ఆలూరుకృష్ణప్రసాదు .
వామన చింతకాయలు .
వామన చింతకాయలు అంటే కొత్తగా సీజన్లో చింత చెట్లకు కాసే, గింజ పట్టని చిన్న చిన్న చింతకాయలు.
ఇవి చిన్నవిగా ఉంటాయి కనుక వామనుల వారు కూడా పొట్టిగా ఉంటారు కనుక మా ప్రాంతంలో వీటిని వామన చింతకాయలు లేదా చిట్టి / పొట్టి చింతకాయలు అని అంటాము .
ఈ చింతకాయలతో పులిహోర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
మనం ఇంట్లో చేసుకునే పులిహోరకు , గుళ్ళో మనకు ఆచార్యుల వారు పెట్టే పులిహోరకు రుచిలో చాలా తేడా ఉంటుంది .
గుళ్ళో ప్రసాదం రుచి మనకు ఇంట్లో రాదు.
కారణం మనం పులిహోరలో చింతపండు రసం వాడతాము.
ఆచార్యుల వారు చింతకాయలు తొక్కి పులిహోర లో వేసి తయారు చేస్తారు .
అదే ప్రధానమైన తేడా.
ఈ విషయం నా చిన్ననాటి పూజారి స్నేహితుడు చెప్పారు .
ఇంక వామన చింతకాయలతో పులిహోర ఏ విధముగా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం .
వామన చింతకాయలతో పులిహోర .
**********************
వామన చింతకాయులు. --
ఒక 100 గ్రాములు .
ఈ కాయలను శుభ్రంగా కడిగి ఆర నిచ్చి , చిన్న ముక్కలుగా తరుగుకొని , తగినంత ఉప్పు మరియు అర స్పూను పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ మొత్తం 100 గ్రాముల పచ్చడిలో సగం పచ్చడి అంటే షుమారు 50 గ్రాముల పచ్చడి తీసుకోవాలి .
మిగిలిన పచ్చడి విడిగా చిన్న జాడీ లోకి తీసుకుంటే ,తర్వాత అవసరమైనప్పుడు మనం మామూలుగా చింతకాయ పచ్చడి భోజనాలలోకి చేసుకోవచ్చును.
పచ్చిమిర్చి -- 10
కరివేపాకు -- నాలుగు రెమ్మలు .
బియ్యము -- ఒక గ్లాసు లేదా
షుమారు 150 గ్రాములు.
పసుపు -- అర స్పూను
ఉప్పు -- తగినంత .
పోపునకు.
ఎండుమిరపకాయలు -- 8 .
పచ్చిశనగపప్పు -- రెండు స్పూన్లు .
చాయమినపప్పు -- రెండు స్పూన్లు
వేరుశనగ గుళ్ళు -- నాలుగు స్పూన్లు .
ఆవాలు -- ముప్పావు స్పూన్ .
జీడిపప్పు -- 8 పలుకులు .
ఇంగువ - తగినంత .
నూనె -- 125 గ్రాములు.
తయారీ విధానము .
ఒక గ్లాసు బియ్యం కడిగి తగినన్ని నీళ్ళు పోసుకుని స్టౌ మీద పెట్టి కొంచెం పొడి పొడి లాడే విధముగా వండుకోవాలి .
ఇప్పుడు ఒక బేసిన్ లో ఉడికిన అన్నం వేసుకుని , అందులో పావు స్పూను పసుపు , రెండు రెమ్మలు కరివేపాకు , కొద్దిగా ఉప్పు మరియు ఒక అర గరిటెడు నూనె వేసి , గరిటెతో వేడి మీదనే బాగా కలుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండి పెట్టి మిగిలిన మొత్తము నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు, ఇంగువ , వేరుశనగ గుళ్ళు మరియు జీడిపప్పు ను వేసి పోపును బాగా వేగనివ్వాలి .
తర్వాత అందులో పచ్చి మిర్చి , కరివేపాకును వేసి రెండు నిముషాలు పచ్చి మిర్చి ని మగ్గ నివ్వాలి .
తర్వాత మిక్సీ వేసుకుని సిద్ధంగా ఉంచుకున్న చింతకాయల మిశ్రమమును కూడా పోపులో వేసుకుని రెండు నిముషాలు ఈ మిశ్రమము పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వాలి.
తర్వాత ఈ పోపును బెసిన్ లో సిద్ధంగా ఉంచుకున్న అన్నము లో వేసుకుని చేతితో నాలుగు మూలలా బాగా కలిసే విధముగా కలుపుకోవాలి .
చింతకాయల మిశ్రమములో మరియు అన్నము లో సరిపడే ఉప్పు వేసుకుంటాము కనుక రుచి చూసి ఉప్పు తగ్గితే కలుపుకోండి .
అంతే ఘుమ ఘుమ లాడే ఇంగువ వాసనతో వామన చింతకాయలతో పులిహోర సర్వింగ్ కు సిద్ధం.
ఇప్పుడు మార్కెట్లో ఈ చిన్న చింతకాయలు బాగా దొరుకుతున్నాయి .
కనుక ఇప్పుడు ఈ వామన చింతకాయల పులిహోర చేసుకోవచ్చును.
శ్రావణ మాసం లో లక్ష్మీ అమ్మ వారికి , భాద్రపద మాసంలో గణపతికి , ఆశ్వయుజ మాసంలో దుర్గా దేవికి మహా నైవేద్యం గా కూడా ఈ పులిహోర నివేదన చేయవచ్చును .
సంబంధించిన రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .