Tuesday, May 30, 2017

ముదిరిన ఆనపకాయతో దోసెలు

ముదిరిన ఆనపకాయతో దోసెలు
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఆనపకాయ కొన్ని ప్రాంతాల వారు సొరకాయ అని పిలుస్తారు .
కొంత మంది ఆనపకాయ ,దోసకాయలలో ఏముంటుంది ? నీరు తప్ప.
ఆ రెండింటిలో అని పెదవి విరిచేస్తారు .

కాని దోసకాయ కందిపప్పు లో వేస్తే రుచి మరే పప్పుకు రాదు.
అలాగే లేత లేత ఆనపకాయలు సన్న ముక్కలు తరిగి మెత్తగా ఉడికించి అందులో పోపు వేసి నువ్వుల పొడి జల్లితే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది .
మరి లేత ఆనపకాయ అనే కొంటాము .
తీరా కాయ తరిగితే ముదురు .
అయ్యో ఏం చేయాలి ?
మొత్తం కాయ పారేయ్యాలసిందేనా ?
ఈ ముదురు కాయతో పప్పు చేసినా , కూర చేసినా Waste అని దిగులు పడకండి .

ఈ ముదిరిన ఆనపకాయతో దోసెలు వేసుకుంటే .
ఆనపకాయతో అదీ ముదిరిన కాయతో దోసెలా ? అని అనుకోకండి .
మేం చేసి చూసాం .
ఇంటికి వచ్చిన బంధువులందరికీ 
పెట్టాము .

దోశెలు చాలా బాగున్నాయి ఎలా చేసారు ? ఎలా చేసారు ? అని అడిగారు .
మీరు కూడా ప్రయత్నించండి .
ఆనపకాయ దోశెలు తయారు చేయు విధానము ; -----
ముందుగా ఒక గ్లాసు బియ్యం మూడు గంటల ముందు నాన బెట్టుకోండి .
ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కడిగి వేసి , అందులో తగినంత ఉప్పు , అర స్పూన్ జీలకర్ర వేసి , నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ , తరిగిన ఆనపకాయ ముక్కలు గింజలు ఉన్నా మరేం పర్వాలేదు మెత్తగా దోశె పిండి లాగా వేసుకోండి .
ఆ తర్వాత అందులో ఒక స్పూన్ ఎండు కారం కలపండి .
పిండిని బాగా కలిపి , ఒక గంట బైట ఉంచేయండి .
ఆ మిక్సీ పట్టిన పిండిని తర్వాత దోశెలు వేసుకునే ముందు కొద్దిగా నీళ్ళు కలుపుకుని గరిట జారుగా చేసుకొని , స్టౌ మీద పెనం పెట్టి నూనె వేసి దోశెలు వేసుకోండి .
అంతే వేడి వేడి ఆనపకాయ దోసెలు తినడానికి రెడి రెడీ.
ఈ దోశెలను టమోటా చట్నీతో తింటే అదిరి పోతుంది .
దోశెల లోకి టమోటా చట్నీ తయారు చేయు విధానము .
ముందుగా మూడు ఒక మాదిరిగా పండిన టమోటాలను తీసుకొని ముక్కలుగా తరగండి .
ఆ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసి బాండిలో రెండు స్పూన్లు నూనె వేసి మగ్గ బెట్టుకోండి.
నాలుగు ఎండు మిరపకాయలు , మెంతులు కొద్దిగా , ఆవాలు కొద్దిగా , ఇంగువ కొద్దిగా , ఒక స్పూన్ చాయ మినపప్పు , కరివేపాకు కొద్దిగా వేసి పోపు పక్కన పెట్టుకోండి .
ఇప్పుడు మిక్సీలో వేయించిన ఎండు మిరపకాయలు వేసి తిప్పండి . అవి మెత్తగా అయిన తర్వాత తగినంత ఉప్పు మగ్గిన టమోటా ముక్కలు కొత్తిమీర వేసి మెత్తగా అయ్యాక పోపు కూడా వేసి మరోసారి తిప్పండి .
అంతే ఘమ ఘమ లాడే టమోటాల చట్నీ వేడి వేడి దోశెల లోకి సిద్ధం.
టమోటాల లో కొంచెం పులుపు ఉంటుంది కనుక వేరే చింతపండు వేయనవసరం లేదు.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి