ఆలూరుకృష్ణప్రసాదు .
మరో వెరైటీ టమోటో రసం.
కావలసినవి.
టమోటోలు -- 4
చింతపండు -- నిమ్మకాయంత
పచ్చిమిరపకాయలు - 4
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- చిన్న కట్ట లో సగం.
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
ఇంటిలో చారు పొడి సిద్ధంగా లేని వారు చారు పొడి సిద్ధం చేసుకోవాలి .
కావలసినవి .
ఎండుమిరపకాయలు -2
ధనియాలు -- స్పూనున్నర
జీలకర్ర -- అర స్పూను
పచ్చి శనగపప్పు - స్పూను
కందిపప్పు - అర స్పూను
మిరియాలు -- పావు స్పూను.
ఇంగువ -- కొద్దిగా
పై దినుసులన్నీ నూనె వేయకుండా బాండీలో వేయించుకుని చల్లారగానే మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ రసము పొడి మూడు నాలుగు సార్లు రసము పెట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది .
చారులో పోపునకు.
నూనె -- స్పూను
మెంతులు -- కొద్దిగా
జీలకర్ర -- కొద్దిగా
ఆవాలు -- కొద్దిగా
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము.
చింతపండు విడదీసి పది నిముషాలు ముందు నీటిలో నానబెట్టు కోవాలి .
తర్వాత గ్లాసుడు రసము తీసుకొని వేరే ఉంచుకోవాలి.
టమోటోలు పెద్ద ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి .
ఒక గిన్నెలో ఒక గ్లాసుడు నీళ్ళు పోసి టమోటో ముక్కలు వేసుకుని ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి .
నీళ్ళు విడిగా ఉంచుకోవాలి .
ముక్కలు చల్లారగానే మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .
లేదా చేతితో మెత్తగా చేసుకోవాలి .
ఇప్పుడు ఒక గిన్నెలో సిద్ధంగా ఉంచుకున్న టమోటో రసము , చింతపండు రసము పోసుకోవాలి.
అవసరమయితే మరో అర గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చును.
అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు , తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు , కరివేపాకు వేసుకుని స్టౌ మీద పెట్టి బాగా తెర్లనివ్వాలి .
ఆ తర్వాత రెండు స్పూన్లు రసము పొడి వేసి మరో అయిదు నిముషాలు తెర్లనివ్వాలి .
దింపుకుని పైన తరిగిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాగగానే ఎండుమిర్చి ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు రసము లో పెట్టుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే టమోటో రసము భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
ఇందులో బెల్లం వేయకూడదు.
ఈ రసము రెండు రోజులు నిల్వ ఉంటుంది .