Monday, February 5, 2018

ఆకాకర కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

ఆకాకరకాయలు .

నిన్న అనుకోకుండా  మార్కెట్ లో  ఆకాకరకాయలు   కనపడ్డాయి .

వెంటనే  కొన్నాను.

ఆకాకరకాయ  కూర  రుచే  భిన్నంగా  ఉంటుంది .

ఆ  గింజలు  వేగి  కూరకు  మరింత రుచి వస్తుంది .

మరి  ఆకాకరకాయ  వేపుడు  తయారీ  విధానము.

కావలసినవి .

ఆకాకరకాయలు  --  పావుకిలో
ఎండుమిరపకాయలు  -- 3
చాయమినపప్పు  -- స్పూను
ఆవాలు  --  అర స్పూను .
నూనె  --  నాలుగు స్పూన్లు
కరివేపాకు  --  మూడు రెమ్మలు.

తయారీ విధానము .

ముందుగా  ఆకాకరకాయలను  చిన్న ముక్కలుగా , గింజలతో సహా తరుగు కోవాలి .

తర్వాత  రెండు స్పూన్లు  ఎండుకారంలో  స్పూను  జీలకర్ర  మరియు  సరిపడా  ఉప్పు వేసి  మిక్సీ లో  మెత్తని  పొడిగా  చేసుకుని  విడిగా  ఉంచుకోండి .

తర్వాత  స్టౌ మీద బాండీ పెట్టి  మొత్తం  నూనె  పోసి ఎండుమిరపకాయల  ముక్కలు , చాయమినపప్పు , ఆవాలు మరియు  కరివేపాకు  వేసి పోపు పెట్టుకుని  తర్వాత  ఆకాకరకాయ  ముక్కలను కూడా వేసి  మీడియం సెగన  వేయించుకుని  చివరగా  సిద్ధం చేసుకున్న జీలకర్ర  కారం  వేసుకుని  మరో  మూడు నిముషాలు  ఉంచి  దింపుకోవాలి .

మెత్తగా  ఇష్టమైన వారు మూతపెట్టి  ముక్కలను  మగ్గ పెట్టు కోవచ్చును.

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఆకాకరకాయ  వేపుడు  సర్వింగ్  కు సిద్ధం.

సాంబారు పొడి

ఆలూరు కృష్ణ ప్రసాదు .

సాంబారు  పొడి .

సాంబారు  రుచికరంగా  తయారవ్వాలంటే  సాంబారు  పొడి  కాని  లేక సాంబారు  ముద్ద  కాని  వేసుకోవాలి .

దక్షిణాదిన  తమిళనాడు వారే  రక రకాల  సాంబారులు  ప్రతి రోజు  పెట్టుకుంటారు .

ప్రతిరోజు  భోజనములో వారు సాంబారుతో పాటుగా  రసము కూడా  పెట్టుకుంటారు .

దక్షిణాది వారు  సాంబారులో  అన్ని రకములైన కాయగూరలు మరియు ఎక్కువ  మోతాదులో  పప్పు వేసి  బాగా  చిక్కగా  సాంబారు  పెట్టుకుంటారు.

ఉదయం ఇడ్లీ , వడలు  మొదలైన  టిఫిన్ల లో  సాంబారు  ఒక రకంగా , మధ్యాహ్నము  భోజనము  లోకి  సాంబారు  మరో రకంగా  పెట్టుకుంటారు .

మన ఆంధ్రాలో  దొరికే  సాంబారు  పొడులు  అంత రుచిగా  ఉండవు .

తమిళనాడులో  అంబిక , శక్తి  ఇంకా  ఇతర కంపెనీ వారి సాంబారు పొడులు  ప్రతి షాపులోను  విరివిగా  దొరుకుతాయి .

వాటిలో  With మసాలా , Without  మసాలా అని  కూడా  ఉంటాయి .

మసాలా  అంటే  దాల్చిన  చెక్క మరియు లవంగాలు వాసన వేస్తూ  పొడి చాలా ఘూటుగా  ఉంటుంది .

మసాలా వేయనిది  అంటే  పై వస్తువులు  వేయకుండా  చేసినది కూడా దొరుకుతుంది .

మామూలుగా  సాంబారు లోకి  మసాలా  వేయనిదే  రుచిగా  ఉంటుంది .

ఈ సాంబారు పొడి  నెలకు సరిపడా  ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు .

సాంబారు పొడి .

తయారీ  విధానము .

కావలసినవి.

ఎండుమిరపకాయలు  -- 15
చాయమినపప్పు  -- 75 గ్రాములు
పచ్చి శనగపప్పు  -- 50 గ్రాములు.
కందిపప్పు  --  25 గ్రాములు
బియ్యము  --  రెండు స్పూన్లు 
మెంతులు  --  స్పూను
జీలకర్ర  --  స్పూను
ఆవాలు --  అర స్పూను.
ధనియాలు  --  100 గ్రాములు.
మిరియాలు  --  షుమారు  25
ఇంగువ  --  పొడి  కాకుండా  పలుకులు 5 ముక్కలు
కరివేపాకు  --  తడి లేకుండా  పొడిది  ఒకటిన్నర  కప్పు.
పసుపు  --  ఒక స్పూను.

తయారీ  విధానము .

ముందుగా  చాయ మినపప్పు , పచ్చి శనగపప్పు , కందిపప్పు , బియ్యము , ధనియాలు  నూనె  అసలు  వేయకుండా  ఒక బాండిలో  కమ్మని  వాసన వచ్చేదాకా  వేయించుకుని  విడిగా  వేరే పళ్ళెంలోకి  తీసుకోండి .

దానిపైన  స్పూను  పసుపు  వేసుకోండి .

ఆ తర్వాత స్టౌ మీద  బాండీ  పెట్టి  కరివేపాకు  నూనె  వేయకుండా  ఎర్రగా వేయించుకుని  వేరేగా ఉంచుకోండి .

ఆ తర్వాత  తిరిగి  బాండిలో  నూనె లేకుండా  ఎండుమిరపకాయలు ,  మెంతులు , జీలకర్ర , ఆవాలు , మిరియాలు , ఇంగువ పలుకులు కూడా  వేసి  వేయించుకోండి .

ముందుగా  మిక్సీ లో  మొదట వేయించుకున్న ధనియాలు , శనగపప్పు , కందిపప్పు , మినపప్పు  తదితర మిశ్రమాన్ని  వేసి  మెత్తగా  పొడి వేసుకుని  ఒక బేసిన్  లో  తీసుకోండి .

తర్వాత  రెండవసారి  వేసుకున్న  ఎండుమిరపకాయలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ మిశ్రమాన్ని ,  వేయించిన  కరివేపాకు  కూడా  వేసి   మిక్సీ లో మెత్తగా  వేసుకుని  ముందు తీసుకున్న  బేసిన్  లో  వేసుకుని  రెండూ చేతితో బాగా  కలుపుకుని  ఒక  సీసాలో  పోసుకుని  ఫ్రిజ్ లో పెట్టుకుని  అవసరమైనప్పుడు మూడు  స్పూన్లు  చొప్పున  సాంబారు లో  వేసుకుని , తిరిగి  సీసాను  ఫ్రిజ్ లో పెట్టుకుంటే  నాలుగు  నెలలు పైన  ఈ సాంబారు  పొడి  ఘమ ఘమ లాడుతూ  సాంబారుకు  మంచి రుచి  వస్తుంది.

బొబ్బట్లు

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి స్పెషల్  వంటకం.

బొబ్బట్లు.

కావలసినవి .

మైదాపిండి  --  ఒక కప్పు.
నూనె  --  2  స్పూన్లు
ఉప్పు   --  చిటికెడు .
నెయ్యి  --  ఒక కప్పు
యాలకులపొడి  --  స్పూను

బొబ్బట్లు లోపల  Stuff  చేసుకోవడానికి .

పచ్చి శనగపప్పు  -  ఒక కప్పు
బెల్లం  -- అర కప్పు

తయారీ  విధానము .

ముందుగా  మైదాపిండి లో  చిటికెడు  ఉప్పు వేసి  స్పూను  నూనె వేసి పొడి పిండి  బాగా కలుపుకోవాలి .

తర్వాత  ఆ పిండిలో  కొద్ది కొద్దిగా  నీరు  పోసుకుంటూ  పిండిని  చపాతీ పిండి మాదిరిగా  కలుపుకోవాలి .

తర్వాత ఆ పిండిలో  మరో స్పూను నూనె వేసుకుని  పిండిని  మరింత మృదువుగా  మెదాయించుకోవాలి .

దానిపై  ఒక పలుచని  గుడ్డను  కప్పి  ఒక ముప్పావు గంట సేపు పక్కన  పిండి  మరింత మృదువుగా  అవ్వటానికి విడిగా ఉంచుకోవాలి .

తర్వాత  పచ్చి శనగపప్పు  ఒకసారి కడిగి  ఒక గిన్నెలో  వేసుకుని  తగినన్ని నీళ్ళు  పోసి  కుక్కర్ లో పెట్టుకుని  మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి .

బెల్లం  పొడి చేసుకుని ఉంచుకోవాలి .

మిక్సీ లో ఉడికిన పచ్చి శనగపప్పు , బెల్లం  పొడి , యాలకుల పొడి వేసుకుని  మెత్తగా  వేసుకోవాలి .

ఆ తర్వాత ఒక అరిటాకును  తీసుకుని  దానిపైన నూనె రాసుకుని  ఉంచుకోవాలి .

మైదాపిండిని  నిమ్మకాయంత  తీసుకొని  పూరీ మాదిరిగా  చేతితో వత్తుకుని  అందులో పూర్ణం పిండిని  పెట్టుకుని  చేతితో  మూసి వేసుకోవాలి .

దానిని  నూనె రాసిన అరటి ఆకులో పెట్టి  నూనె చేతితోనే  పూరీల లాగా  వత్తుకుని ,
స్టౌ మీద పెనం పెట్టుకుని  పెనం మీద   నెయ్యి  వేసుకుని వత్తిన  బొబ్బట్లను  ఆకుతో సహా  బోర్లించాలి .
రెండు వైపులా  కొద్ది  కొద్దిగా  నెయ్యి  వేసుకుంటూమాడకుండా  కాల్చుకోవాలి .

ఇదే విధముగా  ప్రతి బొబ్బట్లు చేసుకోవాలి  .

అంతే ఎంతో రుచిగా  ఉండే  సంక్రాంతి  స్పెషల్  బొబ్బట్లు  సర్వింగ్  కు సిద్ధం .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి