Thursday, March 1, 2018

తెలగపిండి కూర

ఆలూరుకృష్ణప్రసాదు .

తెలగ పిండి అంటే  నువ్వులు గానుగ లో  నూనె  ఆడాక  వచ్చే  పిండిని  తెలగ పిండి  అంటారు .

గోదావరి  జిల్లాలలో   దాదాపుగా  ప్రతి ఇంటిలో   ఈ తెలగ పిండితో  కూర  చేసుకుంటారు .

నువ్వులు  శుభ్రం  చేసి  గానుగలో  నూనె ఆడితే , తెలగపిండిలో  ఇసుక తగలదు .

అందువలన  శుభ్రం   చేసి  నూనె  ఆడిన   గానుగల్లో  తెలగ పిండి   తెచ్చుకుంటే  కూర  చాలా రుచిగా  ఉంటుంది .

మరి ఈ తెలగ పిండి కూర  ఏ విధముగా  తయారు చేస్తారో  తెలుసుకుందాం .

తెలగపిండి  కూర .

నువ్వుల నూనె తీసాక వచ్చిన నువ్వుల పొట్టును తెలగపిండి అంటారు.

ఇందులో ఫైబర్  అధికంగా ఉంటుంది.

సాధారణంగా  గానుగ లో నూనె ఆడిన కొట్లలో ఇది దొరుకుతుంది.

బాలింతలకు  పాలు బాగా పడతాయని ఈ కూరను  బాలింతలతో బాగా తినిపిస్తారు.

పత్యానికి, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

ఈ కూర తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాము.

1కప్పు తెలగపిండి కి 1.5 కప్పు నీరు తీసుకోవాలి.

నీటిలో చిటికెడు మెంతులు, చిన్న బెల్లం ముక్క, అర చెంచా కారం, తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి.

మరుగుతున్న నీటిలో తెలగపిండి వేసి, బాగా కలిపి, సిమ్ లో మూత పెట్టి, పిండి విరవిరలాడుతూ విడిపోయే దాకా ఉడకనివ్వాలి.

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని మూడు చెంచాల నూనె వేసి, అందులో అర స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, స్పూనున్నర మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి ముక్కలు గా చేసుకుని  కాగిన నూనెలో వేసి, పోపు  వేగాక ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు,  మూడు రెమ్మలు కరివేపాకు వేసి, వేగనిచ్చి, అందులో ఉడికిన తెలగపిండి వేసి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి.

చక్కని సువాసనలతో తెలగపిండి కూర సిద్ధం.

వెల్లుల్లి  వాడని వారు మరియు ఇష్టపడని  వారు  వెల్లుల్లి  వేయకుండా  చేసుకొనవచ్చును .

అంతే ఎంతో రుచిగా  ఉండే  తెలగపిండి  కూర సర్వింగ్  కు సిద్ధం.

పూర్ణం బూరెలు

ఆలూరుకృష్ణప్రసాదు .

పూర్ణం  బూరెలు .

శుభ సందర్భాలలో  తప్పని సరిగా  ప్రతి  ఒక్క కుటుంబాలలో  చేసుకునే  పిండి వంట పూర్ణం బూరెలు .

గోదావరి జిల్లాలలో  చాలామంది  పెసర పూర్ణం  బూరెలు  చేసుకుంటారు .

మరి మనం  ఈరోజు పచ్చిశనగపప్పు  తో పూర్ణం బూరెలు  తయారీ విధానము గురించి  తెలుసుకుందాం.

చాలా మంది  పూర్ణం బూరెలు చేయాలంటే  మాకు  భయం. మేం చేసిన ప్రతిసారీ  బూరెలు నూనెలో వేయగానే   చీదతాయి . ( విడిపోతాయి ) అందుకే  ప్రయత్నించం  అంటారు .

మేం ఎప్పుడు  చేసినా బూరెలు మాకు  ఎప్పుడూ  అలా   చీదవు .

కారణం లోపల ఉంచే పూర్ణం తయారీ  గట్టిగా  ఉండాలి .

పలచగా  ఉండకూడదు.

పూర్ణం పిండి  పలచగా  తయారు చేసుకుంటే  పూర్ణం బూరెలు నూనెలో వేయగానే చీదతాయి .

కాబట్టి లోపల పెట్టుకునే పూర్ణం  గట్టిగా  తయారు చేసుకోవాలి .

అలాగే  పైన  పెట్టుకునే  తోపు.

తోపు అంటే  తయారు చేసుకున్న పూర్ణం  చిన్న చిన్న  ఉండలుగా  చేసుకుని , తోపు  పిండిలో  ముంచి  వేసుకునేది .

తోపు  బాగా లేకపోతే  బూరె  నూనెలో వేగాక తింటే  మందంగా  ఉండి  సాగుతుంది .

తోపు వేగాక పల్చగా  ఉండాలి . తింటుంటే  కరకర లాడాలి .

ఈ తోపు  రెండు  రకములుగా  తయారు చేస్తారు .

మొదటి విధానము  ఒక గ్లాసు  మినపగుళ్ళు  మరియు  నాలుగు  గ్లాసుల బియ్యంతో  కలిపి  మెత్తగా  పిండి  మర పట్టించుకోవాలి .

ఇలా  మర పట్టించుకున్న పిండిలో  తోపుకు కావలసినంత పిండిని ఒక గిన్నెలో వేసుకుని  అందులో చిటికెడు  ఉప్పు  మరియు  చిటికెడు  సోడా  ఉప్పు వేసి  సరిపడా  నీళ్ళు  పోసి కనీసం  రెండు గంటల  ముందు నాన బెట్టుకోవాలి .

అలా కాకుండా  అర గ్లాసు మినపగుళ్ళు  మరియు రెండు గ్లాసుల  బియ్యము  విడిగా    సరిపడా  నీళ్ళు పోసుకుని  ముందు  రోజు  రాత్రి  నానబెట్టుకోవాలి .  మరుసటి  రోజు  నీరు వడకట్టుకొని  గ్రైండర్ లో  వేసుకుని   కొద్దిగా  నీళ్ళు  పోసుకుని  పిండిని  మెత్తగా   గ్రైండ్  చేసుకోవాలి .

పిండిని  గట్టిగా  వేసుకోవాలి .

బూరెలకు  అవసరమైన తోపు పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని  చాలా కొద్దిగా  అవసరమైన నీళ్ళు , చిటికెడు  సోడా ఉప్పు మరియు  చిటికెడు  మామూలు  ఉప్పు  వేసుకుని  తోపు  పిండిని  సిద్ధం  చేసుకోవాలి . 

ఈ పిండి  దోశెల  పిండిలా  ఉండాలి .

మిగిలిన  పిండిని  తర్వాత  దోశెలకు  వాడుకోవచ్చును .

ఇంక పూర్ణం  ఎలా  తయారు  చేసుకోవాలి ?

ఒక  గ్లాసు పచ్చి శనగపప్పు  సరిపడా  నీళ్ళు  పోసి  కుక్కర్  లో  మెత్తగా  ఉడకబెట్టుకోవాలి .

లేదా  గిన్నెలో  అయినా  ఉడక పెట్టు కోవచ్చును .

తర్వాత  పూర్తిగా  నీళ్ళు  లేకుండా  వడకట్టుకోవాలి .

ఆ తర్వాత  ఉడికిన  శనగపప్పు   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఆ తర్వాత  గ్లాసు బెల్లపు  పొడి  ( తరిగిన  బెల్లం ) ఒక  గిన్నెలో  వేసుకుని  చాలా  కొంచెము  నీరు పోసుకుని  స్టౌ  మీద పెట్టుకుని  బాగా  గరిటతో  తిప్పుకోవాలి .
బెల్లం  పూర్తిగా  కరగగానే  మిక్సీ   వేసుకొని  సిద్ధంగా  ఉంచుకున్న  శనగపప్పు  వేసుకుని  అడుగంటకుండా  బాగా దగ్గర  పడి  పూర్ణం  గట్టిగా  అయ్యే వరకు గరిటతో తిప్పు కోవాలి .

చేతితో  గట్టిగా  ఉండ అవుతుందో  లేదో  చూసుకోవాలి .

ఆ తర్వాత దింపుకుని   ముప్పావు స్పూను  యాలకుల పొడి  వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  చేయి పట్టే  వేడి  చూసుకుని  పూర్ణం అంతా చిన్న లడ్డూల మాదిరిగా ఉండలుగా  కట్టుకొని  వేరే  ప్లేటులో  సిద్ధంగా  ఉంచుకోవాలి .

మనం పూర్ణం  మరియు  దానిపై  తోపు  రెండు  సిద్దం  చేసుకున్నాము .

ఇప్పుడు  స్టౌ మీద  బాండీ  పెట్టి  పూర్ణం  మునిగే వరకు  అంటే  షుమారు  ముప్పావు  కిలో  నూనె  పోసి  నూనెను బాగా కాగనివ్వాలి.

తయారు  చేసి  సిద్ధంగా  ఉంచుకున్న పూర్ణాలను తోపు పిండిలో  ముంచి అయిదారు  చొప్పున  బూరెలు నూనెలో  వేసుకుని , గరిటె తో  తిప్పుతూ  మాడకుండా  ఎర్రగా  వేయించుకోవాలి .

అలా  మొత్తం  పూర్ణం బూరెలు  వేయించుకోవాలి .

చేయడం కొంచెం  శ్రమ అన్పించినా ఈ పూర్ణం బూరెల  రుచి  అమోఘం.

ఈ  పూర్ణం  బూరెలకు  వేలితో  కన్నం చేసుకుని  దాని నిండా  వెన్న  కాచిన  నెయ్యి  వేసుకుని , ఒక్కొక్క బూరె నోట్లో వేసుకుని  తింటుంటే   -----

ఆహా !  ఏమి రుచి .

మరి  ఇప్పుడంటే  కాటరింగ్ లు , కర్రీ పాయింట్ లు , Sweet షాపులు  వీధి వీధికి వెలిసాయి  కాని  మరి  ప్రతి  పండగలకు మరియు ప్రతి శుభకార్యాలకు  మన బామ్మ , అమ్మమ్మ , అమ్మ , అత్తగారు    మరో మనిషి సాయం లేకుండా  25  మందికి  పైగా  ఒంటి చేత్తో  కట్టెల పొయ్యి , కుంపట్ల  మీద  కేవలం మూడు  నాలుగు గంటల్లో  రెండు కూరలు , రెండు పచ్చళ్ళు , పప్పు , పులుసు , గారెలు , పాయసం , పులిహోర మరియు ఈ పూర్ణం బూరెలు  అవలీలగా  చేసేవారు .

మరి  వారి  ఋణం  ఎన్ని జన్మలెత్తి  మనం తీర్చుకోగలం.

మరి వాళ్ళు  30 , 40 సంవత్సరాల  క్రితం చేసిన రుచి కూడా ఈనాటికీ  మన నాలిక మీద నాట్యం చేస్తోందంటే  ముఖ్య కారణం వారి Dedicaton  and Effection .

మరి  ఈ రోజుల్లో  వంట చేయడానికి ఇన్ని  ఆధునిక  సౌకర్యాలు  ఉన్నా కొంచెం  శ్రమ కూడా  పడలేక పోతున్నామంటే కారణం  అందుబాటులో  అన్నీ రెడీమేడ్ గా దొరకడమే .

మరి  ఈనాటి  బజారు వస్తువుల  రుచి  ఎలా ఉంటుంది  ?

ఎన్ని రోజులు  గుర్తుంటుంది ?

ఏది ఏమైనా  మనం  స్వయంగా  తయారు చేసుకున్న  రుచి , తృప్తి  బజారు వస్తువులకు  ఉంటుందా ?

కొత్తావకాయ

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తావకాయ. ( సాంపిల్  )

కావలసినవి .

మామిడి  కాయలు  -  2
కారం  --  50  గ్రాములు
ఆవపిండి  --  40  గ్రాములు
ఉప్పు  --   35  గ్రాములు
మెంతులు  --  స్పూను
పసుపు --  స్పూను 
నూనె  --  100  గ్రాములు

తయారీ విధానము .

మామిడి కాయలు  కడిగి పొడి గుడ్డ పెట్టుకుని  తడిలేకుండా తుడుచుకుని  పై చెక్కు తీయకుండా మధ్యకు తరుగుకొని , మధ్యలో  జీడి  మరియు లోపల పొర తీసివేసి ముక్కలుగా  తరుగుకోవాలి .

ఈ ముక్కలలో  గరిటెడు  నూనె  , మొత్తము  పసుపు  వేసి  చేతితో  బాగా  కలుపుకొని  విడిగా  ఉంచుకోవాలి .

ఒక బేసిన్ లో  కారం , ఆవ పిండి , ఉప్పు  మరియు  మెంతులు వేసుకుని , చేతితో బాగా కలుపుకోవాలి .

అందులో  కలిపిన ముక్కలు మరియు మొత్తము  నూనె  వేసుకుని  బాగా  కలుపుకుని  ఒక సీసాలో  తీసుకోవాలి .

మరుసటి  రోజునుండి  ఈ ఆవకాయ  తిరగ కలిపి  వాడుకోవచ్చు .

ఈ ఆవకాయ  ఏప్రిల్ లో  అసలు  ఆవకాయలు  పెట్టేవరకు  అంటే  రెండు నెలలు  నిక్షేపంలా  ఉంటుంది .

కొయ్య తోటకూర పప్పు

ఆలూరుకృష్ణప్రసాదు .

కొయ్య తోటకూర  పప్పు .

కావలసినవి .

కొయ్య తోటకూర  --

మా వైపు కట్టలు గా  అమ్మరు .
విడిగా  5  రూపాయలకు , 10  రూపాయలకు  అమ్ముతారు . 

ఆ తోటకూర  తెచ్చుకుని  ముదురు కాడలు  తీసి , లేత కాడలు  మరియు ఆకు  తరుగు కోవాలి .

ఈ తరిగిన  ఆకు  షుమారు  పావు కిలో  పప్పుకు  సరిపోతుంది .

కందిపప్పు  --  గ్లాసు లేదా షుమారు  150  గ్రాములు.

చింతపండు -- నిమ్మకాయంత . విడదీసి  పది నిముషాలు  సేపు  తడిపి  ఉంచుకోవాలి .
ఉల్లిపాయలు -- రెండు .
పచ్చిమిరపకాయలు  --   8
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు
ఉప్పు  --  తగినంత
పసుపు  --  పావు  స్పూను

పోపుకు .

ఎండుమిరపకాయలు  4  ముక్కలుగా  చేసుకోవాలి .

ఈ  కొయ్య  తోటకూర  పప్పుకు  నేతితో  పోపు  వేసుకుంటే   రుచిగా  ఉంటుంది .
నెయ్యి   --  3  స్పూన్లు

మెంతులు  --  పావు  స్పూను 
ఆవాలు  --  అర  స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము .

ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .

పచ్చిమిరపకాయలు నిలువుగా  తరుగుకోవాలి .

తర్వాత  ఒక వెడల్పాటి  గిన్నెలో  కందిపప్పు  వేసుకుని , ఒకసారి  పప్పును  కడిగి  సరిపడా  నీళ్ళు పోయాలి .

స్టౌ  మీద  పెట్టుకుని  పప్పును  పొంగకుండా  చూసుకుంటూ మూతపెట్టి  పప్పును మూడు  వంతులు పైన  మెత్తగా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  తరిగిన   కొయ్య తోటకూర  , తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , తడిపిన చింతపండు , పసుపు , కొద్దిగా  పచ్చి ఇంగువ , రెండు  రెమ్మలు   కరివేపాకు , తరిగిన   పచ్చిమిర్చి వేసి  నీళ్ళు  అవసరమైతే  కొద్దిగా  పోసుకుని  మూతపెట్టి   పప్పును  పూర్తిగా   ఉడకనివ్వాలి .

ఆ పైన తగినంత  ఉప్పు మరియు స్పూను  ఎండు కారము  వేసి మరో  అయిదు  నిముషాలు  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  పప్పుని గరిటతో  బాగా  కలుపుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టుకుని  మొత్తము  నెయ్యి   వేసుకుని  నెయ్యి  బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , మెంతులు , ఆవాలు  , కొద్దిగా  ఇంగువ  మరియు  కరివేపాకు  వేసుకుని  పోపు  పెట్టుకుని , పప్పులో  వేసుకుని  గరిటెతో బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కొయ్య తోటకూర  పప్పు సర్వింగ్ కు  సిద్ధం .

ఈ  కొయ్య తోటకూర   పప్పు   భోజనము లోకి , చపాతీలు , రోటీలలోకి  కూడా   చాలా  రుచిగా  ఉంటుంది .

ఊర మిరపకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఊర మిరపకాయలు  /  చల్ల మిరపకాయలు .

ఒక లీటరున్నర  పుల్లని  గట్టి పెరుగు   తగినన్ని  నీళ్ళు పోసి మజ్జిగ  చెసుకొవాలి .

ఒక  కె. జి. మరీ కారం లేని బోలు  పచ్చిమిరపకాయలు  తీసుకుని  కత్తి పీటతో  మధ్యకు  నిలువుగా  గాటు  పెట్టుకోవాలి .

తొడిమలు  తీయరాదు .

సన్నని  మిరపకాయలు  కూడా  వాడవచ్చును .

ఊరాక  సన్న పచ్చి మిరపకాయలు  కూడా  రుచిగా  ఉంటాయి.

ఇపుడు  ఒక  పెద్ద  స్టీల్  టిఫిన్ లో  మజ్జిగను  పోసుకుని  అందులో  స్పూను  పసుపు మరియు  తగినంత  ఉప్పు వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి .

అందులో  గాటు  పెట్టిన  పచ్చిమిరపకాయలు  వేసుకుని  బాగా  కలిపి  మూత పెట్టుకుని మూడు రోజులు  కదపకుండా  ఉంచాలి .

నాల్గవ రోజు  ఉదయం  చేతితో  మిరపకాయలు  తీసి  మజ్జిగ  టిఫిన్ లోనే  కారనిచ్చి  మిరపకాయలను  ఒక వెడల్పాటి  పళ్ళెంలో  పోసుకుని  ఆరు  బయట ఎర్రని  ఎండలో  ఎండబెట్టుకోవాలి .

సాయంత్రం   మళ్ళీ  మిరపకాయలు  మళ్ళీ  మజ్జిగలో  పోయాలి .

అలా  మజ్జిగ  పూర్తి అయ్యే వరకు షుమారు  నాలుగు రోజులు  ప్రతి  రోజూ  ఉదయం  ఎండబెట్టి  సాయంత్రం  మరల  పోస్తుండాలి .

మజ్జిగ  పూర్తయ్యాక  ఊర మిరపకాయలు  బాగా  తడి లేకుండా  గల గల లాడే వరకు  మరో  నాలుగైదు  రోజులు  ఎండబెట్టుకోవాలి .

తర్వాత టిఫిన్ లో  భద్ర పరచుకోవాలి .

కొంతమంది  పచ్చిమిరపకాయలు   ఊర  వేయకముందే  మజ్జిగ లో  నాలుగు కాయలు  నిమ్మరసం  పిండుకుంటారు .

దీని వలన  ఊరిన కాయలు రంగు మారకుండా  తెల్లగా ఉంటాయని , రుచి కూడా మరింత పెరుగుతుందని  అంటారు.

మీరు కూడా అలా చేసుకోవచ్చును.

మనకు  అవసరమైనప్పుడు   అవసరమైనవి  తీసుకుని  పప్పు , పప్పు కూరలు , కలగలపు పప్పు ఇలా  వండుకున్నప్పుడు    పక్కన ఆదరువుగా నూనెలో  వేయించుకోవచ్చును .

ఈ ఊర  మిరపకాయలు  ఏడాది అంతా  నిల్వ ఉంటాయి .

వానాకాలంలో  , వాతావరణం  చాలా  మబ్బులుగా  చలిగా  ఉన్నప్పుడు ,  బాగా  ఎండ వచ్చిన సమయంలో  రెండు నెలలకు  ఒకసారి  ఎండలో  పోసుకుని సాయంత్రం  టిఫిన్ లో  పోసుకుంటే  మెత్తపడకుండా  ఏడాది  అంతా  నిల్వ ఉంటాయి .

ఉప్పుడు పిండి

బియ్యపు రవ్వతో  పిండి లేదా ఉప్మా.

కావలసినవి .

బియ్యపు రవ్వ  --  ఒక గ్లాసు.
చాయ పెసర పప్పు --  పావు  గ్లాసు
పచ్చి కొబ్బరి   --  అర చిప్ప
నూనె  --  నాలుగు  స్పూన్లు
పచ్చి మిరపకాయలు  --  5  నిలువుగా  చీలికలు  చేసుకోవాలి .
కరివేపాకు  --  మూడు రెమ్మలు

పోపుకు .

ఎండుమిరపకాయలు --   3  ముక్కలుగా  చేసుకోవాలి .
పచ్చిశనగపప్పు  --  రెండు స్పూన్లు
చాయమినపప్పు  --  స్పూనున్నర
జీలకర్ర  --  స్పూను
ఆవాలు  --  స్పూను
నెయ్యి  --  మూడు స్పూన్లు
నీళ్ళు  --  మూడు  గ్లాసులు.
ఉప్పు -- తగినంత

తయారీ  విధానము .

చాయపెసరపప్పు  తగినన్ని  నీళ్ళు  పోసి  గంటన్నర  సేపు  నానబెట్టుకోవాలి .

తర్వాత  నీరు  వడగట్టుకొని వేరే  ప్లేటులో  తీసుకోవాలి .

పచ్చి కొబ్బరి   తురుము కోవాలి.

ఇప్పుడు  స్టౌ  మీద  మందపాటి  గిన్నె కాని  లేదా  బాండీ కాని  పెట్టుకుని  నాలుగు  స్పూన్లు  నూనె  వేసుకుని  నూనె బాగా కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , పచ్చిమిర్చి  మరియు  కరివేపాకు  వేసి  పోపు పెట్టుకోవాలి.

పోపు  వేగగానే  మొత్తం  మూడు గ్లాసుల  నీళ్ళు , నానబెట్టిన  చాయపెసరపప్పు  వేసి  , తగినంత  ఉప్పును  వేసి  మూత పెట్టి  నీళ్ళు బాగా తెర్లనివ్వాలి .

ఆ  తర్వాత  పచ్చి కొబ్బరి  తురుము  అందులో  వేసి  గరిటెతో  బాగా కలిపి  రెండు నిముషాలు  తెర్ల నివ్వాలి .

ఆ తర్వాత  సన్నగా  బియ్యపు రవ్వ పోసుకుంటూ  ఉండకట్టకుండా  అట్లకాడతో  బాగా కలపాలి .

తర్వాత  మూడు స్పూన్లు  నెయ్యి వేసి  అట్లకాడతో  బాగా కలపాలి .

తర్వాత  స్టౌ  సిమ్ లో  పెట్టి  మరో  పది నిముషాలు సన్నని సెగన మగ్గనివ్వాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  బియ్యపు  రవ్వతో  పిండి  సర్వింగ్  కు సిద్ధం.

ఇందులో  నంచుకోవటానికి చట్నీ.

చిన్న నిమ్మకాయంత చింతపండు ( అయిదు నిముషాలు  తడిపి ), ఒక చిన్న కట్ట కొత్తిమీర , ఆరు  పచ్చి మిరపకాయలు , కొద్దిగా  బెల్లం మరియు  సరిపడా  ఉప్పు వేసి  మెత్తగా  మిక్సీ  లో వేసుకుని  వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

తర్వాత స్టౌ మీద  పోపు  గరిటె  స్పెట్టి , రెండు స్పూన్లు  నెయ్యి వేసి  రెండు ఎండుమిరపకాయలు , స్పూను  మినపప్పు , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు రెండు రెమ్మలు  కరివేపాకు  వేసుకుని  పోపు పెట్టుకుని పచ్చడిలో  కలుపు కోవాలి .

ఈ పచ్చడి  పిండి లోకి  కాంబినేషన్ గా బాగుంటుంది .

టమోటాల పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటాల   పచ్చడి .

కావలసినవి .

టమోటాలు  తయారైనవి  ---  ఎనిమిది
పచ్చి మిర్చి  ---  పది .
కరివేపాకు  ---  మూడు  రెబ్బలు
కొత్తిమీర   ---  ఒక  కట్ట.
చింతపండు  --  నిమ్మకాయంత
ఉప్పు  --  తగినంత
పసుపు  --  అర  స్పూను .
నూనె  --  రెండు  గరిటెలు .

పోపుకు  కావలసినవి .

ఎండుమిర్చి  -- ఎనిమిది
ఆవాలు  -   స్పూను
మినపప్పు  --  రెండు  స్పూన్లు
జీలకర్ర  --  అర స్పూను
ఇంగువ  --  తగినంత
మెంతులు  -  అర స్పూను .

తయారీ  విధానము --

ముందుగా  టమోటాలు  ముక్కలుగా   కోసుకోవాలి .

బాండీలో  నూనె  వేసుకుని   నూనె  కాగగానే టమోటాలు , పచ్చి మిర్చి  ముక్కలను , కొద్దిగా  ఉప్పు , పసుపు  వేసి  మగ్గనివ్వాలి.

ఇప్పుడు  మళ్ళీ  బాండీలో  నూనె  వేసి  నూనె బాగా కాగగానే  ముందుగా  మెంతులు , ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర  , ఆవాలు  మరియు కరివేపాకు  పోపు  పదార్ధములన్నీ  వేసి పోపు  పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ లో  ముందుగా ఎండు మిర్చి , చింతపండు , ఉప్పు , వేసి   మెత్తగా మిక్సీ  వేసుకోవాలి.

మగ్గపెట్టిన టమోటా ముక్కలు,  పచ్చిమిరపకాయలు కొత్తిమీర  మిగిలిన  పోపు  వేసి  మరీ  మెత్తగా  కాకుండా మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ  లాడే  కొత్తిమీర ,ఇంగువ  వాసనలతో  టమోటో  పచ్చడి సర్వింగ్ కు  సిద్ధం .

మసాలా పెసర పుణుకులు

మసాలా పెసర వడలు  లేదా మసాలా పెసర పుణుకులు .

కావలసినవి.

పచ్చ పెసలు  లేదా  మామూలు పెసలు  --  పావు కిలో
పచ్చిమిర్చి  --  12 
అల్లం  --  షుమారు  రెండంగుళాలు ముక్క
పై  చెక్కు తీసుకుని
ముక్కలు గా చేసుకోవాలి .

ఉల్లిపాయలు  --  రెండు . సన్నని  ముక్కలుగా  తరుగు కొవాలి .

కరివేపాకు  --  మూడు రెమ్మలు . సన్నగా  తరుగు కోవాలి .

కొత్తిమీర  --  ఒక కట్ట  సన్నగా  తరుగు కోవాలి .

పొదినా  ఆకు   అరకప్పు  --  సన్నగా  తరుగు కోవాలి .

ఉప్పు  --  తగినంత

నూనె  --  అర కిలో

తయారీ  విధానము .

ముందుగా   పెసలు   సరిపడా  నీళ్ళు  పోసి  నాలుగు  గంటల  సేపు  నానబెట్టు కోవాలి .

ఆ తర్వాత నీళ్ళు  వడకట్టు కోవాలి .

ఇప్పుడు  గ్రైండర్ లో కాని  మిక్సీ లో కాని  నాన బెట్టిన  పెసలు , పచ్చి మిర్చి , అల్లం  ముక్కలు మరియు  సరిపడ ఉప్పు వేసి  తగినన్ని  నీళ్ళు పోసుకుంటూ  గారెల పిండి మాదిరిగా   గట్టిగా  వేసుకుని  ఒక  గిన్నెలోకి తీసుకోవాలి .

ఇప్పుడు  అందులో  సన్నగా  తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  కరివేపాకు , తరిగిన  కొత్తిమీర  మరియు తరిగిన  పొదినా  వేసుకుని  చేతితో  బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టుకుని  మొత్తం  నూనె పోసి  నూనె పొగలు వచ్చే  విధముగా  కాగనివ్వాలి .

తర్వాత  పిండిని  అర చేతితో  అద్దుకుని  వడలు  లాగా వేసుకుని  బంగారు  రంగులో  వేయించుకోవాలి .

లేదా  చిన్న చిన్న పుణుకులు లా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మసాలా పెసర వడలు  లేదా  మసాలా పెసర పుణుకులు  మధ్యాహ్నము  అల్పాహారమునకు  సిద్ధం .

ఈ వడలు లేదా పుణుకులు  వేడి వేడి అన్నంలో  నెయ్యి వేసుకుని  నంచుకుని  తినవచ్చు .

చాలా రుచిగా ఉంటాయి .

పెసర పప్పు పచ్చడి

పెసర పప్పు పచ్చడి.
( కొద్ది మార్పులతో  )

చాయపెసరపప్పు  -- 100  గ్రాములు.
పచ్చిమిరపకాయలు  --  6
ఎండుమిరపకాయలు  --  2
జీలకర్ర  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
నిమ్మకాయ  -- ఒకటి .
కట్ చేసుకుని  రసము తీసుకోవాలి .
కొత్తిమీర  --  చిన్న కట్ట

పోపుకు.

నెయ్యి  --  రెండు  స్పూన్లు
ఎండుమిరపకాయలు  --  రెండు 
చాయమినపప్పు --  స్పూను
ఆవాలు  --  అర స్పూను.
కరివేపాకు  --  రెండు రెమ్మలు.

తయారీ విధానము .

ముందుగా  చాయపెసరపప్పును  ఒక గిన్నెలో  వేసుకుని  తగినన్ని  నీళ్ళు  పోసి   రెండు గంటల సేపు  నానబెట్టాలి.

తర్వాత  నీరును  వడకట్టు కోవాలి .

తర్వాత  నానబెట్టిన  చాయపెసరపప్పు ,  జీలకర్ర , పచ్చిమిర్చి , ఎండుమిర్చి , పచ్చి ఇంగువ , తరిగిన  కొత్తిమీర  వేసి , తగినన్ని  నీరు  పోసుకుని   మరీ  మెత్తగా  కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  పచ్చడిని  ఒక గిన్నెలోకి  తీసుకుని  నిమ్మరసం  వేసుకుని  స్పూనుతో బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని రెండు  ఎండుమిర్చి  ముక్కలు చేసుకుని , చాయ మినపప్పు  ,ఆవాలు  మరియు  కరివేపాకు  వేసుకుని  పోపు వేసుకుని  పచ్చడిలో  వేసుకుని,   స్పూను తో   బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే  పెసరపప్పు  పచ్చడి  సర్వింగ్  కు సిద్ధం.

నెయ్యి వల్ల లాభాలు

మల్లిఖార్జున్ బోడ్లా .

నెయ్యి వాడకం వలన ప్రయోజనములు .

హాయిగా నెయ్యి తినండి ఆయుష్షు పెంచుకోండి..

“నెయ్యా! అమ్మో! వద్దు.. బరువు పెరుగుతాం, ఒళ్ళొచ్చేస్తుంది”.. నూటికి 90 శాతం ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. ఎందుకంటే జనం కూడా నెయ్యిని కొలెస్ట్రాల్ కి ప్రతిరూపంలా ఫీలవుతున్నారు. చాలామంది టీవీల్లో చెప్పేవి.. పుస్తకాల్లో, పేపర్లలో రాసేవి చూసి, సగం సగం నాలెడ్జ్ తో నమ్మేసి అదే నిజం అనుకుని, గుండెజబ్బులనేవి నెయ్యి తినడం వల్లే వస్తాయని ఫిక్స్ అయిపోతున్నారు. ఇవేమీ నిజం కాదు. ఆయుర్వేదం ‘నెయ్యి’ అమృతంతో సమానం అని చెప్పింది. అంతేకాదు మోడ్రన్ సైన్స్ కూడా నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయని రీసెర్చ్ చేసి మరీ చెప్పింది..

నెయ్యిలో ఉండే ఈ రెండూ K2 , CLA (Conjugated Linoleic Acid) యాంటి యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి అని ఎంతమందికి తెలుసు.

నెయ్యి తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోవడమే కాదు ఆహారం కూడా స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. నెయ్యి వల్ల గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వాళ్ళు, నెయ్యిని త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల విట‌మిన్ “ఎ” పుష్క‌లంగా ల‌భించి నేత్ర స‌మ‌స్య‌లు తగ్గుముఖం పడతాయి.

నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే అపోహ ఉంది. అయితే నిజానికి నెయ్యి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ పెరగదు.. నెయ్యి మంచి కొలెస్ట్రాల్‌ నే పెంచుతుంది. అందువల్ల నెయ్యివల్ల గుండజబ్బులు రావు. గుండెజబ్బులకి వేరే కారణాలు కీలకం కావచ్చు. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే ఎన్నో పోషకాలు గ‌ర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే పిల్లలకి ల‌భిస్తాయి.

నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు నిర్ధారించాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి. ముఖం మీద వచ్చే ప్రతివాటికీ నెయ్యి కారణం అని మాత్రం అనుకోవద్దు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌వ‌చ్చు. అయితే అతి అనర్ధదాయకం.

నెయ్యిలో ఉండే యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ వల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు తగ్గడమే కాదు రకర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది. రోజూ ఆహారంలో తప్పనిసరిగా నెయ్యిని తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఆయుర్వేదం “నెయ్యి” పాజిటివ్ ఫుడ్‌ అని చెప్తోంది. అంతేకాదు ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు శ‌రీరానికి ఎంతో మంచిది అని వివరణ కూడా ఇచ్చింది. అంతెందుకూ శ‌రీరంపై కాలిన గాయాలు ఉంటే, కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి.. దీంతో ఆ గాయం ఇట్టే తగ్గిపోవడం గమనించవచ్చు.

ఎంతో ఉపయోగకరమైన రుచిగా ఉండే మన నెయ్యిని.. మనం ఇష్టపడటం మానేసి, ఇతరదేశాలవాళ్ళు, వాళ్ళ ఆయిల్స్ గురించి పాజిటివ్ గా ప్రచారం చేస్తుంటే, వాళ్ల అమ్మకాలని పెంచుకుంటుంటే వాటిని మనం ఆహా ఓహో అని మెచ్చేసుకుంటున్నాం.. అధిక బరువుకి, కొలెస్ట్రాల్ పెరగడానికి, గుండె జబ్బులు రావడానికి నెయ్యి కారణం కాదు. స్ట్రెస్, సరైన వ్యాయామం లేకపోవడం ఇతర సమస్యలు కారణం.. కనుక హాయిగా నెయ్యి తినండి ఆయుష్షు పెంచుకోండి..

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి