Saturday, January 6, 2018

వంకాయ కాల్చి పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ కాల్చి పెరుగు పచ్చడి .

తయారీ విధానము .

మూడు గుండ్రని వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుని  వాటిపై నూనె రాసుకుని  స్టౌ మీద సిమ్ సెగలో అన్ని వైపులా కాల్చుకోవాలి .

చల్లారగానే  తడి చేయి చేసుకుని వాటిపై పొట్టు తీసుకుని వేరే ప్లేటులో విడిగా  ఉంచుకోవాలి .

ఒక గిన్నెలో  అర లీటరు పెరుగు వేసుకుని  నాలుగు పచ్చి మిరపకాయలు  ముక్కలుగా తరిగి  పెరుగులో వేసుకోవాలి .

ఒక కట్ట కొత్తిమీర  తరుగుకుని అందులో వేసుకోవాలి .

కొద్దిగా  పసుపు మరియు సరిపడా ఉప్పు పెరుగులో వేసుకోవాలి .

ఇప్పుడు కాల్చి తొక్కు తీసి విడిగా  ఉంచుకున్న  వంకాయలు కూడా వేసుకుని  చేతితో పెరుగులో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని మూడు స్పూన్లు  నెయ్యి వేసుకుని , నెయ్యి బాగా కాగగానే  మూడు ఎండుమిర్చి  ముక్కలుగా చేసుకుని , స్పూను  మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు కరివేపాకు  వేసి  పోపు పెట్టుకుని గరిటతో బాగా కలుపుకోవాలి ,

అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి భోజనము  లోకి సిద్ధం.

చుక్కకూర పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

చుక్కకూర  పచ్చడి .

కావలసినవి .

చుక్కకూర  --  రెండు కట్టలు.
పచ్చిమిర్చి  --  8
నూనె  --  అయిదు  స్పూన్లు
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత

పోపునకు.

ఎండుమిరపకాయలు  --  6
చాయమినపప్పు -- స్పూనున్నర
మెంతులు  --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా .

తయారీ విధానము .

ముందుగా  చుక్కకూరలో ముదురు కాడలు  తీసి వేసి శుభ్రం చేసుకుని సిద్ధంగా  ఉంచుకోవాలి .

తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  చుక్కకూర , పచ్చిమిర్చి , పసుపు వేసి మూత పెట్టి  ఆకును మగ్గ నివ్వాలి .

తర్వాత  మగ్గిన ఆకును విడిగా ప్లేటులో తీసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు, మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి  పోపు వేసుకోవాలి .

ఈ  వేయించిన పోపును  మిక్సీ లో వేసి , తగినంత  ఉప్పును వేసి మెత్తగా మిక్సీ వేసు కోవాలి .

తర్వాత  మగ్గిన చుక్క కూర , పచ్చిమిర్చి  వేసి ఒకసారి మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి.

ఇష్టమైన వారు  మినపప్పు  , ఆవాలు  మరియు ఎండుమిర్చి  వేసి తిరిగి పైన పోపు  వేసుకోవచ్చు .

ఈ చుక్కకూర పచ్చడిలో  ఆకులో  పులుపు ఉంటుంది  కనుక  చింతపండు  వేయనవసరము లేదు.

ఈ పచ్చడి దోశెలు, చపాతీలు మరియు భోజనము  లోకి ఎంతో రుచిగా  ఉంటుంది .

ఉల్లిపాయ చట్నీ

ఆలూరుకృష్ణప్రసాదు .

ఉల్లిపాయ చట్నీ.

ఉల్లిపాయలు రెండు ముక్కలుగా తరుగుకొని ,  పచ్చిమిర్చి  ఆరు ,చింతపండు రెబ్బలు మూడు , తగినంత  ఉప్పు ,  ఇష్టమైన వారు  కొద్దిగా  బెల్లం వేసుకుని  ఏదీ  వేయించనవసరం లేదు.

మిక్సీ లో పైన చెప్పినవన్నీ వేసుకుని  మరీ మెత్తగా  కాకుండా మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని  పైన  మూడు స్పూన్లు నెయ్యి పోపు గరిటెలో వేసి స్పూనున్నర మినపప్పు , అర స్పూను ఆవాలు ,  కొద్దిగా  ఇంగువ , రెండుఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసి  పోపు పెట్టుకోవాలి .

ఈ పచ్చడి ఇడ్లీ దోశెలు మరియు భోజనము లోకి కూడా బాగుంటుంది.

ఉల్లిపాయల  పచ్చి వాసన ఇష్టము లేని వారు ఇదే పద్థతిలో ఉల్లిపాయల ముక్కలను  మగ్గ పెట్టుకుని చేసుకోవచ్చును.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి