Tuesday, May 30, 2017

మినప్పిండి తో చిన్న వడియాలు .

మినప్పిండి తో చిన్న వడియాలు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఇప్పుడు ఎండలు మండి పోతున్నాయి .
ఈ సమయంలో సగ్గు బియ్యం వడియాలు , బూడిద గుమ్మడి వడియాలు , ఊర మిరపకాయలు 
పెట్టుకుంటే గల గలా ఎండుతాయి .

చాలా మంది బూడిద గుమ్మడికాయ వడియాలతో పాటే ఈ చిన్న వడియాలు పెట్టుకుంటారు .
ఈ వడియాలు తోటకూర కూరలో , వంకాయ అల్లం మిర్చి కూరలో , పనస పొట్టు కూరలో ఇలా చాలా కూరల్లో , విడిగా వేయించి కలుపుతారు .
దీనివల్ల ఆ కూరలకు అదనపు రుచి వస్తుంది.
మరి కొంత మంది కూరల్లో కలిపితే వడియాలు మెత్త పడతాయని , విడిగా వేయించుకుని కూర తో పాటుగా కలిపి , ముద్దలో పెట్టుకుని తింటారు .
మేము ఏడాదికి సరిపడా ఒక K . G . మినపగుళ్ళు నానబోసి ఒకే సారి పెట్టుకుంటాము .
అయితే వీటికి వాతావరణ మార్పుల బట్టి తొందరగా పురుగు పట్టే లక్షణం ఉంది కనుక మూడు నెలల కొకసారి ఏ రోజున ఎండ బాగా ఉంటుందో ఆ రోజున ఈ చిన్న వడియాలన్నీ చాటలో పోసి డాబా పైన ఎండ బెట్టు కుంటాము .
మళ్ళీ సాయంత్రం డబ్బా లో పోసుకుంటాము .
కొంతమంది Zip Lock Covers లో పోసి ఫ్రిజ్ లో పెట్టుకుంటారు .
కావలసినన్ని అవసరమయినపుడు వేయించుకోవటానికి తీసుకొని మళ్ళీ కవర్ ఫ్రిజ్ లో పెట్టేసుకుంటారు .
అప్పుడు కూడా పురుగు పట్టవు .
ఇదివరకు పాత రోజుల్లో గుడ్డల మీద పెట్టుకునేవారు .
చాలా కష్ట పడే వారు .
ఇప్పుడు ప్లాస్టిక్ Sheets వచ్చేసాయి .
అందరూ ఈ ప్లాస్టిక్ కవర్ల మీదే పెట్టుకుంటున్నారు .
ఆ విధంగా ప్లాస్టిక్ కవర్ల మీద పెట్టుకుంటే సులువుగా ఊడి వస్తాయి .
మేము పెట్టుకున్న వడియాలు అయిపోయినప్పుడు బజార్లో చాలా సార్లు కొన్నాము .
రుచి పచి లేకపోగా గట్టిగా వేయించాక గులక రాళ్ళు ఉన్నట్లు ఉన్నాయి .
అందువల్ల మీరు కూడా తప్పని సరై బజార్లో కొనవలసివస్తే ముందు ఓ 50 గ్రాముల వడియాలు కొనుక్కుని , వేయించి చూసుకుని నచ్చితే ఎక్కువ మోతాదులో కొనుక్కోండి .
మినపగుళ్ళతో చిన్న వడియాలు పెట్టుకునే విధానము .
****************************
ఒక అర కిలో మినపగుళ్ళు ముందు రోజు రాత్రి తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోండి .
మరుసటి రోజు ఉదయం మీరు Wet Grinder లో మీరు బూడిద గుమ్మడికాయ వడియాలకు పిండి ఎలా వేసుకుంటారో అలా మెత్తగా వేసుకొని ఒక గిన్నె లోకి తీసుకోండి .
ఒక 100 గ్రాముల పచ్చి మిరపకాయలు తొడిమలు తీసి మిక్సీ లో మెత్తగా వేసుకోవాలి .
తగినంత ఉప్పు , పావు స్పూను పచ్చి ఇంగువ మరియు పచ్చిమిర్చి మిశ్రమము పిండిలో వేసి చేత్తో బాగా కలిపి ప్లాస్టిక్ కవర్ల మీద చిన్న చిన్న సైజులో వడియాలు పెట్టుకోవాలి .
ఇప్పుడున్న ఎండల కయితే ఒక్క రోజులోనే ఎండి పోతాయి .
అవసరమయితే రెండో రోజున కూడా ఎండ బెట్టకుని ఒక Container లో పోసుకోండి .
మీకు మినపగుళ్ళతో చిన్న వడియాలు సిద్ధం.
మేము ఈ వడియాలు , ఊరు మిరపకాయలు , గుమ్మడి వడియాలు వేయించుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వడియాలు కలుపుకు తినేస్తాము .
చాలా రుచిగా ఉంటాయి .
ఫోటో --- ఈ సంవత్సరం మేము పెట్టుకున్న వడియాలు .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి