్ళు  పొయ్యకుండా చేతితో కొద్దిగా  చిలకరించుకుని   పిండిని  మరీ  మెత్తగా  కాకుండా  గ్రైండ్  చేసుకోవాలి.

గ్రైండ్  చేసిన  పిండిని  ఓ గిన్నెలోకి  తీసుకోవాలి.

ఇప్పుడు  మిక్సీలో  స్పూనున్నర  మిరియాలు , స్పూను  జీలకర్ర , చిన్న అల్లం  ముక్క , పావు స్పూనులో సగం  ఇంగువను మరియు తగినంత  ఉప్పును వేసుకుని పొడిని మరీ  మెత్తగా  కాకుండా  కొంచెం  కచ్చాపచ్చాగా  మిక్సీ వేసుకోవాలి.

ఈ  పొడిని  గిన్నెలో  సిద్ధంగా  ఉంచుకున్న  పిండిలో  వేసుకుని చేతితో  బాగా  కలుపుకోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  పావు కిలో  నూనె  లేదా  నెయ్యి పోసుకుని  బాగా  కాగనివ్వాలి.

ఈ లోపుగా  ఓ మైనపు  షీట్ ను  తీసుకుని ,  గట్టుపైన పరచుకుని పిండిని చేతితో  పెద్ద ఉండలుగా  చేసుకుని  షీట్  పైన  పెట్టి  బొబ్బట్లు  మాదిరిగా  పెద్ద సైజులో చేతితో  పల్చగా  వత్తుకోవాలి. ఇలా  నూనెలో  వేసేటప్పుడు  మిగిలినవి  కూడా  ఒక్కొక్కటి వత్తుకోవాలి.

బాగా కాగిన  నూనె  లేదా నెయ్యిలో  ఒక్కొక్క వడను  వేసుకుని  రెండు వైపులా  ఎర్రగా  వేయించుకోవాలి. ఇదే పద్ధతిలో  మిగిలిన  వడలు  కూడా  వేయించుకోవాలి.

స్వామి  వారికి  నివేదించిన తర్వాత  వడల ప్రసాదము  స్వీకరించవచ్చును.

మినుములు  నానబోసి పొట్టుతోనే  తయారు  చేస్తాము కనుక  పోషక  విలువలు  కలిగిన , మంచి  బలవర్ధకమైన  వంటకము  ఈ వడలు.

ఎప్పుడైనా  అల్పాహారముగా అప్పటికప్పుడు  వేడి  వేడిగా  వేసుకుని  తింటే  చాలా  రుచిగా  ఉంటాయి.

మరుసటి  రోజుకు  శ్రీ వారి  వడల లానే  కొద్దిగా  పళ్ళకు పని చెబుతాయి.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు  చేసిన విధానము   మరియు  ఫోటో  మేము  వడలు  తయారు చేసిన సమయమున  తీసినది.

Tuesday, May 12, 2020

వేరు శనగపప్పు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వేరు శనగ పప్పు పచ్చడి.

(  పల్లీ  పచ్చడి.  )

తయారీ విధానము .

ఒక  50 గ్రాములు  వేరు శనగపప్పు  బాండీలో  నూనె లేకుండా  వేయించుకుని    చల్లారగానే  పై పొట్టు  తీసేసుకోవాలి.

తిరిగి  స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని  నూనె కాగగానే  నాలుగు ఎండుమిరపకాయలు , మూడు స్పూన్లు  పచ్చిశనగపప్పు  వేసుకుని  పోపు  దోరగా వేయించుకోవాలి.

ఆ పోపులోనే  వేయించిన వేరు శనగ గుళ్ళు , ఆరు  పచ్చి మిరపకాయలు , మరియు  కొద్దిగా  పసుపును  వేసుకుని ఒక  అయిదు  నిముషాలు  పాటు  వేయించు కోవాలి .

చిన్న నిమ్మకాయంత  చింతపండు   కొద్దిగా  నీటిలో  తడుపుకుని  ఉంచుకోవాలి.

ఇప్పుడు మిక్సీ లో  వేయించిన  పోపు  మొత్తము , తడిపిన  చింతపండు మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని  కొద్దిగా  నీళ్ళు  పోసుకుని పచ్చడి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  పచ్చడిని  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  పోపు గరిటె  పెట్టుకుని  రెండు  స్పూన్లు  నెయ్యి  వేసుకుని , నెయ్యి  బాగా కాగగానే  రెండు  ఎండుమిరపకాయలు  ముక్కలుగా తుంచి , ముప్పావు  స్పూను  చాయమినపప్పు , అర స్పూను ఆవాలు , కొద్దిగా  ఇంగువ  మరియు రెండు రెమ్మలు  కరివేపాకును  వేసి  పోపు  వేయించుకుని ,  ఆ పోపును  పల్లీ  పచ్చడిలో  కలుపుకోవాలి.

ఇడ్లీ , దోశెలు , గారెలు  లోకి  చేసుకునే  కొబ్బరి పచ్చడి , వేరుశనగ గుళ్ళు  పచ్చళ్ళల్లో  నూనె తో పోపు  వేసే కన్నా  నేతితో  పోపు  వేస్తేనే  పచ్చడి  చాలా  రుచిగా  ఉంటుంది.

అంతే .  ఎంతో  రుచిగా ఉండే పల్లీ  పచ్చడి ఇడ్లీ, దోశెలు  మరియు  భోజనము  లోకి  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు విధానము  మరియు  ఫోటో  తయారు  చేయు  సమయమున  తీసినది .

పల్లీ పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పల్లీ పొడి  .  (  వేరుశనగ  పొడి. )

కావలసినవి . 

పల్లీలు  --  150 గ్రాములు .

షాపుల్లో  వేయించిన  పల్లీ  గింజలు  విడిగా  అమ్ముతారు .

ఆ పల్లీలు  తెచ్చుకుని  పై పొట్టు తీసేసుకోవాలి .

ఒక వేళ  దొరకని  పక్షంలో  పచ్చి వేరుశనగ  గుళ్ళు  తెచ్చుకుని , బాండీలో  నూనె  వేయకుండా  వేయించుకోవాలి.

చల్లారగానే  పై పొట్టు  తీసేసు కోవాలి.

ఎండుమిరపకాయలు  - 12 .

పచ్చిశనగపప్పు  -  రెండు స్పూన్లు .

చాయమినపప్పు  -  రెండు స్పూన్లు .

ధనియాలు  -  మూడు  స్పూన్లు .

నువ్వుపప్పు  -  మూడు  స్పూన్లు .

ఎండు కొబ్బరి  ముక్కలు -  పావు కప్పు.

జీలకర్ర  -- స్పూను.  

ఉప్పు  -- తగినంత 

నూనె   -- నాలుగు  స్పూన్లు 

కరివేపాకు  -  ఐదు రెమ్మలు .

తయారీ విధానము .

స్టౌ  మీద  బాండీ పెట్టి  మొత్తము నాలుగు స్పూన్లు  నూనెను  వేసుకుని , నూనె  బాగా కాగగానే వరుసగా పై పొట్టు తీసిన  వేరుశనగ గుళ్ళు ,  పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఎండుమిరపకాయలు , ధనియాలు , జీలకర్ర , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి  ముక్కలు మరియు కరివేపాకును  వేసుకుని  కమ్మని  వాసన వచ్చే వరకు వేయించు కోవాలి.

చల్లారగానే మిక్సీ లో వేసుకుని  అందులో  తగినంత  ఉప్పును  వేసి  మెత్తని  పొడిగా  చేసుకోవాలి.

ఈ పొడిని  వేరే  సీసాలో  భద్రపరుచుకోవాలి.

ఈ  పొడి  ఇడ్లీ , దోశేలు, చపాతీలు , భోజనములోకి ,  మరియు  వేపుడు  కూరలలోకి  కూడా  చాలా  రుచిగా  ఉంటుంది .

ఇష్టమైన  వారు  ఎనిమిది  వెల్లుల్లి  రెబ్బలు  పై పొట్టును  తీయకుండా  పొడిలో  వేసుకుని మిక్సీ  వేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన రెసిపీ మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.

పులుసు పొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

పులుసు పొడి.

కావలసినవి.

ఎండుమిరపకాయలు  - 15
పచ్చిశనగపప్పు  -  30 గ్రాములు.
చాయ మినపప్పు  - 20 గ్రాములు.
ధనియాలు -  పావు కప్పు
మెంతులు  -  రెండు స్పూన్లు 
ఎండు కొబ్బరి -  అర చిప్ప.
చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి.
ఇంగువ  -  పావు  స్పూను.
నూనె  -  నాలుగు  స్పూన్లు .

తయారీ  విధానము.

స్టౌ  మీద బాండీ పెట్టి  మొత్తము  నూనెను  వేసుకుని , నూనెను  బాగా కాగనివ్వాలి.

నూనె బాగా కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు , 
ఇంగువను  వేసుకుని  కమ్మని  వాసన  వచ్చే వరకు  వేయించుకోవాలి.

పోపు  వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా  పోపులో వేసి  కొబ్బరి  ముక్కలను  దోరగా  వేయించుకోవాలి.

పోపు  చల్లారగానే  మిక్సీ  లో  మెత్తని  పొడిగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  ఈ పొడిని  ఒక  సీసాలోకి  తీసుకోవాలి .

ఈ  పులుసు పొడి , పులుసు లోని  ముక్కలన్నీ బాగా  ఉడికి  పులుసు  బాగా  తెర్లుతున్నప్పుడు  రెండు స్పూన్లు  ఈ పులుసు  పొడిని  పులుసులో వేసుకుని , పులుసును  మరో ఐదు నిముషాలు  తెర్లనిచ్చి  దింపు కోవాలి.

ఈ కొలతలతో పులుసు పొడి కొట్టుకుంటే  పది సార్లకు  పైగా  వస్తుంది. మూడు నెలలు  పైగా  నిల్వ ఉంటుంది .

పొడి కొట్టగానే  సీసా  ఫ్రిజ్ లో పెట్టుకుని , కావలసినప్పుడు  పొడి  ఫ్రిజ్ లో నుండి  తీసుకుని , తిరిగి సీసాను  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  ఈ పొడితో పెట్టిన  ముక్కల పులుసు ,   ఫ్రెష్ గా  సువాసనలతో అప్పటికప్పుడు  కొట్టిన పొడితో  పెట్టిన పులుసులా తాజాగా  ఉంటుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో   తయారుచేయు  సమయమున  తీసినది.

ఇది  సాంబారు  పొడి  కాదు. సాంబారు  పొడి తయారీ విధానము  వేరు.

ఇందులో  ఉప్పు  వేయరు.
సరిపడా  ఉప్పును  పులుసులోనే  వేసుకోవాలి.

మెంతికాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

మెంతికాయ.  (  మెంతి  ఆవకాయ  )

ఏడాది  నిల్వ  ఊరగాయ .

కావలసినవి.

మామిడి కాయలు  -25.  కాయలు పుల్లగా, గట్టిగా మరియు  పీచుండాలి.

బాగా కడిగి  శుభ్రంగా  పొడి గుడ్డతో  తుడుచుకుని ఒక గంట సేపు  నీడన ఆరబెట్టి కాయల పైన  చెక్కుతీసుకుని , ఆవకాయకు ముక్కలు ఏ విధముగా  లోపలి  టెంకతో తరుగుతామో అదే విధముగా  తరుగుకోవాలి. 

ముక్కల లోపల  జీడి మరియు టెంక పైన పైపొరను  తీసి వేసుకోవాలి.

కొంతమంది పై  చెక్కుతో సహా  ముక్కలను  తరుగుతారు. ఆ విధముగా  ముక్కలు  తరిగినా  ఊరగాయ బాగానే  ఉంటుంది .

తర్వాత షుమారుగా  150  గ్రాములు  పట్టే  ఒక గ్లాసును  కొలతగా  పెట్టుకోండి.

ఆ గ్లాసు  కొలత  ప్రకారం ***

1/2 గ్లాసు - మెంతులు. షుమారు  75 గ్రాములు.
1 గ్లాసు - ఆవాలు. షుమారు 150 గ్రాములు.
4 గ్లాసుల కారం -  షుమారుగా 600 గ్రాములు.
మెత్తని ఉప్పు -  నాలుగు  గ్లాసులు. షుమారుగా - 600  గ్రాములు.
నూనె  -  A . S . Brand  పప్పు  నూనె  -
              ఒక  K. G.
ఇంగువ  -  మెత్తని  పొడి  స్పూనున్నర .

తయారీ  విధానము .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి  నూనె వేయకుండా  మెంతులు, ఆవాలు  విడివిడిగా  వేయించి చల్లారిన తర్వాత మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని  విడి విడిగా ఉంచుకోవాలి.

మెంతులు బాగా  కాఫీపొడి రంగు వచ్చే దాకా వేయించుకోవాలి.

మెంతులు  సరిగా  వేగక పోతే  ఊరగాయ  చేదు  వస్తుంది. 

తర్వాత ఒక  పెద్ద  పళ్ళెము లో మొత్తము   కారం  వేసుకుని , ఈ రెండూ అనగా ఆవపొడి  మరియు మెంతి పొడి కూడా  వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి.

అందులోనే  తరిగిన  మామిడి కాయ ముక్కలు , మొత్తము పసుపు , మొత్తము  ఉప్పు  మరియు రెండు గరిటెలు  కాచి  చల్లార్చిన  నూనెను  వేసుకుని  చేతితో  బాగా  కలుపుకోవాలి. 

ఈ  విధముగా  కలిపిన  ముక్కలను ఒక  జాడీలో  వేసుకుని  మూత పెట్టి  మూడు రోజులు  ఊర నివ్వాలి.

మూడు రోజుల తర్వాత  జాడీ లోని  ముక్కలను  చేతితో  బాగా  కలుపుకుని  ముక్కలను  ఊటను  జాడి లోనే  ఉంచి ,  ముక్కలను మాత్రము ఒక పళ్ళెము లో వేసుకుని  ఒక రోజంతా ముక్కలను బాగా  ఎండ బెట్టు కోవాలి.

ముక్కలు  ఎండిన  తర్వాత ***

స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన మొత్తము  నూనెను  పోసుకుని నూనెను  బాగా కాగనివ్వాలి.

నూనె బాగా కాగిన తర్వాత అందులో మొత్తము ఇంగువ వేసి నూనెను బాగా చల్లారనివ్వాలి.

నూనె  బాగా  చల్లారిన  తర్వాత ***

ఎండిన ముక్కలను మరియు జాడీలోని ఊటను  ఒక  పళ్ళెములో పోసుకుని చేతితో  బాగా కలుపుకుని అందులో  ఈ చల్లారిన  నూనెను  పోసుకుని  తిరిగి   చేతితో  బాగా కలుపుకుని  జాడీలో  పెట్టుకోవాలి.

మామిడికాయల సైజు మారుతూ ఉంటుంది కనుక, కలిపేటప్పుడు ముక్కల్ని బట్టి అవసరమైతే కాస్త గుండ మరియు  ఉప్పు తగ్గితే  మరి కాస్త ఉప్పు  చూసుకుని  వేసుకోవాలి.

అంతే. ఎంతో  రుచిగా  ఉండే  ఏడాది  ఊరగాయ  మెంతికాయ  (  మెంతి  ఆవకాయ )  సిద్ధం.

ఈ మెంతి ఆవకాయ  లో మెంతి పిండి కలుస్తుంది  కనుక  మామూలు ఆవకాయ  మాదిరిగా  వేడి చేయదని  పెద్దలు చెబుతారు.

సంబంధించిన  రెసిపీ  మేము  ఈ  ఊరగాయ  తయారు చేయు  విధానము  మరియు  ఫోటోలు  తయారు చేయు సమయమున  తీసినవి.
ఆలూరుకృష్ణప్రసాదు .
జత పరచిన  ఫోటోలు .

1.  పళ్ళెములో  ఎండిన  తర్వాత  మెంతికాయ  ముక్కలు.

2 . ముక్కలు  ఎండిన తర్వాత ఊట మరియు  కాచిన ఇంగువ  నూనె పోసి  కలిపిన  మెంతి  ఆవకాయ.

3. మెంతి ఆవకాయ  కలిపిన  తర్వాత  జాడీ లోకి  వెళ్ళబోతున్న  మెంతి ఆవకాయ  ఊరగాయ.

అప్పడాల ఉండలు

ఆలూరుకృష్ణప్రసాదు .

అప్పడాల  ఉండలు .
***************
అప్పడాల ఉండలు  మీలో  ఎంతమందికి  ఇష్టం ?

పెసర అప్పడాలు.
************

తయారీ  విధానము .

ఒక  అరకేజీ చాయ పెసర పప్పును  ఒక రోజు  ఎండలో  ఉంచండి.

వేయించవద్దు .

ఇలా  ఎండిన చాయపెసరపప్పును మిక్సీలో  వేసుకోవచ్చు  కానీ  పిండి  మరీ  మెత్తగా  ఉండదు.

అందువలన  పిండిమర  లో  మెత్తగా పిండి  పట్టించుకోండి.

ఆ పిండిని   ఒక  సీసాలో కాని  ప్లాస్టిక్  డబ్బాలో కాని   పోసుకుని   నిల్వ  ఉంచుకోండి .

మనకు  కావలసిన  మోతాదులో   అప్పటికప్పుడు తీసుకుని   అప్పడాల  పిండి  కలుపు కోవచ్చు.

అప్పడాల పిండిని  కలుపుకునే  విధానము.
************************

ముందుగా ఇంగువ  పొడిని   చాలా  కొంచెం  నీళ్ళల్లో  కలుపుకోండి .

అ విధంగా కలుపుకోవడం  వలన  అప్పడాల  పిండికి  ఇంగువ  వాసన  బాగా  పడ్తుంది .

కొంతమంది   పాల  ఇంగువ  వాడతారు .

అది  కూడా  బాగుంటుంది .

ఇప్పుడు  ఇంగువ  కలిపిన  నీళ్ళు , మెత్తని  పొడి కారం , తగినంత  ఉప్పు  పెసరపిండి లో వేసుకుని   కొద్ది  కొద్దిగా   నూనె  వేసుకుంటూ  పిండిని  గట్టిగా   కలుపుకోండి.

 ఇలా మెత్తగా  కలిపిన పిండిని రోటిలో  వేసి  పచ్చడి  బండతో  దంపుకోవాలి .

అప్పుడు  కలిపిన పిండి లో నూనె  బాగా  కలిసి పిండి  బాగా మృదువుగా   అవుతుంది .

అంతే  వేడి  వేడి  అన్నం లోకి  పెసర  అప్పడాల  పిండి  సిద్ధం .

మీకు అప్పడాలు  కావాలంటే .
********************
 పైన  తెలిపిన పద్ధతిలో పిండి  ఎక్కువగా కలుపుకుని  చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

తర్వాత  ఈ  ఉండలను  చపాతీ  పీటపై  పెట్టుకుని , అప్పడాల కర్రతో పూరీల మాదిరిగానే  గుండ్రంగా అప్పడాలు  వత్తుకోవాలి .

తర్వాత అలా వత్తిన  అప్పడాలను  ఇంట్లోనే  నీడలో  ఒక రోజు  ఆర బెట్టుకుంటే  చాలు .

ఎండలో  ఎండబెడితే  అప్పడాలు పెళుసుగా అయ్యి  విరిగిపోతాయి.

తర్వాత మనకు కావలసినప్పుడు అప్పడాలు  నూనెలో వేయించుకొనవచ్చును .  

ఇదే  విధంగా  మినపగుళ్ళు కూడా ఎండబెట్టి మరలో  పిండి   పట్టించుకుని  మినప  పిండితో తయారు చేసుకోవచ్చు .

కొంతమంది  అప్పడాలు  బాగా  వస్తాయని  మూడొంతులు  పెసరపిండి  ఒక  వంతు  మినపపిండిని  కలిపి  చేసుకుంటారు .

ఆ విధముగా  కూడా  అప్పడాలు  చేసుకుంటే  రుచిగా  ఉంటాయి.

ఈ  మధ్య  ఒకచోట  ఎండుమిరపకాయలు  నీళ్ళల్లో  నానబెట్టి  చాలా  కొంచెం   నీళ్ళతో  రోటిలో  రుబ్బి , పెసరపిండిలో  కలిపి  తయారు చేయడం కూడా  గమనించాను .

ఆ  విధముగా కూడా  రుచిగా  ఉంటాయి.

కొంతమంది  బాగా కారముగా అప్పడాలు ఉండాలని అనుకునే వారు సీమ మిరపకాయలు  అని  చిట్టి  మిరపకాయలు బజారులో అమ్ముతారు. అవి తీసుకుని  వచ్చి ఆ కారమును వేసి కాని , లేదా నానబెట్టి  రుబ్బి కాని అప్పడాల పిండిలో కలిపి తయారు చేస్తారు .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధిత  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో తయారుచేయు  సమయమున  తీసినది.

చలిమిడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చలిమిడి .
*******
ఆడపిల్లను  అత్తవారింటికి  పంపే  సందర్భాలలో ప్రతి సారీ  కన్నతల్లి , తన కూతురికి  చలిమిడి  పెట్టి  పంపిస్తారు.

అలాగే  తన  కూతురు  గర్భవతై   మూడవ నెల  రాగానే కన్న తల్లి  వియ్యాల వారి ఇంటికి  వెళ్ళి ,  దొంగ చలిమిడి  అని కూతురి  ఒడిలో  చలిమిడి పెడతారు .  ఎవ్వరికీ  తెలుపకుండా చలిమిడి  పెడతారు కనుక దొంగ చలిమిడి  అనే  పేరు  వచ్చింది.

అలాగే  కూతురుకు  ఏడవ నెల  లేదా  తొమ్మిదివ నెల రాగానే   సీమంతం  చేసే   సందర్భాలలో కూడా ఆడంబరంగా అందరు ముత్తైదువులనూ పేరంటానికి పిలిచి  అమ్మాయికి  మరియు  వచ్చిన ముత్తైదువులందరికీ  గాజులు తొడిగించి , చలిమిడి , నానబెట్టిన శనగలు , పసుపు , కుంకుమ , పువ్వులు , తమలపాకులు , పండ్లు  తాంబూలముగా పంచి  సీమంతం పేరంటం చేస్తారు.

అలాగే  తన కుమార్తెకు  అమ్మాయి కాని  లేదా  అబ్బాయి కాని  పుట్టాక  , మూడవ నెలలో కాని  లేదా  ఐదవ నెలలో  కాని తమ కూతురును  పుట్టిన  బిడ్డతో  సహా  తిరిగి  అత్తవారింటికి  పంపుతున్న సమయంలో   చొంగ  చక్కిలాలు  అంటారుఅవి తయారు చేసి ,  వాటితో  సహా  ఇచ్చి  పంపే  సందర్భంలో కూడా  చలిమిడి కూడా  తయారు చేసి అమ్మాయికి  ఇచ్చి  అత్త వారింటికి  పంపుతారు.

ఇలా  అన్ని  శుభ సందర్భాలలో   చలిమిడి  కూతురుకు  పెట్టి పంపడం అనేది తర తరాలుగా మన ఇళ్ళల్లో వస్తున్న సాంప్రదాయం .

ఇ లా చలిమిడి  పెట్టి  పంపడం తన బిడ్డకు కడుపు చలవే కాకుండా , ఇరు కుటుంబాలకు క్షేమకరం  అని  పెట్టి పంపుతారు .

 వివాహం  ఐన  తర్వాత ఆడపిల్ల  పుట్టింటికి  వచ్చిన  ప్రతి సారి  ఇలా   పుట్టింటి  వారు  చలిమిడి  పెట్టి  పంపడం  అనేది  చాలా మంది  ఇళ్ళల్లో  ఈనాటికీ  సాంప్రదాయంగా పాటిస్తున్నారు.

అసలు  ఆడపిల్లకు   ప్రతి  సందర్భంలో చలిమిడి  పెట్టి  అత్తారింటికి పంపడం  అనేది , కడుపు చలవ అంటారు.

అలా చలిమిడి  ఆడపిల్ల ఒడిలో పెట్టే  సందర్భాలలో  , చలిమిడి  ముందు రోజు  మధ్యాహ్నము  కల్లా  తయారు చేసి , ఆ రోజు రాత్రి  చలిమిడిని  పుట్టింట్లోనే  నిద్ర చేయించి  మరుసటి  రోజు  అమ్మాయి భోజనము చేసిన తర్వాత కొత్త చీర , గాజులు , పసుపు , కుంకుమ , పూలు , పండ్లతో సహా , అమ్మాయి నుదుటిన  కుంకుమను పెట్టి  చలిమిడితో సహా అమ్మాయి  ఒడిలో  పెడతారు.

అమ్మాయి  సంతోషంగా  పుట్టింటి నుండి  అత్తవారింటికి  వెడితే , ఇటు పుట్టింటి వారికి  , అటు  అత్తింటి  వారికి కూడా  ఆనందదాయకమే కదా.

అయితే  ఈ  చలిమిడి  చేసే  విధానము   చాలా  మందికి   తెలియదు .

అందువలన  పెద్దలను  సంప్రదించి   మీ  అందరికీ  చలిమిడి తయారు చేయు  విధానము నేను  వివరంగా  తెలియచేస్తున్నాను .

చలిమిడి  తయారు చేయు  విధానము .
***************************

కావలసినవి .

బియ్యము   --  ఒక  కె. జి .

బెల్లం   --   ముప్పావు  కిలో

గసగసాలు  --  రెండు  స్పూన్లు .

స్టౌ  మీద బాండి పెట్టి  స్పూను  నెయ్యి వేసుకుని నెయ్యి కాగగానే  గసగసాలు వేసుకుని  వేయించుకుని   విడిగా  తీసుకోవాలి .

గసగసాలు చలిమిడి లో వేయడానికి  ఇష్ట పడని వారు  గసగసాలు  వేయకుండా  చలిమిడి  తయారు  చేసుకొనవచ్చును .  శుభ సందర్భాలలో నువ్వుపప్పు వాడరు . అందువలన నువ్వుపప్పు  చలిమిడి లో  వేయరు.
   
ఎండు కొబ్బరి  --  ఒక చిప్ప.
  
చిన్న ముక్కలుగా  తరిగి స్టౌ మీద  బాండీ పెట్టి  రెండు  స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  తరిగిన  కొబ్బరి ముక్కలు   వేసుకుని  కమ్మని  వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన ముక్కలను  విడిగా ఒక  ప్లేటులో కి  తీసుకోవాలి.

లేదా  ఈ మధ్యన కొంతమంది  జీడిపప్పు ను కూడా  నేతిలో  వేయించి  వేసుకుంటున్నారు.  

ఆ విధముగా  ఎండు కొబ్బరి  ముక్కలతో పాటుగా  జీడిపప్పును కూడా  వేయించి  వేసుకొనవచ్చును .

ఇలా   గసగసాలు , ఎండు కొబ్బరి  ముక్కలు  మరియు  జీడిపప్పు  నేతిలో వేయించు కోవడం అనేది చలిమిడి తయారు చేయడానికి  ముందుగా  పాకం  పట్టే  సమయంలో   వేయించుకోవాలి .

వేరు శనగ గుళ్ళు చలిమిడి లో  వాడరు. 

యాలకులు  --  ఎనిమిది  యాలకులు  తీసుకుని  మెత్తని పొడిగా   చేసుకోవాలి . స్పూనున్నర  కొలతగా  తీసుకోవాలి .

తయారీ  విధానము .

ఒక  కె. జి . బియ్యము   తగినన్ని  నీళ్ళు పోసి  ముందు  రోజు  రాత్రి  నానబెట్టుకోవాలి .

కావలసినవి  సామగ్రి  అన్నీ  సిద్ధం  చేసుకున్నాక మరుసటి  రోజు   బియ్యము  వడకట్టి  పిండి  మరపెట్టించాలి .

మరపట్టించే  అవకాశము  లేని  వారు  మిక్సీ లో  వేసుకొనవచ్చు. 

పిండి  తడిగా  ఉన్నప్పుడు  బాగా  నొక్కి  పట్టి  ఉంచాలి .

బెల్లం  గడ్డలను   పొడిలా  పచ్చడి  బండతో  దంచుకోవాలి .

స్టౌ  మీద  గిన్నె  పెట్టి   నలగొట్టిన  బెల్లం  వేసి , బెల్లం   మునిగే  వరకు  నీళ్ళు పోసి జాగ్రత్తగా  చూసి  కదుపుతూ  బాగా  ఉండ పాకం  రానివ్వాలి .

ఉండపాకం  అంటే  ఒక  పళ్ళెంలో  నీళ్ళు  వేసి  ఉడుకుతున్న  కొద్ది   పాకం నీళ్ళల్లో  వేసి  చేతితో  చూస్తే  పాకం  బాగా  ఉండలా  రావాలి .

ఈ లోగా తడిపిండి  బాగా  జల్లించుకుని  బరకగా  ఉన్నది విడిగా  తీసేసుకోవాలి .

ఉండపాకం  రాగానే  స్టౌ  కట్టేసి  దించి   పాకంలో  వేయించిన  కొబ్బరి ముక్కలు , గసగసాలు ,  జీడిపప్పు మరియు యాలకులపొడి  వేసి ,   కొద్ది  కొద్దిగా  గుప్పెడు  గుప్పెడు  బియ్యపు  పిండిని పాకంలో  వేసుకుంటూ ఆపకుండా వెంటనే  అట్లకాడ  గాని లేదా గరిటెతో కాని  పాకం   కలుపుకుంటూ చలిమిడి    సరియైన  విధంగా వచ్చేటట్లు  చూసుకోవాలి .

తర్వాత  పిండిలో  మూడు  చెంచాలు   నెయ్యి వేసుకోవాలి .

పిండి  చాలా  మృదువుగా   వస్తుంది .

తరువాత  సందర్భానుసారం  ఉండలుగా  చేసుకోవచ్చు .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  చలిమిడి  సిద్ధం.

ఇష్టమైనవారు  జీడిపప్పు నేతితో  వేయించుకుని  వేసుకోవచ్చు .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము   తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

బియ్యపు రవ్వతో బెల్లం‌ పాయసము

ఆలూరుకృష్ణప్రసాదు .

బియ్యపు  రవ్వతో  బెల్లం  పాయసము.

ముందుగా  ఒక గ్లాసు బియ్యమును బాండీలో వేసుకుని వేయించు కోవాలి.

చల్లారగానే  మిక్సీ లో వేసుకుని  రవ్వ లాగా వేసుకోవాలి.

పిండి జల్లెడతో జల్లించి  పిండి  విడిగా  తీసుకోవాలి.  రవ్వను మాత్రమే పాయసానికి  ఉపయోగించాలి.

ఒక పచ్చి కొబ్బరి  చిప్పను తీసుకుని  పచ్చి కొబ్బరి తురుముతో  మెత్తగా  తురుము కోవాలి.

ఒక  గిన్నెలో అరలీటరు పాలు పోసుకుని పొంగు వచ్చే దాకా పాలను కాగనివ్వాలి.

రవ్వను ఒకసారి నీటితో కడిగి  కాగుతున్న పాలల్లో  రవ్వను మరియు పచ్చి కొబ్బరి  తురుమును  వేసుకుని  రవ్వను  మరియు కొబ్బరి తురుమును పాలల్లో బాగా  ఉడకనివ్వాలి .

అవసరమైతే  ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి.

ఒక 150  గ్రాముల బెల్లం  తీసుకుని  మెత్తని పొడిగా  చేసుకోవాలి.

పాలల్లో  రవ్వ  మెత్తగా ఉడకగానే  దింపి  అందులో  మెత్తని  బెల్లం  పొడి మరియు ముప్పావు స్పూను  యాలకుల పొడిని  వేసి  గరిటెతో  బాగా  కలుపుకోవాలి.

స్టౌ  మీద  బాండీ  పెట్టుకుని  నాలుగు స్పూన్లు  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే  పది జీడిపప్పు పలుకులు మరియు పది బాదం  పలుకులు  వేసుకుని  బాగా వేయించుకుని  పాయసములో కలుపు కోవాలి.

పాలల్లో  రవ్వ ఉడుకుతున్నప్పుడు  బెల్లం  పొడి  వేస్తే  పాయసము  విరిగి పోతుంది. అందువలన దింపగానే  వేడి మీద వేసుకుని  మెత్తని  బెల్లం  పొడి  కలపాలి.

అంతే. ఎంతో  రుచిగా  ఉండే  రవ్వతో బెల్లం  పాయసము  సర్వింగ్ కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము .

ముద్దపప్పు & కొత్తావకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

శాకాహార ప్రియులకు  అత్యుత్తమ మైనది.

ముద్ద పప్పు   &   కొత్తావకాయ .
**********************

తర తరాల నుండి  వస్తున్న  ముద్ద పప్పు.

తయారీ విధానము .

ఒక  ఇత్తడి  గిన్నెలో  రెండు స్పూన్లు  నెయ్యి వేసి బాగా కాగగానే  ఒక కప్పు  కందిపప్పు  వేసి  బాగా వేయించుకుని  తగినన్ని  నీళ్ళు పోసి  మూతపెట్టి ఒక పదిహేను  నిముషముల పాటు  మెత్తగా  ఉడకనివ్వాలి .

నెయ్యి  వేసి వేయించాము  కనుక  ఇంక పప్పు  పొంగదు .

పప్పు  మెత్తగా  ఉడకగానే  సరిపడా ఉప్పు వేసి గరిటతో  బాగా యెనిపి  వేరే స్టీలు గిన్నెలోకి  తీసుకోవాలి .

ఇత్తడి గిన్నెలోనే ఉంచితే  కొద్ది సేపటికి  కిలం వస్తుందని పెద్దలు  చెప్పే వారు.

ఇత్తడి  గిన్నె  లేని వారు ఇదే పద్థతి లో స్టీలు గిన్నెలో  చేసుకోవచ్చు.

Best  Combinations .

ముద్ద పప్పు  +  కొత్తావకాయ  +  నెయ్యి .

ముద్ద పప్పు +  ముక్కల పులుసు + పేరుకున్న నెయ్యి

ముద్ద పప్పు  + కొత్త నిమ్మకాయ +  నెయ్యి

ముద్ద పప్పు  +  మజ్జిగ  పులుసు

ముద్ద పప్పు  +  గుత్తి  వంకాయ కూర +  నెయ్యి

వేడి  వేడి  అన్నంలో పై విధంగా  తింటే  ఆ రుచే  అత్యద్భుతం.

కొస మెరుపు .

"  బ్రాహ్మణో  భోజన ప్రియః  ".

( బహుజన ప్రియ అని కూడా అంటారు . )

"  లక్ష  రూపాయి లిచ్చినా  తృప్తి పడని  వ్యక్తి  
కడుపు నిండా  భోజనము  చేయగానే  సంతుష్టు డవుతాడు ."

" అన్నదాతా  సుఖీభవ ."

****************************

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తావకాయ .

 పుల్లని  గట్టిగా ఉన్న  మామిడి కాయలు చూడగానే  మళ్ళీ ఈ రోజు కొత్తావకాయ  పెట్టాము.

ఎంతైనా కొత్తావకాయ   రుచే  అద్భుతం  కదండీ .

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తావకాయ .

మామిడి కాయలు ఇప్పుడు మార్కెట్లోకి  విరివిగా  వస్తున్నాయి .

ఈ మామిడి కాయలు  ముక్క బాగా గట్టిగా  ఉండి , ముక్క పీచు ఉండి  చాలా పుల్లగా ఉంటే  ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది .

ఈ రోజు రెండు  మామిడి కాయలతో  కొత్తావకాయ వేసాము.

ఎంతైనా  కొత్తావకాయ  రుచే వేరు కదండీ .
 
***************************

కావలసినవి .

మామిడి  కాయలు  -  2
కారం  --  75  గ్రాములు 
ఆవపిండి  --  60  గ్రాములు 
మెత్తని ఉప్పు  --   50  గ్రాములు
మెంతులు  --  స్పూను 
పసుపు --  స్పూను  
పప్పు నూనె  --  150  గ్రాములు 

తయారీ విధానము .

మామిడి కాయలు  కడిగి పొడి గుడ్డ పెట్టుకుని  తడిలేకుండా తుడుచుకుని  పై చెక్కు తీయకుండా మధ్యకు తరుగుకొని , మధ్యలో  జీడి  మరియు లోపల పొర తీసివేసి ముక్కలుగా  తరుగుకోవాలి .

ఈ ముక్కలలో  గరిటెడు  నూనె  , మొత్తము  పసుపు  వేసి  చేతితో  బాగా  కలుపుకొని  విడిగా  ఉంచుకోవాలి .

ఒక బేసిన్ లో  కారం , ఆవ పిండి , ఉప్పు  మరియు  మెంతులు వేసుకుని , చేతితో బాగా కలుపుకోవాలి .

అందులో  కలిపిన ముక్కలు మరియు మొత్తము  నూనె  వేసుకుని  బాగా  కలుపుకుని  ఒక జాడీలోకి  తీసుకోవాలి .

మరుసటి  రోజునుండి  ఈ ఆవకాయ  తిరగ కలిపి  వాడుకోవచ్చు .
ఆలూరుకృష్ణప్రసాదు .
రెసిపీ మేము తయారు చేసిన విధానము . ఫోటో ఈ రోజు తయారు చేయు సమయమున తీసినది.

కందిపచ్చడి & చింతపండు పచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు 

సూపర్  కాంబినేషన్  ప్రాచీన  వంటకములు.

కందిపచ్చడి  &  చింతపండు  పచ్చడి.

కందిపచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

రెసిపీ చాలా ఈజీ.

పన్నెండు  ఎండుమిరపకాయలు , కప్పున్నర  లేదా  (  షుమారు 150 గ్రాములు  ) కందిపప్పు ,  స్పూను  జీలకర్ర  బాండీలో నూనె వేయకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని , చల్లారగానే ఈ వేయించినవి ,  పావు స్పూను లో సగం  పచ్చి ఇంగువ  మరియు సరిపడా ఉప్పువేసి వాటిని మిక్సీ లో వేసుకుని  కొద్ది  కొద్దిగా  నీళ్ళు పోసుకుంటూ మరీ మెత్తగా  కాకుండా కొంచెం పప్పులు  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఎంతో రుచికరమైన షుమారు వంద సంవత్సరాల పైగా  చరిత్ర కలిగిన తాతమ్మల నాటి  కందిపచ్చడి సర్వింగ్ కు సిద్ధం.

 ఇంక  ఈ పచ్చడిలో  అదనంగా చింతపండు , వెల్లుల్లి , కరివేపాకు ,  నేతితో పోపు లాంటి అదనపు   వన్నీ మీ  అభిరుచి ప్రకారము మీకు ఇష్టమైన  విధముగా  వేసుకోవచ్చును.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది.

********************************

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతపండు   పచ్చడి  .

సాధారణంగా   పెసరట్లు , దోశెలు ,  ఇడ్లీలు , గారెలు  మరియు  భోజనము  లోకి  అందరం  అల్లం   పచ్చడి  చేసుకుంటాము .

అలాగే   ఇప్పుడు  మామిడి  అల్లం  కూడ  బాగా  దొరుకుతోంది  కాబట్టి   చాలామంది  మామిడి  అల్లం  పచ్చడి  కూడా  చేస్తారు .

ఈ  రెండింటికన్నా  ప్రాచీనమైన   పచ్చడి  చింతపండు   పచ్చడి .

లోగడ  పెద్ద వాళ్ళందరూ   చింతపండు   పచ్చడినే  అన్ని సందర్భాలలోనూ చేసేవారు .

ఈ  చింతపండు  పచ్చడి  ఫ్రిజ్ లో  పెట్టక పోయినా  వారం  రోజులు  నిల్వ  ఉంటుంది .

చింతపండు   పచ్చడి తయారీ విధానము .

కావలసినవి .

చింతపండు   ---  పెద్ద   నిమ్మ కాయంత . షుమారుగా  60 గ్రాములు.
పసుపు  --  పావు స్పూను  .
ఉప్పు ---  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క . షుమారుగా 30 గ్రాములు.

పోపునకు .

ఎండుమిరపకాయలు   ---  15
మెంతులు  ---   పావు స్పూను  
ఆవాలు  ---   అర  స్పూను 
ఇంగువ   ---   కొద్దిగా 
నూనె  ---   నాలుగు   స్పూన్లు 

తయారీ  విధానము  .

ముందుగా   చింతపండు  రెబ్బలుగా  విడదీసి  పావు  గ్లాసు  వేడి  వేడి  నీటిలో  తడిపి  ఉంచుకోవాలి .

రసం  తీయనవసరం  లేదు .

ఆ  తర్వాత స్టౌ మీద బాండి  పెట్టి  నూనె  మొత్తము  వేసి ,   నూనె  బాగా  కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు వేయాలి . మెంతులు  వేగగానే  ఆవాలు  మరియు  ఇంగువ   వేసి  పోపు వేగగానే   స్టౌ  ఆపివేయాలి .

పోపు  చల్లారగానే  మిక్సీ  లో  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు మరియు తగినంత  ఉప్పు     వేసి   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  తడిపిన  చింతపండు  నీళ్ళతో సహా , వేగిన  పోపు  మరియు  చిన్న   బెల్లం  ముక్కతో   సహా  మిక్సీ లో వేసి  మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 

నీళ్ళు  పోయకుండా  గట్టిగా    విడిగా గిన్నెలోకి తీసుకోండి .

అంతే  ఇడ్లీ  , దోశెలు , పెసరట్లు , గారెలు  మరియు  భోజనము  లోకి  కూడా  ఎంతో  రుచిగా   ఉండే   చింతపండు  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

మా  ఇంట్లో  ఈ చింతపండు  పచ్చడి చేసినప్పుడు  దీనికి  కాంబినేషన్ గా  కందిపచ్చడి  చేసుకుంటాము.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారు చేయు  విధానము   మరియు  ఫోటో  తయారు చేయు  సమయమున  తీసినది.

Friday, April 24, 2020

బాదుషాలు

బాదుషాలు.
ఆలూరుకృష్ణప్రసాదు .

మేమెప్పుడూ బాదుషాలు  ఇంటి వద్ద ప్రయత్నించలేదు.

ఈ రోజు  కొద్ది  మైదా పిండితో  ప్రయత్నించాము. రుచి  బాగానే  కుదిరింది.

తయారీ  విధానము .

ఒక  పావు కిలో మైదా పిండిలో ఒక కప్పు పెరుగును , పావు కప్పు డాల్డాను లేదా  నెయ్యిని మరియు చిటికెడు  సోడా ఉప్పును  వేసి పూరీ పిండిలా కలుపు కోవాలి.

పైన తడి గుడ్డ కప్పి  ఒక గంట సేపు పిండిని  కదపకుండా  ఉంచుకోవాలి.

ఒక గంట తర్వాత  పిండిని బాగా  మెదాయించు కోవాలి,

తర్వాత  గుండ్రంగా  బిళ్ళలు  మాదిరిగా  చేసుకోవాలి.

ఒక గిన్నెలో పావు కిలో పంచదార లో  పంచదార మునిగే  వరకు  నీరు పోసుకుని స్టౌ మీద పెట్టుకుని  తీగ పాకం పట్టుకోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టుకుని  పావు కిలో  రిఫైండ్  ఆయిల్  పోసుకుని  ఆయిల్  బాగా  కాగగానే  బాదుషా బిళ్ళలు ఆయిల్ లో వేసుకుని సన్నని  సెగన  కాసిని కాసిని  బంగారు రంగులో  వేయించుకుని  సిద్ధంగా  ఉన్న పాకంలో వేసుకుని  అయిదు నిముషాలు  ఉంచుకుని అవి తీసుకుని , మిగిలినవి వేసుకుంటూ  ఉండాలి.

అంతే  ఎంతో రుచిగా  ఉండే  బాదుషాలు అల్పాహారానికి  సిద్ధం.

గోధుమ పిండితో తీపి కాజాలు

గోధుమ పిండితో తీపి కాజాలు.
ఆలూరి కృష్ణప్రసాదు


గోధుమ పిండి  -  పావు కిలో.
పంచదార  - 150 గ్రాములు.
నెయ్యి  -  మూడు  స్పూన్లు 
యాలకుల పొడి - అర స్పూను.
సోడా ఉప్పు  - చిటికెడు .
నూనె  -  పావు కిలో 

తయారీ విధానము .

ముందుగా  ఒక పావు కిలో  గోధుమ  పిండిలో , చిటికెడు  సోడా  ఉప్పు , మూడు స్పూన్లు  నెయ్యి  వేసుకుని తగినన్ని  నీళ్ళు పోసుకుని  చపాతీల పిండిలా కలుపుకోవాలి.

మూత పెట్టి  ఒక  గంట సేపు  పిండిని  నాన నివ్వాలి.

ఒక గంట అవ్వగానే   పిండిని బాగా  మెదాయించి  నిమ్మకాయంత  ఉండలుగా చేసుకోవాలి.

తర్వాత  చపాతీల పీట పై  అప్పడాల కర్రతో  గుండ్రంగా పల్చగా  వత్తుకుని చాకుతో  Cross గా  Daimond Shape లో  Cut చేసుకోవాలి.

ఈ విధముగా  అన్ని కాజాలు ఒకేసారి  చేసుకోవాలి.

ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టుకుని మొత్తము పంచదార పోసుకుని అందులో  ఒక అరగ్లాసు నీళ్ళు పోసుకోవాలి. తీగ పాకం వచ్చేదాకా ఉంచుకొని  అందులో యాలకుల పొడి  వేసుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ పెట్టి  మొత్తము  నూనెను  పోసుకుని నూనె పొగలు,,వచ్చే వరకు  నూనెను  బాగా కాగ నివ్వాలి.

అందులో  సిద్ధంగా  ఉంచుకున్న  కాజాలను  వేసుకుని రెండు  మూడు విడతలుగా  వేసుకుని ఎరుపు రంగు వచ్చేవరకు  వేగ నివ్వాలి.

వేగుతున్న కాజాలు పాకం లో వేసి ఒక ఏడెనిమిది  నిముషాలు  ఉంచి పాకము పట్టిన కాజాలు  వేరే  పళ్ళెము లోకి తీసుకోవాలి .

ఇలా అన్ని  కాజాలు  వేసుకుని తీసుకోవాలి.

అంతే . మధ్యాహ్నము  అల్పాహారానికి  గోదుమ  పిండి  తీపి కాజాలు  సర్వింగ్  కు సిద్ధం.

ఇదే  పద్ధతిలో  మైదా పిండితో  కూడా  చేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారుచేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

వెరైటీ కారప్పొడి



దోశెలలోకి  మరియు ఇడ్లీల లోకి  మరో  వెరైటీ  కారప్పొడి .
ఆలూరుకృష్ణప్రసాదు .


కావలసినవి.

ఎండుమిరపకాయలు  - 20
పచ్చిశనగపప్పు  - 100 గ్రాములు.
చాయమినపప్పు -  50 గ్రాములు.
కరివేపాకు -  ఒక కప్పున్నర.
నూనె  -  నాలుగు స్పూన్లు 
ఇంగువ - పావు స్పూను 
ఉప్పు  -  తగినంత .

తయారీ  విధానము.

 స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  ముందుగా  పచ్చిశనగపప్పు ఎర్రగా  కమ్మని వాసన వచ్చే వరకు వేయించు కోవాలి. వేగిన పచ్చిశనగపప్పు  వేరే ప్లేటులోకి  తీసుకోవాలి .

తర్వాత  చాయమినపప్పు  కూడా  బాండిలో  నూనె వేయకుండా  కమ్మగా  వేగిన  వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి. తర్వాత  వేగిన చాయమినపప్పు  విడిగా  మరో ప్లేటులోకి  తీసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద తిరిగి  బాండీ పెట్టి  మొత్తము  నాలుగు  స్పూన్లు  నూనెను వేసుకుని  నూనె బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , కరివేపాకు  మరియు ఇంగువను  వేసి  మిరపకాయలు  మరియు కరివేపాకు  వేగే  వరకు  వేయించుకోవాలి.

ఇవ్వన్నీ  చల్లారిన తర్వాత  ముందుగా  మిక్సీ లో వేయించిన ఎండుమిరపకాయలు , కరివేపాకు ,  ఇంగువ  మిశ్రమము  మరియు  తగినంత  ఉప్పును వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

ఆ తర్వాత  అందులోనే  నూనె వేయకుండా  వేయించిన  పచ్చిశనగపప్పు  మరియు చాయమినపప్పు  కూడా వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా  కొంచెం  పప్పులు నోటికి  తగిలే విధముగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  ఈ మిశ్రమమును  ఒక పళ్ళెంలో  వేసుకుని చేతితో  బాగా  కలుపుకుని   ఒక సీసాలోకి  తీసుకోవాలి .

అంతే  ఇడ్లీ , దోశెలు , గారెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి  సర్వింగ్  కు సిద్ధం.

ఇదే విధముగా  పొడి కొట్టుకుని  వంకాయ మరియు  దొండకాయ వంటి  కాయల పళంగా  చేసుకునే కూరలలో పెట్టుకోవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున తీసినది.

చింత చిగురు పొడి

చింత చిగురు పొడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి.

చింత  చిగురు  -  150 గ్రాములు.

ఎండుమిరపకాయలు  - 12

చాయమినపప్పు  -  రెండు  స్పూన్లు .

ధనియాలు  -  ఆరు స్పూన్లు .

జీలకర్ర  -  అర స్పూను

వెల్లుల్లి  - 20  రెబ్బలు.

(  వెల్లుల్లి  ఇష్టపడని  వారు వెల్లుల్లి  బదులుగా  మరో స్పూను జీలకర్ర  వేసుకుని పొడి  కొట్టు కొన వచ్చును. ) 

ఉప్పు  -  తగినంత .

నూనె  -  ఐదు  స్పూన్లు .

తయారీ విధానము .

ముందుగా  చింత చిగురు పుల్లలు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

చింత చిగురు ఒకసారి కడిగి తడి లేకుండా  ఒక గంట సేపు నీడన  ఆర బెట్టు కోవాలి.

వెల్లుల్లి  పై పొట్టు తీయకుండా  ఒలిచి  ఉంచుకోవాలి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి , నూనె బాగా కాగగానే  చింత చిగురు నూనెలో వేసుకుని  ఆకును బాగా  తడి లేకుండా మగ్గ నివ్వాలి.

ఆకు మగ్గగానే  విడిగా  వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి .

తర్వాత  తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టుకుని  మిగిలిన  మూడు స్పూన్లు నూనెను వేసుకుని నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , చాయమినపప్పు , ధనియాలు మరియు జీలకర్రను  వేసుకుని పోపు కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

పోపు చల్లారగానే  మిక్సీ లో ముందుగా   ఎండుమిరపకాయలు  మరియు ఉప్పును వేసుకుని మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  మిగిలిన పోపును మరియు చింత చిగురును  వేసుకుని  మిక్సీ   వేసుకోవాలి.

చివరగా  వెల్లుల్లి  పాయలు కూడా వేసుకుని  ఒకసారి మిక్సీ  వేసుకుని , ఒక పళ్ళెములో పోసుకుని  చేతితో  బాగా కలుపుకుని ఒక సీసా లోకి  తీసుకోవాలి .

చింతచిగురులో స్వతహాగా పులుపు ఉంటుంది  కనుక ఈ పొడిలో విడిగా  చింతపండు  వేయనవసరం లేదు.

ఈ పొడి పది రోజులు నిల్వ  ఉంటుంది .

వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని ఈ చింత చిగురు పొడిని వేసుకుని తింటే చాలా రుచిగా  ఉంటుంది . ఆరోగ్యానికి  చాలా మంచిది. నోరు అరుచిగా ఉన్నా తొలగి పోతుంది.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో  తయారు చేయు సమయమున  తీసినది.

Sunday, April 19, 2020

కందిపప్పు కొబ్బరిముక్కల పచ్చడి .

కందిపప్పు కొబ్బరిముక్కల  పచ్చడి .
ఆలూరుకృష్ణప్రసాదు .

కావలసినవి .

కందిపప్పు  --  ఒక కప్పు
పచ్చికొబ్బరి  ముక్కలు --  ఒక కప్పు.
ఎండుమిరపకాయలు  --  పది 
జీలకర్ర  --  స్పూను 
చింతపండు  --  చిన్న ఉసిరి కాయంత.
ఉప్పు  --  తగినంత 
ఇంగువ -- కొద్దిగా 

పోపునకు .

ఎండుమిర్చి  --  మూడు.  చిన్న  ముక్కలుగా  చేసుకోవాలి 
చాయమినపప్పు  --  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు
నెయ్యి  --  నాలుగు  స్పూన్లు 

తయారీ విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ   పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి  బాగా  కాగగానే  కందిపప్పు , ఎండుమిర్చి , జీలకర్ర మరియు ఇంగువ వేసి  కందిపప్పు  కమ్మని  వేగిన వాసన వచ్చే వరకు  వేయించుకోండి. 

తర్వాత  అందులోనే  చిన్న ముక్కలుగా  తరిగిన  కొబ్బరి ముక్కలు  వేసి  పచ్చి వాసన పోయేవరకు  ఉంచి  దింపి  వేరేగా  పళ్ళెంలో  తీసుకోండి .

పోపు  చల్లారగానే   ముందుగా  మిక్సీ లో వేయించిన  ఎండుమిరపకాయలు , వేయించిన  కందిపప్పు  , తడిపిన చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

తర్వాత  వేగిన  కొబ్బరి  ముక్కలు కూడా వేసి ,  కొద్దిగా  నీళ్ళు పోసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకోండి .

తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోండి.

ఇప్పుడు  స్టౌ మీద బాండీ పెట్టి  మిగిలిన రెండు స్పూన్లు  నెయ్యి వేసి  నెయ్యి బాగా కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు మరియు కరివేపాకు  వేసి  పైన పోపు  పెట్టుకోండి .

అంతే   ఇడ్లీ , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా  ఉండే  కందిపప్పు  కొబ్బరి ముక్కల పచ్చడి సర్వింగ్  కు సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ మేము తయారుచేయు  విధానము  మరియు ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

నిమ్మకాయ ఊరగాయ

నిమ్మకాయ  ఊరగాయ.
ఆలూరుకృష్ణప్రసాదు .
కావలసినవి.

గుండ్రని పసుపు పచ్చని ,  పై తొక్క పలుచగా ఉన్న నిమ్మకాయలు -     20

పసుపు  -  స్పూనున్నర 

మెత్తని ఉప్పు  -   షుమారుగా  150 గ్రాములు.

కారం   -  షుమారుగా  125  గ్రాములు.

మెంతి పిండి  - రెండున్నర  స్పూన్లు .

(  30  గ్రాముల మెంతులను  బాండీలో నూనె  వేయకుండా  బాగా  వేయించి  చల్లారిన తర్వాత  మిక్సీ లో  మెత్తని  పొడిగా  వేసుకుని  ఒక సీసాలో  వేసుకోవాలి. ) ఈ పొడి  మరో రెండు మూడుసార్లకు  వస్తుంది.

తయారీ విధానము.

ముందుగా  నిమ్మ కాయలు  తడి గుడ్డతో  శుభ్రంగా  తుడుచుకుని ఓ పది నిముషాలు  నీడన  ఆర  నివ్వాలి.

అందులో  15  నిమ్మ కాయలు ముక్కలుగా తరుగు కోవాలి.

ఒక అయిదు  నిమ్మ కాయలు  రసం ఒక  గిన్నెలో  వేరుగా తీసుకోవాలి .

ఒక  బేసిన్ లో తరిగిన  నిమ్మకాయ ముక్కలు మరియు  విడిగా గిన్నెలోకి తీసిన నిమ్మరసం ముక్కలలో పోసుకోవాలి.

అందులో  పసుపు  మరియు  మొత్తము  ఉప్పును వేసుకుని  చేతితో  బాగా కలుపు కోవాలి.

దీనిని  ఒక జాడిలోకి  తీసుకోవాలి . మూడు రోజులు  కదపకుండా  ఉంచాలి.

నాలుగవ రోజు ఉదయం  ఒకసారి జాడీ లోని  ముక్కలను చేతితో బాగా కలుపుకుని ,  ఒక్కొక్క  ముక్కలోని రసము జాడిలోనే  చేతితో  పిండు కోవాలి.

ఆ విధముగా  పిండిన  ముక్కల లోని గింజలను  మరియు  జాడీ లోని  రసము లోని గింజలను  పూర్తిగా చేతితో తీసి వేసుకుని గింజలను  పడెయ్యాలి.

రసము పిండిన  ముక్కలను  ఒక పళ్ళెము  లో వేసుకుని  ఎర్రని  ఎండలో  రెండు రోజులు  ఎండబెట్టుకోవాలి. రసమును  ఎండ బెట్టవలసిన అవసరము లేదు.

ఆ విధముగా  ముక్కలను ఎండబెట్టడం వలన  ముక్కల పై తొక్క లోని  చేదు పోతుంది .

రెండు రోజులు  ముక్కలు  ఎండిన తర్వాత  ఒక బెసిన్ లో జాడీ లోని రసము  మొత్తమును  పోసుకోవాలి.

ఆ తర్వాత ఎండబెట్టిన  ముక్కలను  కూడా  రసములో  పోయాలి.

ఇప్పుడు  రెండు  పద్ధతులలో  ఈ నిమ్మకాయ ఊరగాయ వాడుకొనవచ్చును .

మొదటి  పద్ధతి.

 మొత్తము పచ్చడిలో   కారము మరియు  రెండున్నర  స్పూన్లు  మెంతి పిండి  వేసుకుని  చేతితో  బాగా  కలుపుకోవాలి.

ఆ తర్వాత  మొత్తము  పచ్చడిని  ఒక జాడీ లోకి  తీసుకోవాలి .

కావలసినప్పుడు  ఒక  ముప్పావు కప్పు  పచ్చడి తీసుకుని   అందులో  పోపు పెట్టుకుని వాడుకొనవచ్చును .

పోపు  వేయు  విధానము .

స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  మూడు  స్పూన్లు  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  నాలుగు  ఎండుమిరపకాయలు , పావు స్పూన్లులో  సగం మెంతులు , అర స్పూను ఆవాలు మరియు  కొద్దిగా  ఇంగువ వేసుకుని  వాడుకొనవచ్చును .

రెండవ పద్ధతి.

అసలు  కారము  మెంతి పిండి  కలపకుండా  ఎండిన ముక్కలు  రసము  కలిపిన  తర్వాత  జాడీ లోకి  తీసుకోవాలి.

కావలసినప్పుడు  ఒక ముప్పావు  కప్పు  పచ్చడి  విడిగా  తీసుకుని  అందులో  రెండు  స్పూన్లు  కారము మరియు అర స్పూను  మెంతి పిండిని  వేసుకుని  స్పూనుతో బాగా కలుపుకోవాలి.

ఇందులో  పోపు  మొదట  చెప్పిన  పద్ధతిలో  ప్రకారము  వేసుకొనవచ్చును .

ఈ నిమ్మకాయ  ఊరగాయ  వేడి వేడి అన్నంలో నెయ్యి  వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా  ఉంటుంది.

వేడి వేడి  అన్నంలో నెయ్యి వేసుకుని  ముద్ద పప్పు కలుపుకుని  ఈ నిమ్మకాయ ఊరగాయ నంచుకుని  తింటే  కూడా  చాలా రుచిగా  ఉంటుంది.

అంతే. ఇడ్లీలు , దోశెలు , గారెలు , చపాతీలు  మరియు భోజనము లోకి  ఎంతో రుచిగా ఉండే  నిమ్మకాయ ఊరగాయ  సర్వింగ్  కు సిద్ధం.

ఈ ఊరగాయ  ఖచ్చితంగా   నాలుగు నెలలు  తాజాగా   రుచిగా  ఉంటుంది .

నిమ్మకాయ ఊరగాయ  ముక్కలు  మరియు రసములో  కొంతమంది  పచ్చిమిర్చి  మరియు  అల్లం  ముక్కలు  వేసుకుంటారు.

కారం కలిపి పోపు  పెట్టిన తర్వాత  ఈ అల్లం  ముక్కలు  మరియు పచ్చిమిర్చి  పెరుగు అన్నంలో  నంచుకోవడానికి  చాలా రుచిగా ఉంటాయని అంటారు.

మీకు  ఇష్టమైన యెడల  ఆ విధముగా  వేసుకొనవచ్చును .
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు  విధానము  మరియు  ఫోటో  తయారుచేయు  సమయమున  తీసినది.

క్యాప్సికమ్ ఉల్లి కారం కూర ( కాయల పళంగా )

క్యాప్సికమ్  ఉల్లి కారం కూర ( కాయల పళంగా )

ఆలూరుకృష్ణప్రసాదు .


క్యాప్సికమ్  ఉల్లికారం కూర . ( కాయల పళంగా కూర )

కావలసిన  పదార్థములు.

క్యాప్సికమ్   ---  అర కిలో.

పచ్చి శనగపప్పు  --  25  గ్రాములు

చాయ  మినపప్పు  -  20  గ్రాములు .

ఆవాలు  --   పావు స్పూను .

ఎండు మిరపకాయలు  --  10

ఉల్లిపాయలు  -  మూడు.

ఉప్పు  ---  తగినంత 

నూనె  --   100  గ్రాములు .

తయారు  చేయు విధానము .

ఉల్లిపాయలు  పొట్టు తీసి ముక్కలుగా తరుగు కోవాలి.

క్యాప్సికమ్  నాలుగు పక్షాలుగా చేస్తే  కారం కాయనుండి విడిపోయి నూనెలో పడి మాడిపోతుందేమోనని  మేము క్యాప్సికమ్ పై తొడిమ తీసేసి చిన్న రంధ్రం చేసాము.

మీరు మీ వీలుని బట్టి  మాలా చేసిన సరే  లేదా కాయను నాలుగు  పక్షాలుగా చేసినా సరే.

ముందుగా  స్టౌ  వెలిగించి  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు  నూనె వేసి నూనె బాగాకాగగానే ముందుగా  ఎండు మిరపకాయలు , పచ్చి శనగపప్పు  , చాయ మినపప్పు , ఆవాలు  వేసి పోపు  కమ్మని  వాసన  వచ్చేదాకా  వేయించు కోవాలి.

ఆ తర్వాత అందులోనే ఉల్లిపాయ  ముక్కలను వేసి  ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి .

పోపు  చల్లారిన  తర్వాత  మిక్సీలో  ఈ  పోపు  మొత్తము మరియు తగినంత  ఉప్పును  వేసి మరీ మెత్తగా  కాకుండా  అంటే  కొంచెము  పప్పులు  పంటికి  తగిలే  విధముగా  మిక్సీ  వేసుకోవాలి .

దీనినే  ఉల్లి కారం అని అంటారు.

ముందుగా   సిద్ధం  చేసుకున్న ఈ ఉల్లికారం  కాయల్లో పై రంధ్రము నుండి కూరు కోవాలి .

చివరలో కూర   దించబోయే  ఐదు నిముషాలు  ముందు కూర  పైన వేసుకోవడానికి  కాస్త  ఉల్లికారం  విడిగా  తీసుకుని ఉంచుకోవాలి .

మళ్ళీ  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మిగిలిన  నూనె  అంతా పోసి  నూనె  బాగా  కాగాక  ఉల్లి కారం కూరిన   క్యాప్సికమ్ కాయలను  వేసి  మీడియం  సెగన  కాయలు  మగ్గి  కారం  వేగే  దాకా  మధ్య మధ్యలో  అట్లకాడతో  తిరగవేస్తూ
కలుపుతూ  ఉండాలి .

దింప  బోయే   అయిదు  నిముషాల ముందు  మిగిలిన ఉల్లికారం కూడా  వేసి  కూర బాగా కమ్మని వాసన వచ్చి వేగాక   దించుకుని , వేరే  డిష్ లోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ ఘమ లాడే క్యాప్సికమ్ ఉల్లి కారంకాయల పళంగా కూర  సర్వింగ్  కు  సిద్ధం.
ఆలూరుకృష్ణప్రసాదు .
సంబంధించిన  రెసిపీ  మేము తయారు చేయు విధానము  మరియు ఫోటో తయారు చేయు సమయమున తీసినది.

Thursday, April 16, 2020

బెల్లం‌ ఆవకాయ

ఆంధ్రా స్పెషల్ - బెల్లం  ఆవకాయ.

ఆలూరుకృష్ణప్రసాదు

 శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్టణం , తూర్పు గోదావరి మరియు  పశ్చిమ  గోదావరి జిల్లాల వారు  ఈ బెల్లం ఆవకాయ ఏడాది నిల్వ ఊరగాయను ఎక్కువ మంది  పెట్టుకుంటారు.

మిగిలిన ఆంధ్ర ప్రాంతం వారు చాలా తక్కువగా  పెట్టుకుంటారు.

మేము  ఆవకాయ , మాగాయలతో పాటుగా  ఈ బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం  తప్పనిసరిగా  పెట్టుకుంటాం.

నా ఊహ తెలిసినప్పటి నుండి  అంటే  షుమారు 60 సంవత్సరాల  పై నుండీ  మా ఇంట్లో  తప్పనిసరిగా  బెల్లం  ఆవకాయను ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము.
ఈ బెల్లం  ఆవకాయ నిక్షేపంగా  ఏడాదిన్నర కూడా నిల్వ ఉంటుంది.

అందుకు ప్రధాన కారణం  మూడు రోజులు ఈ బెల్లం  ఆవకాయను ఎర్రటి  ఎండలో పెడతాము . అందువలన  ఈ బెల్లం ఆవకాయ పాడవదు.

చాలామంది  పై తెలిపిన ప్రాంతాల వారు కాకుండా  ఇతర ప్రాంతాల వారు , దాని రుచి తెలియని వారు " ఆవకాయ లో బెల్లం  ఏమిటి ? " అని మొహం చిట్లిస్తారు. అలా అనే వారు ఈ ఆవకాయ రుచి చూడని వారు మాత్రమే అని  నా అభిప్రాయం.

మేం గుంటూరు జిల్లా లో ఉన్నా ,   మేం తప్పనిసరిగా  ప్రతి సంవత్సరం  పెట్టుకుంటాం కనుక  , మా అన్నదమ్ముల స్నేహితులు , మా ఇరుగు పొరుగు  చుట్టు ప్రక్కల వారు  అందరికీ  మా వల్ల ఈ బెల్లం ఆవకాయ  అలవాటు  చేసాము. వారందరికీ  ఎంతో నచ్చింది.

ప్రతి ఏడు మా అమ్మని ప్రత్యేకంగా  అడిగి  కనీసం ఒక చిన్న హార్లిక్స్  సీసాడు  బెల్లం ఆవకాయ పట్టుకు వెడతారు.

ప్రస్తుతం  మేము తెనాలి లో ఉంటున్నాం కనుక మేము బెల్లం  ఆవకాయ పెట్టుకుంటాం అని తెలిసిన మా స్నేహితులందరూ ప్రత్యేకంగా  అడిగి  మరీ  ఒక చిన్న హార్లిక్స్ సీసాడు బెల్లం  ఆవకాయ పట్టుకుని వెడతారు. తిన్నారా ఎలా ఉంది ? అని అడిగితే " మేము ఇద్దరం  తింటే అయిపోతుంది కదండీ. బెంగుళూరులో ఉంటున్న మా అబ్బాయికి  మీ బెల్లం  ఆవకాయ చాలా ఇష్టం. అందువల్ల వాడికి  పంపాము " అని అంటారు.

ఇదంతా నేను ఎందుకు  చెబుతున్నానంటే  తినని వాళ్ళకు , తినడానికి  ఇష్ట పడని వాళ్ళకే ఈ బెల్లం ఆవకాయ నచ్చదు. ఒకసారి తిని దాని రుచి తెలుసుకున్న వాళ్ళు ఏ ప్రాంతం వారయినా  తినకుండా  ఉండలేరు.

మా చిన్నతనంలో  మా అమ్మ  రెండు పెద్ద జాడీల నిండా అంటే షుమారు ఓ 50 మామిడి కాయలతో ఈ బెల్లం ఆవకాయ పెట్టేది. అమ్మది  భారీ చెయ్యి. పెట్టిన నాలుగో రోజు నుండి  మూడు రోజులు మేడ మీద ఎండలో  పెట్టేది.

మా స్నేహితులు , మా అన్నదమ్ముల స్నేహితులు  మాతో ఆడుకోవడాని కనే మిషతో  మా ఇంటికి  వచ్చి మేడ మీద జాడీ లో  ఎండ బెట్టిన బెల్లం  ఆవకాయ ముక్కలను చేతితో తీసుకుని  ' హాంఫట్ హాంఫట్ ' అంటూ తినేసేవారు. మా అమ్మకు  తర్వాత తెలిసి  ' ఏ చేతులతో పడితే ఆ చేతులతో  ఆవకాయలు ముట్టుకోకూడదు. ఏడాది పచ్చళ్ళు పాడవుతాయి ' అని కోప్పడేదనుకోండి. ఇవి మా గుంటూరు జిల్లాలో మాఅందరికీ మా స్నేహితులతో  ఈ బెల్లం ఆవకాయ మధుర జ్ఞాపకములు.

ఇక  అసలు విషయానికి  వద్దాము.

బెల్లం ఆవకాయ.
************

మేము మరియు లోగడ మా అమ్మమ్మ మరియు  కాకినాడ  లో ఉన్న మా బంధువులు  అందరూ ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  కలెక్టరు మామిడి / చిత్తూరు మామిడి / తోతాపురి (  ఈ మూడు పేర్లు  ఒకటే కాయ )  కాయనే  వాడతారు. ప్రధాన కారణం  ఈ బెల్లం  ఆవకాయ పెట్టుకోవడానికి  ఈ కాయ బాగుంటుందనే వారు.

ఈ చిత్తూరు మామిడి కాయ లేత కాయ కాకుండా  బాగా తయారయ్యి లోపల టెంక మరియు పీచు ఉన్న కాయలనే ఎంచుకునే వారు. కాయ అసలు పండకుండా బాగా గట్టిగా ఉండాలి.

అలాగే  బెల్లం  ఆవకాయలో వాడే బెల్లం  కూడా  మామూలుగా  మనం ఇళ్ళల్లో  వాడే బెల్లం  కాకుండా , మేము కాకినాడ  ప్రాంతం వారమే కాబట్టి  షుమారు నెలరోజుల ముందే అంటే  కాయ రాకముందే ప్రత్యేకంగా  ' బూరుగు పల్లి '  బెల్లం  ఒక మూడు కిలోలు  తెప్పించుకునే వారము . కాకినాడ పెద్ద మార్కెట్ దగ్గర  కల  పచారీ  షాపులలో  బెల్లం ఆవకాయకు  బూరుగు పల్లి బెల్లం  కావాలని  అడిగితే  ఇచ్చే వారు.

ఇప్పుడు  తెనాలిలో ఉన్నా  ప్రతి సంవత్సరం  బెల్లం  ఆవకాయ కోసం కాకినాడ  నుంచి  బంధువుల ద్వారా బూరుగపల్లి బెల్లం తెప్పించుకుంటాము.

కావలసినవి.

చిత్తూరు  మామిడి  కాయలు  -  10  కాయలు.
( షుమారుగా  రెండున్నర  కిలోల ముక్కలు వస్తాయి . )

బూరుగు పల్లి  బెల్లం  లేదా  దొరకనిచో మామూలు బెల్లం  --  ఒక  కిలో లేదా కిలోం పావు  బెల్లం తీసుకుని  రోటిలో దంపుకుని ఒక కిలో బెల్లం పొడి వచ్చే విధముగా  సిద్ధం చేసుకోవాలి.

కారము , ఉప్పు , ఆవపిండి - మూడు కలిపి   --  ఒక కిలో.

ఇందులో  -

కారము  -  400 గ్రాములు.
ఆవపిండి - 350 గ్రాములు.
మెత్తని ఉప్పు - 250 గ్రాములు.
( అయోడైజ్డ్  కానిది . )

ఈ మూడు పైన తెలిపిన పాళ్ళలో తీసుకుని  ఒక బేసిన్  లో వేసుకుని  చేతితో  బాగా కలుపుకొని  విడిగా  ఒక  జాడీలో కాని జార్ లో కాని పోసుకుని  సిద్ధంగా  ఉంచుకోవాలి.

పసుపు  -  స్పూనున్నర .

మెంతులు  -  స్పూనున్నర .

చింతపండు  -  నిమ్మకాయంత  తీసుకుని శుభ్రం  చేసుకుని , గింజలను  తీసి వేసి విడదీసుకుని  రోటిలో  తొక్కి చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి.

బెల్లం  ఆవకాయ సిద్ధ మయ్యాక   --

పోపునకు  --

సామర్లకోట  A . S . Brand నువ్వు పప్పు నూనె  -  పావు కిలో.

ఎండుమిరపకాయలు  - 12

వెల్లుల్లి  పాయలు  -  150 గ్రాములు.

వెల్లుల్లి పాయలు  విడదీసి  రెబ్బలు మీద పొట్టు అంతా  తీసుకుని   సిద్ధం చేసుకోవాలి. 

ఆవాలు  --  రెండు  స్పూన్లు .

తయారీ విధానము.

బాగా తయారయ్యి  టెంక  పట్టి  అసలు పండకుండా గట్టిగా  ఉన్న చిత్తూరు మామిడి  కాయలు  ఒక  పది కాయలు తీసుకోవాలి.

వాటిని ఒక  టబ్ లో నీటిలో వేసుకుని  ఒక  అరగంట సేపు నీటిలో నాన నివ్వాలి.

తర్వాత  ఒక్కొక్క  కాయను తీసుకుని  పొడిగా  గుడ్డతో కాయలను శుభ్రంగా తుడుచు కోవాలి. మరో అరగంట సేపు కాయలను  పొడిగా  ఆర నివ్వాలి.

తర్వాత  మామిడి  కాయల మీద ఉన్న చెక్కును పీలర్ తో కాని  లేదా కత్తి పీటతో కాని లేదా ఆల్ చిప్పతో కాని తీసుకోవాలి . మొత్తము  అన్ని కాయల మీద పై చెక్కును తీసుకోవాలి .

ముందు కాయను మధ్యలో సగానికి  తరుకుని  టెంకలోని పై పొట్టు తీసి వేయాలి. ఇలా అన్ని కాయలకు  తీసి వేయాలి.

తర్వాత  మామూలుగా  ఆవకాయ పెట్టడానికి  ముక్కలు ఏ విధముగా  తరుగుతామో  అదే విధముగా  ప్రతి ముక్క పైన టెంక వచ్చే విధముగా  ముక్కలను తరుగు కోవాలి.

ఇప్పుడు  ఒక పెద్ద బేసిన్ తీసుకుని  తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  మామిడి  కాయ ముక్కలను  బేసిన్ లో వేసుకోవాలి.

అందులో స్పూనున్నర  పసుపు వేసుకుని ముక్కలకు పట్టే  విధముగా  బాగా కలుపు కోవాలి.

కారం , ఆవపిండి  మరియు  ఉప్పు  ఈ మూడు కలిపి  సిద్ధంగా  ఉంచుకున్న  కిలో గుండను  మరియు  స్పూనున్నర  మెంతులు  ముక్కలలో వేసుకుని గుండ ముక్కలకు పట్టే విధముగా  బాగా కలుపు కోవాలి.

ఇప్పుడు సిద్ధంగా  ఉంచుకున్న  ఒక  కిలో బెల్లం  పొడి  మరియు చిన్న చిన్న బిళ్ళలను చేసి సిద్ధంగా  ఉంచుకున్న  చింతపండును కూడా  అందులో వేసి చేతితో బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు  ఈ కలిపిన మిశ్రమము మరియు ముక్కలు  మొత్తము  ఒక  పెద్ద జాడీలో పెట్టుకుని  గట్టిగా  మూత పెట్టుకోవాలి.  ఒక ప్రక్కన కదపకుండా  పూర్తిగా  మూడు రోజులు  ఉంచాలి.

ఇలా  ఉంచడం బెల్లం  మరియు ముక్కలకు  ఆవకాయలో తడి బాగా  వస్తుంది.

పూర్తిగా  మూడు రోజులు  కదపకుండా  ఉన్న  పిదప  నాలుగవ  రోజు ఆవకాయను  చెక్క గరిటె తో బాగా కలుపు కోవాలి.

ఈ బెల్లం  ఆవకాయ  అంతా  ఒకటి లేదా రెండు  బేసిన్  లలో  పోసుకుని  ఉదయం  9 గంటల నుండి  సాయంత్రం  5  గంటల  వరకు  పూర్తిగా  మూడు రోజులు ఎర్రటి  ఎండలో  పెట్టాలి. ప్రతి రోజు ఎండలో నుండి తెచ్చాక చెక్క గరిటెతో ఆవకాయ  బాగా కలుపు తుండాలి.

ఇలా  పూర్తిగా  మూడు రోజులు  ఎండబెట్టినందువలన  పచ్చడి  లోని పాకం పూర్తిగా  గట్టి పడుతుంది. ఆవకాయ లోని  తడి అంతా  పోతుంది. ప్రతి ముక్కకు  తీపి  కారము మొత్తము  సమంగా పట్టుకుంటాయి.  పచ్చడి  పూర్తిగా  దగ్గర  పడుతుంది.

మీరు కొద్దిగా  ఆవకాయ పెట్టుకున్నా  లేదా  ఎండలు  విపరీతంగా  ఉన్నా  ఆవకాయ రెండు  రోజులు ఎండబెట్టితే  సరిపోతుంది .  అటువంటప్పుడు  మరీ ఎక్కువగా  ఎండితే  ఆవకాయ మరీ  ఎండి పోయి  పిడస కట్టినట్లుగా  అయి పోతుంది. మీరు మాత్రం ఈ విషయము  జాగ్రత్తగా   గమనించుకోవాలి.

పూర్తిగా  మూడు రోజులు  ఎండ బెట్టిన తర్వాత  ఆ రోజు  సాయంత్రం బెల్లం  ఆవకాయ లో  పోపు పెట్టుకోవాలి.

ఒక  వెల్లుల్లి  వేసి పోపు పెడితే  బెల్లం  ఆవకాయ ని అంటారని , వెల్లుల్లి తో పాటుగా  ఎండుమిరపకాయలు  , ఆవాలు మరియు కరివేపాకును  వేసి పోపు పెడితే  దప్పళపు ఆవకాయ  అంటారని  మా అమ్మమ్మ  వాళ్ళు చెప్పారు.

ఇక మూడవ రోజు  సాయంత్రం  ఎండలో నుండి  తెచ్చిన  బెల్లం  ఆవకాయలో  పోపు  పెట్టుకునే  విధానము.

స్టౌ  మీద  బాండి  పెట్టి  మొత్తము  పావు కిలో  పప్పు నూనెను  బాండీలో పోయాలి.

బాండిలో నూనె బాగా కాగగానే  తొడిమలు  తీసిన  ఎండుమిరపకాయలు , ఆవాలు  మరియు కరివేపాకును  వేసి పోపును వేగ నివ్వాలి.  అందులోనే  ఒలిచి  సిద్ధంగా  ఉంచుకున్న  వెల్లుల్లి పాయలు కూడా  వేసుకుని  వెల్లుల్లి  పాయలు  బంగారు రంగులో  వచ్చే వరకు  వేయించు కోవాలి.

ఈ వేగిన  పోపును  వేడిగానే  బెల్లం  ఆవకాయ లో  వేసుకుని  చెక్క గరిటెతో  బాగా కలుపు కోవాలి.

చల్లారగానే  తిరిగి  జాడీలోనికి  తీసుకుని  జాడి పైన  వాసిన కట్టుకుని  భద్రపరుచుకోవాలి.

కావలసినప్పుడు   చిన్న జాడీల లోకి తీసుకుని   వాడుకొనవచ్చును .

అంతే. ఇడ్లీల లోకి , దోశెల లోకి , గారెల లోకి , రోటీల లోకి , చపాతీల లోకి  మరియు  భోజనము  లోకి  అద్భుతమైన  రుచిగా  ఉండే  బెల్లం  ఆవకాయ  సర్వింగ్  కు  సిద్ధం.

సంబంధించిన  రెసిపీ మేము  తయారుచేయు  విధానము  మరియు ఫోటోలు  తయారుచేయు  సమయమున తీసినది.
ఆలూరుకృష్ణప్రసాదు .
ముఖ్య గమనిక  --

మేము ఈ బెల్లం ఆవకాయకు  మామిడి కాయల  పై  చెక్కు తీస్తాము.
మీరు  కావాలిస్తే  పై చెక్కు తో ముక్కలు తరుగు కోవచ్చును.

మేము  చిత్తూరు  మామిడి కాయలతోనే  ఈ బెల్లం  ఆవకాయ పెడతాము.
మీరు  మామూలుగా  ఆవకాయ పెట్టే కాయలతో  కూడా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  బూరుగు పల్లి  బెల్లమే  బెల్లపు  ఆవకాయ  తయారు చేయడానికి  వాడతాము.
మీరు మీకు మార్కెట్లో  దొరికే  ఏ రకమైన బెల్లంతో నైనా  బెల్లం ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  వెల్లుల్లి  పాయలు  వేసుకుంటాము .
మీరు వెల్లుల్లి  వేయకుండా  బెల్లం  ఆవకాయ పెట్టుకోవచ్చును .

మేము  ఈ బెల్లం  ఆవకాయలో  ఇంగువ  వేసుకోము.
మీరు కావాలనుకుంటే  ఇంగువ  వేసుకోవచ్చును.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి