Saturday, January 6, 2018

కొత్తిమీర నిల్వ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తిమీర  నిల్వ పచ్చడి .

కావలసినవి .

కొత్తిమీర  --  రెండు పెద్ద కట్టలు .

వేర్లు కట్ చేసుకుని  కాడలతో సహా ఆకును  శుభ్రంగా  కడిగి  ఒక గుడ్డమీద వేసి తడి లేకుండా రెండు గంటల సేపు  ఎండ బెట్టు కోవాలి .

ఆ తర్వాత కాడలతో సహా  కత్తిరించుకోవాలి .

ఆ తర్వాత  ఆ మొత్తము  ఆకును  నూనె వేయకుండా  బాండీలో  మొత్తము  ఆకు  ముద్దగా  దగ్గర  పడే వరకు వేయించుకోవాలి .

తర్వాత కొత్తిమీర  ముద్ద  తొక్కులుగా  ఉండకుండా ఒకసారి మిక్సీలో  కొంచెం  మెత్తగా  వేసుకోవాలి .

చింతపండు  --  75 గ్రాములు తీసుకుని  ఒక ముప్పావు  గ్లాసు నీళ్ళు పోసుకుని  స్టౌ మీద పెట్టి  బాగా  చిక్కపడేంత వరకు  ఉడికించి  చిక్కగా రసము  వేరే గిన్నెలో కి తీసుకుని   మిగిలిన  పిప్పి  పార వేయాలి .

పై  కొత్తిమీర  మరియు చింతపండు  రసము బాగా చల్లారనివ్వాలి .

తర్వాత  స్టౌ మీద బాండీ  పెట్టి ఒక 100  గ్రాముల నువ్వుల నూనె కాని , వేరు శనగ  నూనె కాని పోసుకుని  నూనె  బాగా  కాగగానే  అందులో నాలుగు  ఎండుమిరపకాయలు , స్పూను జీలకర్ర , స్పూనున్నర  ఆవాలు   వేసుకుని పోపు  వేగగానే  రసము తీసి ఉడికించి ఉంచుకున్న  చింతపండు  రసము పోపులో  వేయాలి .

అందులో చెంచా  పసుపు , నాలుగు  స్పూన్లు కారం, తగినంత  ఉప్పు  (  షుమారు  నాలుగు స్పూన్లు  ఉప్పు  ) మరియు  75  గ్రాముల  బెల్లపు పొడి  అందులో వేయాలి .

అట్ల కాడతో  బాగా  అన్నీ కలిసి దగ్గర  పడేంతవరకు కలుపుకుని ,  సిద్ధంగా  ఉంచుకున్న  కొత్తిమీర  ముద్దను  ఆ పోపులో  వేసి  బాగా  కలుపుకోవాలి .

బాగా  చల్లారగానే  తీసుకుని  వేరేగా  ఒక జాడీలో గాని , ఒక  సీసాలో కానీ   తీసుకోవాలి .

అంతే  అద్భుతమైన  రుచిగా  ఉండే  కొత్తిమీర   నిల్వ పచ్చడి సిద్ధం.

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , చపాతీలు , రోటీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా ఉండే   అద్భుతమైన , రుచికరమైన  కొత్తిమీర  నిల్వ పచ్చడి  సిద్ధం.

ఈ పచ్చడి  ఏడాది అంతా  నిల్వ  ఉంటుంది .

ఇంట్లో  కొత్తిమీర   లేనప్పుడు  ఒక  స్పూను  ఈ కొత్తిమీర  పచ్చడి  చారు కాని , పులుసుల్లో కాని  వేసుకుంటే  అదే  మామూలు కొత్తిమీర   వేసుకున్న  రుచి వస్తుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి