Tuesday, May 30, 2017

అమ్మమ్మ నేర్పిన ఉల్లిపాయల పులుసు

అమ్మమ్మ నేర్పిన ఉల్లిపాయల పులుసు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

కందిపచ్చడి ఉల్లిపాయల పులుసు గొప్ప కాంబినేషన్ .
ఈ రోజు ఉల్లిపాయల పులుసు
తయారీ విధానము గురించి తెలుసుకుందాం.

కావలసినవి .
ఉల్లిపాయలు -- 6 లేదా 500 గ్రా
ఉల్లిపాయలు చిన్నవి అయితే అలాగే వాడవచ్చు.
చింతపండు -- 60 గ్రా
బెల్లం -- 40 గ్రా
ఉప్పు -- తగినంత

పోపుకు .
ఎండుమిరపకాయలు --- 4
మెంతులు -- పావు స్పూను 
ఆవాలు -- అర స్పూను 
నూనె -- మూడు స్పూన్లు 
మామూలు కారం -- అర స్పూను 
బియ్యపు పిండి -- ఒకటిన్నర స్పూను
పసుపు -- కొద్దిగా

తయారీ విధానము .
ముందుగా చింతపండు వేడి నీళ్ళలో పదిహేను నిముషములు నానబెట్టి రెండు గ్లాసుల నీళ్ళు పోసి రసం తీసుకొని ఉంచుకోవాలి .
ఉల్లిపాయలు చిన్న సైజువి అయితే పై పొట్టు తీసి ఆ చివర ఈ చివర తీసుకుంటే సరిపోతుంది .
తరగ నవసరం లేదు .
అదే పెద్ద ఉల్లిపాయలు అయితే ముక్కలుగా తరుగు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే ఎండు మిర్చి ముక్కలు , మెంతులు , ఆవాలు వేసి పోపు వేగగానే తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు , కొద్దిగా పసుపు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి
తర్వాత చింతపండు రసం, తగినంత ఉప్పు, బెల్లం , అర స్పూను కారం వేసి ఉల్లిపాయలు బాగా ఉడికేదాకా మీడియం సెగలో బాగా తెర్ల నివ్వాలి .
తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళలో స్పూనున్నర బియ్యపు పిండి వేసి చేత్తో బాగా కలిపి మరుగుతున్న పులుసులో పోసి, మరో అయిదు నిముషాలు ఉంచి దింపు కోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ఉల్లిపాయల పులుసు సర్వింగ్ కు సిద్ధం.
ఇందులో మా అమ్మమ్మ పచ్చిమిర్చి , కరివేపాకు , జీలకర్ర , ఇంగువ , కొత్తిమీర ఏవీ వేయదు.
కారణం ఉల్లిపాయల ఫ్లేవర్ ను డామినేట్ చేస్తాయనేది .
మీరు కావాలనుకుంటే మీరు ఏవైనా వేసుకోవచ్చు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి