Monday, September 3, 2018

వామన చింతకాయలు

ఆలూరుకృష్ణప్రసాదు .

వామన చింతకాయలు .

వామన చింతకాయలు అంటే  కొత్తగా  సీజన్లో  చింత చెట్లకు  కాసే, గింజ పట్టని  చిన్న చిన్న చింతకాయలు.

ఇవి చిన్నవిగా ఉంటాయి కనుక వామనుల వారు కూడా పొట్టిగా  ఉంటారు కనుక మా ప్రాంతంలో  వీటిని  వామన చింతకాయలు లేదా  చిట్టి /  పొట్టి చింతకాయలు అని అంటాము .

ఈ చింతకాయలతో  పులిహోర  చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

మనం  ఇంట్లో చేసుకునే పులిహోరకు , గుళ్ళో మనకు ఆచార్యుల వారు పెట్టే పులిహోరకు  రుచిలో చాలా తేడా ఉంటుంది .

గుళ్ళో ప్రసాదం రుచి మనకు  ఇంట్లో రాదు.

కారణం మనం పులిహోరలో చింతపండు రసం వాడతాము.

ఆచార్యుల వారు చింతకాయలు  తొక్కి పులిహోర లో వేసి తయారు చేస్తారు .

అదే ప్రధానమైన తేడా.

ఈ విషయం నా చిన్ననాటి పూజారి స్నేహితుడు  చెప్పారు .

ఇంక వామన చింతకాయలతో పులిహోర ఏ విధముగా  తయారు చేస్తారో  మనం తెలుసుకుందాం .

వామన చింతకాయలతో పులిహోర .
**********************

వామన చింతకాయులు. --
ఒక  100  గ్రాములు .

ఈ కాయలను  శుభ్రంగా  కడిగి ఆర నిచ్చి , చిన్న ముక్కలుగా తరుగుకొని , తగినంత  ఉప్పు  మరియు అర స్పూను పసుపు వేసుకుని  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఈ మొత్తం  100  గ్రాముల  పచ్చడిలో  సగం పచ్చడి అంటే షుమారు 50  గ్రాముల  పచ్చడి తీసుకోవాలి .

మిగిలిన  పచ్చడి విడిగా చిన్న జాడీ లోకి తీసుకుంటే ,తర్వాత అవసరమైనప్పుడు  మనం మామూలుగా  చింతకాయ పచ్చడి భోజనాలలోకి చేసుకోవచ్చును.

పచ్చిమిర్చి  --  10
కరివేపాకు  --  నాలుగు  రెమ్మలు .
బియ్యము  --  ఒక గ్లాసు లేదా
షుమారు  150  గ్రాములు.
పసుపు --  అర  స్పూను
ఉప్పు  --  తగినంత .

పోపునకు.

ఎండుమిరపకాయలు  -- 8 .
పచ్చిశనగపప్పు  -- రెండు స్పూన్లు .
చాయమినపప్పు --  రెండు స్పూన్లు
వేరుశనగ గుళ్ళు -- నాలుగు స్పూన్లు .
ఆవాలు --  ముప్పావు స్పూన్ .
జీడిపప్పు  --  8  పలుకులు .
ఇంగువ  - తగినంత .
నూనె  --  125 గ్రాములు.

తయారీ విధానము .

ఒక గ్లాసు  బియ్యం కడిగి  తగినన్ని  నీళ్ళు పోసుకుని స్టౌ మీద పెట్టి  కొంచెం  పొడి పొడి లాడే విధముగా  వండుకోవాలి .

ఇప్పుడు  ఒక బేసిన్ లో ఉడికిన అన్నం వేసుకుని ,  అందులో పావు స్పూను పసుపు , రెండు రెమ్మలు కరివేపాకు , కొద్దిగా  ఉప్పు మరియు  ఒక అర గరిటెడు  నూనె వేసి , గరిటెతో వేడి మీదనే బాగా కలుపు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండి  పెట్టి మిగిలిన మొత్తము  నూనె వేసుకుని , నూనె బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చిశనగపప్పు , చాయమినపప్పు , ఆవాలు,  ఇంగువ , వేరుశనగ గుళ్ళు మరియు  జీడిపప్పు ను వేసి పోపును బాగా వేగనివ్వాలి .

తర్వాత అందులో పచ్చి మిర్చి , కరివేపాకును వేసి రెండు నిముషాలు  పచ్చి మిర్చి ని  మగ్గ నివ్వాలి .

తర్వాత  మిక్సీ  వేసుకుని  సిద్ధంగా  ఉంచుకున్న  చింతకాయల  మిశ్రమమును కూడా పోపులో వేసుకుని  రెండు నిముషాలు  ఈ మిశ్రమము పచ్చి వాసన పోయేదాకా  మగ్గనివ్వాలి.

తర్వాత  ఈ పోపును  బెసిన్ లో సిద్ధంగా  ఉంచుకున్న  అన్నము లో వేసుకుని  చేతితో  నాలుగు  మూలలా  బాగా కలిసే విధముగా  కలుపుకోవాలి .

చింతకాయల మిశ్రమములో మరియు  అన్నము లో  సరిపడే  ఉప్పు వేసుకుంటాము  కనుక రుచి చూసి ఉప్పు తగ్గితే కలుపుకోండి .

అంతే ఘుమ ఘుమ  లాడే  ఇంగువ వాసనతో  వామన చింతకాయలతో పులిహోర  సర్వింగ్  కు సిద్ధం.

ఇప్పుడు  మార్కెట్లో ఈ చిన్న చింతకాయలు బాగా దొరుకుతున్నాయి  .

కనుక  ఇప్పుడు ఈ వామన చింతకాయల పులిహోర చేసుకోవచ్చును.

శ్రావణ మాసం లో లక్ష్మీ అమ్మ వారికి , భాద్రపద మాసంలో గణపతికి , ఆశ్వయుజ మాసంలో  దుర్గా  దేవికి  మహా నైవేద్యం గా కూడా  ఈ పులిహోర నివేదన చేయవచ్చును .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటోలు నా స్వంతం .

ముక్కల పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

ముక్కల  పులుసు .

కావలసినవి .

చింతపండు  --  50 గ్రాములు విడదీసి  15 నిముషముల ముందు  వేడి నీటిలో నానబెట్టి ఒక గ్లాసు చిక్కని రసం తీసుకొని  సిద్ధంగా  ఉంచుకోవాలి.

ఆనపకాయ /   సొరకాయ  -- లేతది.
కాయలో  సగం  ముక్క లేదా షుమారు 150 గ్రాముల ముక్క.
దోసకాయ   --  ఒకటి
బెండకాయలు  --  ఎనిమిది
టమోటోలు  --  రెండు
వంకాయలు -- రెండు
పచ్చి మిర్చి  ---   5
కరివేపాకు  --   మూడు  రెబ్బలు
కొత్తిమీర    ---  ఒక  కట్ట
పసుపు  ---   కొద్దిగా
ఉప్పు  ---  తగినంత
బియ్యపు  పిండి  --   స్పూనున్నర
కారం  ---  అర స్పూను .

పోపుకు  .

నూనె  ---   రెండుస్పూన్లు
ఎండుమిరపకాయలు   --  3
మెంతులు ---   కొద్దిగా
జీలకర్ర  ---  పావు స్పూను
ఆవాలు  --  అర స్పూను
ఇంగువ  --  కొద్దిగా
బెల్లం  --  చిన్న ముక్క

తయారీ  విధానము .

అనపకాయ /  సొరకాయ  పై చెక్కు తీసి  ముక్కలుగా  తరుగు కోవాలి.

అదే  విధంగానే   దోసకాయ  కూడా  పై  చెక్కు  తీసి  గింజల  చేదు  చూసుకుని   ముక్కలుగా   తరుగు  కోవాలి.

వంకాయలు , టమోటోలు  మరియు  బెండకాయలు ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చిమిర్చి   నిలువుగా   చీలికలు  గా  తరగాలి  .

ఒక  గిన్నెలో  ఈ  తరిగిన   ముక్కలన్నీ  వేసి  , చింతపండు  రసం వేసి  మరి ఒక  రెండు  గ్లాసుల  నీళ్ళు పోయాలి .

అందులో  పసుపు , ఉప్పు , చిన్న బెల్లం  ముక్క వెయ్యాలి .

పచ్చిమిర్చి , కరివేపాకు   కూడా  వెయ్యాలి .

ఇప్పుడు  స్టౌ  వెలిగించి   ఈ  పులుసు  గిన్నె  పెట్టి  మీడియం  సెగన  ముక్కలన్నీ  ఉడికి  దగ్గర  పడేలా  ఉడకనివ్వాలి . తర్వాత అర స్పూను  కారం వెయ్యాలి.

తర్వాత  ఒక  అర గ్లాసు  నీళ్ళలో   ఒకటిన్నర   స్పూను  బియ్యపు  పిండి  వేసి  చేత్తో బాగా  కలిపి  మరుగుతున్న పులుసు లో  పోయాలి .

మరో మూడు నిముషముల తర్వాత పులుసు  చిక్క పడగానే  దింపుకోవాలి .

తర్వాత  స్టౌ  మీద  పోపు  గరిట  పెట్టుకుని  రెండు స్పూన్లు   నూనె  వేసి  నూనె కాగగానే  ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ  వేసి  పోపు  పెట్టు కోవాలి .

పైన  తరిగిన   కొత్తిమీర   వేసుకోవాలి .

అంతే  ఘమ  ఘమ  లాడే  ఇంగువ  పోపుతో ఆనప కాయ  దోసకాయ  వంకాయ  బెండకాయల ముక్కల   పులుసు  సర్వింగ్   కు  సిద్ధం.

అప్పాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

రేపు   శ్రావణ  శుక్ర వారము .

వరలక్ష్మీ  వ్రతము.

అమ్మవారికి  అప్పాలు  చాలా ప్రీతికరమైనవని  దేవి గుడిలోని  పూజారి గారు  తెలియచేసారు .

రేపు  వరలక్ష్మీ  అమ్మ వారికి  ప్రత్యేకంగా  నివేదనకు  అప్పాలు తయారీ విధానము .

ప్రియమిత్రులందరికీ .

అమ్మ వారి  ప్రసాదము  అప్పాలు  తయారు  చేయు  విధానము .

కావలసినవి .

షుమారుగా  ఒక  కప్పు  కొలతగా  పెట్టుకోండి .

గోధుమ పిండి   ---   అరకప్పు

బియ్యపు  పిండి  ---  అర కప్పు

బెల్లం  తరిగిన   పొడి  --  ఒక  కప్పు

పచ్చి కొబ్బరి  తురుము ---  పావు  కప్పు    

యాలకుల పొడి  ---  అర  స్పూను 

నెయ్యి  ---  రెండు  స్పూన్లు

నూనె  ---  200  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి తరిగిన   బెల్లం  పొడి  వేసి  బెల్లం పొడి  మునిగే  వరకు  నీళ్ళు  పోసి  బెల్లం   కరిగాక   నీళ్ళు  బాగా  తెర్లనివ్వాలి .

పాకం  రావక్కరలేదు.

గోధుమ  పిండి  మరియు  బియ్యపు  పిండి రెండూ  జల్లెడ  పోసుకుని  లేదా  రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న  నీళ్ళలో  ముందు యాలకుల  పొడి వేసి , తర్వాత  ఈ  పిండి , కొబ్బరి తురుము  మరియు  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  బాగా  గరిటెతో  కలిపి   స్టౌ  వెంటనే   ఆపేయాలి.

కొద్ది  సేపు   తర్వాత  చేతికి  నెయ్యి  రాసుకొని  ఎడం  అర చేతిలోకి  కొద్దిగా   ఈ  మిశ్రమాన్ని  తీసుకొని   కుడి  చేతి  వేళ్ళతో  పాలకోవా  బిళ్ళలు  లాగా  చిన్న  చిన్న  అప్పాలు  మాదిరిగా   పిండి  అంతా  వత్తుకొని  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  వేరే  బాండి  పెట్టి  నూనె  అంతా  పోసి  నూనె  బాగా   కాగనివ్వాలి .

తర్వాత  షుమారు ఎనిమిది  పది  అప్పాలు  వేసి  ఎక్కువ   సేపు  ఉండనివ్వకుండా  వెంటనే  తీసెయ్యాలి .

ఎక్కువ   సేపు  ఉంటే  అప్పాలు  మాడి  పోతాయి.

ఇవి  కొబ్బరి  బూరెల్లా  కొంచెం   మెత్తగా   ఉంటాయి .

అప్పాలు  గట్టిగా   కావాలనుకునే  వాళ్ళు  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి  , పావు కప్పు  గోధుమ పిండి  వేసుకుని   చేసుకోవాలి .

అంతే  అమ్మ  వారి  ప్రసాదానికి  అప్పాలు  సిద్ధం.

కొంచెం   పెద్దవి  చేసుకుంటే  బూరెల్లా  టిఫిన్  గా  కూడా  బాగుంటాయి .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

అప్పాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

రేపు   శ్రావణ  శుక్ర వారము .

వరలక్ష్మీ  వ్రతము.

అమ్మవారికి  అప్పాలు  చాలా ప్రీతికరమైనవని  దేవి గుడిలోని  పూజారి గారు  తెలియచేసారు .

రేపు  వరలక్ష్మీ  అమ్మ వారికి  ప్రత్యేకంగా  నివేదనకు  అప్పాలు తయారీ విధానము .

ప్రియమిత్రులందరికీ .

అమ్మ వారి  ప్రసాదము  అప్పాలు  తయారు  చేయు  విధానము .

కావలసినవి .

షుమారుగా  ఒక  కప్పు  కొలతగా  పెట్టుకోండి .

గోధుమ పిండి   ---   అరకప్పు

బియ్యపు  పిండి  ---  అర కప్పు

బెల్లం  తరిగిన   పొడి  --  ఒక  కప్పు

పచ్చి కొబ్బరి  తురుము ---  పావు  కప్పు    

యాలకుల పొడి  ---  అర  స్పూను 

నెయ్యి  ---  రెండు  స్పూన్లు

నూనె  ---  200  గ్రాములు

తయారీ  విధానము  .

ముందుగా   స్టౌ  మీద  బాండీ  పెట్టి తరిగిన   బెల్లం  పొడి  వేసి  బెల్లం పొడి  మునిగే  వరకు  నీళ్ళు  పోసి  బెల్లం   కరిగాక   నీళ్ళు  బాగా  తెర్లనివ్వాలి .

పాకం  రావక్కరలేదు.

గోధుమ  పిండి  మరియు  బియ్యపు  పిండి రెండూ  జల్లెడ  పోసుకుని  లేదా  రెండూ బాగా కలుపుకొని , తెర్లుతున్న  నీళ్ళలో  ముందు యాలకుల  పొడి వేసి , తర్వాత  ఈ  పిండి , కొబ్బరి తురుము  మరియు  రెండు స్పూన్లు   నెయ్యి  వేసి  బాగా  గరిటెతో  కలిపి   స్టౌ  వెంటనే   ఆపేయాలి.

కొద్ది  సేపు   తర్వాత  చేతికి  నెయ్యి  రాసుకొని  ఎడం  అర చేతిలోకి  కొద్దిగా   ఈ  మిశ్రమాన్ని  తీసుకొని   కుడి  చేతి  వేళ్ళతో  పాలకోవా  బిళ్ళలు  లాగా  చిన్న  చిన్న  అప్పాలు  మాదిరిగా   పిండి  అంతా  వత్తుకొని  వేరే  ప్లేటులో  పెట్టుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  వేరే  బాండి  పెట్టి  నూనె  అంతా  పోసి  నూనె  బాగా   కాగనివ్వాలి .

తర్వాత  షుమారు ఎనిమిది  పది  అప్పాలు  వేసి  ఎక్కువ   సేపు  ఉండనివ్వకుండా  వెంటనే  తీసెయ్యాలి .

ఎక్కువ   సేపు  ఉంటే  అప్పాలు  మాడి  పోతాయి.

ఇవి  కొబ్బరి  బూరెల్లా  కొంచెం   మెత్తగా   ఉంటాయి .

అప్పాలు  గట్టిగా   కావాలనుకునే  వాళ్ళు  ముప్పావు  కప్పు  బియ్యపు  పిండి  , పావు కప్పు  గోధుమ పిండి  వేసుకుని   చేసుకోవాలి .

అంతే  అమ్మ  వారి  ప్రసాదానికి  అప్పాలు  సిద్ధం.

కొంచెం   పెద్దవి  చేసుకుంటే  బూరెల్లా  టిఫిన్  గా  కూడా  బాగుంటాయి .

సంబంధిత రెసిపీ  మరియు ఫోటోలు  నా  స్వంతం .

ఇడ్లీ , దోశెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి .

ఇడ్లీ , దోశెలు  మరియు చపాతీల లోకి  కారప్పొడి .

కావలసినవి .

నూనె  -- మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  - 12
పచ్చిశనగపప్పు -- అర కప్పు
చాయమినపప్పు  -- అర కప్పు
ధనియాలు  --  అర కప్పు
కరివేపాకు  --  కప్పు
ఉప్పు   -- తగినంత

తయారు చేయు విధానము .

ముందుగా  స్టౌ  మీద బాండీ పెట్టుకుని నూనె మొత్తము  పోసి  నూనె  బాగా కాగనిచ్చి  వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు  వేసి బాగా  వేగ నివ్వాలి .

తర్వాత   అందులో కరివేపాకు  కూడా వేసి ఎర్రగా  వేగ నివ్వాలి .

చల్లారగానే  మొత్తము  మిక్సీ లో వేసి  పప్పులు  పూర్తిగా  నలగ కుండా  మిక్సీ  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ఇడ్లీ , దోశెల లోకి కారప్పొడి  సిద్ధం.

ధనియాల పొడి

ధనియాల పొడి .

నోరు  అరుచిగా  ఉన్నా , జ్వరపడిన వారికి  పత్యం పెట్టాలన్నా , బాలింతలకు  పథ్యానికి  ఈ  ధనియాల పొడి  ఎక్కువగా  పెడతారు .

జలుబు  కఫం వంటివి  కూడా  హరిస్తుంది .

వేడి  వేడి అన్నంలో నెయ్యి బాగా వేసుకుని  ఈ పొడిని  మొదటి  ఐటమ్  గా  వేసుకుని  తింటే  ఆరోగ్య  రిత్యా  చాలా మంచిది .

కడుపులో  ఇబ్బందిగా  ఉన్నవారికి  , గ్యాస్  ప్రాబ్లమ్స్  ఉన్న వారికి  కూడా ఈ ధనియాల పొడి  వాడటం వలన  ఆ ఇబ్బందులు  తొలగి  పోతాయి .

ధనియాల పొడి  తయారీ  విధానము .

కావలసినవి .

ఎండుమిరపకాయలు  --   15
ధనియాలు  --  75  గ్రాములు
మినపప్పు  --  మూడు  స్పూన్లు
చింతపండు  --  చిన్న నిమ్మకాయంత
కరివేపాకు  --  రెండు రెమ్మలు .
ఉప్పు  --  తగినంత
నూనె  --  మూడు స్పూన్లు .

తయారీ  విధానము .

ముందుగా   చింతపండు   విడదీసి  గింజలు  లేకుండా  శుభ్రం  చేసుకోవాలి .

ధనియాలు  పుల్లలు  లేకుండా  శుభ్ర పరుచు కోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద బాండీ  పెట్టి  మొత్తము  నూనె  వేసి  నూనె  బాగా  కాగగానే  వరుసగా  ఎండుమిరపకాయలు , మినపప్పు  , ధనియాలు , వేసి  వేయించుకుని , తర్వాత కరివేపాకు  కూడా  వేసి  కమ్మని  వేపు  వచ్చే వరకు  వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో   వేయించిన  దినుసులు  , చింతపండు  మరియు  తగినంత  ఉప్పు వేసి మెత్తగా   పొడిగా  వేసుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  ధనియాల పొడి  సర్వింగ్  కు  సిద్ధం .

ఇందులో  మెంతులు , ఆవాలు , జీలకర్ర  , శనగపప్పు , ఇంగువ  వంటివి  వెయ్యరు .

వెల్లుల్లి  తినే  వారు  కూడా  ఇది  కేవలం  ధనియాల పొడి  కావున  వేసుకోపోవడం  మంచిది .

ఈ  పొడి  భోజనము  లోకే  కాకుండా  ఇడ్లీ , దోశెలలోకి కూడా  బాగుంటుంది .

పల్లీలు పచ్చికొబ్బరి చట్నీ

పల్లీలు మరియు  పచ్చి కొబ్బరి  తో  చట్నీ.

తయారీ  విధానము .

స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు స్పూన్లు  నూనె వేసి నూనె కాగగానే ,  అర కప్పు వేయించని  పల్లీలు ,  పావు కప్పు  పచ్చిశనగపప్పు , ఆరు  పచ్చిమిరపకాయలు వేసి  మగ్గ పెట్టు కోవాలి .

చల్లారగానే  ఈ  మిశ్రమము , ఒక అరకప్పు పచ్చి కొబ్బరి  తురుము మిక్సీ లో  వేసుకుని  , మూడు రెబ్బలు  చింతపండు , తగినంత ఉప్పు వేసుకుని  కొద్దిగా   నీళ్ళు పోసుకుని  పచ్చడి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

వేరే గిన్నెలోకి  తీసుకోవాలి .

తిరిగి  స్టౌ మీద పోపు గరిటె పెట్టుకుని  రెండు స్పూన్లు  నెయ్యి వేసుకుని   ఎండుమిర్చి  ముక్కలు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసుకుని  పోపు పెట్టుకోవాలి .

ఈ  పచ్చడి  ఇడ్లీ , దోశెలు , పూరీలు  మరియు భోజనము లోకి రుచిగా  ఉంటుంది .

బియ్యప్పిండి చక్కిలాలు

బియ్యపు పిండితో రుచికరమైన మీగడ చక్కిలాలు /  జంతికలు .

ఆలూరుకృష్ణప్రసాదు .

బియ్యపు పిండితో  మీగడ  చక్కిలాలు.

కావలసినవి .

మర పట్టించిన బియ్యపు  పిండి --  నాలుగు  కప్పులు.

మీగడతో ఉన్న పెరుగు  --  ఒక కప్పు.

(  జంతికలు  పుల్లగా  తినడానికి  ఇష్ట పడే వారు  పుల్లని మీగడ పెరుగు  వేసుకోవచ్చును. )

ఉప్పు  -- తగినంత

కారము  -- ఒక స్పూను

వాము   --  ఒక  స్పూను

నువ్వుపప్పు  -  ఒక  స్పూను

నూనె   --  350  గ్రాములు.

తయారీ  విధానము .

ఒక  బెసిన్లో మెత్తగా  మరపట్టించి జల్లెడ పోసుకున్న   బియ్యపు  పిండి ,  వాము , నువ్వుపప్పు , కారం,  వేసుకుని  అందులో  మీగడ పెరుగు మరియు  తగినంత  ఉప్పు వేసుకుని చేతితో  బాగా  కలుపు కోవాలి .

ఇప్పుడు  అవసరమైతే కొద్దిగా   నీళ్ళు పోసుకుంటూ  చక్కిలాలు  వేయటానికి  వీలుగా  పిండిని  గట్టిగా  కలుపుకోవాలి .

తర్వాత  బాగా పిండిని  మెదాయించుకోవాలి.

ఇప్పుడు   స్టౌ  వెలిగించి   బాండి పెట్టుకుని  మొత్తము   నూనె  పోసి  నూనెను  పొగలు  వచ్చే విధముగా  బాగా  కాగనివ్వాలి.

తర్వాత  పిండిని  చక్కిలాలు  వేసే  గిద్దలో  పెట్టుకుని  స్టౌ  మీడియం  సెగలో  పెట్టి  రెండు  రెండు  చొప్పున  చక్రాలు వేసుకుని బంగారు  రంగులో  వేయించుకుని  తీసేసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా ఉండే చల్ల చక్రాలు /  మీగడ చక్రాలు  అల్పాహారానికి  సిద్ధం.

ఈ  చక్కిలాలు  పది రోజులు   పైన నిల్వ ఉంటాయి .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

కొత్తిమీర చట్నీ

ఆలూరుకృష్ణప్రసాదు .

కొత్తిమీర  చట్నీ.

కొత్తిమీర  --  ఒక కప్పు.
తురిమిన పచ్చి కొబ్బరి --  ఒక కప్పు.
పచ్చిమిర్చి  --  ఎనిమిది .
చింతపండు  --  ఉసిరి కాయంత.
ఇంగువ  --  కొద్దిగా .
ఉప్పు  --  తగినంత .

తయారీ  విధానము .

ముందుగా  మిక్సీ లో  పైన  కొత్తిమీర , పచ్చి కొబ్బరి , పచ్చి మిర్చి , చింతపండు , ఇంగువ  మరియు  తగినంత ఉప్పు  వేసుకుని , మరీ మెత్తగా కాకుండా మిక్సీ  వేసుకోవాలి .

నూరిన పచ్చడి వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  రెండు స్పూన్లు  నెయ్యి  వేసి  నెయ్యి బాగా కాగగానే  మూడు ఎండుమిరపకాయలు  చిన్న ముక్కలుగా చేసుకుని , స్పూను  మినపప్పు , అర స్పూను ఆవాలు మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించుకుని   పచ్చడిలో  వేసుకుని  స్పూనుతో బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే  కొత్తిమీర  పచ్చడి  ఇడ్లీ , దోశెలు , వేడి వేడి పూరీలు మరియు భోజనము లోకి  సిద్ధం .

పచ్చిశనగపప్పు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు

పచ్చిశనగపప్పు  తో పచ్చడి.
********************

తయారీ  విధానము .

పది  ఎండుమిరపకాయలు , గ్లాసు పచ్చిశనగపప్పు , స్పూను  జీలకర్ర మరియు  కొద్దిగా  ఇంగువ
నూనె  వేయకుండా  బాండీలో  కమ్మని  వాసన  వచ్చేదాకా   వేయించుకోవాలి .

చల్లారగానే  మిక్సీ లో వేయించిన పచ్చిశనగపప్పు   , ఎండుమిరపకాయలు  , జీలకర్ర   మిశ్రమం ,  మరియు తగినంత   ఉప్పు  వేసి   కొద్దిగా నీళ్ళు  పోసి  మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

తర్వాత  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .

ఎవరి అభిరుచిని పట్టి వారు  ఈ క్రింద తెలియ చేసిన విధముగా  చేసుకోవచ్చును.

వెల్లుల్లి  ఇష్టపడే వారు ఒక  నాలుగైదు  వెల్లుల్లి   రెబ్బలు  పచ్చడిలో  వేసుకుని  మిక్సీ  వేసుకుంటారు .

రెండు రెబ్బలు చింతపండు కూడా మిక్సీ  లో  పచ్చడిలో  వేసి  మిక్సీ  వేసుకుంటారు.

పచ్చి మామిడి  కాయ ముక్కలు అరకప్పు ,  పచ్చికొబ్బరి పావుకప్పు మరియు మూడు రెబ్బలు  కరివేపాకు ను కూడా పచ్చడిలో  వేసి మిక్సీ  వేసుకుంటారు .

కొంతమంది  స్టౌ  మీద  పోపు గరిటె పెట్టి  మూడు  స్పూన్లు   నెయ్యి  వేసి  రెండు  ఎండుమిర్చి  ముక్కలుగా  చేసి , మినపప్పు , ఆవాలు , ఇంగువ  మరియు  కరివేపాకు   వేసి   పచ్చడిలో   పోపు  పెట్టుకుంటారు .

మీ  అభిరుచి  ప్రకారం  ఏ  విధంగానైనా  మార్చి  చేసుకోవచ్చును .

టమోటో పచ్చి పులుసు

ఆలూరుకృష్ణప్రసాదు .

టమోటో  పచ్చి పులుసు .

కావలసినవి .

మంచి రంగు వచ్చి గట్టిగా  ఉన్న టమోటోలు  --  పావు కిలో  లేదా  4
ఉల్లిపాయలు  ---  3
పచ్చిమిరపకాయలు  --  5 
చింతపండు  --  టమోటో లో కొంచెం  పులుపు ఉంటుంది  కనుక  చిన్న నిమ్మకాయంత  చింతపండు  సరిపోతుంది .
పసుపు  --  కొద్దిగా
ఉప్పు  --  తగినంత
కరివేపాకు  --  మూడు  రెమ్మలు
కొత్తిమీర  --  ఒక  చిన్న కట్ట
నూనె  --  నాలుగు  స్పూన్లు

పోపుకు .

ఎండుమిరపకాయలు  --  3
చాయమినపప్పు --  ఒక స్పూను
జీలకర్ర   --  పావు  స్పూను
ఆవాలు  --  అర స్పూను 
ఇంగువ  --  కొద్దిగా

తయారీ  విధానము .

ముందుగా  టమోటో లు ముక్కలుగా  తరుగు కోవాలి .

నిమ్మకాయంత  చింతపండు   గ్లాసు  నీళ్ళలో  పదిహేను  నిముషాలు   నాన బెట్టుకుని , పల్చగా  గ్లాసు  రసం  తీసి  వేరే  గిన్నెలో   ఉంచుకోవాలి .

గ్లాసు  రసం  సిద్ధం  చేసుకోవాలి .

ఉల్లిపాయలు   సన్నని  ముక్కలుగా  తరుగు కోవాలి .

పచ్చి మిరపకాయలు   చిన్న ముక్కలుగా  తరుగు కోవాలి .

ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి  రెండు స్పూన్లు  నూనె వేసి నూనె బాగా కాగగానే  తరిగిన  టమోటో  ముక్కలను మరియు కొద్దిగా  పసుపును వేసి , మూత పెట్టి   ఏడెనిమిది నిముషాలు ముక్కలను మగ్గనివ్వాలి.

తర్వాత చింతపండు  రసం  వేరే గిన్నెలో  వేసుకుని  మగ్గిన టమోటో  ముక్కలు అందులో వేసుకుని  చేతితో బాగా నలుపు కోవాలి.

తర్వాత తరిగిన  పచ్చిమిర్చి  ముక్కలు , సరిపడా  ఉప్పు , కరివేపాకు , తరిగిన  కొత్తిమీర  వేసి
చెత్తో  మగ్గిన టమోటో లు   చింతపండు  రసం  బాగా  కలిసే విధంగా  కలుపుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి మిగిలిన మొత్తము   నూనె  వేసి  నూనె  బాగా కాగగానే  వరుసగా  ఎండుమిర్చి  ముక్కలు , చాయమినపప్పు , జీలకర్ర  , ఆవాలు , ఇంగువ , కరివేపాకు  వేసి  పోపు  వేగగానే  తరిగిన   ఉల్లిపాయ  ముక్కలు  పోపులో  వేసి   ఉల్లిపాయలు   బంగారు  రంగు  వచ్చే  వరకు  మూత పెట్టి  మగ్గనివ్వాలి .

తర్వాత  మగ్గపెట్టిన  ఉల్లిపాయలు టమోటో  పచ్చిపులుసు  మిశ్రమం  లో  వేసి  గరిటతో  బాగా  కలుపు  కోవాలి .

కొంతమంది సన్నగా  తరిగిన పచ్చి ఉల్లిపాయల  ముక్కలు  వేయించకుండా పచ్చివే పులుసులో కలుపుతారు.

ఆ విధంగా చేసినా  చాలా రుచిగా ఉంటుంది .

కొంతమంది  టమోటోలు  నూనెలో మగ్గ పెట్టకుండా  సిమ్ సెగన  స్టౌ పైన  కాయలు  చిట్లకుండా కాల్చి  , కాలిన పై పొర తీసి వేసి  పులుసు పచ్చడిలో  వంకాయలు పులుసు  పచ్చడి చేసే విధముగా కలుపుతారు .

ఆ విధముగా  కూడా  రుచిగా  ఉంటుంది.

అంతే  అన్నం లోకి  మరియు  చపాతీలలోకి  ఎంతో  రుచిగా  ఉండే టమోటో  పచ్చిపులుసు 
సర్వింగ్  కు  సిద్ధం .

కాంబినేషన్ గా కంది పచ్చడి , పచ్చిశనగపప్పు  పచ్చడి  మరియు కందిపొడి  బాగుంటాయి .

కందిపొడి

ఆలూరుకృష్ణప్రసాదు .

కందిపొడి .

కావలసినవి.

కందిపప్పు  --  100 గ్రాములు.
మినపగుళ్ళు /
లేదా చాయమినపప్పు  - 50 గ్రాములు.
ఎండుమిరపకాయలు  --  15
జీలకర్ర  --  స్పూను
ఇంగువ పొడి   --  పావు స్పూను లో సగం.
ఉప్పు  -- తగినంత

తయారీ విధానము.

స్టౌ మీద  బాండీ పెట్టి  ముందుగా  కందిపప్పు , ఎండుమిరపకాయలు , జీలకర్ర  బాండీ  లో నూనె వేయకుండా  కమ్మని  వేగిన  వాసన వచ్చే వరకు  వేయించుకోవాలి.

వేరే  ప్లేటు లోకి  తీసుకోవాలి .

తర్వాత  మినపగుళ్ళు  కాని , చాయమినపప్పు  కాని  బాండిలో  వేసుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .

విడిగా  వేరే పళ్ళెంలో  తీసుకోవాలి .

విడిగా  వేయించు కోవడం  ఎందుకు  అంటే  రెండూ  కలిపి  వేయిస్తే  ఒకటి వేగి  మరొకటి  వేగనట్లు అయితే  పొడి  రుచి పాడవుతుంది.

రెండూ చల్లారిన తర్వాత ఇప్పుడూ  మిక్సీలో  మొదట వేయించినవి మరియు రెండవ సారి వేయించినవి రెండూ వేసుకుని  తగినంత  ఉప్పు  మరియు  ఇంగువ వేసుకుని   మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి.

తర్వాత  మొత్తము పొడి  ఒక ప్లేటులో వేసుకుని  చేతితో బాగా  కలుపుకోవాలి .

తర్వాత వేరే సీసా లో కి తీసుకోవాలి .

అంతే  ఎంతో రుచిగా  ఉండే కందిపొడి  సర్వింగ్ కు సిద్ధం.

గోదావరి ప్రాంతం వారు ఈ పొడి వేడి వేడి అన్నంలో కలుపుకుని , గానుగ దగ్గర  పట్టించుకున్న కమ్మని  నువ్వుపప్పు నూనె వేసుకుని  తింటారు.

అద్భుతమైన  రుచిగా ఉంటుంది .

ఈ పొడి  భోజనము లోకే  కాకుండా  ఇడ్లీ  మరియు  దోశెల లోకి కూడా చాలా రుచిగా  ఉంటుంది .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం.

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి