Sunday, June 25, 2017

మిక్స్డ్ వెజిటబుల్ కూర

మిక్స్డ్ వెజిటబుల్ కూర
ఆలూరు కృష్ణప్రసాదు .

పూరీల లోకి , రోటీల లోకి , చపాతీల లోకి  మరియు  భోజనము   లోకి  ఉపయోగించే   బలవర్ధకమైన    మిక్సెడ్  వెజిటబుల్   కూర .
మిక్సెడ్  వెజిటబుల్  కూర .
కావలసినవి .
బంగాళా దుంపలు  --   2  
తరిగిన   క్యాలీఫ్లవర్  --  ఒక  కప్పు .
ఉల్లిపాయలు   -   2
  క్యారెట్  ---  2  
టమోటో లు  -  3  
పచ్చి  బఠాణీలు  --  ఒక  కప్పు.
పచ్చిమిరపకాయలు  --  6
అల్లం  --  రెండు  అంగుళముల  ముక్క చిన్న ముక్కలుగా  చేసుకోవాలి ,
పసుపు  --  పావు  టీ  స్పూను 
ఉప్పు  --  తగినంత 
కారం  --  ఒక  స్పూను 
నూనె  --  నాలుగు   స్పూన్లు

పోపు నకు .
ఎండుమిరపకాయలు   --  4  ముక్కలుగా   చేసుకోవాలి .
పచ్చి  శనగపప్పు  --  స్పూనున్నర .
మినపప్పు   --  స్పూను 
జీలకర్ర   --  పావు  స్పూను .
ఆవాలు  --  అర  స్పూను  
ఇంగువ  --  కొద్దిగా   
కరివేపాకు   --   మూడు  రెమ్మలు .

తయారీ  విధానము .
ముందుగా   బంగాళా దుంపలు  , క్యారెట్   ముక్కలు గా  తరిగి   (  క్యారెట్  పై  చెక్కు  తీయ నవసరం  లేదు  )  కుక్కర్  లో సరిపడా  నీళ్ళు  పోసి  రెండు  విజిల్స్  రానిచ్చి , దింపుకుని  బంగాళా  దుంపల  పై  చెక్కు  తీసుకుని   ఈ  రెండు  వేరుగా  
ఉంచుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము  నూనె  పోసి  నూనె  బాగా కాగగానే  , వరుసగా   ఎండుమిర్చి , పచ్చి శనగపప్పు  , మినపప్పు  , జీలకర్ర  , ఆవాలు ,  ఇంగువ  , అల్లం  ముక్కలు  మరియు  కరివేపాకు  వేసి  పోపు  వేయించుకుని  పోపు  వేగగానే వరుసగా   ముందుగా  తరిగిన   ఉల్లిపాయలు , పసుపు , కొద్దిగా   ఉప్పు  వేసి  మూత  పెట్టి  ఉల్లిపాయలు   సగానికి   పైగా  మగ్గనివ్వాలి .
తర్వాత  సన్నగా   తరిగిన , క్యాలిఫ్లవర్ ,   ముక్కలు గా  తరిగిన   టమోటో  లు , పచ్చి  బఠాణీలు , ఉడికించిన  క్యారెట్ ముక్కలు , ఉడికించిన  బంగాళాదుంప   ముక్కలు ,  అన్నీ  వేసి  సరిపడా  ఉప్పు  వేసి  పూర్తిగా   ముక్కలన్నీ  కూరలో  కలిసి  పోయే  విధముగా   ముక్కలు  చితక  కుండా  కలుపుకుంటూ  చివరలో  ఒక స్పూను  కారం  వేసుకుని , పూర్తిగా   మగ్గగానే  దించి  వేరే  డిష్ లోకి  తీసుకోవాలి  .
పూరీ  చపాతీ  రోటీలలోకి  అయితే  ఇలాగే   ముద్ద కూరగా  అద్దుకుని  తినవచ్చు .
లేని  పక్షంలో  రెండు  స్పూన్లు   శనపిండి  అర గ్లాసు  నీళ్ళలో  వేసి  బాగా  కలిపి  , మగ్గుతున్న  కూరలో  వేసి   మరో  అయిదు  నిముషముల  పాటు  ఉంచి  దింపుకుంటే  కూర  కొంచెం  పల్చగా   బాగుంటుంది .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  మిక్సెడ్  వెజిటబుల్  కూర  పూరీ , రోటీ , చపాతీ మరియు  అన్నం లోకి  సర్వింగ్   కు  సిద్ధం .

సజ్జప్పాలు లేదా సజ్జ పూరీలు

సజ్జప్పాలు లేదా సజ్జ పూరీలు
ఆలూరు కృష్ణప్రసాదు .

సజ్జప్పాలు  లేదా  సజ్జ పూరీలు .
తయారు  చేయు  విధానము  .
పావు కిలో  మైదా  పిండి  లో  చిటికెడు   ఉప్పు వేసి తగినన్ని    నీళ్ళు పోసి  బొబ్బట్లు  కు  కలుపు కునే  విధంగా  పిండిని   పల్చగా  తోపుకు  అనుగుణంగా   కలుపు కోవాలి .
అందులో  రెండు స్పూన్లు   నూనె  వేసి  బాగా  కలుపు  కొని  విడిగా  ఒక  అరగంట  సేపు  మూత  పెట్టి  ఉంచుకోవాలి .
స్టౌ  మీద  గిన్నె పెట్టి   అందులో   రెండు  గ్లాసుల    నీళ్ళు పోసి    నీళ్ళు  బాగా తెర్లగానే  గ్లాసు  పంచదార వేసి,   పంచదార   నీళ్ళలో  కరగగానే   గ్లాసు  బొంబాయి  రవ్వ  ఉండకట్టకుండా సన్నగా   పోసుకుంటూ  అట్లకాడతో  తిప్పుతూ  కలుపు కోవాలి .
తదుపరి  అందులో  అర స్పూను   యాలకుల  పొడి  మరియు  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి    రవ్వ  ఉడకగానే  దింపు కోవాలి .
ఇప్పుడు  రవ్వ  కేసరి  తయారు  అయ్యింది  .
రవ్వ కేసరి  కొద్దిగా  చల్లారగానే   చేతికి  నెయ్యి  రాసుకుని  నిమ్మకాయంత    ఉండలుగా  చేసుకుని   వేరే   పళ్ళెంలో  విడిగా  పెట్టు కోవాలి .
ఆ తర్వాత  ఒక   ప్లాస్టిక్   కవర్  తీసుకుని    కవరుకు  నూనె  రాసుకుని  పక్కన  పెట్టుకోవాలి  .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  అర కె. జి .  నూనె  పోసి  నూనెను సన్నని  సెగన   బాగా  కాగ  నివ్వాలి  
  తర్వాత అర చేతికి    నూనె  రాసుకుని      కొంచెం   తోపు  పిండి  తీసుకొని   అర చేతిలోకి  తీసుకుని    అర చేతిలో  పల్చగా  పరుచుకుని , మధ్యలో  రవ్వ కేసరి  ఉండ పెట్టుకుని  తోపు  పిండితో  ఉండ  మొత్తము     మూసి  వేయాలి .
తర్వాత  నూనె  రాసి  సిద్ధముగా  ఉంచుకున్న   ప్లాస్టిక్   కవరు పై  ఆ ఉండను  పెట్టుకుని  చిన్న  చిన్న  పూరీల  సైజులో  మధ్య  మధ్య  నూనె  చెయ్యి  చేసుకుంటూ   నాలుగు   వైపులా  రౌండ్  గా  సమంగా  వత్తు కుని , ఒక్కొక్కటిగా   బాండీ లోని  కాగుతున్న  నూనెలో  వేసి  రెండు  ప్రక్కలా  బంగారు  రంగు  వచ్చే  వరకు కాల్చుకుంటూ    విడిగా  తీసుకోవాలి  .
అంతే  ఎంతో  రుచిగా   ఉండి  శుభ కార్యక్రమాల్లో  అందురూ  తరచుగా  చేసుకునే  సజ్జప్పాలు  లేదా  సజ్జ  పూరీలు  సర్వింగ్   కు  సిద్ధం .
ఈ  సజ్జ పూరీలు  రెండు  రోజులు   నిల్వ  ఉంటాయి .

ఉల్లిపాయల పునుగులు

ఉల్లిపాయల పునుగులు
ఆలూరు కృష్ణప్రసాదు .

ఉల్లిపాయల   పునుగులు .
తయారీ  విధానము .
పావు  కె. జి  .  మినప గుళ్ళు  ముందు రోజు   నీళ్ళలో   నాన బెట్టుకొని  మరుసటి  రోజు  నీళ్ళు  వడగట్టుకొని  గారెల  పిండిలా  గట్టిగా   మెత్తగా   వేసుకోవాలి .
మూడు  ఉల్లిపాయలు  ముక్కలుగా   తరుగు  కోవాలి .
పావు  కప్పు  కరివేపాకు   తరుగు కోవాలి .
ఒక  కట్ట  కొత్తిమీర   సన్నగా   తరుగు కోవాలి .
ఆరు  పచ్చిమిర్చి   సన్నగా  తరుగు కోవాలి .
చిన్న అల్లం   ముక్క  సన్నగా  తరుగు కోవాలి .
ఆ  పిండి  ఒక  గిన్నెలో  వేసుకుని  అందులో  పావు  స్పూను  జీలకర్ర  ,  తగినంత   ఉప్పు ,  తరిగిన   ఉల్లిపాయ  ముక్కలు , తరిగిన  కరివేపాకు  ,  తరిగిన  కొత్తిమీర  , తరిగిన  అల్లం  ముక్కలు , ఒక  పులుసు గరిటెడు గట్టి  పెరుగు  వేసి  బాగా  కలుపు కోవాలి .
ఓ  గంట పాటు  అలాగే   ఉంచాలి .
ఆ  తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి   అర  కె. జి . నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   చేతితో  పునుగుల్లా  వేసుకుని   బంగారు  రంగు  వచ్చే  వరకు   వేయించుకుని  ప్లేటులో  తీసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  ఉల్లిపాయ   పునుగులు  మధ్యాహ్న  పలహారమునకు  సిద్ధం.
అల్లం   చట్నీతో  తింటే  చాలా  రుచిగా  ఉంటాయి .

కాకరకాయ ఉల్లిపాయ పులుసు

కాకరకాయ ఉల్లిపాయ పులుసు
ఆలూరు కృష్ణప్రసాదు .

కాకరకాయ ఉల్లిపాయ పులుసు .
ఆరోగ్యానికి   ముఖ్యంగా మధుమేహ  వ్యాధిగ్రస్తులకు  ఎంతో  ఉపయోగించే   కూర    కాకరకాయ  .
ఎంతో  మంది  ఇష్ట పడే  ఈ  కాకరకాయ  తినని  వారు  కూడా  ఉన్నారు  .
ఎందుకంటే   చేదు  అంటారు .
చేదు  కలిగి   ఉండడం  కాకరకాయ   సహజ గుణం .
పైగా  ఆ  చేదు   ఆరోగ్యానికి  చాలా  మేలు  చేస్తుంది   కూడా .
ఉగాది  రోజున  చేదుగా  ఉన్నా  వేపపువ్వు ను  తినిపిస్తారు  కదా !
అదే  విధంగానే  కాకరకాయ ను  కూడా  కనీసం వారంలో  ఒకసారైనా    ఆహారంలో  ఉపయోగించడం  ఆరోగ్య కరం .
కాకరకాయ  ఉల్లిపాయ  పులుసు   తయారీ విధానము .
కావలసినవి .
కాకరకాయలు   --  పావు కిలో 
ఉల్లిపాయలు  --  మూడు .
పచ్చిమిరపకాయలు  --  ఎనిమిది  
కరివేపాకు   --  మూడు  రెమ్మలు .
పసుపు    --  కొద్దిగా 
ఉప్పు   --  తగినంత .
బెల్లం   ---  కొద్దిగా .
కారం  ---  ముప్పావు  స్పూను .
చింతపండు  --  నిమ్మకాయంత.

పోపుకు  .
నూనె  ---   నాలుగు   స్పూన్లు .
ఎండుమిరపకాయలు  --  నాలుగు  ,  ముక్కలుగా   చేసుకోవాలి .
మినపప్పు   --  స్పూను 
జీలకర్ర  --  పావు స్పూను 
ఆవాలు  --  అర  స్పూను 
ఇంగువ  --   కొద్దిగా

తయారీ  విధానము  .
ముందుగా  చింతపండు   పదిహేను  నిముషాల  పాటు  ఒక  గ్లాసు నీళ్ళలో  నాన  బెట్టి పల్చగా   రసం  తీసుకోవాలి .
   కాకరకాయ లు  చిన్న  ముక్కలుగా  తరుగు కోవాలి .
ఉల్లిపాయ లు  చిన్న  ముక్కలుగా  తరుగు  కోవాలి .
పచ్చిమిర్చి   ---  నిలువుగా  తరుగు కోవాలి .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   వరుసగా  ఎండుమిర్చి   ముక్కలు , మినపప్పు  ,   జీలకర్ర  , ఆవాలు ,  ఇంగువ  వేసి  పోపు  వేసుకోవాలి .

పోపు  వేగగానే  కరివేపాకు  , పచ్చిమిర్చి  , తరిగిన  కాకరకాయ  ముక్కలు , తరిగిన  ఉల్లిపాయల  ముక్కలు   సరిపడా  ఉప్పు   మరియు  కొద్దిగా   పసుపు  వేసి  మూత పెట్టి  బాగా  మగ్గ నివ్వాలి .
ఆ  తర్వాత  నాన బెట్టిన  చింతపండు   రసము  మగ్గుతున్న  ముక్కలలో  పోసి  మరో  అర  గ్లాసు  నీళ్ళు ,  కొద్దిగా  బెల్లం  మరియు ముప్పావు  స్పూను  కారం వేసి  బాగా  తెర్లనివ్వాలి  .
పులుసు  పల్చగా   ఉన్నట్లయితే  పావు  గ్లాసు  నీళ్ళలో  స్పూను   బియ్యపు  పిండి  వేసి  స్పూను తో  బాగా  కలిపి  మరుగుతున్న  పులుసు లో  పోసి  మరో  అయిదు  నిముషాలు  ఉంచి  దింపి  వేరే  గిన్నెలో  పోసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  కాకరకాయ  ఉల్లిపాయ  పులుసు  భోజనము  లోకి  సర్వింగ్  కు  సిద్ధం .

ఉల్లిపాయ శనగపప్పు మసాలా వడలు

ఉల్లిపాయ శనగపప్పు మసాలా వడలు
ఆలూరు కృష్ణప్రసాదు .

ఉల్లిపాయ  శనగపప్పు  మసాలా వడలు .
తయారీ  విధానము .
ముందుగా  పావు కిలో  పచ్చి శనగపప్పు   నాలుగు  గంటల పాటు   తగినన్ని   నీళ్ళు  పోసి  నానబెట్టుకోవాలి .
తర్వాత   నీళ్ళు  వడకట్టి  మిక్సీ లో  కచ్చాపచ్చాగా  నీళ్ళు  పోయకుండా  వేసుకోవాలి .
ఆ  మిశ్రమాన్ని   ఒక  బేసిన్ లోకి  తీసుకోవాలి .
రెండు  పెద్ద  ఉల్లిపాయలు  సన్నగా   ముక్కలుగా  తరిగి   అందులో కలపాలి .
అయిదు  పచ్చిమిరపకాయలు   చిన్న  ముక్కలుగా   తరిగి   అందులో  కలపాలి .
పావు కప్పు  కరివేపాకు  , పావు కప్పు  పొదీనా  సన్నగా   తరిగి   అందులో కలపాలి .
అర స్పూను   జీలకర్ర  ,  స్పూను  కారం ,  సరిపడా  ఉప్పు ,  స్పూను   తరిగిన  అల్లం , సన్నగా  తరిగిన   కొత్తిమీర   మరియు  రెండు స్పూన్లు   బియ్యపు  పిండి  వేసి  సరిపడా  నీళ్ళు  పోసుకుని  పిండిని  వడల్లా  వేసుకోవడానికి  వీలుగా  చేతితో  బాగా కలుపు కోవాలి .
స్టౌ  మీద  బాండి  పెట్టి   పావు  kg  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   చేతితో  వడల్లా  వత్తుకుని  నూనెలో  వేసుకుని  బాగా  వేగనివ్వాలి .
అంతే  వేడి వేడి  పచ్చి శనగపప్పు  ఉల్లిపాయ   మసాలా  వడలు  టిఫిన్  గా  సేవించడానికి  సిద్ధం.

పొదీనా చింతచిగురు పచ్చడి

పొదీనా చింతచిగురు పచ్చడి
ఆలూరు కృష్ణప్రసాదు .

పొదీనా  చింత చిగురు  పచ్చడి .
కావలసినవి .
పొదీనా  --  రెండు కట్టలు  విడదిసి  ఆకులు  వలుచుకుని  సిద్ధంగా   ఉంచుకోవాలి.
చింత చిగురు --  150   గ్రాములు  .
ఆకు పుల్లలు  లేకుండా  ఏరుకుని  ఆకును  చేతితో  మెత్తగా   నలుపుకోవాలి .
ఎండుమిరపకాయలు   --  12
నూనె  ---  75  గ్రాములు
పచ్చి శనగపప్పు   --  రెండు స్పూన్లు  
పచ్చి మిర్చి   --  4  
పసుపు   --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత

పోపునకు .
ఎండుమిర్చి   -- 3  
జీలకర్ర   --  పావు స్పూను 
మెంతులు  --  పావు  స్పూను ఆవాలు  --  అర  స్పూను 
ఇంగువ  --  కొద్దిగా

తయారు  చేయువిధానము .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి మూడు స్పూన్లు   నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  12  ఎండుమిరపకాయలు   మరియు  పచ్చి శనగపప్పు వేసి  బాగా  వేగనిచ్చి  వేరే  ప్లేటులో  పెట్టు కోవాలి .
అదే  నూనెలో  ముందుగా  పొదీనా , ఆ తర్వాత  చేతితో  నలిపిన  చింత చిగురు , కాస్త పసుపు , పచ్చిమిర్చి   వేసి  బాగా మగ్గనిచ్చి  తీసి  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .
ఇప్పుడు  మళ్ళీ  స్టౌ మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి  వరుసగా  ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర  , ఆవాలు  మరియు  ఇంగువ   వేసి పోపు  వేయించు కోవాలి .
ఇప్పుడు  మిక్సీలో  ఎండుమిరపకాయలు  , పచ్చి శనగపప్పు , పసుపు , తగినంత   ఉప్పు వేసి  కాస్త  మెత్తగా   మిక్సీ   వేసుకోవాలి ,
ఆ తర్వాత  అందులో  వేయించుకున్న  పొదినా  చింత చిగురు ,  పచ్చి మిరపకాయలు  వేసి  మెత్తగా   మిక్సీ   వేసుకోవాలి .
చివరగా  వేయించుకున్న  పోపు  కూడా  అందులో  వేసి  మరోసారి  మిక్సీ   వేసుకోవాలి .
తర్వాత  వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  పొదినా  చింతచిగురు  పచ్చడి  దోశెలలోకి మరియు  భోజనము   లోకి  సిద్ధం .
చింత చిగురు లో  పులుపు  ఉంటుంది  కనుక  వేరుగా  చింతపండు   రసం  వేయనవసరం  లేదు .

అరిసెలు

అరిసెలు
ఆలూరు కృష్ణప్రసాదు .


అరిసెలు  తయారీ  విధానము .
ఒక  కె. జి  . బియ్యము   ముందు  రోజు  రాత్రి  నీళ్ళలో  నాన  పోసుకోవాలి .
మరుసటి  రోజు  బియ్యాన్ని  వడ కట్టి  మిల్లులో  మెత్తని   పిండిలా  వేయించుకోవాలి .
పిండి  పట్టించి  వెంటనే  జల్లెడ  పోసుకుని   ఒక  గిన్నెలో  పోసి   పిండిలోని    తడి  ఆరకుండా గట్టిగా  నొక్కి  పెట్టి  ఉంచాలి .
ఒక  వెడల్పాటి   పాత్రలో  ముప్పావు  కిలో  బెల్లం  మెత్తగా   పొడి  చేసి  వేసి  బెల్లం  మునిగే  వరకు   నీళ్ళు  పోసి   స్టౌ  మీద  పెట్టి బెల్లం నీళ్ళలో  వేసి  చూస్తే  పాకం  ఉండగా   అయ్యే  విధంగా పాకం  రానివ్వాలి .
అంటే  పళ్ళెంలో  నీళ్ళు పోసి పాకం  అందులో  వేసి  చూస్తే ఉండలా  కట్టే  విధంగా  పాకం  రావాలి .
పాకం లో  నాలుగు  చెంచాల  నెయ్యి   వెయ్యాలి .
తర్వాత  పాకంలో  అర  స్పూను  యాలకుల  పొడి  వేసి స్టౌ మీద నుండి  దింపి  వెంటనే  బియ్యపు పిండి  పోస్తూ గరిటతో  గబ  గబా  కలియ బెట్టు కోవాలి .
పాకం  చల్లారక  ముందే  కలియబెట్టటం  పూర్తవ్వాలి .
దింపగానే  మరో  నాలుగు  చెంచాలు  నెయ్యి  వెయ్యాలి .
అలా  రెండుసార్లు   నెయ్యి వేసుకుంటే   పాకం  రుచిగా  మృదువుగా  ఉండటమే  కాక  ఉండలుగా చేయటానికి   అనువుగా   వస్తుంది .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి   ముప్పావు  కే .జి . నూనె  పోసి  నూనెను  బాగా  కాగనివ్వాలి .
చలిమిడి  చల్లారగానే   పిండిని  ముద్దలుగా  చేసుకుని  ఒక  ప్లాస్టిక్   కవరు  మీద  చేతికి   నూనె రాసుకుని  ముద్దను  చేతితో  పల్చగా   వత్తుకుని  కాగిన  నూనెలో  వేసి  చక్కగా   రంగు  వచ్చే వరకు   వేయించుకొని , అరిసెల   చెక్కల  మధ్య  పెట్టి  గట్టిగా  నొక్కుకొని  నూనె  పూర్తిగా  పోయాక  అరిసెలు  తీసి     వెడల్పాటి  పళ్ళెంలో  కాస్త  ఆరనిస్తే  బాగా  కరకరలాడుతూ  ఎంతో  రుచిగా ఉంటాయి .
మెత్తగా  కావాల్సిన వారు    కొంచెం  నొక్కితే  సరిపోతుంది .
అరిసెలు  చేయడానికి   మరో  మనిషి  సాయం  ఉంటే  సులువుగాను , త్వరగాను  అయిపోతుంది .
ఈ  అరిసెలు నెల రోజులు   పైగా  నిలవ ఉంటాయి .
బాలింతలు  ఆర్నెల్ల వరకు   అరిసెలు  తినకూడదు .

నేరేడు పండ్ల ఉపయోగాలు

నేరేడు పండ్ల ఉపయోగాలు
ఆలూరు కృష్ణప్రసాదు .

కనీసం  సంవత్సరం  లో  ఒక సారైనా  నేరేడు  పండ్లు  తినమని  పెద్దలు   చెప్తారు .
కారణం  నేరేడు  పండు  సర్వ రోగ నివారిణి  .
శరీరం  లోని  రక్తాన్ని   శుద్ధి   చేస్తుంది .
కడుపులో   ప్రేగులకు  చుట్టుకుని  ఉన్న  వెంట్రుకలని  కూడా  బయటకు   నెట్టేస్తుందని  పెద్దలు  చెప్తారు .
ఇప్పుడిప్పుడే   మార్కెట్లో కి  వస్తున్నాయి .
మీకు  బజార్లో  కనిపిస్తే  తప్పకుండా   తినండి  .

మినప సున్నుండలు

మినప సున్నుండలు .
ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము  .
ఒక  కె. జి  .   మినప  గుళ్ళు  (  పొట్టు  లేనివి  ) బాండీ లో   నూనె  వేయకుండా   కమ్మని  వాసన  వచ్చే దాకా  వేయించుకోవాలి .
ఆ తర్వాత  మిక్సీ  లో  గాని  లేదా  పిండి  మరలో  గాని  మెత్తని    పొడిగా   వేసుకుని   ఆ పొడి  డబ్బాలో  పోసుకుని  గట్టిగా   మూత  పెట్టు కోవాలి .
మనం  ఎప్పుడు  మినప  సున్నుండలు  చేసుకోవాలని  అనుకుంటే  అప్పుడు  కప్పు  మినప సున్నికి  అర కప్పు  బాగా  మెత్తగా   దంచిన  బెల్లపు  పొడి  గాని  , మెత్తగా   గ్రైండ్   చేసిన  పంచదార  కాని  పొడిలో  వేసి  బాగా  చేత్తో   కలుపు కోవాలి  .
షుమారు  పావు  కప్పు   బాగా  కాగిన  వేడి  వేడి  కల్తీ లేని  మంచి  నెయ్యి  పిండిలో  పోసుకుంటూ  చేత్తో  గట్టిగా   ఉండలు  కట్టు కోవాలి .
బాలింతలకు  కూడా  నడుము  గట్టి  పడుతుందని  ఈ   సున్నుండలు  పెడతారు .
పెద్ద, చిన్న , పిల్లలూ  అందరూ  ఎంతో  ఇష్టంగా  తినే  మినప  సున్నుండలు  రెడీ .
ఒక్కసారి  ఎక్కువ   మోతాదులో   కలుపుకునే  కన్నా  మన  ఇంట్లో  జనాన్ని  బట్టి  కాస్త  కాస్త  కలుపుకుంటే  తాజా  తాజా గా  ఉంటాయి .

గోబి పకోడి

గోబి  (  కాలీ ఫ్లవర్  )  పకోడి .
ఆలూరు కృష్ణప్రసాదు .

కావలసినవి .
సన్నగా   తరిగిన  కాలిఫ్లవర్  ముక్కలు  ---  ఒక  కప్పు .
శనగపిండి --  ఒక  కప్పు
బియ్యపు పిండి  --  రెండు  స్పూన్లు .
అల్లం  తరుగు  --  స్పూను 
పచ్చిమిర్చి   ముక్కలు  --  ఆరు   పచ్చిమిర్చి   సన్నగా   ముక్కలుగా   తరుగు కోవాలి .
జీలకర్ర   --  అర స్పూను 
కారం  ---  స్పూను 
ఉప్పు  ---  తగినంత 
నూనె  --  200  గ్రా ములు .

తయారీ  విధానము  .
కాలిఫ్లవర్  ఫోటోలో  చూపిన  విధముగా  తుంపుకుని  సన్నని   ముక్కలుగా  తరుగు కోవాలి .
ఒక  గిన్నెలో  తరిగిన   గోబి  ముక్కలు , శనగపిండి , బియ్యపు  పిండి ,  పచ్చిమిర్చి  ముక్కలు , అల్లం  తరుగు , జీలకర్ర  ,  కారం ,  తగినంత  ఉప్పును  వేసి  సరిపడా  నీళ్ళు పోసుకుంటూ  పిండిని  గట్టిగా  కలుపు కోవాలి .
తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మొత్తము   నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   పిండిని  పకోడీల లాగా  వేసుకోవాలి .
అంతే  ఎంతో  రుచిగా   ఉండే  మధ్యాహ్నము  అల్పాహారము  గా  గోబి  పకోడి  సిద్ధం .

పరుప్పు రసం

తమిళ  బ్రాహ్మణుల  పరుప్పు  రసం .
ఆలూరు కృష్ణప్రసాదు .

మేం  చెన్నై   లో   నాలుగు  సంవత్సరాలు  ఉన్నాము .
మేం  అక్కడ  ఉన్నప్పుడు  మేం  ఉన్న  కాలనీ  లో  తమిళ  బ్రాహ్మణులు   ఈ  తమిళుల  పరుప్పు రసం  ఎలా  చేసుకోవాలో  మాకు  నేర్పించారు .
తమిళం  లో  పరుప్పు  అంటే  పప్పు  అని  అంటారు . రసము  ను  చారు  అని కూడా  పిలుస్తారు .
కాబట్టి  మన భాష లో  చెప్పాలంటే  దీనిని  పప్పు చారు  అని   అనవచ్చు .
కాని  ఈ  పరుప్పు  రసం  మనం చేసే  విధానానికి   వారు  చేసే  విధానానికి   చాలా  వత్యాసం  ఉంది .
ఇందులో  మిరియాలు  , ధనియాలు , జీలకర్ర   మొదలైన  ఓషధ  విలువ కలిగిన  పదార్ధములు  కలుస్తాయి  కనుక   ఆరోగ్యానికి   మరీ  ముఖ్యంగా  జీర్ణ శక్తి  వృద్ధి చెందడానికి   చాలా  మంచిది .
పరుప్పు  రసము  తయారు  చేయు విధానము .
కావలసినవి  .
  
చింతపండు  ---  40  గ్రాములు

పచ్చిమిర్చి    ----   3
కరివేపాకు   --  మూడు రెమ్మలు.
కొత్తిమీర   --  ఒక  చిన్న కట్ట
టమోటో లు  --  2
  
నెయ్యి  ---  నాలుగు   స్పూన్లు

పసుపు   ---  కొద్దిగా
ఉప్పు   ---   తగినంత .
కందిపప్పు   ---  అర  కప్పు .
రసము  ముద్దకు  కావలసినవి .
ఎండుమిరపకాయలు   ---  3  
కందిపప్పు   ---    రెండు  స్పూన్లు .
ధనియాలు  --  రెండు స్పూన్లు .
మిరియాలు  ---  ఒక  స్పూను 
జీలకర్ర   ---  అర  స్పూను 
కరివేపాకు   ---  రెండు  రెమ్మలు .
ఇంగువ  ---  కొద్దిగా .

ముందుగా   చింతపండు   విడదీసి  గ్లాసు  నీళ్ళల్లో  పది నిముషాలు  నానబెట్టుకుని పల్చగా రసం  తీసుకుని అందులో  మరో  గ్లాసు  నీళ్ళు  పోసుకోవాలి .
టమోటో  లు  కొద్దిగా   నీళ్ళు  పోసి  ఉడికించుకుని  పై  తొక్క తీసుకుని   వేరేగా  ఉంచుకోవాలి .
టమోటో  లు  ఉడికించిన  నీళ్ళు    రసము  గిన్నెలో   పోసుకోండి .
అందులో  పసుపు ,  తరిగిన   పచ్చిమిర్చి  ,  తగినంత  ఉప్పు , రెండు  రెమ్మలు  కరివేపాకు   , అర స్పూను   పంచదార  వేసుకుని   పక్కన  ఉంచుకోవాలి  .
అర  గ్లాసు  కంది పప్పు  సరిపడా  నీళ్ళు  పోసి  కుక్కర్  లో మూడు  విజిల్స్  వచ్చే వరకు  ఉంచి  మెత్తగా   ఉడికించి , చల్లారి  మూత  రాగానే  గరిటతో  మెత్తగా  యెనుపు కోవాలి .
రసము  ముద్ద  తయారీ  విధానము .
స్టౌ  మీద  బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు   నెయ్యి  వేసి  నెయ్యి   కాగగానే  వరుసగా   ఎండుమిర్చి  , కందిపప్పు  , ధనియాలు , మిరియాలు , ఇంగువ , జీలకర్ర  ,  మరియు  రెండు  రెమ్మలు  కరివేపాకు  వేసి  పోపు  వేయించుకోవాలి .
పోపు  చల్లారగానే  ఇవ్వన్నీ  మిక్సీ  లో  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి   మెత్తగా   ముద్దలా  వేసుకోవాలి .
చివరగా  ఉడికిన  టమోటో లు కూడా  ఆ ముద్దలో  వేసి  మెత్తగా   మిక్సీ   వేసుకుని   వేరే  గిన్నెలో కి  తీసుకోవాలి .
ఇప్పుడు   స్టౌ   మీద   చింతపండు   రసము  ఉప్పు  మొదలైనవి  వేసిన  గిన్నె   పెట్టి  రసము  బాగా  తెర్లుతున్నప్పుడు , ఉడికించి  ఉంచుకున్న   కందిపప్పు   మరియు  వేరేగా  ఉంచుకున్న   రసము  ముద్ద కూడా  వేసి  బాగా  తెర్లనిచ్చి  దింపుకోవాలి .
ఆ తర్వాత   స్టౌ  మీద  బాండీ  పెట్టి   రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి  బాగా  కాగగానే    రెండు  ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , మెంతులు , ఆవాలు , జీలకర్ర  , ఇంగువ  మరియు  కరివేపాకు  తో  పోపు పెట్టు కోవాలి .
తర్వాత  పైన  కొత్తిమీర   వేసుకోవాలి .
అంతే  ఇడ్లీ లోకి , పూరీ , చపాతీలలోకి ,  వడల లోకి  మరియు  భోజనము   లోకి  ఎంతో  రుచికరమైన  తమిళ  బ్రాహ్మణ  పరుప్పు  రసము  సర్వింగ్   కు  సిద్ధం.

Monday, June 19, 2017

తోటకూర గారెలు

తోటకూర   గారెలు .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


తయారీ విధానము .
ఒక కప్పు  మినపప్పు   నాలుగు   గంటల పాటు  నీళ్ళలో నానబెట్టి  తర్వాత  గారెలు  వేయుటకు అనువుగా  గ్రైండ్  చేసుకోవాలి .
కప్పు  తరిగిన  తోటకూర , తరిగిన  అల్లం  , తరిగిన  పచ్చిమిర్చి  ,  స్పూను జీలకర్ర , తరిగిన  కరివేపాకు  , ఉల్లి  పాయల  ముక్కలు  అన్నీ  ఈ  పిండిలో  వేసి  బాగా  కలుపు కోవాలి .
స్టౌ  మీద  బాండీ పెట్టి  200  గ్రాముల  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   గారెలు  మాదిరిగా   వేసుకోవాలి .
అంతే  వేడి  వేడి  రుచికరమైన  తోటకూర  గారెలు  సర్వింగ్   కు  సిద్ధం .
ఒక కప్పు  మినపప్పు   నాలుగు   గంటల పాటు  నీళ్ళలో నానబెట్టి  తర్వాత  గారెలు  వేయుటకు అనువుగా  గ్రైండ్  చేసుకోవాలి .

కప్పు  తరిగిన  తోటకూర , స్పూను తరిగిన  అల్లం  , అయిదు తరిగిన  పచ్చిమిర్చి  ,  స్పూను జీలకర్ర , మూడు రెమ్మలు తరిగిన  కరివేపాకు  ,  రెండు తరిగిన ఉల్లి  పాయల  ముక్కలు మరియు  సరిపడా ఉప్పు    అన్నీ  ఈ  పిండిలో  వేసి  బాగా  కలుపు కోవాలి .
స్టౌ  మీద  బాండీ పెట్టి  200  గ్రాముల  నూనె  వేసి  నూనె  బాగా కాగగానే   గారెలు  మాదిరిగా   వేసుకోవాలి .
అంతే  వేడి  వేడి  రుచికరమైన  తోటకూర  గారెలు  సర్వింగ్   కు  సిద్ధం .
అల్లం   చట్నీతో తింటే  రుచిగా  ఉంటుంది .

టమోటో బాత్

టమోటో బాత్
ఆలూరు కృష్ణప్రసాదు .

వేడి  వేడి  జీడిపప్పు   టమోటో  బాత్   కొబ్బరి చట్నీ మరియు  అల్లం   చట్నీతో .
తయారీ  విధానము .
పోపు  అంతా  ఉప్మా లాగా బాండీలో  నాలుగు  స్పూన్లు   నూనె వేసి  కాగగానే   ఎండుమిర్చి  శనగపప్పు  మినపప్పు  ఆవాలు కరివేపాకు  వేసి పోపు వేగగానే    మూడు  తరిగిన పచ్చిమిర్చి  , రెండు టమోటాలు , రెండు  ఉల్లిపాయలు   ముక్కలు తరిగి  పోపులోనే  మగ్గపెట్టి , గ్లాసు  బొంబాయిరవ్వకు  రెండు గ్లాసుల  నీళ్ళు  పోసి , సరిపడా  ఉప్పువేసి , నీళ్ళు  బాగా తెర్లుతున్నప్పుడు ఈ రవ్వ పోసి , అట్ల కాడతో  బాగా కదిపి  మూత పెట్టాలి .
నాలుగు  లవంగాలు  , రెండు యాలకులు  , దాసిన చెక్క , మూడు   మిరియాలు  అమాన్  దస్తాలో  వేసి  మెత్తగా  దంచుకుని  ఆ పొడిని  ఈ బాత్ లో  వేసి , మూడు  స్పూన్లు   నెయ్యి వేసి  మరో  మూడు  నిముషాలు   ఉంచి  దింపుకోవాలి .
పైన  నేతిలో  వేయించిన  జీడిపప్పు   తో  అలంకరించుకోవాలి .

కరివేపాకు పచ్చడి

కరివేపాకు  పచ్చడి.
ఆలూరు కృష్ణప్రసాదు .


తయారీ  విధానము .
రెండు కప్పుల కరివేపాకు  , 75  గ్రాముల  పొట్టు  మినపప్పు  ,  పది  ఎండుమిరపకాయలు  , అర స్పూను   ఆవాలు ,  ఇంగువ  కొద్దిగా   నాలుగు   స్పూన్లు   నూనె  వేసి  వేయించుకోండి .
నిమ్మకాయంత  చింతపండు   వేడి నీళ్ళలో  పావు గంట  నాన బెట్టు కొని    చిక్కగా  రసం  తీసుకోండి .

పోపు చల్లారగానే  మిక్సీ లో  ముందు  వేగిన  ఎండుమిరపకాయలు ,  తగినంత ఉప్పు  వేసుకుని   ఒకసారి  తిప్పి  , ఆ  తర్వాత  పొట్టు మినపప్పు   కరివేపాకు   మిశ్రమం , చింతపండు  రసం , ఇష్టమైతే  కొద్దిగా  బెల్లం  వేసుకుని  కొంచెం   నీరు  అవసరమైతే  పోసుకుని  పప్పులు  గా  వేసుకుంటే  కరివేపాకు   పచ్చడి  బాగుంటుంది .

పొట్టు  మినపప్పే  వాడండి.
చాయమినపప్పు  తో  పచ్చడి  రుచిగా  ఉండదు .

పునుగులు

పునుగులు .
ఆలూరుకృష్ణప్రసాదు .

ఇడ్లీ  పిండి  పునుగులు  వేసే  గంట ముందు  బయట పెట్టుకుని  అందులో   బియ్యపు పిండి  తగినంత , తరిగిన  పచ్చిమిర్చి , ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు  స్పూను కారం  కొద్దిగా  కరివేపాకు  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోసి  కలుపు కోవాలి  .
గంట తర్వాత స్టౌ  మీద  బాండీ  పెట్టి  200  గ్రాముల  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   పునుగుల్లా వేసుకుంటే  కర కర లాడుతూ  బాగుంటాయి .

తమిళుల పొడి

తమిళుల పొడి
ఆలూరుకృష్ణప్రసాదు .


ఇటీవల  వడపళని  చెన్నై   లోని  ఒక  హోటల్  లో  భోజనానికి   వెళ్ళాము .
పక్కన  కప్పులో  పొడి , ఊరగాయ  పెట్టాడు .
అది  తమిళుల  హోటల్ .
సర్వర్  కర్నూలు  ప్రాంతం  అతను .
మా  మొఖాలు  చూసి  తెలుగులో నే  మాట్లాడాడు .
భోజనము   లో  పక్కనే   కప్పులో ఉన్న  పొడి  అన్నం  లో  కలుపుకున్నాను .
చాలా రుచిగా  ఉంది .
ఏం పొడి  ఇది  అని  అడిగాను .
ఏదో  అరవ  పేరు  చెప్పాడు .
నాకు  ఆ పేరు  అర్ధం కాక  ఎలా  తయారు  చేస్తారని  అడిగాను .
తయారీ  విధానము   చెప్పాడు . నేను  రాసుకున్నాను .
ఇంటికి  వచ్చాక  చేసాను .
హోటల్  లో  తిన్న దానిని  తలదన్నేలా  కుదిరింది .
మరి  ఆ  కందిపప్పు పుట్నాల పప్పు  పొడి తయారీ  విధానము  మీ  కోసం .
కందిపప్పు   పుట్నాల  పప్పు  పొడి .
కావలసినవి.
కందిపప్పు   ---   150  గ్రాములు .
పుట్నాల  పప్పు  --  75  గ్రాములు
ఎండుమిరపకాయలు  --  15 
కరవేపాకు    --   విడి  ఆకులు  అర కప్పు  ఆర పెట్టుకుని  సిద్ధం  చేసుకోవాలి . .
మిరియాలు  --   స్పూను.
ఉప్పు  ---  తగినంత .

తయారీ విధానము .
ముందుగా  స్టౌ  మీద  బాండీ  పెట్టి  బాండీ  బాగా  వేడెక్కగానే ముందుగా  కందిపప్పు ,  మిరియాలు , ఎండుమిరపకాయలు  వేసి  అట్లకాడతో  బాగా  కలుపుతూ   కందిపప్పును   మూడొంతులు  పైగా  వేగ  నివ్వాలి .
ఆ తర్వాత  వేయించిన   శనగపప్పు   (  పుట్నాల పప్పు ) ,   ఆరిన   కరివేపాకు  మరియు పొట్టు  తీయని  వెల్లుల్లి  రేకలు  కూడా  వేసి  పూర్తిగా   బంగారు  రంగులో  వేగనివ్వాలి .
తర్వాత  వేయించినవి  కొద్దిగా  చల్లారగానే  ముందుగా   ఎండుమిరపకాయలు  , సరిపడా ఉప్పు  వేసి మెత్తగా    మిక్సీ   వేసుకోవాలి .
తర్వాత  కందిపప్పు ,  పుట్నాల పప్పు,   కరివేపాకు  ,  మరియ మిరియాలు వేసిన  వేగిన  మిశ్రమం కూడా  మిక్సీ  లో  వేసి  మెత్తగా  పొడి  వేసుకోవాలి .
ఆ  తర్వాత  దీనిని  ఒక  సీసాలో  భద్ర పరుచుకోవాలి .
వెల్లుల్లి   ఇష్ట పడని వారు  వెల్లుల్లి  బదులుగా  కందిపప్పు   వేయించే  ముందే  స్పూను  జీలకర్ర   వేసి  చేసుకోవచ్చు .
అంతే .  అన్నం లోకి , దోశెల లోకి  ,  ఇడ్లీ ల లోకి  రుచికరమైన  కందిపప్పు   పుట్నాల  పొడి  సిద్ధం .

Sunday, June 18, 2017

దోసకాయ పచ్చిశనగపప్పు కూర

దోసకాయ పచ్చిశనగపప్పు  కూర.
ఆలూరు కృష్ణ ప్రసాద్

ముందుగా  రెండు  దోసకాయలు  పై  చెక్కు తీసుకొని   ముక్కలుగా  తరుగు  కోవాలి .
పావు కప్పు  పచ్చిశనగపప్పు  , మరియు   తరిగిన   దోసకాయ ముక్కలు ఒక గిన్నెలో  వేసి   ముక్కలు  మునిగే  వరకు  నీళ్ళు పోసి  ముక్కలు  మరియు  శనగపప్పు   మెత్త పడేవరకు  ఉడకనివ్వాలి .
ఉప్పు  వేయకుండా  ఉడకనివ్వాలి
ఉడకగానే  నీళ్ళు  వడ కట్టుకుని  ముక్కలపై  కొద్దిగా   పసుపు  వేసుకోవాలి .
పది  పచ్చిమిరపకాయలు   తొడిమలు  తీసి  నిలువుగా  తరుగు కోవాలి .
కరివేపాకు  మూడు రెమ్మలు  సిద్ధంగా  ఉంచుకోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు   స్పూన్లు  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  నాలుగు   ఎండు మిర్చి  ముక్కలుగా  చేసినవి , స్పూను  మినపప్పు  , పావు  స్పూను   జీలకర్ర  , అర స్పూను  ఆవాలు , కొద్దిగా   ఇంగువ  వేసి  పోపు  వేసుకోవాలి .
పోపు వేగగానే  తరిగిన   పచ్చిమిర్చి   ముక్కలు,  కరివేపాకు  కూడా  వేసి   వేగ నివ్వాలి .
తర్వాత  ఉడికిన  దోసకాయ  శనగపప్పు   మిశ్రమం  కూడా  వేసి , తగినంత  ఉప్పువేసి  ఒక  అయిదు  నిముషాలు   మూత పెట్టి  మగ్గ నివ్వాలి .
తర్వాత  దింపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
పచ్చి  మిర్చి  సరిపడా  వేసాము  కనుక  వేరుగా  ఎండు  కారం  వేయనవసరం  లేదు .
చూసి  అవసరమైతే  వేసుకోండి .
దోసకాయలో  పులుపు  ఉంటుంది  కనుక  చింతపండు   రసం  కూడా  వేయనవసరం  లేదు .
మీకు  ఇష్ట మైతే  వేసుకోండి .
అంతే  ఎంతో  రుచికరమైన   దోసకాయ పచ్చిశనగపప్పు కూర  అన్నం  లోకి  రోటి ల లోకి  సర్వింగ్ కు  సిద్ధం.

క్యాబేజి పెసర మసాలా వడలు

క్యాబేజి  పెసర  మసాలా వడలు .
ఆలూరు కృష్ణప్రసాదు .


కావలసినవి .
ముడి పచ్చ పెసలు  --  150  గ్రా.
క్యాబేజి  --   150  గ్రా.
ఉల్లిపాయలు  -  రెండు
పచ్చిమిర్చి   --  పన్నెండు 
కరివేపాకు   --  మూడు  రెమ్మలు 
పొదినా ఆకు   -  పావు  కప్పు 
శనగపిండి  --  రెండు స్పూన్లు 
అల్లం   ---  చిన్న ముక్క 
జీలకర్ర  --  పావు  స్పూను 
నూనె  --  200  గ్రాములు .

పెసల  వడలు  తయారీ  విధానము  .
ఈ  పెసల  వడలకు  ముడి  పచ్చ  పెసలే  వాడాలి .
పెసర పప్పు  కాని , చాయపెసరపప్పు  కాని  వాడ కూడదు . రుచిగా  ఉండదు .
ముందుగా  ముడి  పెసలు  తగినన్ని   నీళ్ళలో  మూడు గంటల   సేపు  నానపెట్టుకోవాలి .
తర్వాత  నానిన  పెసలలో   ని నీళ్ళు  వంపేసి  మిక్సీ  లో  నీళ్ళు  పోయకుండా  కచ్చా పచ్చాగా  వేసుకోవాలి .
క్యాబేజి  చిన్న  ముక్కలుగా   తరుగుకోవాలి .
ఉల్లిపాయలు  చిన్న  ముక్కలుగా  తరుగుకోవాలి .
పచ్చిమిర్చి  చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .
అల్లం పై  చెక్కు   తీసి  చిన్న ముక్కలుగా   తరుగు కోవాలి .
కరివేపాకు  సన్నగా  తరుగుకోవాలి .
పొదినా  ఆకులు  వలిచి  సిద్ధంగా  ఉంచుకోవాలి .
ఇప్పుడు   ఒక  గిన్నెలో   గ్రైండ్   చేసుకొని  సిద్ధంగా  ఉంచుకున్న   ముడి పెసల  మిశ్రమం , తరిగిన  క్యాబేజి  ముక్కలు , తరిగిన   ఉల్లిపాయల  ముక్కలు , తరిగిన  కరివేపాకు ,
తరిగిన  పచ్చిమిర్చి   ముక్కలు ,  పొదీనా  ఆకు , శనగ పిండి ,  జీలకర్ర  , సరిపడా  ఉప్పువేసి   కొద్దిగా  నీళ్ళు  పోసుకుని  చేత్తో  బాగా  కలుపు కోవాలి .

పిండి  వడలుగా  వేయటానికి  అనుగుణంగా  కలుపు కోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  నూనె  మొత్తము   వేసి  నూనె బాగా  కాగిన  తర్వాత  కలిపిన  పిండిని  ఉండలుగా  చేసుకుని   అర చేతితో   చిన్న  వడలుగా  చేసుకొని   నూనెలో  బంగారు  రంగులో  వేయించుకోవాలి  .
అంతే  ఎంతో  రుచిగా  ఉండే  క్యాబేజి  పెసల  మసాలా  వడలు  టిఫిన్  గా  సేవించడానికి  సిద్ధం.
ఈ వడలు  వేడి  వేడిగా  అన్నం లోకి కూడా  చాలా  రుచిగా  ఉంటాయి ,
ఫోటో   --   మా  ఇంట్లో  చేసిన  క్యాబేజి  పెసల వడలు .

రవ్వ లడ్డూ

రవ్వ లడ్డూ  తయారీ  విధానము .
ఆలూరు కృష్ణప్రసాదు

ఇక  రవ్వ లడ్డు  కు  ఒక కప్పు  బొంబాయి  రవ్వ  నేతిలో  వేయించుకోవాలి .
ఎండు కొబ్బరి  ఒక చిప్ప  ఎండు కొబ్బరి  కోరాముతో  తురుముకుని  నెయ్యి వేసి  వేయించుకోవాలి .
అర కప్పు  పంచదార  మిక్సీలో మెత్తగా  పొడి  వేసుకోండి.
నేతిలో  జీడిపప్పు   , కిస్మిస్   వేయించుకోండి .
ఇప్పుడు  బేసిన్లో నేతిలో  వేయించిన  బొంబాయి రవ్వ , నేతిలో  వేయించిన  ఎండు  కొబ్బరి , మిక్సీలో  మెత్తగా  వేసిన  పంచదార  మరియు  నేతిలో  వేయించిన  జీడిపప్పు  , కిస్మిస్  వేసి    కొద్దిగా కాచి చల్లారిన  పాలు పోసి  ఉండలు  కట్టుకోండి .
అంతే  రవ్వ లడ్డూలు  సిద్ధం .

Wednesday, June 14, 2017

బీరచెక్కు పచ్చడి

బీర చెక్కు  పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావల్సిన  పదార్థములు 
బీర  చెక్కు
ఎండు  మిరపకాయలు  ---  3
పచ్చిమిరపకాయలు    ---    3
మెంతులు  ---  కొద్దిగా 
జీలకర్ర    ----   పావు  స్పూను 
చాయ మినపప్పు  ---  స్పూన్ 
ఆవాలు   ----   అర స్పూను  
ఇంగువ  ----  కొద్దిగా 
పసుపు  ---  కొద్దిగా  
చింతపండు  ---  తగినంత 
ఉప్పు  ---  తగినంత
కరివేపాకు  ---  రెండు  రెమ్మలు
కొత్తిమీర   ---  తగినంత 
నూనె  ---  మూడు  స్పూనులు
ముందుగా  స్టౌ  వెలిగించి  బాండీ  పెట్టి  మూడు  స్పూన్ల  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  చాయ మినపప్పు  , జీలకర్ర  , ఎండు మిరపకాయలు , ఆవాలు  , ఇంగువా  వేసి  పోపు  వేగాక  పచ్చిమిరపకాయలు , బీరతొక్కు    పసుపు వేసి  అయిదు  నిముషాల పాటు  మూత  పెట్టి  మగ్గనివ్వండి.
 బీర  చెక్కు మగ్గాక  దింపేయండి .
ఇప్పుడు  మిక్సీలో  చింతపండు   ఉప్పు వేసి  నలిగాక  ఈ  మగ్గిన  బీర తొక్కును  వేసి  మ రోసారి  తిప్పి  పచ్చడి నలిగాక  మిగిలిన  పోపు  కొత్తిమీర కూడా  అందులో  వేసుకుని పేస్టులా  కాకుండా  ఓ  మాదిరి  మెత్తగా   వేసుకొని   ఓ  Bowl  లోకి  తీసుకోండి.
అంతే  బీర  చెక్కు  పచ్చడి  భోజనం  లోకి  సిద్ధం.
లేత  చెక్కు  అయితేనే  పచ్చడి  చేసుకోండి.
లేకపోతే   పచ్చడి  రుచి  ఉండదు .

బీరకాయ ఉల్లికారం కూర

బీరకాయ  ఉల్లికారము  కూర .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావల్సిన  వస్తువులు.
ఎండు మిరపకాయలు  ---  6
పచ్చి  శనగపప్పు  ---  పావు కప్పు
చాయ మినపప్పు  ---  పావు కప్పు
ఆవాలు   ----   అర స్పూను
పెద్ద  ఉల్లిపాయలు  ---  4
ఉప్పు  ---   తగినంత 
బీరకాయలు  ----   4
నూనె   --  తగినంత 
ఈ  బీరకాయ  ఉల్లికారం  కూరకు
కాయలు  ఎంత  లేతగా  ఉంటే  కూర అంత  రుచిగా  ఉంటుంది.
ఫోటోలో  చూపిన  విధంగా  సన్నగా  ఓ  మాదిరి  పొడవైన  కాయలు  తీసుకోండి  .
పైన  చెక్కుని  తీసి  కాయ లోపల చేదు  ఉందేమో  చూసుకోండి .
చేదు  కాయ  చెక్కు  రెండూ  పారేయండి .
అలా  చెక్కు  తీసిన  బీరకాయను 
మధ్యలో  రెండు లేక  మూడు  ముక్కలుగా  చేసుకొని   గుత్తి  వంకాయ  కూర  చేసుకునే  విధంగా  కాయను  నాలుగు  పక్షాలుగా  చేయండి.  కాయను  ముక్కలుగా  కోయవద్దు . మిగిలిన  అన్ని కాయలను  అదే  విధంగానే   కోసుకోండి .
తీసిన  బీర   చెక్కును  పార వెయ్యవద్దు.  పక్కన  పెట్టుకోండి. 
లేత  బీర  చెక్కు అయితే  నిక్షేపంగా  పచ్చడి  చేసుకో వచ్చు .
ఇప్పుడు  ఉల్లిపాయలు  పై  పొట్టు తీసి  పులుసు  ముక్కల్లాగా  పెద్ద ముక్కలు  తరుగు  కోండి.
ఆ  తర్వాత  స్టౌ  మీద  బాండీ  పెట్టి  నాలుగు  చెంచాలు  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక   పచ్చి శనగపప్పు , చాయ  మినపప్పు  ,
ఎండు  మిరపకాయలు , ఆవాలు  వేసి  పోపు  కమ్మని  వాసన  వచ్చే  దాక  వేయించి   అందులోనే  తరిగి  ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు  వేసి  మూత  పెట్టి  సన్నని  సెగన  ఒక  అయిదు  నిముషముల  పాటు  మగ్గనివ్వండి.
ఉల్లిపాయలు  పచ్చి  వాసన  పోయేదాక  ఒక  మాదిరిగా   మగ్గితే  చాలు.  పూర్తిగా   వేగ నివ్వద్దు .  
ఇప్పుడు  స్టౌ  ఆపి  పోపు  చల్లారాక   వేయిచుకున్న పోపు , తగినంత  ఉప్పు  వేసి  రెండు  మూడు  సార్లు  తిప్పి  ముద్ద  పూర్తిగా  పేస్ట్  అయిపోకుండా  తీసి ఒక  ప్లేటులో  పక్కన  పెట్టుకోండి .
ఉల్లిపాయలలో  తడి  ఉంటుంది  కనుక  నీళ్ళు  అసలు  పోయవద్దు.
ఇప్పుడు  నాలుగు  పక్షాలుగా చేసుకున్న  బీరకాయలలో  ఆ  ముద్దను  కూరి  కొంత  ముద్దను  విడిగా   ఉంచుకోండి.
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  అయిదు  ఆరు  చెంచాలు  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక  ఈ  ఉల్లికారం  కూరిన  కాయలను  నూనెలో  వేసి  మధ్య  మధ్యలో  అడుగంట  కుండా  అట్లకాడతో  కలుపుతూ  ఒక  పది  నిముషాలు  మూత పెట్టి  మగ్గ నివ్వండి  . బీరకాయల్లో  స్వతహాగా  నీరు  ఉంటుంది  కనుక  వేరుగా  నీరు  పోయనవసరం లేదు . కాయల్లోనుండి  నీరు  బయటకు  వచ్చి  ముక్కలు  మగ్గుతాయి.
ఇలా  ముక్కలు  మగ్గాక  మిగిలిన  ముద్దను  ఇప్పుడు  వేసి  మూతపెట్టకుండా  మగ్గనివ్వండి.
ఒక  అయిదు నుండి  ఎనిమిది  నిముషాల్లో  నీరు  ఇగిరిపోయి  నూనె బయటకు  వచ్చి  కమ్మని  వేగిన  వాసన  వస్తుంది .
తర్వాత  వేసిన  ముద్ద  కూడా  కాయలకు  పడుతుంది .
ముద్ద  మాడకుండా  వేగిందో  లేదో  చూసుకుని  ఇప్పుడు  స్టౌ  ఆపి  మూత పెట్టి  అయిదు  నిముషాలు  అయ్యాక  కూరను  వేరే  Bowl  లోకి  తీసుకోండి .
అంతే  ఘమ  ఘమ  వేగిన  ఉల్లికారం  సువాసనలతో  బీరకాయ  ఉల్లికారం  కూర  భోజనం  లోకి  సిద్ధం.
ఇప్పుడు  చెప్పిన  కూర గ్రేవి  ఉంటుంది  కాబట్టి  బాగా  ఆటు  వస్తుంది.
కనీసం  ఆరు మందికి  సరిపోతుంది .
అదే  బీరకాయలు  కిలో  కాయలు  ముక్కలు  తరిగి  పోపులు  వేసుకుంటే  ముగ్గురుకు  కూడా  సరిపోదు.
ఇది  కేవలం  ఉల్లికారం  కూర కాబట్టి  పోపులో  ధనియాలు , జీలకర్ర  మెంతులు  కరివేపాకు  కొత్తిమీర   వంటివి  వాడలేదు .
మసాలా  కూరగా  చేసుకునే  వారు  అవి  వారికి  ఇష్టమైతే  పై  చెప్పినవి  పోపులో  వేసుకోవచ్చు .

చారుపొడి తయారీ

చారుపొడి తయారీ
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

మా ఇంట్లో  చారు పొడి  నెలకు  సరి పడా  మిక్సీ  వేసుకుంటాము .
చారుపొడి  చేసుకునే  విధానము .
ఎండు  మిరపకాయలు  ---  షుమారు  20  గ్రాములు.
 ధనియాలు   ----  50  గ్రాములు
జీలకర్ర        -----  15  గ్రాములు
మిరియాలు  ----  15  గ్రాములు
పచ్చి శనగపప్పు  ---  25  గ్రాములు
కందిపప్పు        ----   20 గ్రాములు
షుమారుగా  కొలతలు  చెప్పాను.
ఇవి  అన్నీ  పచ్చివే  ఒక  చాటలో  పోసి  ఎర్రటి  ఎండలో  మూడు  రోజులు  ఎండ  నివ్వండి .  
మూడో  రోజు  ఈ పదార్ధాలన్నీ  మెత్తగా   మిక్సీ  వేసుకోండి .
మేము  ఇందులో  కొంచెం  పచ్చి  ఇంగువ  వేసుకుంటాం .
మీకు  ఇష్ట మైతే  పొడి  మిక్సీ  వేయబోయే ముందు  ఇంగువ  తగినంత  వేసుకోండి.
 మిరియాలు  మరి కాస్త  వేసుకుంటే  ముక్కులు  అదిరిపోయే  ఘూటుతో  చారుపొడి  రెడీ  అవుతుంది .
ఈ  మిశ్రమాన్ని  ఒక  సీసాలో  పోసి  నిల్వ  ఉంచుకోండి .
చారులో  మీరు  చెప్పిన విధంగానే  చింతపండు , పచ్చిమిరపకాయలు , ఉప్పు , ఇష్టమైతే చాలా కొద్దిగా  బెల్లం , కరివేపాకు , పసుపు వేసి  నీళ్ళు  పోసి  బాగా  తెర్లుతున్నప్పుడు  ఈ  చారుపొడి  రెండు  టీ  స్పూన్లు  వేసి  పొంగ కుండా  చూసుకుని, దింపే ముందు  కొత్తిమీర   వేసుకుని  రెండు ఎండుమిరపకాయలు , ఆవాలు , జీలకర్ర  , మెంతులు , ఇంగువ  వేసి  నూనెతో  పోపు  పెట్టుకోండి .
ఇంక  రుచికరమైన  చారు  సిద్ధం.

వంకాయ పెరుగు పచ్చడి

వంకాయ పెరుగు పచ్చడి
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసిన పదార్థాలు :
వంకాయలు - 2, పెరుగు - ఒక కప్పు, 
పోపు గింజలు - ఒక స్పూన్, 
ఎండుమిర్చి - 1, 
కరివేపాకు - ఒక రెమ్మ, 
కొత్తిమీర - అర కట్ట, 
నూనె - 2 స్పూన్స్, 
ఉప్పు - తగినంత 
తయారుచేసే విధానం :
ముందు వంకాయలను బాగా కడిగి తుడవాలి. వాటికి నూనె రాసి స్టౌ మీద కాల్చాలి. ఈ కాల్చిన వంకాయపై మాడిన పొట్టంతా తీసేయాలి. ఆ తర్వాత ఆ వంకాయలను చేతితో చిదమాలి. దీంట్లో ఉప్పు, పెరుగు కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి పోపు గింజలు వేసి దోరగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని వంకాయ పచ్చడిలో కలిపి పై నుంచి కొత్తిమీర చల్లాలి. అంతే.. నోరూరించే వంకాయ పచ్చడి మీ ముందుంటుంది

సొరకాయ పచ్చి కొబ్బరి పచ్చడి

సొరకాయ పచ్చి కొబ్బరి  పెరుగు పచ్చడి.
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఈ  పెరుగు  పచ్చడి తయారు  చేయడానికి   లేత  సొరకాయ  అయితే  బాగుంటుంది .
కావలసినవి  .
లేత  సొరకాయ చిన్నది  --
పై  చెక్కు తీసి  రెండు కప్పులకు  సరిపడా  ముక్కలు  సన్నగా  తరుగుకొని  సిద్ధం  చేసుకోవాలి .
పచ్చి  కొబ్బరి  తురుము  -  ఒక  కప్పు .
పచ్చి  మిరపకాయలు  -  ఆరు 
అల్లం   --   చిన్న  ముక్క .
కరివేపాకు  --  మూడు స్పూన్లు 
కొత్తిమీర   ---  ఒక  కట్ట .
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
జీలకర్ర  ---  స్పూను 
నూనె  ---  మూడు స్పూన్లు 
పోపు  కు  కావలసినవి .
నెయ్యి  --  మూడు స్పూన్లు 
ఎండు  మిర్చి  ---  మూడు
మినపప్పు   ---  స్పూను 
మెంతులు  --  పావు స్పూను
ఆవాలు  ---  అర స్పూను 
ఇంగువ  ---  కొద్దిగా 
తయారి  విధానము .
ముందుగా  పచ్చిమిర్చి  మరియు అల్లం    కొంచెం  నలిగేటట్లు  మిక్సీ  వేసుకోవాలి .
ఒక  గిన్నెలో  కమ్మని  అర  లీటరు  పెరుగు  తీసుకొని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .
అందులో  సరిపడా  ఉప్పు  వేసుకోవాలి .
స్టౌ  మీద  బాండి  పెట్టి  రెండు  స్పూన్ల  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక   స్పూను   జీలకర్ర , మూడు రెమ్మల  కరివేపాకు   వేసి అందులో  పై చెక్కు  తీసి  ముందుగా  సన్నగా  తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న   రెండు కప్పుల  సొరకాయ  ముక్కలు    వేసి  మూతపెట్టి  మెత్తగా   మగ్గ నివ్వాలి.
చల్లారాక  మగ్గిన  సొరకాయ  ముక్కల్ని  పెరుగులో  కలపాలి .
కప్పు  పచ్చి కొబ్బరి  తురుము  కూడా అందులో  కలపాలి .
అల్లం  పచ్చి  మిర్చి   మిశ్రమం  అందులో కలపాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్ల  నెయ్యి  వేసి 
ఎండు  మిర్చి , మినపప్పు  , మెంతులు , ఆవాలు ,  ఇంగువ  వేసి పోపు  పెట్టుకుని   పెరుగులో  కలపాలి .
కొత్తిమీర  కడిగి  కట్  చేసుకొని   పెరుగు లో  వేసి  అన్నీ  బాగా  కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  సొరకాయ  పచ్చి కొబ్బరి  పెరుగు పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ  పచ్చడి  అన్నం లోకే  కాక  రైతా  లాగా  చపాతీలలో  కూడా  చాలా  రుచిగా   ఉంటుంది .

పిడత కింద పప్పు

పిడత కింద పప్పు
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


ముంత కింద పప్పు /  పిడత కింద పప్పు  /  మసాలా  పప్పు  /  గరం గరం /  ఇంట్లోనే   తయారు చేసుకునే  విధానము.
నేను  మీకు  ఫోటోలో  కాఫీ/  టీ  తాగే  కప్పు  కొలత  ఇచ్చాను .
ఆ  కప్పుకు  మధ్యలో  గీత  కూడా  ఉంది .

అందువలన  షుమారుగా  ఆ  విధంగానే   ఫాలో  అవ్వండి. 
నేను  చూపిన  కప్పులో  గీత  వరకు  నాటు అటుకులు  కాని  లేదా  మిషను  అటుకులు  కాని  తీసుకోండి .
స్టౌ  మీద  బాండి  పెట్టి  అందులో  ఒక  కప్పు  నూనె  పోసి  నూనె  సలసలా కాగాక  ఒక్కసారి  అర కప్పు  అటుకులు  వేసి  తెల్ల రంగులో  వేగగానే  తీసేసి  ఒక  ప్లేటులో  పక్కన  పెట్టుకోండి .
అర  కప్పు  అటుకులు  వేగాక  కప్పుడు  అటుకులు  అవుతాయి.
రెండు పెద్ద  ఉల్లిపాయలు  చాలా  సన్నగా  ముక్కలు  తరిగి  వేరే  ప్లేటులో  ఉంచుకోండి.
 మూడు  పచ్చి మిర్చి   సన్నగా  తరిగి  ఉంచుకోండి.
రెండు రెమ్మలు  కరివేపాకు  సన్నగా  తరిగి   ఉంచుకోండి .
ఒక  పావు  కప్పు పొదినా  ఆకు  కూడా  సన్నగా   తరిగి  ఉంచుకొండి.

వేయించి  పొట్టు తీసిన  వేరుశనగ గుళ్ళు   పావు కప్పు ,  వేయించిన  శనగపప్పు   (  పుట్నాల పప్పు ) పావు కప్పు ,  కారం  వేయని  బూంది  అర కప్పు  సిద్ధంగా  ఉంచుకోండి .
నిమ్మకాయ  ఒకటి , గరం మసాల పొడి  ఒక స్పూను ,  కారం  ఒక స్పూను , ఉప్పు  తగినంత  సిద్ధం  చేసుకోండి.
ఇప్పుడు  ఒక  గిన్నె  తీసుకొని   అందులో  వరుస  క్రమంలో  వేయించిన అటుకులు, వేరు శనగ పప్పు ,  వేయించిన  శనగపప్పు ,  కారం వేయని  బూందీ ,  సన్నగా  తరిగిన  ఉల్లిపాయ ముక్కలు , సన్నగా  తరిగిన  కరివేపాకు , సన్నగా  తరిగిన  పొదీనా , సన్నగా  తరిగిన  పచ్చి మిర్చి , ఒక స్పూను  గరం మసాలా పొడి , ఒక స్పూన్  కారం , ఒక  కాయ  పిండిన  నిమ్మరసం , తగినంత  ఉప్పు  వేసి  గరిటతో  బాగా  కలిపి  ప్లేట్లలో  పెట్టి  సాయంత్రం  పూట  సర్వ్  చేసారా !!
ఇక  దాని  రుచి  చెప్పడం  చేసి  రుచి  చూసి  మీరే  అంటారు  "  అద్భుతం  "  అని.

మసాల వడ

మసాల  వడ.
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

తయారీ  విధానము .
మూడు గంటల ముందు  ఒక  గ్లాసు  పచ్చిశనగపప్పు  , అర గ్లాసు  పెసర పప్పు  తగినన్ని  నీరు  పోసి విడిగా  నానబెట్టుకుని , తర్వాత  నీరు  వడ  కట్టు కోవాలి .
తర్వాత  మిక్సీలో  ఈ  నాన  బెట్టిన  పప్పులు , ఎనిమిది   పచ్చి మిరపకాయలు , చిన్న  అల్లంముక్క, ఒక  పెద్ద  ఉల్లిపాయ   ముక్కలు , పావు  స్పూను  జీలకర్ర ,  పావు  కప్పు పొదీనా ఆకు ,  రెండు  రెమ్మలు  కరివేపాకు , కొద్దిగా   కొత్తిమీర , అర స్పూను  కారం , తగినంత   ఉప్పు, వేసి  తగినన్ని  నీళ్ళు పోసి మరీ   మెత్తగా   కాకుండా  మిక్సీ వేసుకోవాలి .
ఆ   తర్వాత   ఈ  మిశ్రమంలో  ఒక  స్పూను  బియ్యపు  పిండి  కలుపు కోవాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  పావు కేజి  నూనె  పోసి  నూనె  బాగా  కాగగానే   ఆకు  మీద  వడల్లా  తట్టి  నూనె  లో  వేసుకొని   బంగారు  రంగు  వచ్చే  విధంగా  వేయించు  కోవాలి .
అంతే  వేడి  వేడి  మసాల  వడ  రెడి .
ఈ  మసాలా  వడ  టిఫిన్  గాను  మరియు  వేడి  వేడి  అన్నంలో  ఆదరువు  గాను  పనికొస్తుంది.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి