Monday, May 29, 2017

అప్పాలు

ఆంజనేయ స్వామి వారి ప్రసాదము అప్పాలు తయారు చేయు విధానము .
ఆలూరి కృష్ణ ప్రసాద్

కావలసినవి .
షుమారుగా ఒక కప్పు కొలతగా పెట్టుకోండి .

గోధుమ పిండి --- అరకప్పు
బియ్యపు పిండి --- అర కప్పు
బెల్లం తరిగిన పొడి -- ఒక కప్పు
పచ్చి కొబ్బరి తురుము --- పావు కప్పు
యాలకుల పొడి --- అర స్పూను
నెయ్యి --- రెండు స్పూన్లు
నూనె --- 200 గ్రాములు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి తరిగిన బెల్లం పొడి వేసి బెల్లం పొడి మునిగే వరకు నీళ్ళు పోసి బెల్లం కరిగాక నీళ్ళు బాగా తెర్లనివ్వాలి .
పాకం రావక్కరలేదు.
గోధుమ పిండి మరియు బియ్యపు పిండి రెండూ జల్లెడ పోసుకుని లేదా రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న నీళ్ళలో ముందు యాలకుల పొడి వేసి , తర్వాత ఈ పిండి , కొబ్బరి తురుము మరియు రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా గరిటెతో కలిపి స్టౌ వెంటనే ఆపేయాలి.
కొద్ది సేపు తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఎడం అర చేతిలోకి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని కుడి చేతి వేళ్ళతో పాలకోవా బిళ్ళలు లాగా చిన్న చిన్న అప్పాలు మాదిరిగా పిండి అంతా వత్తుకొని వేరే ప్లేటులో పెట్టుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద వేరే బాండి పెట్టి నూనె అంతా పోసి నూనె బాగా కాగనివ్వాలి .
తర్వాత షుమారు ఎనిమిది పది అప్పాలు వేసి ఎక్కువ సేపు ఉండనివ్వకుండా వెంటనే తీసెయ్యాలి .
ఎక్కువ సేపు ఉంటే అప్పాలు మాడి పోతాయి.
ఇవి కొబ్బరి బూరెల్లా కొంచెం మెత్తగా ఉంటాయి .
అప్పాలు గట్టిగా కావాలనుకునే వాళ్ళు ముప్పావు కప్పు బియ్యపు పిండి , పావు కప్పు గోధుమ పిండి వేసుకుని చేసుకోవాలి .
అంతే స్వామి వారి ప్రసాదానికి అప్పాలు సిద్ధం.
కొంచెం పెద్దవి చేసుకుంటే బూరెల్లా టిఫిన్ గా కూడా బాగుంటాయి .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి