Tuesday, May 30, 2017

గోరు చిక్కుడు కాయలు కొబ్బరి కూర.

గోరు చిక్కుడు కాయలు కొబ్బరి కూర.
ఆలూరి కృష్ణ ప్రసాద్

కావలసినవి .
గోరు చిక్కుడు కాయలు -- పావు కిలో
పచ్చి కొబ్బరి తురుము -- ఒక చిప్ప
చింతపండు --- నిమ్మ కాయంత
పసుపు --- కొద్దిగా 
కారం -- స్పూను 
ఉప్పు -- తగినంత

పోపుకు.
నూనె --- నాలుగు స్పూన్లు 
ఎండుమిరపకాయలు --- 4
తుంపి ముక్కలుగా చేసుకోవాలి
పచ్చిశనగపప్పు --- స్పూనున్నర 
మినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను 
ఆవాలు --- అర స్పూను 
ఇంగువ --- కొద్దిగా 
కరివేపాకు -- రెండు రెమ్మలు

తయారీ విధానము .
ముందుగా గోరు చిక్కుడు కాయలు రెండు వైపులా ఈనెలు తీసుకుని చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
చింతపండు పదిహేను నిముషములు నీళ్ళలో నానబెట్టి చిక్కగా రసం తీసుకోవాలి .
కుక్కర్ లో గోరు చిక్కుడు కాయ ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి .
ఆ తర్వాత చల్లారగానే నీళ్ళు వడగట్టి ఉడికిన ముక్కల పై కొద్దిగా పసుపు వేసి పక్కన ఉంచుకోవాలి .
పచ్చి కొబ్బరి తురుముకొని ఒక చిప్ప పచ్చి కొబ్బరి సిద్ధం చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి 
 నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , పచ్చి శనగపప్పు ,
మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే ఉడికించి ఉంచుకున్న గోరు చిక్కుడు కాయ ముక్కల్ని పోపులో వేయాలి .

సిద్ధం చేసుకున్న చింతపండు రసం కూరలో వేసి తగినంత ఉప్పు స్పూను కారం వేయాలి .
కూర మగ్గిన తర్వాత తురిమి ఉంచుకున్న పచ్చి కొబ్బరి వేసి మరో మూడు నిముషాలు ఉంచి కొబ్బరి కూరలో బాగా కలిసి పచ్చి వాసన పోగానే దింపు కొని , వేరే డిష్ లోకి తీసుకోవాలి.
అంతే . కొబ్బరి సువాసనలతో గోరు చిక్కుడు పచ్చి కొబ్బరి కూర సర్వింగ్ కు సిద్ధం.
ఈ కూర అన్నం లోకి మరియు రోటీలలోకి కూడా బాగుంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి