Friday, January 12, 2018

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

కొత్త  పండు మిరపకాయల పచ్చడి.

సాంపిల్ గా  ఒక  అర కిలో పెట్టుకున్నాం.

ఒక అర కిలో పండు మిరపకాయలలో స్పూనున్నర  పసుపు,  ఒక 75 గ్రాములు మెత్తని ఉప్పు వేసి  రోటిలో  తొక్కుకోవాలి .

ఒక జాడిలో  100 గ్రాముల కొత్త చింతపండు  విడదీసి  మధ్యలో  పెట్టుకోవాలి .

ఇంగువ  పలుకులు కూడా  మధ్యలో పెట్టుకుని  మూడో  రోజు  మెత్తగా  రుబ్బుకోవాలి .

ఒక  జాడీలో  భద్ర పరుచుకోవాలి .

కావలసినప్పుడు   కొంత పచ్చడి తీసుకుని  అందులో స్పూను మెంతిపిండి  వేసుకుని , బాండిలో  నాలుగు స్పూన్లు  నూనె వేసుకుని  ఆవాలు, ఎండుమిర్చి  ముక్కలు మరియు ఇంగువ వేసి పోపు  పెట్టుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే పండుమిరపకాయల పచ్చడి  దోశెలు , చపాతీలు మరియు భోజనము  లోకి  సర్వింగ్ కు సిద్ధం.

పెసరపప్పు లడ్డూలు

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి  స్పెషల్ .

మినప సున్నుండలు  ఏ విధంగా  చేసుకుంటామో  చాయపెసరపప్పు ను  మిగిలిన పప్పులతో  కలిపి  కూడా  లడ్డూలు  చేసుకోవచ్చును .

పెసర పప్పు పల్లీ పప్పుతో లడ్డూలు .

కావలసినవి .

చాయపెసర పప్పు --  ఒక  కప్పు
నెయ్యి --  ఒక  కప్పు.
కాచి  ఉంచుకోవాలి .
పంచదార  -- రెండు  కప్పులు .
వేరు శనగపప్పు  -- ఒక కప్పు.
జీడిపప్పు  మరియు 
బాదం పప్పు  --  అర కప్పు .
కాచి  చల్లారిన పాలు   --  పావు కప్పు.
యాలకుల పొడి  --  ఒకటిన్నర  స్పూను .

తయారీ  విధానము .

ముందుగా  బాండీలో  నాలుగు  స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి   బాగా  కాగగానే   చాయపెసరపప్పు  ను వేసి  కమ్మని వాసన వచ్చేదాకా  వేయించుకోవాలి .

చల్లారగానే  పెసర పప్పు ను  మిక్సీ లో  మెత్తగా  పొడి  చేసుకొని  విడిగా  ఉంచుకోవాలి. .

తర్వాత  పంచదార ను  కూడా  మెత్తగా  మిక్సీ  వేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

తర్వాత   బాండీలో  నెయ్యి  వేయకుండా  పల్లీలను  వేయించుకుని , చల్లారగానే  పై పొట్టు  తీసుకుని తర్వాత  మిక్సీ లో  మెత్తగా  పొడి చేసుకుని  విడిగా  ఉంచుకోవాలి .

జీడిపప్పు  మరియు  బాదం  బాండిలో  రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  వేయించుకుని   మిక్సీలో  పొడి  చేసుకోవాలి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో  పెసరపప్పు పొడి , పల్లీల పొడి , జీడిపప్పు  బాదంపొడి , పంచదార పొడి ,  యాలకుల పొడి  మరియు  కాచిన నెయ్యి వేసుకుని   చేతితో బాగా కలుపు కోవాలి . ఆ తర్వాత  ఉండ  కట్టుకోవటానికి   అవసరమైన  కొద్దిగా  పాలు పోసుకొని   ఉండలు కట్టుకోవాలి .

ఈ ఉండల్లో  పల్లీలు , జీడిపప్పు , బాదం  అన్నీ  కలుస్తాయి  కనుక  మంచి పోషక విలువలు కలిగి  ఎదుగుతున్న పిల్లలకు  మంచి బలవర్ధకమైనవి .

అంతే  సంక్రాంతి  స్పెషల్  పెసరపప్పు మరియు పల్లీ పప్పుతో  లడ్డూలు  సిద్ధం .

Saturday, January 6, 2018

అప్పాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

ఈ రోజు  శనివారము .

శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన రోజు .

ఆంజనేయ  స్వామి  వారి  ప్రసాదము  అప్పాలు  తయారు  చేయు  విధానము .

కావలసినవి .

షుమారుగా  ఒక  కప్పు  కొలతగా  పెట్టుకోండి .

గోధుమ పిండి   ---   అరకప్పు

బియ్యపు  పిండి  ---  అర కప్పు

బెల్లం  తరిగిన   పొడి  --  ఒక  కప్పు

పచ్చి కొబ్బరి  తురుము ---  పావు  కప్పు    

యాలకుల పొడి  ---  అర  స్పూను 

నెయ్యి  ---  రెండు  స్పూన్లు

నూనె  ---  200  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి తరిగిన   బెల్లం  పొడి  వేసి  బెల్లం పొడి  మునిగే  వరకు  నీళ్ళు  పోసి  బెల్లం   కరిగాక   నీళ్ళు  బాగా  తెర్లనివ్వాలి .

పాకం  రావక్కరలేదు.

గోధుమ  పిండి  మరియు  బియ్యపు  పిండి రెండూ  జల్లెడ  పోసుకుని  లేదా  రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న  నీళ్ళలో  ముందు యాలకుల  పొడి వేసి , తర్వాత  ఈ  పిండి , కొబ్బరి తురుము  మరియు  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  బాగా  గరిటెతో  కలిపి   స్టౌ  వెంటనే   ఆపేయాలి.

కొద్ది  సేపు   తర్వాత  చేతికి  నెయ్యి  రాసుకొని  ఎడం  అర చేతిలోకి  కొద్దిగా   ఈ  మిశ్రమాన్ని  తీసుకొని   కుడి  చేతి  వేళ్ళతో  పాలకోవా  బిళ్ళలు  లాగా  చిన్న  చిన్న  అప్పాలు  మాదిరిగా   పిండి  అంతా  వత్తుకొని  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  వేరే  బాండి  పెట్టి  నూనె  అంతా  పోసి  నూనె  బాగా   కాగనివ్వాలి .

తర్వాత  షుమారు ఎనిమిది  పది  అప్పాలు  వేసి  ఎక్కువ   సేపు  ఉండనివ్వకుండా  వెంటనే  తీసెయ్యాలి .

ఎక్కువ   సేపు  ఉంటే  అప్పాలు  మాడి  పోతాయి.

ఇవి  కొబ్బరి  బూరెల్లా  కొంచెం   మెత్తగా   ఉంటాయి .

అప్పాలు  గట్టిగా   కావాలనుకునే  వాళ్ళు  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి  , పావు కప్పు  గోధుమ పిండి  వేసుకుని   చేసుకోవాలి .

అంతే  స్వామి  వారి  ప్రసాదానికి  అప్పాలు  సిద్ధం.

కొంచెం   పెద్దవి  చేసుకుంటే  బూరెల్లా  టిఫిన్  గా  కూడా  బాగుంటాయి .

మైసూరు పాక్

ఆలూరుకృష్ణప్రసాదు .

సంక్రాంతి  స్పెషల్  వంటలు .

మైసూర్ పాక్ .

కావలసినవి .

శనగపిండి  -  కప్పు
పంచదార  --  కప్పున్నర.
నెయ్యి  --  రెండు కప్పులు .
నెయ్యి  విడిగా ముందుగా  బాగా కాచుకుని  ఉంచుకోవాలి .

వంట సోడా ఉప్పు  --  చిటికెడు .
నీళ్ళు  --  ఒక  కప్పు .

శనగపిండి  కల్తీ లేనిది  తీసుకుని  శుభ్రంగా జల్లించుకోవాలి .

అందులో చిటికెడు  సోడా ఉప్పువేసి  బాగా  కలుపుకోవాలి .

తయారీ విధానము .

ముందుగా   స్టౌ మీద  దళసరి  గిన్నె  పెట్టుకుని , ఒకటిన్నర  కప్పు పంచదార మరియు కప్పు నీళ్ళు  పోసి  గరిటతో బాగా కలపాలి .

నీళ్ళు  బాగా  తెర్లుతుండగానే  శనగ పిండిని  కొద్ది కొద్దిగా  పోసుకుంటూ  ఉండకట్టకుండా  గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి .

పిండి  బాగా  కలవగానే  ముందుగా  సిద్ధం చేసుకున్న నెయ్యి  గరిటెతో కొద్ది  కొద్దిగా  పొసుకుంటూ  స్టౌ  మీడియం  సెగలో  ఉంచి  గరిటెతో  బాగా  కలుపుతుండాలి .

ఒక వెడల్పాటి  పళ్ళానికి  నెయ్యి రాసుకుని  సిద్ధంగా ఉంచుకోవాలి .

పాకం , పిండి , నెయ్యి  అన్నీ  బాగా కలిసి  పొంగు మాదిరిగా  వచ్చి  బాగా దగ్గర  పడుతున్నప్పుడు  జాగ్రత్తగా చూసుకుని  పాకాన్ని  పళ్ళెంలో  పోసి  వేడి మీదనే  ముక్కలు కోసుకోవాలి .

మెత్తగా  ఇష్ట పడేవారు  కొంచెం  ముందుగా , గట్టిగా  ఇష్టపడేవారు  కొద్దిగా  ముదురు పాకం రానిచ్చి దింపుకోవాలి .

కొంతమంది  కప్పు నెయ్యి మరియు కప్పు నూనె కలిపి  చేసుకుంటారు .

మేమయితే పూర్తిగా  నెయ్యి తోనే  చేస్తాము .

అంతే  ఎంతో రుచిగా కమ్మని  నేతి వాసనతో ఉండే  సంక్రాంతి  స్పెషల్  మైసూర్  పాక్  మీ అందరి కోసం సిద్ధం.

నువ్వుల పొడితో చింతపండు   పులిహోర.

నువ్వుల పొడితో చింతపండు   పులిహోర.

కావలసినవి .

చింతపండు   --  75 గ్రాములు  గింజలను  తీసుకుని గ్లాసున్నర  వేడినీటిలో  పదిహేను నిముషములు  నానబెట్టుకోవాలి .

తదుపరి  వేరే గిన్నెలో  చిక్కగా రసం తీసుకోవాలి .

నువ్వు పప్పు  --  75 గ్రాములు.
నూనె  వేయకుండా  నాలుగు  ఎండుమిరపకాయలు వేసి  బాండిలో  వేయించుకుని  ఆ తర్వాత మిక్సీ లో  మెత్తగా  పొడి వేసుకోవాలి .

ఈ పొడి  విడిగా  ఉంచుకోవాలి .

పచ్చిమిర్చి   --  పది . తొడిమలు తీసుకుని  ఉంచుకోవాలి .
కరివేపాకు   --  ఎనిమిది   రెమ్మలు .
బియ్యము   --  ఒకటిన్నర   గ్లాసుడు .
నూనె   ---  75  గ్రాములు .

పోపుకు .

ఎండుమిరపకాయలు   --  పది
పచ్చి శనగపప్పు   --  మూడు స్పూన్లు
మినపప్పు   --  రెండు  స్పూన్లు
ఆవాలు  --  స్పూను
పల్లీలు  ---  పులుసు  గరిటెడు
ఇంగువ  --  పావు  స్పూను .
నూనె  ---   50  గ్రాములు.

తయారీ  విధానము .

ముందుగా  గిన్నెలో  గ్లాసున్నర  బియ్యము   సరిపడా  నీళ్ళు పోసి  స్టౌ  మీద  పెట్టుకొని పొడిగా  వండుకోవాలి  .

అన్నం  ఉడికే  లోపున

స్టౌ  మీద  బాండి  పెట్టి  ఓ 50 గ్రాముల  నూనె  వేసి  , నూనె  బాగా  కాగగానే   వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి  శనగపప్పు , మినపప్పు , ఆవాలు , ఇంగువ, పచ్చిమిరపకాయలు , కరివేపాకు  మరియు వేరుశనగ  గుళ్ళు వేసి  పోపు బాగా వేయించుకోవాలి.

వేగుతున్నప్పుడే     చింతపండు రసము , తగినంత  ఉప్పు మరియు కొద్దిగా  పసుపు వేసి బాగా  ఉడకనివ్వాలి .

తర్వాత  బేసిన్  లో  ఉడికిన  అన్నం  , స్పూను  పసుపు , కరివేపాకు , అర గరిటెడు  నూనె , కొద్దిగా   ఉప్పు  మరియు  ముందుగా  సిద్ధం  చేసుకున్న పోపు లో ఉడికిన చింతపండు  రసము  అన్నములో   వేసి  గరిటతో అన్నం  అంతా   పొడి  పొడిగా   కలుపు కోవాలి .

చివరగా ముందుగా  సిద్ధంగా  ఉంచుకున్న  నువ్వుపప్పు  పొడి కూడా వేసుకుని  బాగా కలుపుకోవాలి .

అంతే  చింతపండుతో నువ్వుల పొడి  , ఇంగువ  సువాసనలతో  నోరూరించే  పులిహోర  మీకు  సర్వింగ్   కు  సిద్ధం .

పులగం

ఆలూరుకృష్ణప్రసాదు .

పులగం  తయారీ  విధానము .

ఉపవాసం అంటే  కటిక ఉపవాసం ఏమీ తినకుండా ఉండి కడుపు  మాడ్చుకుని  శోష  వచ్చి పడిపోయి  కొత్త ఆరోగ్య  సమస్యలను సృష్టించుకోవడం  కాదు .

మధ్యాహ్నము  వేళలలో  నీరసపడకుండా  ఆ కాలంలో  పెద్దలందరూ  పులగం  తినే వారు .

చాయపెసరపప్పు తో   కలసిన  ఈ అన్న పదార్ధము  శరీరానికి  అవసరమైన  శక్తిని  ఇస్తుంది .

ఇది  శాస్త్ర  సంబంధితమైన ఉపవాస సమయంలో  తీసుకో తగ్గ ఆహార పదార్ధముగా  పెద్దలు  తెలియ చెప్తారు .

ఈ పులగం  తయారీ విధానము  ఇంచు మించుగా  తమిళనాడు  వారు    ప్రతి రోజు ఉదయపు ఫలహారముగా  చేసుకునే  పొంగల్  ను  పోలి  ఉంటుంది .

ఇక  పులగం  తయారీ  విధానము  గురించి  తెలుసుకుందాం .

పులగం.

కావలసినవి .

బియ్యం --  ఒక గ్లాసు
చాయపెసరపప్పు  --  పావు గ్లాసు .

ఈ రెండు  కలిపి ఒక గిన్నెలో  పోసుకుని ఒకసారి కడిగి తగినన్ని  నీళ్ళు పోసి   ఒక పావుగంట  సేపు  నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత  స్టౌ మీద పెట్టుకుని  మరీ  మెత్తగా  కాకుండా  వండుకోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నెయ్యి వేసుకుని  నెయ్యి బాగా కాగగానే  పది మిరియాలు , అరస్పూను  జీలకర్ర ,  మూడు రెమ్మలు  కరివేపాకు , పది జీడిపప్పు  పలుకులు  వేసి  వేయించుకుని  పోపు వేగగానే  అందులోనే  ఉడికించిన  పులగమన్నము , తగినంత  ఉప్పు వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  పులగం  అన్నం  సిద్ధం.

దీనిలోకి  ఆదరువుగా  అయిదు పచ్చిమిర్చి , ఒక కట్ట కొత్తిమీర , ఉసిరి కాయంత చింతపండు , తగినంత  ఉప్పు మరియు  కొద్దిగా  బెల్లం  వేసుకుని  మిక్సీ లో వేసుకుని  ఆ తర్వాత ఆ పచ్చడిలో  నేతితో పోపు పెట్టుకుంటారు.

బంగాళాదుంపల పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

బంగాళాదుంపలతో పెరుగు పచ్చడి .

తయారీ విధానము.

పావు కిలో బంగాళాదుంపలు తొక్కుతో ముక్కలుగా తరిగి  కుక్కర్ లో మూడు విజిల్స్  వచ్చే వరకు ఉడికించి  పై తొక్కు తీసుకొని  ముక్కలుగా చేసుకోవాలి .

ఒక చిన్న కట్ట కొత్తిమీర , నాలుగు పచ్చిమిరపకాయలు , చిన్న అల్లం  ముక్క, తగినంత  ఉప్పు వేసి  మిక్సీ లో మరీ మెత్తగా  కాకుండా వేసుకోవాలి .

అర లీటరు  పెరుగు ఒక గిన్నెలో  పోసి బాగా  గరిటతో కలుపుకుని , అందులో ఉడికించిన బంగాళాదుంప  ముక్కలు , మిక్సీ  వేసుకున్న కొత్తిమీర , పచ్చిమిర్చి  మిశ్రమం  వేసుకుని  గరిటతో  బాగా కలుపుకోవాలి.

స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  మూడు స్పూన్లు  నెయ్యి  వేసుకుని  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసుకుని , స్పూను  చాయమినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు  రెండు రెబ్బలు కరివేపాకు  వేసుకుని  పోపు వేగగానే  ఈ పెరుగు పచ్చడిలో వేసుకుని  గరిటతో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంపలతో  పెరుగు పచ్చడి  రోటీలు , చపాతీలు మరియు భోజనము లోకి  సిద్ధం.

బెండకాయ కాయల పళంగా కూర

బెండకాయ కాయల పళంగా  కూర .

తయారీ విధానము .

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే  వరుసగా పది ఎండుమిరపకాయలు , మూడు స్పూన్లు  పచ్చి శనగపప్పు , రెండు స్పూన్లు  మినపప్పు , నాలుగు స్పూన్లు  ధనియాలు , అర స్పూను  జీలకర్ర ,  కొద్దిగా  ఇంగువ మరియు  తగినంత  ఉప్పు వేసుకుని  ఎర్రగా  వేయించు కోవాలి .

తర్వాత మిక్సీలో  మరీ మెత్తగా  కాకుండా  పొడి  వేసుకోవాలి.

ఒక  పావు కిలో  బెండకాయలు  రెండు వైపులా  చాకుతో  కట్ చేసుకుని మధ్యలో  గాటు  పెట్టు కోవాలి .

తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి నాలుగు  స్పూన్లు  నూనె  వేసి ఈ ముక్కలను  వేసి  బాగా వేగనివ్వాలి .

తర్వాత  ముక్కలను  విడిగా  పళ్ళెంలో  తీసుకుని  కాయలలో  ఈ పొడి  పెట్టుకుని బాగా  కాగిన  వేడి వేడి నూనె కాయలలో పోసుకోవాలి .

అంతే  బెండకాయ కాయల  పళంగా పొడి కూర  భోజనము  లోకి  సిద్ధం.

ఈ కూర  వేడి  వేడి అన్నం లో నెయ్యి వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది .

కాకరకాయ   కొబ్బరి  కారం  వేపుడు కూర.

ఆలూరుకృష్ణప్రసాదు .

కాకరకాయ   కొబ్బరి  కారం  వేపుడు కూర.

కావలసినవి .

ముందు కొబ్బరి  కారానికి .

ఎండుమిరపకాయలు  -- 10 
పచ్చి  శనగపప్పు  --  మూడు స్పూన్లు .
జీలకర్ర  --  స్పూను .
ఎండుకొబ్బరి  --  పావు చిప్ప . చిన్న ముక్కలుగా చేసుకోవాలి .
కరివేపాకు  --  నాలుగు రెమ్మలు.

ఇవ్వన్నీ  నూనె  వేయకుండా  బాండిలో  కమ్మని వేపు  వచ్చేదాకా వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీలో  వేసుకుని  తగినంత  ఉప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా  పొడి  చేసుకోవాలి.

కాకరకాయలు  అరకిలో  ఫోటోలో  చూపిన విధముగా  చక్రాలు  మాదిరిగా  తరుగు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ పెట్టి  అయిదు స్పూన్లు  నూనె వేసి  నూనె బాగా కాగగానే   చక్రాలుగా తరిగిన  కాకరకాయ  ముక్కలను  వేసి  బాగా  ఎర్రగా వేగ నివ్వాలి .

తరువాత  సిద్ధంగా  ఉంచుకున్న  కొబ్బరి కారం పొడి కూడా  అందులో  వేసి  బాగా కలుపుకుని  మరో  అయిదు  నిముషాలు  ఉంచి  దింపుకోవాలి .

వెల్లుల్లి  ఇష్టమైన వారు  ఆరు  వెల్లుల్లి  రెబ్బలు  పొడిలో వేసుకుని మిక్సీ  వేసుకుంటే  ఈ కాకరకాయ వేపుడు కూర చాలా రుచిగా  ఉంటుంది .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కాకరకాయ  కొబ్బరి  కారం వేపుడు కూర సర్వింగ్  కు సిద్ధం.

ఈ వేపుడు  కూర వేడి వేడి  అన్నంలో నెయ్యి  వేసుకుని  తింటే  చాలా రుచిగా  ఉంటుంది .

నిమ్మకాయ చారు

ఆలూరుకృష్ణప్రసాదు .

చింతపండు   కె. జి . రు.300 /- దాటింది .

మాకు  నిత్యం చారు కాని పులుసు కాని రెండు పూటలా కావాలి .

మరి  కొంతవరకైనా  చింతపండు ఖర్చు  అదుపు  చేయాలంటే  ప్రత్యామ్నాయం  నిమ్మకాయ చారు .

నిమ్మకాయ  చారు .

ఒక  గిన్నెలో  రెండు  గ్లాసుల  నీళ్ళు  పోసుకోండి .

అందులో  పావు  స్పూను  పసుపు  వేయండి .

రెండు  పచ్చిమిర్చి   ముక్కలుగా   చేసి  వేయండి .

రెండు  రెమ్మల  కరివేపాకు   వేయండి .

తగినంత   ఉప్పు వేయండి .

రెండు  నిమ్మకాయలు  కోసి  వేరే  కప్పులో  రసం  తీసుకోండి .

రెండు ఎండు మిరపకాయలు , స్పూను  ధనియాలు , పావు  స్పూను  జీలకర్ర  , నాలుగు   మిరియాలు  రోట్లో  దంచుకోండి .
లేదా  మిక్సీ   లో  పొడి  వేసుకోండి .

చారుపొడి  ఇంట్లో  రెడీగా  ఉంటే  ఆ  పొడి  స్పూనున్నర   వేసుకోవచ్చు .

అప్పుడు రసం  పొడి  కొట్టు కోనక్కర లేదు ,

ఇప్పుడు  స్టౌ  మీద  చారు  గిన్నె  పెట్టి  బాగా  మరగ నివ్వండి .

అందులో  నే చెప్పిన  కొట్టిన  పొడి  గాని   లేదా చారు  పొడి  గాని  వేయండి .

బాగా  కాగనిచ్చి  దింపి  పిండిన  నిమ్మరసం  అందులో  పోసి  గరిటతో  బాగా  కలపండి .

స్టౌ  మీద  కాగుతూ  ఉండగా  నిమ్మరసం   పోస్తే  చారు  చేదు  వస్తుంది .

కొత్తిమీర   తరిగి   అందులో  వేయండి .

ఇప్పుడు  స్టౌ  మీద  పోపు  గరిటె  పెట్టి  రెండు స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే   రెండు  ఎండుమిర్చి   ముక్కలు , కొద్దిగా   మెంతులు , కొద్దిగా   జీలకర్ర , పావు  స్పూను  ఆవాలు  ,  కొద్దిగా   ఇంగువ   వేసి  పోపు  పెట్టుకోండి .

అంతే  వేడి  వేడి   నిమ్మరసం తో  చారు  సిద్ధం . 

మీకు  హోటల్  చారు  రుచి   రావాలంటే   పొడిలో  రెండు  వెల్లుల్లి   రెబ్బలు  వేసుకుని   దంపుకోండి .

అప్పుడు  పోపులో  ఇంగువ  వేయవద్దు .

కొత్తిమీర నిల్వ పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తిమీర  నిల్వ పచ్చడి .

కావలసినవి .

కొత్తిమీర  --  రెండు పెద్ద కట్టలు .

వేర్లు కట్ చేసుకుని  కాడలతో సహా ఆకును  శుభ్రంగా  కడిగి  ఒక గుడ్డమీద వేసి తడి లేకుండా రెండు గంటల సేపు  ఎండ బెట్టు కోవాలి .

ఆ తర్వాత కాడలతో సహా  కత్తిరించుకోవాలి .

ఆ తర్వాత  ఆ మొత్తము  ఆకును  నూనె వేయకుండా  బాండీలో  మొత్తము  ఆకు  ముద్దగా  దగ్గర  పడే వరకు వేయించుకోవాలి .

తర్వాత కొత్తిమీర  ముద్ద  తొక్కులుగా  ఉండకుండా ఒకసారి మిక్సీలో  కొంచెం  మెత్తగా  వేసుకోవాలి .

చింతపండు  --  75 గ్రాములు తీసుకుని  ఒక ముప్పావు  గ్లాసు నీళ్ళు పోసుకుని  స్టౌ మీద పెట్టి  బాగా  చిక్కపడేంత వరకు  ఉడికించి  చిక్కగా రసము  వేరే గిన్నెలో కి తీసుకుని   మిగిలిన  పిప్పి  పార వేయాలి .

పై  కొత్తిమీర  మరియు చింతపండు  రసము బాగా చల్లారనివ్వాలి .

తర్వాత  స్టౌ మీద బాండీ  పెట్టి ఒక 100  గ్రాముల నువ్వుల నూనె కాని , వేరు శనగ  నూనె కాని పోసుకుని  నూనె  బాగా  కాగగానే  అందులో నాలుగు  ఎండుమిరపకాయలు , స్పూను జీలకర్ర , స్పూనున్నర  ఆవాలు   వేసుకుని పోపు  వేగగానే  రసము తీసి ఉడికించి ఉంచుకున్న  చింతపండు  రసము పోపులో  వేయాలి .

అందులో చెంచా  పసుపు , నాలుగు  స్పూన్లు కారం, తగినంత  ఉప్పు  (  షుమారు  నాలుగు స్పూన్లు  ఉప్పు  ) మరియు  75  గ్రాముల  బెల్లపు పొడి  అందులో వేయాలి .

అట్ల కాడతో  బాగా  అన్నీ కలిసి దగ్గర  పడేంతవరకు కలుపుకుని ,  సిద్ధంగా  ఉంచుకున్న  కొత్తిమీర  ముద్దను  ఆ పోపులో  వేసి  బాగా  కలుపుకోవాలి .

బాగా  చల్లారగానే  తీసుకుని  వేరేగా  ఒక జాడీలో గాని , ఒక  సీసాలో కానీ   తీసుకోవాలి .

అంతే  అద్భుతమైన  రుచిగా  ఉండే  కొత్తిమీర   నిల్వ పచ్చడి సిద్ధం.

ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , చపాతీలు , రోటీలు  మరియు భోజనము  లోకి  ఎంతో రుచిగా ఉండే   అద్భుతమైన , రుచికరమైన  కొత్తిమీర  నిల్వ పచ్చడి  సిద్ధం.

ఈ పచ్చడి  ఏడాది అంతా  నిల్వ  ఉంటుంది .

ఇంట్లో  కొత్తిమీర   లేనప్పుడు  ఒక  స్పూను  ఈ కొత్తిమీర  పచ్చడి  చారు కాని , పులుసుల్లో కాని  వేసుకుంటే  అదే  మామూలు కొత్తిమీర   వేసుకున్న  రుచి వస్తుంది .

పచ్చిమిరపకాయల కారం

ఆలూరుకృష్ణప్రసాదు .

గుంటూరు  స్పెషల్ .

పచ్చిమిరపకాయల కారం.

కావలసినవి .

పచ్చిమిరపకాయలు  -- 100 గ్రాములు .
చింతపండు  --  నిమ్మకాయంత  విడదీసి తడిపి ఉంచుకోవాలి.
ఉప్పు --  తగినంత .
పసుపు  --  కొద్దిగా .
నూనె  --  నాలుగు  స్పూన్లు

పోపునకు.

మెంతులు  -- అర స్పూను
చాయమినపప్పు  --  స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా

తయారీ విధానము .

ముందుగా  స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు  నూనె వేసుకుని  నూనె బాగా కాగగానే  పచ్చిమిరపకాయలు , పసుపు వేసి మూతపెట్టి పచ్చిమిర్చి   బాగా  మగ్గనివ్వాలి .

తర్వాత వాటిని  వేరే ప్లేటులో  తీసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన  రెండు స్పూన్లు  మెంతులు , మినపప్పు , ఆవాలు మరియు  ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .

తర్వాత  మిక్సీలో  మగ్గిన పచ్చిమిరపకాయలు , తడిపిన చింతపండు , తగినంత  ఉప్పువేసి  పచ్చడి బండతో మరీ మెత్తగా కాకుండా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత వేగిన పోపు  మిక్సీ లో వేసుకొని ఒకసారి మిక్సీ  వేసుకోవాలి

కారంగా తినలేని వారు  చిన్న బెల్లం  ముక్క వేసి మిక్సీ వేసుకోండి .

ఈ  పచ్చడి లో ఎండుమిరపకాయలు , కొత్తిమీర , కరివేపాకు  వంటివి వేయరు .

చింతపండు  సమంగా  పడితే  పచ్చడి నోరుమండి పోయే కారం ఉండదు .

అంతే  ఎంతో రుచిగా  ఉండే ఈ గుంటూరు  స్పెషల్ పచ్చిమిరపకాయల కారం ఇడ్లీ , దోశెలు , గారెలు మరియు  భోజనము లోకి సర్వింగ్  కు సిద్ధం.

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని  తింటే  ఆ రుచి చెప్పనలవి కాదు.

వెరైటీ టమాటో రసం

ఆలూరుకృష్ణప్రసాదు .

మరో వెరైటీ  టమోటో  రసం.

కావలసినవి.

టమోటోలు  --  4
చింతపండు  --  నిమ్మకాయంత
పచ్చిమిరపకాయలు  - 4
కరివేపాకు  --  మూడు రెమ్మలు
కొత్తిమీర  --  చిన్న కట్ట లో సగం.
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత

ఇంటిలో చారు పొడి సిద్ధంగా  లేని వారు చారు పొడి సిద్ధం చేసుకోవాలి .

కావలసినవి .

ఎండుమిరపకాయలు -2
ధనియాలు -- స్పూనున్నర 
జీలకర్ర  --  అర స్పూను
పచ్చి శనగపప్పు - స్పూను
కందిపప్పు  -  అర స్పూను
మిరియాలు  --  పావు స్పూను.
ఇంగువ -- కొద్దిగా

పై దినుసులన్నీ  నూనె వేయకుండా బాండీలో  వేయించుకుని   చల్లారగానే  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ రసము పొడి  మూడు  నాలుగు సార్లు  రసము  పెట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది .

చారులో పోపునకు.

నూనె  -- స్పూను
మెంతులు  --  కొద్దిగా
జీలకర్ర  --  కొద్దిగా
ఆవాలు --  కొద్దిగా
ఇంగువ --  కొద్దిగా

తయారీ విధానము.

చింతపండు  విడదీసి  పది నిముషాలు  ముందు  నీటిలో నానబెట్టు కోవాలి .

తర్వాత గ్లాసుడు  రసము తీసుకొని  వేరే ఉంచుకోవాలి.

టమోటోలు  పెద్ద ముక్కలుగా  తరిగి ఉంచుకోవాలి .

ఒక గిన్నెలో  ఒక గ్లాసుడు  నీళ్ళు పోసి  టమోటో  ముక్కలు  వేసుకుని  ముక్కలు  మెత్తగా  అయ్యే వరకు  ఉడకనివ్వాలి .

నీళ్ళు విడిగా  ఉంచుకోవాలి .

ముక్కలు  చల్లారగానే  మిక్సీ లో మెత్తగా  వేసుకోవాలి .

లేదా  చేతితో మెత్తగా  చేసుకోవాలి .

ఇప్పుడు  ఒక  గిన్నెలో  సిద్ధంగా  ఉంచుకున్న టమోటో  రసము , చింతపండు  రసము పోసుకోవాలి.

అవసరమయితే మరో అర గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చును.

అందులో  కొద్దిగా  పసుపు, తగినంత  ఉప్పు , తరిగిన  పచ్చిమిరపకాయ ముక్కలు , కరివేపాకు  వేసుకుని  స్టౌ మీద పెట్టి  బాగా తెర్లనివ్వాలి .

ఆ తర్వాత  రెండు స్పూన్లు  రసము పొడి వేసి మరో అయిదు నిముషాలు  తెర్లనివ్వాలి .

దింపుకుని  పైన తరిగిన  కొత్తిమీర  వేసుకొని  మూత పెట్టుకోవాలి.

తర్వాత  స్టౌ మీద  పోపు గరిటె పెట్టుకుని నూనె వేసుకుని  నూనె కాగగానే  ఎండుమిర్చి  ముక్కలు , మెంతులు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి  పోపు రసము లో పెట్టుకోవాలి .

అంతే ఎంతో రుచిగా  ఉండే టమోటో  రసము  భోజనము లోకి  సర్వింగ్ కు సిద్ధం.

ఇందులో బెల్లం  వేయకూడదు.

ఈ రసము రెండు రోజులు  నిల్వ ఉంటుంది .

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి