కొంచెం వెరైటీగా క్యాలీ ఫ్లవర్ బంగాళా దుంప కూర. ( ఆలు గోబి కూర. )
తయారీ విధానము .
ఒక అరకిలో క్యాలీఫ్లవర్ గోరు వెచ్చని నీటిలో విడదీసి వేసుకుని సన్నగా ముక్కలు తరుగుకుని వేరే ప్లేటులో ఉంచుకోవాలి .
మూడు బంగాళా దుంపలు తొక్కతో పెద్ద ముక్కలుగా తరుగు కుని సరిపడా నీళ్ళు పోసుకుని ఉడక పెట్టుకుని చల్లారగానే పై తొక్క తీసుకుని విడిగా ప్లేటులో ఉంచుకోవాలి .
ఆరు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
పోపునకు .
ఎండుమిరపకాయలు -- 4 చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
పచ్చి శనగపప్పు -- స్పూనున్నర .
చాయమినపప్పు -- స్పూను.
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెబ్బలు .
నూనె -- నాలుగు స్పూన్లు
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
కారము -- స్పూనున్నర .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర ,ఆవాలు , ఇంగువ , కరివేపాకు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి పోపు వేసుకుని పోపు బాగా వేగగానే అందులో క్యాలీ ఫ్లవర్ ముక్కలు , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు వేసి మూత పెట్టి పది నిముషములు క్యాలీ ఫ్లవర్ ముక్కలను బాగా మగ్గనివ్వాలి .
తర్వాత ఉండికించి సిద్ధంగా ఉంచుకున్న బంగాళా దుంప ముక్కలు , స్పూను కారం వేసి అట్లకాడతో బాగా కదిపి మూత పెట్టి మరో అయిదు నిముషాలు మగ్గ నివ్వాలి .
పులుపు ఇష్టమయిన వారు ఒక కాయ నిమ్మరసం కూర దింపాక పిండుకుని బాగా కలుపుకోవాలి .
ఈ క్యాలి ఫ్లవర్ బంగాళాదుంప ( ఆలూ గోబి ) కూర చపాతీలలోకి , దోశెల లోకి మరియు భోజనము లోకి కూడా రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment