Saturday, April 14, 2018

దొండకాయ మసాలాకూరపొడి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

దొండకాయ మసాలాకూరపొడి కూర.

కావలసినవి .
 
దొండకాయలు  -- అర కిలో
నూనె --  నాలుగు  స్పూన్లు

కూర పొడికి.

ఎండుమిరపకాయలు  --  15
పచ్చిశనగపప్పు  --  మూడు  స్పూన్లు
చాయమినపప్పు  --  స్పూనున్నర
వేరుశనగ గుళ్ళు --  రెండు స్పూన్లు
నువ్వుపప్పు  --  స్పూనున్నర
ఎండుకొబ్బరి  --  పావు చిప్ప. ( చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .)
జీలకర్ర  --  అర స్పూను
ఉప్పు  --  తగినంత
నూనె --  మూడు స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి  మూడు 
స్పూన్లు  నూనె వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు ,
పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , వేరుశనగ  గుళ్ళు , నువ్వుపప్పు , ఎండు కొబ్బరి  ముక్కలు  మరియు  జీలకర్ర  వేసి కమ్మని వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి.

చల్లారగానే  మిక్సీలో  ఈ మిశ్రమమును మరియు సరిపడ  ఉప్పు వేసి మరీ మెత్తగా  కాకుండా  పొడి వేసుకోవాలి .

తర్వాత  దొండకాయలు  చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద మందపాటి  గిన్నె కాని  , ఇత్తడి  గిన్నె కాని పెట్టి  మొత్తము  నాలుగు  స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  దొండకాయ ముక్కలు మరియు కొచెం  ఉప్పు వేసి  అట్లకాడతో బాగా కలిపి , స్టౌ మీడియం సెగన పెట్టి , ఒక గిన్నెలో  పావు వంతు  నీళ్ళు  పోసి , ఆ నీళ్ళ గిన్నె  మూత పెట్టాలి .

ఇలా  ముందుగా  కొంచెం  ఉప్పు వేయడం వలన మరియు నీళ్ళ గిన్నె  మూత పెట్టడం వలన  ముక్కలు  బాగా మగ్గుతాయి .

మధ్య మధ్యలో కదుపుతూ ఒక పది నిముషాలు  పైగా  ముక్కలను  మగ్గనివ్వాలి .

తర్వాత నీళ్ళ మూత  తీసివేసి  ముందుగా  సిద్ధం చేసుకున్న కూర పొడి  వేసుకుని  ఓ అయిదు నిముషాల పాటు ఉంచి, పొడి కమ్మగా వేగిన వాసన రాగానే  దింపుకుని , వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా ఉండే  దొండకాయ మసాలా కూరపొడి  కూర భోజనము లోకి సిద్ధం.

మునక్కాడ ఉల్లిపాయల కూర

మునక్కాడ ఉల్లిపాయల  కూర.

మనం కాకరకాయలను  ఉడకపెట్టి  చింతపండు  రసము బెల్లం పెట్టి  కాకరకాయ  ముక్కల కూర చేసుకుంటాము.

అదేవిధంగా  మనం  మునక్కాడ ఉల్లిపాయల  కూర కూడా  చేసుకోవచ్చును.

ఈ కూరను  గట్టిగా  చేసుకొనవచ్చును .
లేదా కూర పులుసులా మధ్యస్థంగా  చేసుకొనవచ్చును .

అలా  కొంచెం  పల్చగా  చేసుకున్నప్పుడు కాంబినేషన్ గా  కందిపచ్చడి  చేసుకుంటే చాలా  రుచిగా  ఉంటుంది .

ఇంక ములక్కాడ ఉల్లిపాయల  కూర తయారీ విధానము  గురించి తెలుసుకుందాం.

మునక్కాడ ఉల్లిపాయ కూర .

కావలసినవి.

ములక్కాడలు  -- 3 
ఉల్లిపాయలు  --  4
పచ్చిమిరపకాయలు -- 8
కరివేపాకు  --  మూడు రెమ్మలు 
చింతపండు  --  నిమ్మకాయంత  లేదా  షుమారు 30  గ్రాములు
బెల్లం  --  చిన్న ముక్క
ఉప్పు --  తగినంత
పసుపు  --  పావు స్పూను

పోపుకు .

ఎండుమిరపకాయలు  -- 5  (  ముక్కలుగా  చేసుకోవాలి )
చాయమినపప్పు  --  స్పూను
మెంతులు  --  పావు స్పూను
జీలకర్ర  -- అర స్పూను
ఆవాలు  -- అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  నాలుగు  స్పూన్లు

తయారీ విధానము .

ముందుగా  చింతపండు  విడదీసి  ఒక గ్లాసు నీళ్ళలో పావు గంట సేపు నానబెట్టి   ఒక గ్లాసు రసము  తీసుకోవాలి .

ములక్కాడలు పై చెక్కు  తీయనవసరము లేదు.
ముక్కలుగా  తరుగుకోవాలి .

ఉల్లిపాయలు  చిన్న ముక్కలుగా  తరుగుకోవాలి.

పచ్చిమిర్చి  నిలువుగా  చీలికలుగా తరుగుకోవాలి.

ముందుగా   స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తము  నూనె వేసి నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు వేసి  కొద్దిసేపు వేగనివ్వాలి .

తర్వాత  ఎండుమిర్చి  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు, ఇంగువ వేసి  పోపు వేయించుకోవాలి.

తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు  వేసి  కాసేపు మగ్గనివ్వాలి.

తర్వాత అందులో ఉల్లిపాయల ముక్కలు, మునక్కాడ ముక్కలు  , పసుపు , మరియు  కొద్దిగా  ఉప్పు వేసి మూతపెట్టి  పదినిముషాల పాటు ఉల్లిపాయలు ,  మునక్కాడ ముక్కలు మూడొంతులు మగ్గనివ్వాలి .

తర్వాత చింతపండు  రసము , బెల్లం  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మరో పదినిముషములు  పాటు  ఉల్లిపాయలు , ములక్కాడ ముక్కలు  పూర్తిగా  ఉడకనివ్వాలి .

తర్వాత  వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

ఈ కూర / పులుసు చిక్కగానే ఉంటుంది .

బియ్యపు పిండి  పెట్టనవసరము లేదు.

బెల్లం  అస్సలు  ఇష్టం  లేని వారు బెల్లం  వేయకుండా  చేసుకొనవచ్చును .

పులుసుగా పల్చగా  చేసుకుంటే  బెల్లం  వేసుకుంటేనే  రుచిగా  ఉంటుంది .

దీనికి  కాంబినేషన్ గా  కందిపచ్చడి  చాలా రుచిగా ఉంటుంది .

ఈ పులుసు  మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే మునక్కాడ ఉల్లిపాయల  కూర / పులుసు సర్వింగ్  కు సిద్ధం.

అవియళ్

ఆలూరుకృష్ణప్రసాదు .

అవియళ్ .

అవియళ్  కేరళ వారి వంటకం.

ఇందులో అన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటారు  కావున  చాలా  బలవర్ధకమైన  వంటకము.

కేరళ ప్రాంతంలో  వారు  అన్ని వంటలకు  కొబ్బరి  నూనెను వాడతారు .

అందువల్ల వారు ఈ అవియళ్ లో కూడా కొబ్బరి నూనె నే వాడతారు .

నిజానికి  మనం కూడా కొబ్బరి  నూనె  వాడితేనే  మంచిది.

ఒకవేళ  కొబ్బరి  నూనె  వేసుకోవడం ఇష్టం లేకపోతే  నూనె  వాడకండి .

దాని బదులుగా  నెయ్యి వాడండి.

ఇంక ఈ అవియళ్  కు కావలసిన వస్తువులు మరియు తయారు  చేయు విధానము గురించి  తెలుసుకుందాము.

కావలసినవి .

బంగాళా దుంపలు  --  రెండు.(  పై చెక్కు తీసి  ముక్కలుగా  చేసుకోవాలి )

క్యారెట్  --  రెండు ( చెక్కు  తీసుకోవాలి )

బీన్స్  -- చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .)

ములక్కాడలు  --  2  ( 
ముక్కలుగా  కట్ చేసుకోవాలి .) 

ఆనపకాయ  లేదా  సొరకాయ  --  ఒక ముక్క .  (  పై  చెక్కు తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

అరటికాయ  --  పెద్దది  ఒకటి .  (  చెక్కు  తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

దొండకాయలు --   8 ( ముక్కలుగా  తరుగు కోవాలి .)

పచ్చి బఠాని  గింజలు  --  అర కప్పు .

కొత్తిమీర  --  ఒక  కట్ట . (  సన్నగా  తరుగు కోవాలి .)

కరివేపాకు  --  మూడు రెమ్మలు .

కొబ్బరి  నూనె  లేదా  /  నెయ్యి  --  ఆరు  స్పూన్లు

కొబ్బరి కాయ  --  1  (  రెండు  చిప్పలు  కోరాముతో  తురుము కోవాలి . )

గట్టి పెరుగు  --  అర లీటరు . ( పుల్లగా ఉంటే  బాగుండదు . కమ్మగా ఉండాలి . )

జీలకర్ర  --  స్పూను

పచ్చి మిరపకాయలు --   6 
పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ( ముక్కలుగా   చేసుకోవాలి )
ఆవాలు  --  అర స్పూను .

తయారు చేయు విధానము .

ముందుగా   తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలు మరియు ఒలుచుకున్న బఠాణీ గింజలు  ఒక గిన్నెలో  వేసుకుని  సరిపడా  ఉప్పు  మరియు  నీళ్ళు పోసుకుని  కుక్కర్ లో  పెట్టుకుని  మూడు విజిల్స్  రానిచ్చి  దింపుకుని  కొద్దిగా  నీరు  ఉంటే  గిన్నెలో  అలాగే  ఉంచుకోవాలి .

తర్వాత  తురిమిన పచ్చి కొబ్బరి , పచ్చిమిరపకాయలు , జీలకర్ర , సరిపడా ఉప్పు వేసుకుని  మరియు కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మరీ పల్చగా  కాకుండా  ముద్దలా  వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  ఉడికిన నీళ్ళతో  ఉన్న ముక్కల గిన్నెను  పెట్టి , అందులో   మిక్సీ  వేసుకున్న కొబ్బరి  ముద్దను  వేసి , ముక్కలు  ముద్ద బాగా  దగ్గర పడి  కలిసి పోయేలా  ఓ పది   నిముషాలు   ముద్ద పచ్చి వాసన పోయేదాకా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  ముక్కలతో   ఉడికిన  మిశ్రమాన్ని బాగా  చల్లారనివ్వాలి .

వేడి  మీద పెరుగు కలిపితే  విరిగి  పోతుంది .

తర్వాత  పెరుగును  గరిటతో  బాగా  కలుపుకుని  ఈ  ముక్కలలో  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము  నెయ్యి వేసి , నెయ్యి  బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , ఆవాలు , కరివేపాకు  వేసుకుని  పోపు  వేసుకుని  ఈ  పెరుగు కలిపిన  ముక్కలలో  వేసుకోవాలి .

తర్వాత తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  అవియళ్  చపాతీల లోకి , భోజనము  లోకి , చివరికి  వట్టిగా  తినడానికి  కూడా  సర్వింగ్  కు సిద్ధం .

పసుపు వేస్తే అవియళ్ తెల్లగా  ఉండదు . పసుపు అవసరం లేదు.

పోపు దినుసులు మినపప్పు , పచ్చిశనగపప్పు  వంటివి  ఇందులో బాగుండదు .

ఇంగువ ,  ఎండు కారము వంటివి వేస్తే  బాగుండవు .

ఎంత కమ్మగా  ఉంటే  అవియళ్  అంత  రుచిగా  ఉంటుంది .

ఎవరైనా  అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు  మరియు ప్రత్యేక సందర్భాలలో  ఈ అవియళ్  తయారు చేసుకుంటే  చాలా  కలర్ ఫుల్ గా ఉండి ఫంక్షన్ కు నిండు తనం  తెస్తుంది .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి