Thursday, July 27, 2017

పచ్చి బఠాని కొబ్బరి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చిబఠాణీ  కొబ్బరి   కూర.

కావలసినవి .

పచ్చి బఠాణీ  గింజలు  -- బఠాణీ  కాయలు  ఒక పావు కిలో  కొని  వలుచు కొని  ఒక  కప్పు  పచ్చి  బఠాణీ  గింజలను   సిద్ధం చేసుకోవాలి .  లేదా  frozen  బఠాణీ  గింజలను  కూడా  వాడ వచ్చును .

పచ్చి కొబ్బరి తురుము  --  అర కప్పు

మినపప్పు  --  స్పూను
జీలకర్ర   --  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
పచ్చిమిర్చి  --  మూడు  చిన్న ముక్కలుగా  చేసుకోవాలి .
కరివేపాకు   --  రెండు రెమ్మలు .
ఇంగువ  --  కొద్దిగా
నూనె  --  రెండు స్పూన్లు
ఉప్పు  --  తగినంత
కారం  --  అర  స్పూను .

తయారీ విధానము .

ముందుగా   స్టౌ  మీద    బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు   ముక్కలు , మినపప్పు ,  జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , కరివేపాకు మరియు  పచ్చిమిర్చి  ముక్కలు  వేసి  పోపు వేగగానే వలిచిన   పచ్చి బఠాణీలు  కూడా   పోపులో వేసుకుని  అర  కప్పు  నీరు  పోసి   మూతపెట్టి  బఠాణీలను  అయిదు  నిముషములపాటు   నీరు  ఇగిరి  పోయే వరకు  సన్నని  సెగన  మగ్గ నివ్వాలి .

తర్వాత అర కప్పు  పచ్చి  కొబ్బరి తురుము  , అర  స్పూను  కారం , తగినంత  ఉప్పువేసి   కొబ్బరి  పచ్చి వాసన  పోయే వరకు  ఉంచి  దింపి  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .

అంతే  వేడి  వేడి  పచ్చి బఠాణి  కొబ్బరి కూర  భోజనము  లోకి  , రోటీలు మరియు  చపాతీల లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

మామిడికాయ పులుసు

పునాస కాపు  మామిడి కాయలు  మళ్ళీ  మార్కెట్  లోకి  వచ్చాయి .

ఆలూరుకృష్ణప్రసాదు .

ముక్కల  పులుసు .

మామిడి  కాయ  ముక్కలతో . (  చింతపండు  బదులుగా  )

కావలసినవి .

పుల్లని  మామిడి   కాయ     --   ఒకటి
ఆనపకాయ /   సొరకాయ  --
కాయలో  సగం  ముక్క
దోసకాయ   --  ఒకటి
పచ్చి మిర్చి  ---   5
కరివేపాకు  --   మూడు  రెబ్బలు
కొత్తిమీర    ---  ఒక  కట్ట
పసుపు  ---   కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బియ్యపు  పిండి  --   స్పూనున్నర
కారం  ---  అర స్పూను .

పోపుకు  .

నూనె  ---   రెండుస్పూన్లు
ఎండుమిరపకాయలు   --  3
మెంతులు ---   కొద్దిగా
జీలకర్ర  ---  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము .

మామిడి  కాయ  పై  చెక్కు తీసి  మాగాయ  ముక్కలు  తరిగి  నట్లుగా  తరుగు  కోవాలి .

అనపకాయ /  సొరకాయ  పై చెక్కు తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి.

అదే  విధంగానే   దోసకాయ  కూడా  పై  చెక్కు  తీసి  గింజల  చేదు  చూసుకుని   ముక్కలుగా   తరుగు  కోవాలి.

పచ్చిమిర్చి   నిలువుగా   చీలికలు  గా  తరగాలి  .

ఒక  గిన్నెలో  ఈ  తరిగిన   ముక్కలన్నీ  వేసి  ఒక  రెండు  గ్లాసుల  నీళ్ళు పోయాలి .

అందులో  పసుపు , ఉప్పు  ,  కారం వెయ్యాలి .

పచ్చిమిర్చి , కరివేపాకు   కూడా  వెయ్యాలి .

ఇప్పుడు  స్టౌ  వెలిగించి   ఈ  పులుసు  గిన్నె  పెట్టి  మీడియం  సెగన  ముక్కలన్నీ  ఉడికి  దగ్గర  పడేలా  ఉడకనివ్వాలి .

తర్వాత  ఒక  అర గ్లాసు  నీళ్ళలో   ఒకటిన్నర   స్పూను  బియ్యపు  పిండి  వేసి  చేత్తో బాగా  కలిపి  మరుగుతున్న పులుసు లో  పోయాలి .

మరో మూడు నిముషముల తర్వాత పులుసు  చిక్క పడగానే  దింపుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిట  పెట్టుకుని  రెండు స్పూన్లు   నూనె  వేసి  నూనె కాగగానే  ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  పెట్టు కోవాలి .

పైన  తరిగిన   కొత్తిమీర   వేసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ  లాడే  ఇంగువ  పోపుతో  మామిడి  కాయతో  ఆనప కాయ  దోసకాయ  ముక్కల   పులుసు  సర్వింగ్   కు  సిద్ధం.

బీన్స్ కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

బీన్స్  కూర .

బీన్స్ కూర  మూడు నాలుగు  విధములుగా  చేసుకొనవచ్చును.

ఈ రోజు ఫోటోలో  చేసినది  బీన్స్  కొబ్బరి  కూర .

మొదటి  పద్ధతి .

బీన్స్ పీచు ఉంటే  తీసుకుని  చిన్న ముక్కలుగా  చేసుకుని  కొద్దిగా  ఉప్పువేసి  సరిపడా నీళ్ళు పోసి ఉడక పెట్టి  పోపు లో  ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  , కరివేపాకు  మొదలైనవి వేసి ఉప్పూ , స్పూను కారం వేసుకుని  తర్వాత  ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేసుకుని  దింపుకోవాలి

రెండో పద్ధతి . బీన్స్  ముక్కలుగా  చేసుకుని  చారెడు  కందిపప్పు  వేసి  ఉడికించి వార్చి పైన  చెప్పిన విధంగా  పోపు వేసి  ఉప్పూ కారం వేసుకుని  పప్పు కూరలా  చేసుకోవచ్చు .

మూడో పద్థతి  బీన్స్ కొద్దిగా  పచ్చి   శనగపప్పు   ఉడికించి పైన చెప్పిన విధంగానే   పోపు వేసి  అందులో  ఉడికించిన  బీన్స్  చింతపండు  రసం , ఉప్పూ , స్పూను  కారం  వేసి  కొద్దిగా  బెల్లం  వేసుకుంటాము .

వేరుశనగ ఉండలు

వేరుశనగ   ఉండలు .

తయారీ  విధానము .

అర కిలో  పల్లీలు  బాండీలో నూనె  లేకుండా వేయించుకొని  చల్లారగానే  శుభ్రంగా  పై  పొట్టు  చెరుగు కోవాలి .

ఇప్పుడు  350  గ్రాముల  బెల్లం  తీసుకొని  దాన్ని  మెత్తని  పొడిగా  చేసుకోవాలి .

ఆ పొడిని  ఒక మందపాటి  గిన్నెలో  వేసుకుని  అందులో  పావు గ్లాసుకు తక్కువగా  నీళ్ళు  పోసుకుని  స్టౌ  వెలిగించి  స్టౌ  మీద  పెట్టి గరిటతో  కలుపుతూ  బాగా  ఉండ పాకం రానిచ్చి దింపి  వెంటనే  వేరు శనగపప్పులు, మూడు స్పూన్లు  నెయ్యి  వేసి  బాగా కలిపి  వేడి  కొద్దిగా  చల్లారగానే  వేడి మీదనే  చేతికి  నెయ్యి రాసుకుని చేతితో  చిన్న చిన్న  ఉండలుగా  కట్టుకోవాలి .

Sunday, July 23, 2017

మామిడికాయ పచ్చడి

పునాస కాపు  మామిడి కాయలు వస్తున్నాయి .

మామిడి  కాయ పచ్చడి .

కావలసినవి .

పచ్చి మామిడి  కాయలు  -- 2  
పసుపు   -- కొద్దిగా
ఉప్పు  --   తగినంత
నూనె  ---   నాలుగు  స్పూన్లు

పోపు కు .

ఎండుమిరపకాయలు --  15  
మెంతులు  --  అర  స్పూను .
ఆవాలు   --  అర  స్పూను .
ఇంగువ   ---   కొద్దిగా .

తయారు  చేయు  విధానము .

ముందుగా  మామిడి  కాయలు  బాగా  కడిగి  పొడి  గుడ్డతో  తుడుచు కోవాలి .

తర్వాత  పై  చెక్కు   తీసుకుని   చిన్న ముక్కలుగా   తరుగు కోవాలి .

తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టుకుని  మూడు  స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు ,   మెంతులు ,  ఆవాలు , ఇంగువ   వేసి  పోపు  వేయించుకోవాలి .

ఇప్పుడు  మిక్సీ లో  పోపు  మొత్తము, పసుపు    మరియు  సరిపడా  ఉప్పు  వేసి వేసుకుని  మెత్తగా   మిక్సీ   వేసుకోవాలి .

ఆ  తర్వాత  మామిడి   కాయ ముక్కలు  వేసి  మెత్తగా   మిక్సీ   వేసుకోవాలి .

తర్వాత  రెండు  స్పూన్లు   నూనె  వేసి  స్పూను   మినపప్పు  , పావు స్పూను  ఆవాలు , కొద్దిగా   ఇంగువ  వేయించుకుని   నూరిన  పచ్చడిలో  కలిపి  ఒక సారి  మిక్సీ   వేసుకుని  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .

అంతే  దోశెలలోకి   మరియు  అన్నం లోకి  పుల్ల పుల్లని  మామిడి  కాయ  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .

మిరపకాయ శనగపిండి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

బజ్జీ  మిరపకాయలలో  శనగ పిండి   కూరిన  కూర .

కావలసినవి.

బజ్జీ మిర్చి  --  పావు కిలో
శనగపిండి  --  అర కప్పు
జీలకర్ర   --  పావు  స్పూను
ఉప్పు  --  తగినంత
నూనె  --  100  గ్రాములు
కారం  --  అర  స్పూను

తయారీ  విధానము .

ముందుగా   స్టౌ  మీద  బాండీ పెట్టి  నూనె  వేయకుండా  శనగపిండి , జీలకర్ర   వేసి  కమ్మని  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

అందులో  అర  స్పూను  కారం  మరియు  సరిపడా  ఉప్పు వేసి  బాగా  కలుపుకోవాలి .

పచ్చిమిర్చి   నిలువుగా   మధ్యలో  గాటు  పెట్టుకుని  ఈ  మిశ్రమాన్ని   అందులో  కూరుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  మళ్ళీ  బాండి  పెట్టుకుని  మొత్తం   నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   స్టౌ ను  మీడియం  సెగన పెట్టి  కూరిన  బజ్జీ  మిర్చి  వేసి  పిండి  మరియు  మిర్చి   మాడకుండా  జాగ్రత్తగా   అట్లకాడతో  కదుపుతుండాలి  .

కూర  వేగగానే కూరిన పిండి  మిగిలితే  అదికూడా  కూర పైన  వేసి మరో  మూడు  నిముషాలు   ఉంచి  దింపి  వేరే  ప్లేటులోకి  తీసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బజ్జీ పచ్చి మిర్చి శనగ పిండి కూర  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం.

కుడుములు

ఆలూరుకృష్ణప్రసాదు .

జిల్లేడుకాయలు  లేదా  తీపి కుడుములు.

ఈ  స్వీట్  మేము  ప్రతి  వినాయక చవితి  పండుగకు  తప్పనిసరిగా  చేసుకుంటాము .

గణపతి కి  ఉండ్రాళ్ళు  మరియు  తీపి   జిల్లేడుకాయలు   మాత్రమే ప్రసాదంగా  చేస్తాము .

ఆ రోజు  వేడి  వేడి  నూనెతో  గారెలు , సజ్జ పూరీలు , పునుగులు   వంటి వండిన పిండి వంటలు   చేయము ,

కారణం  నాకు  పూర్తిగా  తెలియదు  కాని  మా  ఇంట్లో  మాత్రం  మా  బామ్మ గారి  తరం  నుండి  ఇదే  పద్ధతి .

గోదావరి  జిల్లాలో  మా  అమ్మమ్మ గారి  ఇంట్లో  కూడా  ఇదే  ఆనవాయితి .

ఇంక  ఈ  తీపి   కుడుములు  మళ్ళీ  దేవీ నవరాత్రులలో  చేసుకుంటాము .

విడి  రోజుల్లో   చేసుకోవడం  చాలా  తక్కువ .

జిల్లేడుకాయలు   మాదిరిగా   చేసుకుంటే  జిల్లేడుకాయలు  అని అంటాము .

గుండ్రంగా  చేసుకుంటే  తీపి కుడుములని  అంటాము .

తయారీ విధానము  .

ఇంక  జిల్లేడుకాయలు లేదా  తీపి  కుడుములు  తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద  గిన్నె పెట్టి  అందులో  గ్లాసున్నర  నీళ్ళు పోసి  అందులో  చిటికెడు   ఉప్పు  వేసి  నీళ్ళను  బాగా  తెర్ల నివ్వాలి .

బియ్యము  మర పట్టించి  ఒక  గ్లాసు  బియ్యపు  పిండి  తీసుకోవాలి .

తరువాత  తెర్లుతున్న  నీళ్ళలో    సిద్ధంగా  ఉంచుకున్న   బియ్యపు  పిండిని  కొద్ది కొద్దిగా   వేస్తూ  బియ్యపు  పిండి  ఉండలు  కట్టకుండా గరిటతో  బాగా  కలుపుకుని ,  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి బాగా కలిపి   పైన  మూత  పెట్టి   స్టౌ  ఆపేయాలి .

తర్వాత  చేతికి  నెయ్యి రాసుకుని  పిండిని చెత్తో మెదుపుతూ  చిన్న  చిన్న  ఉండలుగా  చేసుకోవాలి .

అంతకు  ముందు  కొబ్బరి కాయ కొట్టుకొని  పచ్చి  కొబ్బరి  తురుముతో  రెండు  చిప్పలు  కోరుకొని  పచ్చి కొబ్బరి తురుము  సిద్ధం  చేసుకోవాలి .

పచ్చి కొబ్బరి తురుము  రెండు  కప్పులు  ఉంటే , ఒక  కప్పు  బెల్లం  బండతో  పొడిగా   చేసుకొని  ,  తురిమిన  కొబ్బరి  లో  వేసి  బాగా కలుపు కోవాలి .

ఆ తర్వాత  స్టౌ   మీద  బాండీ  పెట్టి  కలిపిన  మిశ్రమము  వేసి  రెండు  చేతి  వేళ్ళతో  పట్టుకుంటే  చేతులకు  బెల్లం పాకం  అంటుకునే  విధంగా  పాకం పట్టుకుని   రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  దింపాలి .

కొబ్బరి లౌజు  కొద్దిగా  చేయి పట్టే  వేడి  మీద  ఉండగానే    చిన్న  చిన్న  ఉండలుగా  చేసుకున్న  బియ్యపు పిండి  అర చేతికి  నెయ్యి  రాసుకుని  ఒక్కొక్క   ఉండను  అర  చేతులోకి  తీసుకొని   చెయ్యి  అంతా  ఒత్తుకుని , అందులో  స్పూను  కొబ్బరి  మిశ్రమం  పెట్టి  పిండి  మీద  పరచి  అంచులు  తడి చేత్తో   మూసేసుకోవాలి .

ఇలా  అన్నీ  తయారు  చేసుకుని  ఇడ్లీ  స్టాండు ప్లేటులకు  నెయ్యి రాసి  , అందులో ఈ  తయారు  చేసుకున్న  కుడుములు  పెట్టి  , కుక్కర్  లో  సరిపడా  నీళ్ళు పోసి  ఒక  పది నిముషాల  పాటు  ఇడ్లీల  మాదిరిగా   ఆవిరి  పట్టాలి  .

అంతే  ఎంతో  రుచిగా   ఉండే  జిల్లేడుకాయలు  లేదా  తీపి  కుడుములు  స్వామి వారికి   లేదా  అమ్మ వారి  నైవేద్యానికి  అనంతరం  మనం  దైవ  ప్రసాదంగా  స్వీకరించడానికి   సిద్ధం .

కొరివికారంతో పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .
ఇడ్లీ  దోశెలలోకి  చాలా  చాలా  సింపుల్  గా అయిదు  నిముషాల్లో  తయారయ్యే   మరో  వెరైటీ  పచ్చడి .

తయారీ  విధానము  .

మూడు  స్పూన్లు   పండు మిరపకాయల కారం  (  కొరివి కారం  )   నిల్వ  పచ్చడి  మీక్సీ లో వేసుకోండి .

అందులో  ఒక  పెద్ద  నిమ్మకాయ  మధ్యకు  తరిగి  నిమ్మరసం   పిండండి .

మిక్సీ లో  మెత్తగా   వేసుకుని  ఒక  గిన్నెలోకి  తీసుకోండి .

స్టౌ  మీద  పోపు  గరిట  పెట్టుకుని  రెండు స్పూన్లు   నెయ్యి వేసి  వరుసగా  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా చేసి ,  స్పూను  మినపప్పు  , అర స్పూను   ఆవాలు , కొద్దిగా   ఇంగువ  మరియు  కాస్త  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకోండి .

అంతే . సింపుల్ గా  అయిదు  నిముషాల్లో  తయారయ్యే పుల్ల పుల్లగా  నోరూరించే  పండు  మిరపకాయల  చట్నీ  ఇడ్లీ  మరియు  దోశెలలోకి  సిద్ధం .

రాగిపిండి జావ

ఆరోగ్యానికి   రాగి  పిండితో  జావ.
ఆలూరు కృష్ణప్రసాదు .

ఒక  కప్పు  రాగి పిండి  ఒక  గిన్నెలో  వేసుకుని   అందులో  మూడు కప్పుల  నీళ్ళు  పోసి మరియు  కొద్దిగా   ఉప్పు  వేసి  బాగా  కలుపుకుని  స్టౌ మీద  పెట్టి ఒక  పదిహేను  నిముషాల  పాటు మీడియం  సెగన    బాగా  ఉడకనివ్వాలి .
ఉడికిందో  లేదో  చెయ్యి  తడి చేసుకుని  చూస్తే  చేతికి  అంటకూడదు .
చల్లారగానే  చేతితో  చిన్న  ఉండలుగా  చేసుకుని   అందులో మజ్జిగ  పోసి  మరి కాస్త  ఉప్పు వేసి రాత్రంతా   మజ్జిగలో  నానబెట్టాలి .
మరుసటి  రోజు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు స్పూన్లు  నెయ్యి వేసి  ఒక  ఎండుమిర్చి , జీలకర్ర , ఆవాలు ,కరివేపాకు  వేసి  పోపు  వేసుకుని  అందులో  సన్నగా తరిగిన  ఒక  ఉల్లిపాయ  ముక్కలు  మరియు సన్నగా  తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు  వేసి  మగ్గనిచ్చి  ఆ తర్వాత  ఈ  రాగి  జావలో  వేసి  ఉండలుగా  ఉన్నట్లయితో  చేతితో  బాగా  నలిపి  అవసరమైతే  మరి  కాస్త  మజ్జిగ   పోసుకుని  జావలా  పల్చగా   చేసుకుని  ప్రతిరోజు  ఉదయాన్నే  ఒక  గ్లాసు  మోతాదులో  తీసుకోవాలి .
ఈ రాగి  జావ  సన్నపడాలనుకునే వారికి   మంచిది.
శరీరానికి  చలువ చేస్తుంది
మధుమేహ  వ్యాధిగ్రస్తులకు  కూడా  చాలా మంచిది.
ఎముకలకు  పుష్టి నిస్తుంది .

బంగాళాదుంప జంతికలు

బంగాళాదుంపతో  జంతికలు .
ఆలూరు కృష్ణప్రసాదు .

బంగాళాదుంప  తో  జంతికలు  ఏమిటి  ?  అని  అనుకుంటున్నారా !
ఈ  రెసిపీ  చదవండి .
కావలసినవి .
బంగాళాదుంపలు  --  రెండు
శనగ పిండి  --   ఒక  కప్పు 
కారం  ---  స్పూను 
మిరియాల పొడి  --  పావు స్పూనుకు  తక్కువగా  
ఇంగువ  ---  కొద్దిగా 
నువ్వుపప్పు  --  స్పూను న్నర
ఉప్పు   --  తగినంత 
నూనె  ---  350  గ్రాములు .

తయారీ  విధానము .
ముందుగా   బంగాళా  దుంపలను  పై  చెక్కు   తీయకుండా  ముక్కలుగా   తరిగి ఒక  గిన్నెలో   తగినన్ని   నీళ్ళు  పోసి  మెత్తగా   ఉడికించుకోవాలి .
చల్లారిన  తర్వాత  పై చెక్కు   తీసుకుని ఒక  గిన్నెలో  వేసి  మెత్తగా   చేసుకోవాలి .
ఆ తర్వాత  అందులో  శనగపిండి , కారం , తగినంత  ఉప్పు , మెత్తని  మిరియాల పొడి , నువ్వు పప్పు మరియు  కొద్దిగా   ఇంగువ  వేసి  తగినన్ని   నీళ్ళు  పోసుకుని   జంతికలు  వేసుకోవటానికి  అనువుగా   కలుపు కోవాలి .
ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము   నూనె  పోసి  నూనెను  బాగా  కాగనిచ్చి  స్టౌ ను  మీడియం  సెగన  పెట్టి , జంతికల  గొట్టము లో  ఈ  పిండిని  పెట్టి  జంతికలు  లాగా  వేసుకోవాలి .
బంగాళాదుంప   కలిపాము  కనుక  తొందరగా  వేగి పోతాయి .
నల్ల రంగు  రాకుండా  చూసుకుని   వేయించుకోవాలి .
రెండు  రోజుల కన్నా  నిల్వ ఉండవు  కనుక  తక్కువ   మోతాదులో  చేసుకోండి .
అంతే  ఎంతో  మిరియాలు , ఇంగువ , నువ్వు పప్పు రుచితో  తమిళనాడు   Style  జంతికలు  సర్వింగ్   కు  సిద్ధం.

Tuesday, July 18, 2017

మైదాపిండి వల్ల నష్టాలు

మైదాపిండి వల్ల నష్టాలు
ఆలూరు కృష్ణప్రసాదు .

మైదా పిండితో  తయారయ్యే  పదార్ధములను  తినడం వలన కలిగే  దుష్పరిణామములు .
గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, 
రాగుల నుండి రాగిపిండి వస్తుంది.

కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది........? ఎప్పుడైనా ఆలోచించారా.........?
మైదా పిండి ఎలా వస్తుంది........ 
అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ........

ఒక్కసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది.
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.
మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు 
*********************************** 
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.

చింతపండు పచ్చడి

చింతపండు   పచ్చడి  .
ఆలూరు కృష్ణప్రసాదు .

సాధారణంగా   పెసరట్లు , దోశెలు ,  ఇడ్లీలు , గారెలు  మరియు  అన్నం లోకి  అందరం  అల్లం   పచ్చడి  చేసుకుంటాము .
అలాగే   ఇప్పుడు  మామిడి  అల్లం  కూడ   ఇప్పుడు  బాగా  దొరుకుతోంది  కాబట్టి   చాలామంది  మామిడి  అల్లం  పచ్చడి  కూడా  చేస్తారు .
ఈ  రెండింటికన్నా  ప్రాచీనమైన   పచ్చడి  చింతపండు   పచ్చడి .
లోగడ  పెద్ద వాళ్ళందరూ   చింతపండు   పచ్చడినే  అన్ని సందర్భాలలోనూ చేసేవారు .
కొంచెం   అటూ  ఇటుగా  మూడు  పచ్చళ్ళ  రెసిపీలు  ఒకే  పద్ధతి లో  ఉంటాయి .
ఈ  చింతపండు  పచ్చడి  ఫ్రిజ్ లో  పెట్టక పోయినా  నాలుగైదు  రోజులు  నిల్వ  ఉంటుంది .
చింతపండు   పచ్చడి తయారీ విధానము .
కావలసినవి .
చింతపండు   ---  పెద్ద   నిమ్మ కాయంత .
పచ్చిమిరపకాయలు  --  6
పసుపు  --  కొద్దిగా .
ఉప్పు ---  తగినంత 
బెల్లం  --  చిన్న ముక్క

పోపునకు .
ఎండుమిరపకాయలు   ---  12
మినపప్పు   ---   స్పూను 
ధనియాలు  ---   స్పూను 
మెంతులు  ---   పావు  స్పూను 
జీలకర్ర   ---   పావు స్పూను 
ఆవాలు  ---   అర  స్పూను 
ఇంగువ   ---   కొద్దిగా 
నూనె  ---   నాలుగు   స్పూన్లు

తయారీ  విధానము  .
ముందుగా   చింతపండు   విడదీసి  పావు  గ్లాసు  వేడి  వేడి  నీటీలో  తడిపి  ఉంచుకోవాలి .
రసం  తీయనవసరం  లేదు .
ఆ  తర్వాత స్టౌ మీద బాండి  పెట్టి  నూనె మొత్తము   వేసి  నూనె  మొత్తం  వేసి   నూనె  బాగా  కాగగానే  వరుసగా  మెంతులు , ఎండుమిరపకాయలు వేయాలి . మెంతులు  వేగగానే   మినపప్పు , ధనియాలు , జీలకర్ర  , ఆవాలు  మరియు  ఇంగువ   వేసి  పోపు వేగగానే  పచ్చిమిరపకాయలు   కూడా  వేసి  కొద్ది సేపు  ఉంచి  స్టౌ  ఆపివేయాలి .
పోపు  చల్లారగానే  మిక్సీ లో  ముందుగా  ఎండుమిరపకాయలు , పసుపు , ఉప్పువేసి   మెత్తగా   మిక్సీ  వేసుకోవాలి .
ఆ తర్వాత  తడిపిన  చింతపండు  కొద్ది   నీళ్ళతో సహా , వేగిన  పోపు  పచ్చిమిరపకాయలు మరియు  చిన్న   బెల్లం  ముక్కతో   సహా  వేసి   మిక్సీ    వేసుకోవాలి  .
మేము కొద్దిగా  నీళ్ళు  కలిపి   పల్చగా   వేసుకున్నాము  దోశెలలోకి .
మీరు  కాస్త  గట్టిగా   నీళ్ళు  పోయకుండా  గట్టిగా   తీసుకోండి .
అంతే  ఇడ్లీ  , దోశెలు , పెసరట్లు , గారెలు  మరియు  అన్నం లోకి  కూడా  ఎం తో  రుచిగా   ఉండే   చింతపండు  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

Monday, July 17, 2017

చలిమిడి

చలిమిడి
ఆలూరు కృష్ణప్రసాదు .

చలిమిడి  తయారు  చేయు  విధానము .
ఆడపిల్లను  అత్తవారింటికి  పంపే  సందర్భాలలో , కూతురుకు మూడవ నెల  రాగానే  దొంగ చలిమిడి  అని  కన్న తల్లి  పెడతారు ఆ  సందర్భంలో  , కూతురుకు  ఏడవ నెల మరియు  తొమ్మిదివ నెల  సీమంతం  చేసిన  సందర్భాలలో , పిల్ల వాడు  పుట్టాక  కూతురును  బిడ్డతో  సహా  తిరిగి  అత్తవారింటికి  పంపుతూ  చొంగ  చక్కిలాలు  అంటారు వాటితో  సహా  ఇచ్చి  పంపే  సందర్భాలలో ఇలా  అన్ని  శుభ సందర్భాలలో   చలిమిడి  అని  పెడతారు .
అయితే  ఈ  చలిమిడి  చేసే  విధానము   చాలా  మందికి   తెలియదు .
అందువలన  పెద్దలను  సంప్రదించి   మీ  అందరికీ   వివరంగా  తెలియచేస్తున్నాను .
చలిమిడి  తయారు చేయు  విధానము .
కావలసినవి .
బియ్యము   --  ఒక  కె. జి .
బెల్లం   --   ముప్పావు  కిలో
గసగసాలు  --  రెండు  స్పూన్లు
ఎండు కొబ్బరి  --  ఒక చిప్ప.
  
చిన్న ముక్కలుగా  తరిగి స్టౌ మీద  బాండీ పెట్టి  రెండు  స్పూన్లు  నెయ్యి వేసి ముక్కలు  వేగగానే  అందులో  గసగసాలు కూడా వేసి     వేయించుకోవాలి.

పాకం  పట్టే  సమయంలో   వేయించుకోవాలి .
యాలకుల పొడి  --  ఎనిమిది  యాలకులు  పొడిగా   చేసుకోవాలి . స్పూనున్నర   తీసుకోవాలి .
తయారీ  విధానము .
ఒక  కె. జి . బియ్యము   తగినన్ని  నీళ్ళు పోసి  ముందు  రోజు  రాత్రి  నానబెట్టుకోవాలి .
కావలసినవి  సామగ్రి  అన్నీ  సిద్ధం  చేసుకున్నాక మరుసటి  రోజు   బియ్యము  వడకట్టి  పిండి  మరపెట్టించాలి .
మరపట్టించే  అవకాశము  లేని  వారు  మిక్సీ లో  వేసుకొనవచ్చు.
పిండి  తడిగా  ఉన్నప్పుడు  బాగా  నొక్కి  పట్టి  ఉంచాలి .
బెల్లం  పొడిలా  పచ్చడి  బండతో  దంచుకోవాలి .
స్టౌ  మీద  గిన్నె  పెట్టి   నలగొట్టిన  బెల్లం  వేసి , బెల్లం   మునిగే  వరకు  నీళ్ళు పోసి జాగ్రత్తగా  చూసి  కదుపుతూ  బాగా  ఉండ పాకం  రానివ్వాలి .
ఉండపాకం  అంటే  ఒక  పళ్ళెంలో  నీళ్ళు  వేసి  ఉడుకుతున్న కొద్ది   పాకం వేసి  చేతితో  చూస్తే  పాకం  బాగా  ఉండలా  రావాలి .
ఈ లోగా తడిపిండి  బాగా  జల్లించుకుని  బరకగా  ఉన్నది  తీసేసుకోవాలి .
ఉండపాకం  రాగానే స్టౌ  కట్టేసి  దించి   పాకంలో   వేయించిన కొబ్బరి ముక్కలు , గసగసాలు , యాలకులపొడి  వేసి  కొద్ది  కొద్దిగా గుప్పెడు  గుప్పెడు   పిండి  వేసుకుంటూ  వెంటనే  కలుపుకుంటూ చలిమిడి    సరియైన  విధంగా వచ్చేటట్లు  చూసుకోవాలి .
తర్వాత  పిండిలో  మూడు  చెంచాలు   నెయ్యి వేసుకోవాలి .
పిండి  చాలా  మృదువుగా   వస్తుంది .
తరువాత  సందర్భానుసారం  ఉండలుగా  చేసుకోవచ్చు .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  చలిమిడి  సిద్ధం.
ఇష్టమైనవారు  జీడిపప్పు నేతితో  వేయించుకుని  వేసుకోవచ్చు .

పెసర పొడి

పెసర పొడి .
ఆలూరు కృష్ణప్రసాదు .

ఒక  గ్లాసు   చాయ పెసరపప్పు  ఒకసారి  ఎండలో  పెట్టండి  లేదా  నూనె వేయకుండా  బాండీలో  పచ్చి వాసన  పోయే దాకా  వేయించుకోండి .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  వేయకుండా  పన్నెండు  ఎండు మిరపకాయలు , స్పూను   జీలకర్ర ,  వేయించుకోండి .

ఇప్పుడు  మిక్సీ లో  పెసర పప్పు ,  వేయించిన   ఎండుమిరపకాయలు , జీలకర్ర  , పావు స్పూను కు  తక్కువగా   ఇంగువ  మరియు  తగినంత   ఉప్పు వేసి  మెత్తగా   పొడి  వేసుకోండి .

ఒక  సీసాలో  భద్ర పరుచుకోండి .
అన్నం లోకి  ,  ఇష్టమైతే  ఇడ్లీ  మరియు  దోశెలలోకి  పెసర పొడి   బాగుంటుంది .
వేడి  వేడి  అన్నంలో  నెయ్యి వేసుకుని  ఈ  పెసర పొడిని కలుపుకొని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది .

దోసకాయ ముక్కల పచ్చడి

దోసకాయ ముక్కల  పచ్చడి .
ఆలూరు కృష్ణప్రసాదు .

కావలసినవి .
పసుపు రంగు గట్టి  దోసకాయ  ---  ఒకటి.
పై  చెక్కు   తీసి  చిన్న  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .
చిన్న నిమ్మకాయంత  చింతపండు   విడదీసి  కొద్దిగా నీళ్ళతో  తడిపి  ఉంచుకోవాలి ..
  
పచ్చిమిరపకాయలు  --  10

కొత్తి మీర   ---  రెండు కట్టలు .
మరి కాస్త  వేసుకున్నా  చాలా  రుచిగా  ఉంటుంది .

కట్టలు  విడదీసి  కాడలు  తీసేసి  కొత్తిమీర   శుభ్రం  చేసుకోవాలి .
ఉప్పు   ---   తగినంత
పసుపు  ---  కొద్దిగా .
పోపుకు  .
ఎండుమిరపకాయలు  --  6
మినపప్పు   ---  స్పూను
మెంతులు  ---   పావు  స్పూను
ఆవాలు  ---   అర  స్పూను 
ఇంగువ  ---  కొద్దిగా
నూనె  ---   50  గ్రాములు
తయారీ  విధానము  .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తం  నూనె  పోయాలి.
నూనె  బాగా  కాగనివ్వాలి  .
నూనె బాగా కాగగానే   మెంతులు , ఎండుమిరపకాయలు  ,  మినపప్పు , ఆవాలు  మరియు  ఇంగువ  వేసి  పోపు  బాగా  వేగనివ్వాలి .
ఎక్కువ   నూనె  ఉంటే  ఆఖరున  పచ్చడిలో  కలుపుకోవచ్చు.
బాండీ లోనే  ఉంచేయండి
పోపు  చల్లారగానే  ముందుగా   మిక్సీ లో  ఎండుమిరపకాయలు , తగినంత  ఉప్పు  మరియు  పసుపు వేసి  మిక్సీ   మెత్తగా   వేసుకోవాలి .
తరువాత  పచ్చిమిర్చి  , తడిపిన  చింతపండు   మరియు  పోపు  వేసి  మెత్తగా మిక్సీ   వేసుకోవాలి
చివరగా  దోసకాయ  ముక్కలు  మరియు కొత్తిమీర  వేసి   ఒకే  ఒక్కసారి  దోసకాయ  ముక్కలు  నలగ  కుండా  మిక్సీ   వేసుకుని  ఒక  గిన్నెలోకి  తీసుకుని  బాండీలో  కాగిన  మిగిలిన  నూనె  అందులో పోసి   గరిటతో  ముక్కలు  పచ్చడి  బాగా కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  దోసముక్కలు  పచ్చడి  సర్వింగ్   కు  సిద్ధం .

వంకాయ కొత్తిమీర కారం

వంకాయ కొత్తిమీర కారం
ఆలూరు కృష్ణప్రసాదు .

సింపుల్   గా  గుత్తి  వంకాయ  కొత్తిమీర   కారం.
కావలసినవి .
లేత  వంకాయలు  --  అర కిలో
కొత్తిమీర   ---  చిన్న కట్టలు  4
పచ్చిమిర్చి  --  10 
ఉప్పు  --  తగినంత 
నూనె  ---  150  గ్రాములు .

తయారీ  విధానము .
ముందుగా  కొత్తిమీర   బాగుచేసుకుని  , పచ్చిమిర్చి  , సరిపడా  ఉప్పు వేసి  మిక్సీలో  మెత్తగా   వేసుకోవాలి .
వంకాయలు  నీళ్ళలో  వేసుకుని   నాలుగు   పక్షాలుగా  చేసుకోవాలి .
ముందుగా   సిద్ధం  చేసుకున్న  కొత్తిమీర   కారం ముద్ద   ఈ  కాయల్లో  కూరుకోవాలి .
కొద్దిగా   కారం  విడిగా   ఉంచుకోవాలి .
స్టౌ  మీద  ఒక  గిన్నె  పెట్టి  మొత్తము   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  ,  ముద్ద కూరిన  వంకాయలు  అందులో  వేసి  గిన్నె    పైన  నీళ్ళ గిన్నె  మూత పెట్టాలి  .
స్టౌ  మీడియం  సెగలో  పెట్టాలి .
మధ్య  మధ్య  కాయలు  చితకకుండా
అట్లకాడతో  కదుపుతూ  ఉండాలి .

లేదా  రెండు వైపులా  గుడ్డతో గిన్నెను  పట్టుకొని   కుదిలిస్తూ ఉండాలి .
కాయలు  బాగా  మగ్గాక   విడిగా  ఉంచుకున్న  కారం  వేసి  మూత  తీసి  కారం  వేగనివ్వాలి .
మరో  అయిదు  నిముషాలు   ఉంచి  దింపి  వేరే  Dish  లోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ  లాడే  కొత్తిమీర   సువాసనతో  గుత్తి వంకాయ  కొత్తిమీర   కారం  కూర  సర్వింగ్  కు  సిద్ధం .

కందిపప్పు చారు

టమోటో , మునగ కాడలు కందిపప్పు పప్పు  చారు .
ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ విధానము.
ఒక  అర కప్పు  కందిపప్పు   ఒకసారి  కడిగి  కుక్కర్  లో  సరిపడా  నీళ్ళు , రెండు  టమోటో లు  ముక్కలుగా  తరిగి  , మరియు  కొద్దిగా పసుపు  వేసి మూడు  విజిల్స్  వచ్చే వరకు   ఉంచి  స్టౌ  ఆపేయాలి .
తర్వాత  కుక్కర్  తీసి  పప్పు బాగా యెనిపి , అందులో  నాలుగు  పచ్చిమిర్చి  ముక్కలుగా తరిగి , రెండు  ములక్కాడలు  ముక్కలుగా  తరిగి , నిమ్మకాయంత  చింతపండు  రసం  ఒక గ్లాసు నీళ్ళలో   పది  నిముషాలు నానబెట్టిన  రసం ,  రెండు రెమ్మలు  కరివేపాకు  , సరిపడా  ఉప్పు వేసి  మరో గ్లాసు నీళ్ళు పోసి  స్టౌ మీద  పెట్టి   ములక్కాడలు  ఉడికే  వరకు  మరగనివ్వాలి .
ఆ తర్వాత   పప్పు చారు  దింపాలి .
తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నూనె  వేసి , నూనె  బాగా కాగగానే   వరుసగా  మూడు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసి , పావు స్పూను  జీలకర్ర  ,  అర స్పూను  ఆవాలు  ,  కొద్దిగా  ఇంగువ మరియు  కొద్దిగా  కరివేపాకు   వేసి  పోపు  పెట్టుకోవాలి .
ఆ తర్వాత  కొత్తిమీర   తరిగి   పైన  వేసుకోవాలి .
అంతే  ఘమ  ఘమ లాడే  ములక్కాడ  , టమోటో  కందిపప్పు  పప్పు చారు  సర్వింగ్  కు  సిద్ధం.

బాదంతో ఆరోగ్యం

బాదంతో ఆరోగ్యం
ఆలూరుకృష్ణప్రసాదు .

నానబెట్టిన ‘బాదం’తో ఆరోగ్యం!
ఆరోగ్యానికి బాదంపప్పు (ఆల్మండ్) మంచిది. అదే, నానబెట్టిన బాదంపప్పు అయితే మరింత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ ఈ, పీచు (ఫైబర్) పదార్థం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు ప్రొటీన్లు బాదంపప్పులో పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, చక్కటి రక్త ప్రసరణకు, బ్లడ్ షుగర్ నియంత్రణకు, కండరాలు, నరాల పనితీరు సవ్యంగా సాగేందుకు బాదం ఎంతో మేలు చేస్తుంది. అయితే... నీళ్లలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే, బాదంపప్పు పై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అదేకనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది. తద్వారా ఆ సమస్య బారిన పడకుండా ఉంటాము. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని ఒంచి వేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవరులో స్టోర్ చేయాలి. దరిదాపు ఒక వారం రోజుల పాటు వీటిని తినవచ్చు. నానబెట్టిన బాదంతో కలిగే లాభాలు...

* జీర్ణక్రియ సమర్థవంతంగా ఉండటానికి
* అధిక బరువును తగ్గించుకోవడానికి
* గుండె ఆరోగ్యం పదిలంగా ఉండటానికి
* చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి.. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి
* యాంటిఆక్సిడెంట్లను పెంచుకోవడానికి
* కేన్సర్ వ్యాధిని దరిచేరనీయకుండా ఉండడానికి
* ట్యూమర్ల బారిన పడకుండా ఉండడానికి
* శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి
* పుట్టుకతో వచ్చిన లోపాల నివారణకు (నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఈ పనులను చక్కబెడుతుంది) నానబెట్టిన బాదం తీసుకోవడం ఎంతో మంచిది.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి