Wednesday, July 4, 2018

మినప వడియాలు(చిన్నవి)

ఆలూరుకృష్ణప్రసాదు .

మినప్పిండి తో  చిన్న   వడియాలు .

ఇప్పుడు   ఎండలు మండి  పోతున్నాయి  .

ఈ  సమయంలో  సగ్గు బియ్యం  వడియాలు , బూడిద  గుమ్మడి  వడియాలు , ఊర  మిరపకాయలు
పెట్టుకుంటే గల  గలా  ఎండుతాయి .

చాలా  మంది  బూడిద  గుమ్మడికాయ   వడియాలతో  పాటే  ఈ  చిన్న వడియాలు   పెట్టుకుంటారు .

ఈ వడియాలు  తోటకూర   కూరలో , వంకాయ  అల్లం  మిర్చి  కూరలో , పనస  పొట్టు కూరలో  ఇలా  చాలా  కూరల్లో  ,  విడిగా   వేయించి  కలుపుతారు .

దీనివల్ల  ఆ కూరలకు  అదనపు  రుచి  వస్తుంది.

మరి కొంత  మంది  కూరల్లో  కలిపితే  వడియాలు  మెత్త  పడతాయని  , విడిగా   వేయించుకుని  కూర తో  పాటుగా  కలిపి , ముద్దలో  పెట్టుకుని  తింటారు .

మేము  ఏడాదికి  సరిపడా  ఒక  K . G .  మినపగుళ్ళు  నానబోసి  ఒకే సారి  పెట్టుకుంటాము .

అయితే  వీటికి  వాతావరణ మార్పుల  బట్టి  తొందరగా పురుగు  పట్టే  లక్షణం  ఉంది  కనుక   మూడు నెలల కొకసారి  ఏ రోజున  ఎండ  బాగా  ఉంటుందో  ఆ రోజున  ఈ  చిన్న వడియాలన్నీ  చాటలో  పోసి  డాబా  పైన  ఎండ బెట్టు కుంటాము .

మళ్ళీ  సాయంత్రం   డబ్బా లో  పోసుకుంటాము .

కొంతమంది    Zip  Lock  Covers  లో  పోసి  ఫ్రిజ్  లో  పెట్టుకుంటారు .

కావలసినన్ని  అవసరమయినపుడు వేయించుకోవటానికి  తీసుకొని  మళ్ళీ  కవర్  ఫ్రిజ్ లో  పెట్టేసుకుంటారు .

అప్పుడు   కూడా  పురుగు  పట్టవు .

ఇదివరకు   పాత రోజుల్లో   గుడ్డల  మీద  పెట్టుకునేవారు .

చాలా  కష్ట పడే వారు .

ఇప్పుడు   ప్లాస్టిక్   Sheets  వచ్చేసాయి .

అందరూ  ఈ  ప్లాస్టిక్   కవర్ల  మీదే  పెట్టుకుంటున్నారు .

ఆ  విధంగా  ప్లాస్టిక్   కవర్ల  మీద  పెట్టుకుంటే  సులువుగా   ఊడి వస్తాయి .

మేము  పెట్టుకున్న వడియాలు  అయిపోయినప్పుడు  బజార్లో  చాలా  సార్లు  కొన్నాము .

రుచి  పచి  లేకపోగా  గట్టిగా  వేయించాక  గులక రాళ్ళు  ఉన్నట్లు  ఉన్నాయి .

అందువల్ల  మీరు  కూడా  తప్పని సరై  బజార్లో  కొనవలసివస్తే  ముందు  ఓ  50  గ్రాముల  వడియాలు   కొనుక్కుని  , వేయించి  చూసుకుని  నచ్చితే  ఎక్కువ   మోతాదులో  కొనుక్కోండి .

మినపగుళ్ళతో  చిన్న వడియాలు  పెట్టుకునే విధానము .

****************************

ఒక  అర కిలో  మినపగుళ్ళు  ముందు రోజు  రాత్రి  తగినన్ని   నీళ్ళు  పోసి  నానబెట్టుకోండి .

మరుసటి  రోజు   ఉదయం   మీరు  Wet  Grinder  లో  మీరు  బూడిద  గుమ్మడికాయ    వడియాలకు  పిండి  ఎలా  వేసుకుంటారో  అలా  మెత్తగా   వేసుకొని   ఒక  గిన్నె లోకి  తీసుకోండి .

ఒక   150  గ్రాముల పచ్చి  మిరపకాయలు   తొడిమలు  తీసి  మిక్సీ  లో  మెత్తగా   వేసుకోవాలి .

తగినంత   ఉప్పు  , పావు  స్పూను  పచ్చి  ఇంగువ  మరియు  పచ్చిమిర్చి   మిశ్రమము  పిండిలో  వేసి  చేత్తో  బాగా  కలిపి  ప్లాస్టిక్   కవర్ల  మీద  చిన్న  చిన్న  సైజులో  వడియాలు   పెట్టుకోవాలి .

ఇప్పుడున్న   ఎండల  కయితే  ఒక్క రోజులోనే  ఎండి పోతాయి .

అవసరమయితే  రెండో  రోజున    కూడా  ఎండ  బెట్టకుని  ఒక  Container  లో  పోసుకోండి .

మీకు  మినపగుళ్ళతో  చిన్న వడియాలు  సిద్ధం.

మేము  ఈ  వడియాలు  ,  ఊరు  మిరపకాయలు  , గుమ్మడి  వడియాలు  వేయించుకుని  వేడి  వేడి  అన్నంలో  నెయ్యి  వేసుకొని   ఈ వడియాలు  కలుపుకు  తినేస్తాము .

చాలా  రుచిగా   ఉంటాయి .

ఫోటో   ---  ఈ  సంవత్సరం   మేము  పెట్టుకున్న  వడియాలు .

సంబంధించిన  రెసిపీ మరియు ఫొటోలు నా స్వంతం .

సాంబార్ రైస్

ఆలూరుకృష్ణప్రసాదు .

సాంబార్  రైస్ .

వేసవికాలం .
పిల్లలకు శలవులు .అక్కడకు వెడదాం.ఇక్కడకు తీసుకు వెళ్ళండి అని గొడవ చేస్తుంటారు .

అలాటి సందర్భాలలో

దూరపు  ప్రయాణాలు , చిన్న పిక్నిక్ లకు చేయవలసి  వచ్చినప్పుడు   ఇలా  సాంబార్  రైస్  మరియు  దద్ధ్యోజనం   చేసుకొని    వెడితే   నలుగురు   మీద  ఖర్చులు  కలిసి  వస్తాయి  మరియు  ఆరోగ్యానికి   మంచిది .

అలాగే   నలుగురు  families  సరదాగా   ఎక్కడికైనా  వెళ్ళేటప్పుడు  కూడా  ఈ  సాంబార్  రైస్  తయారు చేసుకుని   వెంట  తీసుకొని   వెళ్ళవచ్చు  .

మనం  సాంబారు  పొడి  తయారు  చేసుకొని   సిద్ధంగా   ఉంచుకుంటే    సులువుగా   సాంబార్  రైస్  తయారీ  అయిపోతుంది .

సాంబారు  పొడి  తయారీ  ---

ఎండుమిర్చి  ---  15
పచ్చిశనగపప్పు   --   అయిదు  స్పూన్లు
ఎండు కొబ్బరి --  అర చిప్ప. చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
ధనియాలు  -- నాలుగు  స్పూన్లు
మిరియాలు  --  ఒక  స్పూను
ఇంగువ   ---  పావు స్పూను లో సగం.
బియ్యం  --  రెండు  స్పూన్లు

పై  వన్నీ  బాండీలో  నూనె  లేకుండా  వేయించుకొని  చల్లారగానే  మెత్తగా   మిక్సీ  వేసుకోవాలి .

ఈ  పొడిని  ఒక  సీసాలో  భద్ర పరుచుకోవాలి .

ఈ  పొడి  మనం  విడిగా   సాంబారు  పెట్టుకోవడానికి  కూడా  ఓ  ఐదు  ఆరు సార్లకు  వస్తుంది .

సాంబార్  రైస్  తయారీ  విధానము

కావలసినవి .

ఉల్లిపాయలు  ---  మూడు
సొరకాయ ముక్క --  ఒకటి
వంకాయలు  --  నాలుగు లేదా
బెండకాయలు --  పది

ఈ కూరలన్నీ  ముక్కలుగా  తరుగుకొని  వేరుగా పెట్టుకోవాలి .

పచ్చి  మిర్చి  ఒక  అయిదు  నిలువుగా   తరగాలి.

కరివేపాకు  ఒక మూడు  రెమ్మలు , కొత్తిమీర  ఒక చిన్న  కట్ట  సిద్ధంగా  ఉంచుకోవాలి .

పెద్ద  నిమ్మకాయంత  చింతపండు   పదిహేను  నిముషాలు  ఒక  గ్లాసున్నర నీళ్ళలో   నానబెట్టి  రసం  తీసుకోవాలి .

ఒక  గ్లాసు బియ్యం తగినన్ని నీళ్ళు పోసి  విడిగా  స్టౌ  మీద  పెట్టి కొంచెం  పొడి పొడిగా   వండుకోవాలి.

అలాగే ఒక కప్పు కందిపప్పు  తగినన్ని  నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి .

అన్నం ఒక గిన్నెలో , పప్పు ఒక గిన్నెలో  పెట్టుకుని  రెండూ కలిపి కుక్కర్ లో పెట్టుకోవచ్చు .

సమయం కలిసి వస్తుంది .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండి  పెట్టి  నాలుగు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   మూడు ఎండుమిరపకాయలు   ముక్కలుగా చేసి ,  పావు  స్పూను మెంతులు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ ,
కరివేపాకు మరియు  పచ్చిమిర్చి  ముక్కలు   వేసి పోపు  వేయించి  అందులో  తరిగిన అన్ని కూరల ముక్కలు మరియు ఉల్లిపాయల  ముక్కలు , కొద్దిగా  పసుపు , స్పూను  కారం , మరియు తగినంత   ఉప్పు వేసి  మూతపెట్టి     పది నిముషాలు   ముక్కలన్నీ మెత్తగా  మగ్గ నివ్వాలి .

ఆ తర్వాత  అందులో  చింతపండు  రసం  మరో రెండు గ్లాసులు నీళ్ళు  పోసి  బాగా  తెర్లనివ్వాలి .

ఆ తర్వాత ఉడికించిన పప్పు కూడా కలుపుకోవాలి .

తర్వాత  మూడు  స్పూన్లు   సాంబారు  పొడి  వెయ్యాలి .

అయిదు  నిముషాలు  తెర్లిన  తరువాత  దింపి  కొత్తిమీర   వేసుకోవాలి .

ఇంతవరకు  సాంబార్  సిద్ధమైంది .

ఇప్పుడు  ఉడికిన అన్నం  బేసిన్  లోకి  తీసుకొని  చల్లార పెట్టుకోవాలి .

వేడి మీద కలిపితే వాసన రావచ్చును .

చల్లారిన అన్నంలో సాంబారు , నాలుగైదు స్పూన్లు   నెయ్యి  వేసి  అన్నం  కలుపుకోవాలి .

లేదా  తెర్లుతున్న  సాంబారు  లో  పట్టిన  వరకు  ఉడికిన  అన్నం  వేసి  గరిటతో  బాగా కలిపి  మరో  అయిదు  నిముషాలు  స్టౌ  మీద  ఉంచి  దింపే ముందు  నెయ్యి  వేసి  గరిటతో  బాగా  కలిపి  దింపు కొని విడిగా చల్లార బెట్టుకోవాలి .

అప్పటికప్పుడు తినాలనుకుంటే  ఐతే  వేడిగా  తినవచ్చు .

బాక్స్ లో  సర్దుకోవాలనుకునే  పక్షంలో  చల్లారాక  పెట్టుకోండి .

వేడి  మీద  పెడితే   వాసన వచ్చి నిల్వ  ఉండక పోవచ్చు .

ఈ సాంబార్ రైస్ తో పాటుగా అప్పడాలు కూడా వేయించుకుని బాక్స్ లో సర్దుకుని  తీసుకొని  వెళ్ళి తింటే ఆ రుచే వేరు .

సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం.

దోసకాయ మామిడి  కాయ ముక్కలతో పచ్చడి .

ఆలూరుకృష్ణప్రసాదు .

దోసకాయ మామిడి  కాయ ముక్కలతో పచ్చడి .

కావలసినవి .

పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.

పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .

పుల్లని మామిడి  కాయ --  ఒకటి .

పై చెక్కు  తీసుకుని  మాగాయ ముక్కలు మాదిరిగా  తరుగు కోవాలి .

పచ్చిమిరపకాయలు  --  10

కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .

కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .

ఉప్పు   ---   తగినంత

పసుపు  ---  కొద్దిగా .

పోపుకు  .

ఎండుమిరపకాయలు  --  8

మినపప్పు   ---  స్పూనున్నర 

మెంతులు  ---   పావు  స్పూను

ఆవాలు  ---   అర  స్పూను 

ఇంగువ  ---  కొద్దిగా

నూనె  ---   50  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.

నూనె  బాగా  కాగనివ్వాలి  .

నూనె బాగా కాగగానే ముందుగా   మెంతులు వేసి బాగా వేగాక ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .

ఎక్కువ   నూనె బాండీలో మిగిలి  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.

బాండీ లోనే  ఉంచేయండి

పోపు  చల్లారగానే  ముందుగా   మిక్సీ  లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోండి.

తరువాత  పచ్చిమిర్చి  , మామిడి  కాయ ముక్కలు   మరియు  పోపు వేసి  మెత్తగా  మిక్సీ  వేసుకోండి .

చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   దోసకాయ  ముక్కలు  నలగ  కుండా ఒకే ఒక్కసారి మిక్సీ  వేసుకోండి.

తర్వాత ఈ పచ్చడి  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసకాయ మరియు మామిడి  కాయ ముక్కలతో  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

సంబంధిత రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి